విశాఖపట్నం, డిసెంబర్ 18: సంవత్సరానికి ఆరు సిలిండర్ల నిబంధనను మంత్రి ధర్మాన ప్రసాదరావు సమర్థించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖ జిల్లాలో నిర్వహిస్తున్న ఇందిరమ్మబాటలో సోమవారం జరిగిన సభల్లో మహిళలు సిలిండర్ల తగ్గింపు, విద్యుత్ బిల్లుల పెంపు, కిలోబియ్యం రూపాయికే ఇచ్చి, ఇతర నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయకపోవడంపై నిరసన తెలిపారు. వీటిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు మంగళవారం జరిగిన సభల్లో వివరణ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఇందిరమ్మ బాటలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి హోదాలో పాల్గొన్న ధర్మాన మాట్లాడుతూ గ్యాస్ మనం ఉత్పత్తి చేయడం లేదు. బోలెడంత డబ్బుపెట్టి దిగుమతి చేసుకుని, సబ్సిడీపై ప్రజలకు అందచేస్తున్నామని అన్నారు. ధనవంతుడికి, పేదవాడికి తేడా ఉండాలన్న ఉద్దేశంతో గ్యాస్ సిలెండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈవిధమైన నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న సబ్సిడీ ధనవంతునికి వెళ్లడం వలన, పేదలు నష్టపోతున్నారని ఆయన అన్నారు. పేదలకు ఏడాదికి తొమ్మిది సిలెండర్లను ఇస్తూ, ధనికులకు ఆరు సిలెండర్లు ఇవ్వడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు.ఈ నిర్ణయాన్ని ప్రజలు హర్షించాలే తప్ప, వ్యతిరేకించకూడదని ఆయన ఉద్బోధించారు. ధనవంతులు ఎక్కువ ధరపెట్టి సిలెండర్లు కొనుగోలు చేయాలన్న నిబంధనను ప్రతి ఒక్కరూ సమర్థించాలని ఆయన సూచించారు. స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ళలో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తున్నది కిరణ్ సర్కారు మాత్రమేనని ఆయన అన్నారు.
జిల్లేల పర్యటన భగ్నం
మజ్లిస్, బిజెపి
ఎమ్మెల్యేల అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, డిసెంబర్ 18: కర్నూలు జిల్లా గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో జరిగిన కాల్పులు, ఘర్షణ సంఘటనలపై వివరాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ నుండి బయలుదేరిన బిజెపి, మజ్లిస్ ఎమ్మెల్యేలను కర్నూలు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం వారిని హైదరాబాదుకు తిప్పి పంపారు. బిజెపికి చెందిన నిజామాబాద్ ఎమ్మెల్యే లక్ష్మీ నారాయణ, పార్టీ సీనియర్ నాయకుడు బద్దం బాలిరెడ్డిలను పాణ్యం పోలీస్ స్టేషన్ వద్ద, మజ్లిస్ పార్టీకి చెందిన చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ బాషా ఖాద్రీ, బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజం ఖాన్‌లను ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లెల్ల గ్రామానికి వెళ్లి వివరాలు తెలుసుకుని వస్తామని, వెళ్లేందుకు అనుమతించాలని వారు డిమాండ్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు. గ్రామంలో నెలకొన్న ఆధిపత్య పోరులో భాగంగా ఈ ఘర్షణ జరిగిందని ఇందులో మతాలకు సంబంధం లేదని పోలీసులు నేతలకు నచ్చజెప్పి కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహానికి తరలించారు. భోజనానంతరం వారిని హైదరాబాదుకు పంపించారు. కాగా ఇరు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అసమర్థత కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.