హైదరాబాద్, డిసెంబర్ 19: ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం అవినీతిమయం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపీదారుడు..’ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి చెన్నంశెట్టి రామచంద్రయ్య ధ్వజమెత్తారు. వైఎస్ పాలన అవినీతిమయం అని తాను లోగడ చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని మంత్రి రామచంద్రయ్య బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. అయితే వైఎస్ అవినీతితో మంత్రులకు సంబంధం ఉందో? లేదో? తనకు తెలియదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా దాట వేశారు. వైఎస్ హయాంలో పిఆర్‌పి విలీనాన్ని తాను వ్యతిరేకించానని ఆయన గుర్తు చేశారు. పాదయాత్ర చేపట్టిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే బాబు మతిస్థిమితం కోల్పోయారేమోనన్న అనుమానం కలుగుతున్నదని అన్నారు. పిఆర్‌పిని కాంగ్రెస్‌లో విలీనం చేయడం రాజ్యాంగ ద్రోహం అని బాబు విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎన్టీఆర్ నుంచి టిడిపిని లాక్కోవడం, సిఎం పదవిని లాక్కోవడం రాజ్యాంగ ద్రోహం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఎవరు పథకాలు ప్రారంభించినా ఇవి తనవేనని, తన పథకాలను కాపీ కొట్టారని బాబు ప్రకటిస్తున్నారని ఆయన తెలిపారు. నగదు బదిలీ పథకం తనదేనని బాబు చెబుతున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి తమరు పాదయాత్ర చేపట్టడం కాపీ కాదా? అని ఆయన ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్, టిఆర్‌ఎస్, వామపక్షాలతో కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావడాన్ని చూసి, 2009లో అవే పక్షాలతో టిడిపి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేయడం కాపీ కొట్టడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. బాబు వ్యాఖ్యలను చూస్తుంటే మతి స్థిమితం కోల్పోయినట్లు కనిపిస్తున్నదని అన్నారు. లోగడ బాబు అధికారంలోకి రాగానే పేదలను మరిచారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌లో పిఆర్‌పి విలీనం చేయక ముందు వైఎస్ అవినీతి పరుడని చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
మంత్రి రామచంద్రయ్య ధ్వజం
english title:
ys
Date:
Thursday, December 20, 2012