పాడేరు, డిసెంబర్ 19: ఉపాధిహామీ పథకంలో 150 రోజులు పూర్తిచేసుకున్న గిరిజనులకు అదనంగా మరో 25 రోజుల పనిదినాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మబాట మూడోరోజు బుధవారం ఆయన పాడేరు డివిజన్‌లో పర్యటించారు. పాడేరు జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అటవీ ఫలసాయంపై స్థానిక పంచాయతీలకే అధికారం ఇస్తామన్నారు. గిరిజన సంక్షేమానికి వచ్చే బడ్జెట్‌లో 2 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై రాష్టవ్య్రాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. హాస్టళ్లలో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై దళిత, గిరిజన వర్గాలలో అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజనుల కోసం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ఇప్పటికే నిర్ణయించామని చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరిజనులకు ప్రత్యేకంగా మరో 25 రోజుల పనిదినాలను కల్పిస్తున్నట్టు ప్రకటించారు. గిరిజనులకు ఇంతవరకు 150 పనిదినాలను అమలు చేస్తున్నామని, వీటిని పూర్తి చేసిన వారికి అదనంగా మరో 25 పనిదినాలను కల్పించాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం ఉపాధి హామీలో 150 రోజుల పనిదినాలను పూర్తి చేసిన వారి వివరాలతో ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. గిరిజన గ్రామాలకు త్వరలోనే తారు రోడ్లు రానున్నాయని కిరణ్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏజెన్సీలో 242 కోట్ల 13 లక్షల రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి, మహిళా సంఘాలకు 11 కోట్ల 34 లక్షల రూపాయల రుణాల చెక్కులు పంపిణీ చేశారు. గిరిజన ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 27 వేల మంది బాలలకు పాల సరఫరా చేసే పథకాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. మంత్రులు దర్మాన ప్రసాదరావు, గంటా శ్రీనివాసరావు, పసుపులేటి బాలరాజు, అరకులోయ ఎంఎల్‌ఎ సివేరి సోమ, పలువురు ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన గిరిజనులు పాల్గొన్నారు.
అటవీ ఫలసాయంపై పంచాయతీలకే అధికారం
అడవి నుంచి గిరిజనులు సేకరించే అటవీ ఫలసాయాలపై అధికారాన్ని ఆయా పంచాయతీలకే అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నామని సిఎం ప్రకటించారు. దాలింపుట్టు గ్రామ నర్సరీలో అటవీ హక్కు చట్టం లబ్ధిదారులు, కాఫీ, ఉద్యానవన తోటల లబ్ధిదారులతో బుధవారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే నెల 3వ తేదీన తానే స్వయంగా చింతపల్లి మండలం దద్దుగులు పంచాయతీలో పర్యటించి ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం అమలు చేస్తానన్నారు.
వసతి గృహాలకు సోలార్ విద్యుత్
కోటవురట్ల: రాష్ట్రంలో వసతి గృహాలకు సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం రాత్రి విశాఖ జిల్లా కోటవురట్లలోని సమీకృత వసతి గృహంలో బసచేసిన ముఖ్యమంత్రి బుధవారం ఉదయం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.
చిత్రం... విశాఖ జిల్లా పాడేరులో బుధవారం సాయంత్రం జరిగిన సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి
ఉపాధిహామీపై గిరిజనులకు ముఖ్యమంత్రి కిరణ్ భరోసా
english title:
a
Date:
Thursday, December 20, 2012