న్యూఢిల్లీ, డిసెంబర్ 19: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డితోపాటు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో విధ్వంసానికి పాల్పడిన సీమాంధ్ర విద్యార్థులపై బనాయించిన కేసులను ఉపసంహరించిన ప్రభుత్వం.. తెలంగాణ విద్యార్థుల విషయంలో మాత్రం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని ఎంపీలు జి వివేక్, మందా జగన్నాథం, మధుయాష్కీ, రాజయ్య, పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కిరణ్‌కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాకాక ఒక్క సీమాంధ్రకే ముఖ్యమంత్రి అన్న తీరులో ప్రవర్తిస్తున్నారని బుధవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో నిప్పులు చెరిగారు. ఉద్యమ సమయంలో ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ విద్యార్థులపై బనాయించిన కేసులను ఉపసంహరిస్తామంటూ ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇంతవరకూ నేరవేర్చలేదని మండిపడ్డారు. కాగా, శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించిన జగన్మోహన్‌రెడ్డి ఆయన అనుచరులపై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఆరు జీవోలను విడుదల చేయటంపై ఎంపీలు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పాలకపక్షానికి గట్టి పోటీగా జగన్‌ను పరోక్షంగా ముఖ్యమంత్రే పెంచి పోషిస్తున్నారన్న అనుమానాన్ని ఈ సందర్భంగా వీరు వెలిబుచ్చారు. తెలంగాణ విద్యార్థులు, న్యాయవాదులకు ఒక న్యాయాన్ని, సీమాంధ్ర వారికి మరో న్యాయాన్ని వర్తింపచేయటం దారుణమన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులపై పెట్టిన కేసులను ఉపసంహరించకపోయినా తాము పట్టించుకోమని, అయితే విద్యార్థులపై బనాయించిన కేసులను మాత్రం తక్షణమే రద్దు చేయాలని వివేక్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే ఈ విషయమై తగిన చర్యలు తీసుకోని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. పదవుల కోసం ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు రాజీనామా చేస్తే తాము తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నిజం చేయటానికి పదవులకు రాజీనామా చేశామంటూ కావూరి వైఖరిని జగన్నాథం విమర్శించారు. తమ వారసులను జగన్ పార్టీలోకి పంపి కాంగ్రెస్‌ను దెబ్బతీసే ఉద్దేశంతో సీమాంధ్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారని మధుయాష్కీ ఆరోపించారు. కెఎస్ రావు తన లోక్‌సభ సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ విద్యార్థులపై కేసుల ఎత్తివేతలో అన్యాయం * ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ టి-ఎంపీలు
english title:
j
Date:
Thursday, December 20, 2012