విశాఖపట్నం, డిసెంబర్ 18: అయ్యో పాపం జగన్ అరెస్ట్ అయ్యాడని ప్రజలు కన్నీరు కార్చి సానుభూతి చూపితే రాష్ట్రం అధోగతిపాలవుతుందని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విశాఖ జిల్లాలో రెండో రోజు ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం అనకాపల్లిలో సభలో ప్రసంగించారు. జగన్‌ను కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ అరెస్ట్ చేయించలేదని అన్నారు. అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు, పెట్టుబడులే జగన్‌ను అరెస్ట్ చేయించాయన్నారు. అక్రమ ఆస్తులను గుర్తించిన తరువాతే సిబిఐ జగన్‌ను అరెస్ట్ చేసిందని సిఎం చెప్పారు. జగన్ ఏనాడైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశాడా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడి ఆయన జైలుకు వెళ్లలేదని, అయితే ఆయన అనుచరులు ఈ అరెస్ట్‌పై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నారని కిరణ్ ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నప్పుడు ఎందుకు సభలో లేరని ప్రశ్నించారు. ఆయన వయ్యారి నడకలతో పాద యాత్ర చేస్తున్నారని, దానివలన ఎవరికి ప్రయోజనమని నిలదీశారు. సబ్ ప్లాన్‌పై ఓటింగ్ జరిగినప్పుడు సిపిఐ, సిపిఎం, బిజెపి, వైకాపాలు టిడిపికి మద్దతు పలకడం శోచనీయమని అన్నారు. ఈ పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఆలోచన చేస్తున్నాయని కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అంతకు ముందు గాజువాక బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టడం వలన రేషన్ డిపోల ద్వారా ఇస్తున్న బియ్యం, కిరోసిన్‌ను నిలిపివేస్తారని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రూపాయికి కిలో బియ్యం పథకాన్ని రద్దుచేసేది ఆయన స్పష్టం చేశారు. కిలో బియ్యం రూపాయికి ఇచ్చి, మిగిలిన వస్తువుల ధరలను తగ్గించలేదని మహిళలు అంటున్నారని, కనీసం బియ్యమైనా చవకగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ పథకాన్ని అమలు చేస్తున్నామని సిఎం అన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండో రోజునే రైతులకు ఇచ్చే సబ్సిడీని 4,500 రూపాయల నుంచి 10 వేల రూపాయలకు పెంచానని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌లో 6,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నట్టు యాజమాన్యాలు తెలియచేశాయని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వచ్చే ఐదేళ్లలో ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద విశాఖ జిల్లాలో 1300 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామీణ రైతాంగం ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శనను ఆయన తిలకించారు.
సిఎం పర్యటనలో బుల్లెట్ కలకలం
విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనలో ఓ బుల్లెట్ కలకలం సృష్టించింది. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా సిఎం మంగళవారం మధ్యాహ్నం అనకాపల్లికి చేరుకున్నారు. అనకాపల్లి పట్టణంలోకి వచ్చిన వెంటనే సిఎం కాన్వాయ్ వేగం తగ్గింది. మీడియా వాహనానికి ముందున్న పోలీస్ ఎస్కార్ట్ జీప్ కాన్వాయ్‌లో నుంచి పక్కకు తప్పుకుంది. దీంతో ఎక్కడ అపశృతి చోటు చేసుకుందో తెలియక అంతా ఆందోళన చెందారు. వెనుక నుంచి పరుగెత్తుకుని వచ్చిన ఇద్దరు ఎస్‌ఐలు ఎస్కార్ట్ వాహనం కింద ఉన్న ఓ బుల్లెట్‌ను చేజిక్కించుకున్నారు. అది ఎక్కడ నుంచి, ఎలా వచ్చిందీ వారికీ అర్థం కాలేదు. ఎస్కార్ట్ పోలీసులలో ఎవరి తుపాకీ నుంచైనా మాగ్జైన్ జారి పడి బుల్లెట్ బయటకు వచ్చిందా అనే కోణంలో పోలీసులు పరిశీలించారు. కానీ అక్కడ మాగ్జైన్ కనిపించలేదు. మరి ఆ బుల్లెట్ ఎలా వచ్చిందో తెలియటం లేదు.
