కాకినాడ, డిసెంబర్ 18: సహకార సంఘాల ఎన్నికల్లో ఈ దఫా కౌలు రైతులకు ఓటు హక్కు లభించింది. రుణ అర్హత కార్డు (ఎల్‌ఇసి) కలిగిన కౌలు రైతులు వచ్చే సహకార ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత కొనే్నళ్లుగా వరుస నష్టాలతో రాష్ట్రంలో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో రెండేళ్ళ క్రితం చేపట్టిన పంట విరామం పోరాటం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడటం సర్వత్రా ఆందోళనకు తెర తీసింది. దీంతో ప్రభుత్వం కౌలురైతుల ఆర్ధిక భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు హామీ ఇస్తూ అర్హుడైన ప్రతి ఒక్క కౌలుదారుకు రుణ అర్హత కార్డులను జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ విధంగా వేలాది రైతులు రుణ అర్హత కార్డులు పొందారు. వీరందరికీ రుణాల పంపిణి మాటెలా ఉన్నప్పటికీ ఎల్‌ఇసి కార్డుల జారీ ఫలితంగా నేడు సహకార ఓటు హక్కు లభించినట్టయ్యింది. దీంతో కౌలుదార్ల చుట్టూ వివిధ ప్రథాన రాజకీయ పార్టీల నేతలు ప్రదక్షిణలు ఇప్పటి నుండే మొదలుపెట్టారు. అలాగే దేవాదాయ, ధర్మాదాయ భూములను కౌలు ప్రాతిపదికన సాగుచేస్తున్న వారు సైతం ఈ సహకార ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే ప్రభుత్వ ఆధీనంలో గల మత్స్యశాఖ, చేనేత సంఘాల సభ్యులకు కూడా సహకార ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. 2005వ సంవత్సరంలో సహకార సంఘాలకు అప్పటి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించగా ఆ పాలకవర్గాల పదవీ కాలం 2010వ సంవత్సరంలో ముగిశాయి. సుమారు రెండున్నర సంవత్సరాలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు జరుగకపోవడంతో ఆయా వర్గాల్లో తీవ్ర నిరాస ఏర్పడింది. ఎట్టకేలకు ప్రప్రథమంగా సహకార నగారా మ్రోగడంతో చాలా కాలం తర్వాత ఎన్నికల సందడి మొదలైంది.
నకిలీ ఓట్ల బెడద!
కడప: సహకార ఎన్నికలకు కడప జిల్లాలో నకిలీ ఓట్ల బెడద పట్టుకుంది. సాధారణ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకోవడం జిల్లాలో ఆనవాయితీగా వస్తోంది. అదే తరహాలో సహకార ఎన్నికల్లో కూడా ఓటర్లు తమ ఓట్లను నమోదు చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓట్ల నమోదుకు అన్ని రాజకీయ పార్టీ నేతలు శ్రీకారం చుట్టారు. ఈనెల 21 వరకు ఓటరు జాబితాలో చేరడానికి గడువు ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో నకిలీ ఓట్ల బెడద అధకారులను వేధిస్తోంది. అధికార పార్టీ నేతలు ఓటరు నమోదుకు లోలోపల ప్రయత్నాలు మొదలు పెట్టారు. గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ వైకాపా నేతలు కూడా అధికార పార్టీ వ్యూహాలను పసిగట్టి అందుకు దీటుగా పావులు కదుపుతున్నారు. నిరాశ, నిస్పృహల్లో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తమకు అనుకూల ప్రాంతాల్లో నకిలీ ఓట్లను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మూడు పార్టీలు పోటాపోటీగా ఓటర్ల నమోదుపై దృష్టి సారించడంతో నకిలీ ఓట్ల బెడద తీవ్ర రూపం దాల్చుతోంది. 2014 సాధారణ ఎన్నికలకు సంబంధించి పార్టీల భవిష్యత్తు ఎలావుంటుందనేది ఈ ఎన్నికల ద్వారా సంకేతాలు అందుతాయని నేతలు అభిప్రాయ పడుతున్నారు. దీనితో తమ సత్తా చాటుకునేందుకు సర్వశక్తులు వడ్డి నకిలీ ఓటర్లను చేర్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ, సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో ఇప్పటి వరకు 4 లక్షల పైబడి ఓటర్లు ఉన్నారు. వాస్తవానికి రైతులకే సొసైటీల్లో సభ్యులుగా ఉంటారు. వారికే ఓటు హక్తు లభిస్తుంది. ఏకగవాక్ష విధానం వచ్చిన తరువాత పరిస్థితి మారింది. దీంతో ఇతరత్రా సభ్యులు కూడా ఓటర్లుగా చేరుతున్నారు.
దేవాదాయ భూమి సాగుదార్లు, డి-్ఫరం పట్టాదార్లూ అర్హులే
english title:
k
Date:
Wednesday, December 19, 2012