న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియోరంగం రూ.1400 కోట్ల టర్నోవర్ సాధిస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 86 నగరాల్లో పనిచేస్తున్న 245 ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల ఆదాయం 2012-13లో రూ.1400 కోట్లకు చేరుకునే అవకాశం వుందని ‘అభివృద్ధి పథంలో భారతీయ ఎఫ్‌ఎం రేడియో’ అనే అంశంపై సిఐఐ, అర్నెస్ట్ అండ్ యంగ్ జరిపిన సర్వే వెల్లడించింది. అలాగే ఎఫ్‌ఎం మూడవ దశ విధానం అమలు జరిగిన మూడేళ్ల వ్యవధిలో ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియో రంగం సాలీనా 18% వృద్ధిరేటుతో రూ.2300 కోట్ల టర్నోవర్ స్థాయికి చేరుకో గలదని నివేదిక పేర్కొంది. మొత్తం దేశ అడ్వర్టైజ్‌మెంట్ పరిశ్రమలో ఎఫ్‌ఎం రేడియో నలుగుశాతం వాటాను కలిగివుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం పరిశ్రమలో రేడియో రంగం సగటు వాటా 5-10 శాతం శ్రేణిలో వుందని అధ్యయనం వివరించింది.
ఐఆర్‌ఎస్ 2012 రెండో త్రైమాసిక గణాంకాల నివేదిక ప్రకారం రేడియో మొత్తం ఆడియన్స్ సంఖ్య 15.8 కోట్ల మంది కాగా ఇందులో ఎఫ్‌ఎం రేడియో అడియన్స్ 10.6 కోట్లుగా అంచనా వేశారు. టీవీ విభాగంలో ప్రేక్షకులు 56.3 కోట్లు, ప్రింట్ సెక్టార్‌లో 35.2 కోట్ల మంది వున్నారని అంచనా వేశారు. ఎఫ్‌ఎం ఫేజ్ -3 విధానం త్వరగా అమలు చేయడం వల్ల రేడియో పరిశ్రమ ఆదాయం మూడేళ్లలో రూ.1400 కోట్ల నుంచి రూ.2300 కోట్ల స్థాయికి చేరుకుంటుందని అధ్యయనంలో పాల్గొన్న మెజారిటీ స్టేక్‌హోల్డర్లు అభిప్రాయపడినట్లు నివేదిక తెలిపింది.
* సిఐఐ, అర్నెస్ట్ అండ్ యంగ్ అధ్యయనం వెల్లడి
english title:
fm
Date:
Friday, December 21, 2012