హైదరాబాద్, డిసెంబర్ 19: నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం అయ్యేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ద ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. మహాసభల ఏర్పాట్లపై సచివాలయంలో బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్వహిస్తున్న తెలుగు మహాసభలు అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. తెలుగువారంతా తమ ఇంటిలో నిర్వహించే పండగలా దీన్ని పరిగణించాలని సూచించారు. నిరసనలు వ్యక్తం చేయడం సబబు కాదని, మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కూడా కొన్ని సంస్థలు నిరసన వ్యక్తం చేశాయని గుర్తు చేశారు. ప్రస్తుతం నిరసన వ్యక్తం చేసేందుకు తగిన బలమైన కారణాలు ఏవీ లేవన్నారు.
నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నవారితో, సభల నిర్వహణను వ్యతిరేకిస్తున్న వారితో ఇప్పటికే చర్చలు కూడా జరిపామని గుర్తు చేశారు. పరిపాలనలో తెలుగు భాషను వినియోగించడం, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీ చేయడం, రాష్ట్ర మంత్రివర్గంలో తెలుగుభాషకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం తదితర అంశాలపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదన్నారు. ఈ విషయాలు ఇప్పటికిప్పుడే ఉద్భవించినవి కావని, వీటి అమలుకోసం కొంత సమయం అవసరం అవుతుందని, ఈ దిశలో ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని వెల్లడించారు. ఏ సమస్యను కూడా క్షణాల్లో పరిష్కరించలేమని, దానికి ఒక ప్రణాళిక, కొంత వ్యవధి అవసరం అని పేర్కొన్నారు. తెలుగులోనే జీఓలు జారీ చేసే అంశానికి సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, సాంకేతిక అంశాలు పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కారణాల వల్ల మహాసభలు ఏర్పాటు కాకముందే నిరసనలు వ్యక్తం చేయకుండా, వేచి చూడాలని, మహాసభల్లో తీసుకునే నిర్ణయాల తర్వాత వాటిని ప్రభుత్వం అమలు చేయలేకపోతే ఆందోళన చేపట్టినా అర్థం చేసుకోవచ్చన్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలు ఎకాఎకిన ఏర్పాటు చేయడం లేదని అన్ని వర్గాలతో ప్రభుత్వం చర్చించిందని బుద్దప్రసాద్ గుర్తు చేశారు. కవులు, రచయితలు తదితరులతో రవీంద్రభారతిలో సమావేశం ఏర్పాటు చేశామని, మీడియా అధినేతలు, సంపాదకులతో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి స్వయంగా సమావేశం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వివిధ పార్టీల అభిప్రాయాలు తీసుకునేందుకు అఖిలపక్షం సమావేశం కూడా నిర్వహించినట్టు తెలిపారు. గ్రామస్థాయి మొదలుకుని జిల్లా స్థాయి వరకు కూడా సభలు సమావేశాలు నిర్వహించి అందరి సలహాలు, సూచనలు తీసుకున్నామని గుర్తు చేశారు. నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు ముందే అన్ని వర్గాలవారితో చర్చలు జరపడంతో సమావేశాల నిర్వహణపై స్పష్టమైన వైఖరి ఉందన్నారు. అధికార భాషగా తెలుగును ఏ విధంగా అమలు చేయాలన్న విషయంలో ఇప్పటికే మేధావులు, కవులు, రచయితలు, భాషాశాస్తవ్రేత్తలు అనేక సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు. మహాసభల సందర్భంగా మరిన్ని సూచనలు, సలహాలు వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు. ప్రపంచ తెలుగు మహాసభలు ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ, ఇది తెలుగువారందరికీ సంబంధించిన చారిత్రక ఘట్టంగా పరిగణించాలని పేర్కొన్నారు. అందుకే అందరూ ఈ సభల్లో పాల్గొనాలని, వీటిని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు.
సభలకు సంబంధించి పూర్తి వివరాలు సిద్ధం చేస్తున్నామని, గురువారం తుది నిర్ణయం తీసుకుంటామని మండలి తెలిపారు. మహాసభల నిర్వహణకు నిధులకు ఎలాంటి కొరత లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహాసభలకు ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరిస్తోందని, ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 25 కోట్ల రూపాయలు కేటాయించారని, అవసరం అయితే మరిన్ని నిధులు విడుదల చేసేందుకు అంగీకరించారని వివరించారు.
తెలుగువారి పండగలా ప్రపంచ మహాసభలు అధికార భాషా సంఘం అధ్యక్షుడు బుద్దప్రసాద్
english title:
s
Date:
Thursday, December 20, 2012