చిత్రం... అనకాపల్లిలో చెరకు మొక్కలు నాటే
విధానాన్ని పరిశీలిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి
మహిళల పట్ల అసభ్య ప్రవర్తన
యువకుడిని కొట్టి చంపారు
ములకలచెరువు, డిసెంబర్ 18: మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ ఉన్మాదిపై గ్రామస్థులు దాడి చేయడమే కాకుండా చంపి మృతదేహాన్ని కాల్చేసి అంతిమ తీర్పునిచ్చారు. ఉన్మాదిని చెట్టుకి కట్టెసి కొట్టి చంపి కాల్చివేశారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం వేపూరుకోట పంచాయతీ ఉమాశంకర్ కాలనీకి చెందిన శంకర్ (33), చిన్నతనం నుంచి వ్యసనాలకు బానిసై చిన్నచిన్న నేరాలకు పాల్పడేవాడు. మదనపల్లె పరిధిలోని ఒక చోరీ కేసులో అరెస్టు అయి గత నెల 30న విడుదలయ్యాడు. నాలుగు రోజుల క్రితం శంకర్ స్వగ్రామమైన ఉమాశంకర్ కాలనీకి వచ్చాడు. అప్పటి నుంచి తప్పతాగి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని వేధించసాగాడు. దీనిపై ఎవరైన ప్రశ్నిస్తే వారిపై దాడిచేసి గాయపరిచేవాడు. ఈ నేపధ్యంలో సోమవారం రాత్రి శంకర్ మద్యం మత్తులో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిసుండటంతో గ్రామస్థులు అతనిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతదేహాన్ని గ్రామానికి కిలోమీటరు దూరంలో వున్న చినే్నరులో టైర్లువేసి కాల్చివేశారు. విషయం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ రాఘవరెడ్డి, సిఐ ఎవి రమణ, ఎస్‌ఐ గంగిరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు సాగిస్తున్నారు.
వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, డిసెంబర్ 18: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 23న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఇప్పటికే భక్తుల దర్శన, వసతి ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సర్వదర్శనం, దివ్యదర్శనం, వి ఐ పి దర్శనాల్లో స్వామివారిని ఏకాదశి పర్వదినం నాడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే భక్తులకు నిర్దేశిత సమయం, నిర్దేశిత క్యూలైన్లు, నిర్దేశిత ప్రదేశాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. విఐపి భక్తులకు డిసెంబర్ 23న ఉదయం 1.45గంటల నుండి 5గంటల లోపు దర్శనం ఉంటుంది. దివ్యదర్శనం(కాలిబాట)్భక్తులకు ఉదయం 4గంటల తరువాత మాత్రమే నారాయణగిరి ఉద్యానవనాలలో వారికి కేటాయించిన క్యూలైన్లలోకి అనుమతిస్తారు. దివ్యదర్శనం భక్తుల సౌకర్యార్థం గాలిగోపురం వద్ద 12 టికెట్టు కౌంటర్లు, శ్రీవారి మెట్టు చెంత 8టికెట్టు కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 5గంటల తరువాతనే సర్వదర్శనం భక్తులను ఆళ్వారుట్యాంకు చుట్టూ ఉండే క్యూలైన్ల ద్వారా ఆలయంలోనికి అనుమతిస్తామన్నారు.
ఎఫ్‌డిఐలపై పోరు: కిషన్‌రెడ్డి
అనంతపురం సిటీ, డిసెంబర్ 18: దేశంలో చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతిస్తే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై దేశం అంధకారంలోకి వెళ్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించారు. దీనివల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయన్నారు. ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా గ్రామాల్లోని చిల్లర వర్తకులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం అనంతపురం నగరంలో జరిగిన జిల్లా పదాధికారుల సమావేశంలో ‘దేశంలో చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ అనాదిగా చిల్లర వ్యాపారంతో కుటుంబాలను పోషించుకునే చిరు వ్యాపారులను ఆర్థికంగా దెబ్బతీయడానికి విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వాలని కుట్ర పన్నారన్నారు. కాగా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం తెలుగు భాషను అవహేళన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో విలేఖర్లతో మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలు మాతృభాషను కాపాడుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశాయని, కాని రాష్ట్రంలో అలాంటి దాఖలాలు కనిపించవని ఎద్దేశా చేశారు. శాసన సభ ద్వారా జారీ అయ్యే జివోలను తెలుగులోనే వచ్చేలా కృషి చేయాలన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. చంద్రబాబు తెలుగు భాషకు పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు.
శ్రీవారి సేవలో విజయమాల్యా
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, డిసెంబర్ 18: యుబి చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త విజయమాల్య మంగళవారం ఉదయం కల్యాణోత్సవ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలోని ద్వారాలకు బంగారు తాపడం చేయించడానికి 3 కేజిల బంగారాన్ని ఆలయ డిప్యూటీ ఇఓ చిన్నంగారి రమణకు అందజేశారు. వాస్తవానికి శ్రీవారి ద్వారాలకు బంగారు తాపడం చేయిస్తానని గతంలో ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే 8 కేజిల బంగారాన్ని టిటిడికి అప్పగించారు. తక్కిన మూడు కిలోలను మంగళవారం అధికారులకు అందజేశారు. బుధవారం తన 56 జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన మంగళవారం తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. విజయమాల్య వెంట వ్యాపార వేత్త డికె ఆదికేశవుల నాయుడుతో పాటు ప్రముఖ సినీనటి సమీరారెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు.