తిరుపతి, డిసెంబర్ 21: ప్రతిష్ఠాత్మకంగా మూడు రోజుల పాటు తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగుమహాసభల ఏర్పాట్లలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సభలు మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ ఏ పనులూ ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. వేదికను అవిలాల చెరువు నుండి ఇక్కడకు మార్చడంతోనే కొంత ఇబ్బందులు వచ్చాయే తప్ప లేకుంటే ఇప్పటికే తాము ఈ పనులు పూర్తి చేసేవారమని కొంత మంది అధికారులు అంటున్నారు. ఏర్పాట్లు మాత్రం ముఖ్యమంత్రి కిరణ్ ఆశించినంత వేగవంతంగా సాగడం లేదన్నది అక్షర సత్యం. ప్రస్తుతం వేదిక వద్ద వున్న పరిస్థితులను పరిశీలిస్తే ఉన్న ఆరు రోజుల్లో 24 గంటలూ సిబ్బంది పనిచేస్తే తప్ప ఓ మోస్తరుగా పూర్తయ్యే పరిస్థితులు కానరావడం లేదు. ఇక్కడ విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం విస్పష్టంగా కనపడుతోంది. ట్రాన్స్‌ఫార్మర్లు ఆలస్యంగా ఏర్పాటు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రధాన వేదిక అలంకరణ, ప్రతినిధులు కూర్చునే షెడ్ల నిర్మాణంలో పనులు మాత్రం శుక్రవారం కొంత జోరుగానే సాగుతూ కనపడ్డాయి. భోజనశాలకు సంబంధించిన పనులూ అంతే. 130 అడుగుల వెడల్పు వుండాల్సిన వేదికను అధికారులు కొంత కుదించి ఏర్పాటు చేస్తున్నారు. ఆ వేదికకు ఇరువైపులా చిన్నపాటి వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. అందుకు కారణం సభలను ప్రారంభించేందుకు రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ వస్తే వేదికపై కేవలం 9 మంది మాత్రమే కూర్చోవడానికి భద్రతా సిబ్బంది అనుమతి ఇస్తారు.
ఈ నేపధ్యంలో మంత్రివర్గ సభ్యులంతా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన సీట్లలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలా కాకుండా వేదికకు ఇరువైపులా వారికోసం ప్రత్యేకంగా చిన్నపాటి వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ రాష్టప్రతి భద్రతా సిబ్బంది ఈ ఏర్పాట్లను అంగీకరించకపోతే మంత్రులు వేదిక ముందు అందరితో పాటు కూర్చోవాల్సి వుంటుంది. కాగా వేదిక వెనుకభాగాన తెలుగుతల్లి చిత్రంతో పాటు ఇద్దరు ప్రధాన కవుల చిత్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ ఆరిస్టు, డిజైనర్ అప్పాజీ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వీటితో పాటు ఒక పుస్తకంపై కలంతో రాస్తున్నట్లువున్న కవి చిత్రాన్ని వేదికకు వెనుక వైపున వుండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన వేదిక ముందు ప్రతినిధులు ఆసీనులయ్యే ప్రాంతాల్లో కూడా రాజమందిరాలను తలపించేవిధంగా కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. వేదికకు వెనుకభాగాన కుడి, ఎడమలుగా విఐపిలు విశ్రాంతి తీసుకునేవిధంగా గదులను, మరుగుదొడ్లను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యే విఐపిలు విలేఖరులతో ముచ్చటించడానికి ఒక వేదికకు కుడివైపున సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 20 ఎకరాల విసీర్ణంలో ప్రధాన వేదికను నిర్మిస్తున్నారు. ఈ పనులను టిటిడి ఇంజనీరింగ్ అధికారులతో పాటు డ్వామా పిడి చంద్రవౌళితో పాటు మరో పదిమంది తహశీల్దార్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రోజు 25 వేల మందికి తగ్గకుండా అవసరమైన అన్నపానీయాలు స్వీకరించడానికి వీలుగా రెండు అతిపెద్ద డైనింగ్ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అనుసంధానంగా ఒక భారీ వంటగదిని ఏర్పాటు చేస్తున్నారు. సభలకోసం నగరంలో విధులు నిర్వహించే పోలీసులు,ఇతర అధికారులు, సిబ్బందికోసం సుమారు 10 వేల ప్యాకెట్లను వారివారి స్థానాలకే ప్రత్యేక వాహనాల్లో తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సభలకు తిలకించడానికి వచ్చి ఆప్రాంతంలో భోజనం చెయ్యాలని భావించే సామాన్య ప్రజలు ఎవ్వరికైనా 10 రూపాయలకే రుచికరమైన భోజనాన్ని అందించేవిధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలో హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పుడ్ కమిటీ చర్చలు జరుపుతోంది. శుక్రవారం రాత్రి వరకూ ఈ వ్యవహారంపై హోటల్ యజమానులు తుది నిర్ణయం తీసుకోలేదు.
పనిచేసే వారికన్నా పెత్తందారులే ఎక్కువ
english title:
t
Date:
Saturday, December 22, 2012