అనకాపల్లి, డిసెంబర్ 18: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం విశాఖ జిల్లా అనకాపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి కార్యక్రమానికి బందోబస్తుగా వచ్చిన ఓ ఎస్‌ఐ పత్రికా ఫొటోగ్రాఫర్లపై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో జర్నలిస్ట్‌లు సుమారు మూడు గంటలపాటు ఆందోళన చేశారు. పోలీసులకు, జర్నలిస్ట్‌లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ముఖ్యమంత్రి సభా కార్యక్రమాన్ని విలేఖరులు, ఫొటోగ్రాఫర్లు బహిష్కరించారు. డిఎస్పీ, జిల్లా ఎస్పీ ఆందోళనకారులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఆందోళన చేస్తున్న జర్నలిస్ట్‌లను సముదాయించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి సభాస్థలి నుంచి బస్సులో వెళ్లిపోతున్న సమయంలో ఆందోళనకారులు ఆయన బస్సుకు అడ్డంపడ్డారు. కానీ వారిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు పోనిచ్చారు. ఆ తరువాత ముఖ్యమంత్రే జర్నలిస్ట్‌లతో చర్చలు జరపాల్సిందిగా మంత్రి బాలరాజును పంపించారు. ఆయన వచ్చి అందరి తరపున క్షమాపణ చెపుతున్నానని అన్నారు. అప్పటికీ జర్నలిస్ట్‌లు శాంతించలేదు. సిఎంతో చర్చించేందుకు కొంతమంది జర్నలిస్ట్‌లను బాలరాజు తన వెంట తీసుకువెళ్లారు. ఎస్‌ఐపై తక్షణం చర్య తీసుకుంటామని సిఎం ప్రకటించారు.
హనుమాన్ ఆలయంలో విగ్రహాలు ధ్వంసం
పెద్దశంకరంపేట, డిసెంబర్ 18: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పట్టణ శివారులోని రహదారి పక్కన ఉన్న తిరుమలాపూర్ హనుమాన్ దేవాలయంలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు నవగ్రహాలైన శని, రాహు విగ్రహాలను ధ్వంసం చేసి ఆలయం చుట్టూ మలమూత్ర విసర్జనతో అపవిత్రం చేశారు. మంగళవారం ఉదయం 6 గంటలకు పట్టణంలోని అయ్యప్పస్వాములు దర్శనానికి వెళ్లగా గుడి తాళం పగులగొట్టి ఉండడం, ఆలయం ముందు మలమూత్ర విసర్జన చేసి ఉండడంతో అవాక్కయ్యారు. ఇద్దరు స్వాములు ఆలయంలోకి వెళ్లి చూడగా ప్రతిష్ఠించిన శనీశ్వర, రాహు విగ్రహాలు పెకిలించి ఉన్నాయి. శివలింగం ముందు గల నంది విగ్రహం కొమ్ములు విరిగి పడి ఉన్నాయి. ఈ విషయం పట్టణంలో దావానంలా వ్యాపించడంతో వేలాది మంది అక్కడికి చేరుకుని నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ అక్కడికి చేరుకుని ప్రజలను శాంతపరుస్తూ పై అధికారులకు తెలియజేశారు.
సిబిఐకి చిక్కిన పోస్టల్ అధికారి
ఆమదాలవలస, డిసెంబర్ 18: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస డివిజనల్ పోస్టల్ కార్యాలయంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న పివి రమణమూర్తి లక్షా 10 వేలు బీమా చెల్లింపునకు 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ మంగళవారం రాత్రి పట్టుబడ్డారు. బాధితుడు నూతిబిల్లి హేమంత్ ఫిర్యాదు మేరకు విశాఖపట్నం సిబిఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు సుమారు తొమ్మిది మంది కార్యాలయంపై దాడి చేసి రమణమూర్తిని పట్టుకున్నారు. బీమా సొమ్ము చెల్లింపులో సంబంధిత అధికారి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు సిబిఐను ఆశ్రయించాడు.
మత్స్యకారుల దీక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, డిసెంబర్ 18: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో ఏర్పాటు చేయనున్న అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పరిసర గ్రామాల ప్రజలు పలురూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మంగళవారం పలువురు మత్స్యకారులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షా శిబిరాన్ని అఖిలపక్ష ప్రజాసంఘ నాయకులు సందర్శించి మత్స్యకారుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అణువిద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నించడం అన్యాయమని స్పష్టంచేశారు.
శ్రీ శారదాపీఠంలో అతిరుద్ర,
లక్ష చండీయాగం ప్రారంభం
ఆరిలోవ, డిసెంబర్ 18: లోక కల్యాణార్థం విశాఖ శ్రీ శారదాపీఠంలో అతిరుద్ర, లక్ష చండీయాగం మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. శ్రీపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీస్వామి స్వీయ పర్యవేక్షణలో, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో యాగం ప్రారంభమైంది. స్వరూపానందేంద్ర సరస్వతీస్వామి అనుగ్రహభాషణం చేస్తూ నాలుగువందల మంది ఋత్వికులచే యాగం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శ్రీ శారదాపీఠంలో 5వ సారి యాగం నిర్వహిస్తున్నామని అన్నారు. టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ లోక కల్యాణార్థం చేపడుతున్న కార్యక్రమంలో పాల్గొని తరించాలని అన్నారు.