విశాఖపట్నం, డిసెంబర్ 19: పీఠాలలో స్వామీజీల పర్యవేక్షణలో జరిగే యాగాలు లోక కల్యాణం కోసమేనని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. శ్రీశారదాపీఠంలో రాజ్యసభ సభ్యులు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో స్వరూపానందేంద్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న లక్ష చండీ, అతి రుద్రయాగం రెండవరోజు బుధవారం అతి వైభవంగా జరిగింది. శ్రీశారదా పీఠ ఆస్థాన వేద పండితుల సారథ్యంలో నాలుగు వందల మంది యాగ రుత్విక్కులు ఈ యాగాన్ని నిర్వహించారు. యాగ నిర్వాహకులు, రాజ్యసభ సభ్యులు సుబ్బరామిరెడ్డి యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అందాల విశాఖ మరింత పచ్చగా సుఖశాంతులతో ఉండాలన్నదే తన ఆశయమన్నారు. నగరంతోపాటు రాష్ట్రం, యావత్తు దేశంలోని ప్రజలంతా సుఖంగా ఉండటం కోసమే పూజ్య స్వామీజీ పర్యవేక్షణలో ఈ యాగాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలంతా భక్తిమార్గంలో తరించాలని పిలుపునిచ్చారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ సామాన్య గృహస్థులు తమతమ గృహాల్లో నిర్వహించుకునే యజ్ఞయాగాదులు స్వప్రయోజన ఫలాన్నిస్తాయన్నారు. ఆస్థాన వేద పండితులు కృష్ణశర్మ నేతృత్వంలో నాలుగు వందల మంది ఋత్విక్కులు 21 యాగ గుండాలలో యాగం చేస్తున్నారన్నారు.
ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు
శ్రీశైలం, డిసెంబర్ 19: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 23న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి సాగర్ బాబు తెలియజేశారు. ఆదివారం వేకువ జామున స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు కల్పిస్తామన్నారు. రావణ వాహన సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు. ఆలయ వేళల్లో మార్పులు చేశామన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరుస్తామని, మంగళవాయిద్యాలతో 4 గంటలకు సుప్రభాత సేవ, ఆది దంపతులకు ప్రాతఃకాల పూజలు నిర్వహిస్తారన్నారు. 4.30 నుండి అమ్మవారికి మహామంగళ హారతులిచ్చి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. అంతకుముందు సుప్రభాత సేవ, మహా మంగళహారతి, కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లను ఉత్తర ద్వారం ద్వారా వెలుపలకు తీసుకొచ్చి అభిషేక మండపంలో అశీనులను చేసిపూజాధికాలు నిర్వహిస్తామన్నారు.
కొప్పరపు కవులు కారణజన్ములు
* సిద్దేశ్వరానంద భారతీస్వామి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, డిసెంబర్ 19: కవిత్వాన్ని వేగంగా, అందంగా చెప్పి తెలుగు సాహితీ వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన కొప్పరపు కవులు కారణజన్ములని సిద్దేశ్వరానంద భారతీస్వామి కొనియాడారు. టిటిడి శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో కొప్పరపు కవిరాజుకు సాహితీ నీరాజనం అందించారు. ప్రారంభ కార్యక్రమంలో తమిళనాడులోని వౌనస్వామి మఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీ స్వామి అనుగ్రహ భాషణ చేశారు. కొప్పరపు కవులు ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆసువుగా కవిత్వాన్ని చేప్పేవారని, వీరి ప్రతిభను మెచ్చుకుని ఎందరో రాజులు, జమీందారులు సన్మానాలు, సత్కారాలు చేశారని వివరించారు. టిటిడి ఇ ఓ ఎల్ వి సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ కొప్పరపు కవులుగా ప్రసిద్ధి చెందిన కొప్పరపు వెంకటసుబ్బరాయకవి, కొప్పరపు వెంకటరమణ కవి ఆ రోజుల్లో గంటకు 500 పద్యాలను ఆసువుగా చెప్పేవారని, దీన్ని బట్టి వారి సామర్థ్యం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చునన్నారు. విద్యార్థులు మార్కుల కోసం పాఠాలు చదవడం తప్ప, మన పెద్దలు అందించిన వారసత్వ సంపద గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదన్నారు. పద సంపదను పెంచుకున్నప్పుడే బాష ఔన్నత్యం తెలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కొప్పరపు కవుల కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు మా శర్మ రచించిన ‘కొప్పరపు కవుల ప్రతిభా ప్రభ’ పుస్తకాన్ని సిద్దేశ్వరానంద భారతీ స్వామి ఆవిష్కరించారు.
* శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర
english title:
l
Date:
Thursday, December 20, 2012