భద్రాచలం, డిసెంబర్ 21: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన భద్రాచలం క్షేత్రంలో ఈ నెల 14న ప్రారంభమైన శ్రీ సీతారామచంద్రస్వామివారి అధ్యయనోత్సవాలు జనవరి 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా 21 రోజుల అధ్యయనోత్సవాలతో పాటుగా మూడు రోజులు స్వామివారికి విలాసోత్సవాలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా 15 రోజుల తర్వాత జనవరి 9న బహుళ ద్వాదశి నాడు విశేష ఉత్సవమైన విశ్వరూప సేవ జరగనుంది. మధ్య మణిపూసగా చేసుకొని ముందు పది రోజులు పగల్‌పత్తుగాను, వెనుక పది రోజులు రాపత్తుగాను వ్యవహరిస్తూ మొత్తం 21 రోజుల పాటు వైభవోపేతంగా అధ్యయనోత్సవాలను శ్రీపాంచరాత్ర భగవచ్ఛాస్త్రాన్ని అనుసరించి నిర్వహించడం సాంప్రదాయం. అధ్యయనోత్సవాలలో భాగంగా స్వామి వారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి పవిత్ర గోదావరి నదీ తీరాన హంస వాహనంపై స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. సోమవారం తెల్లవారుజామున రామాలయ ఉత్తర ద్వారం నందు వైకుంఠ ఉత్తర ద్వారదర్శనం గంటపాటు నిర్వహించనున్నారు. శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రదినం. సకల జగత్తుకు సృష్టి-స్థితి-లయకారకుడైన శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన రోజు. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన కాలం దేవతలకు బ్రహ్మ ముహూర్తకాలం. ఈ పరమ పవిత్రకాలంలో వచ్చే శుద్ధ ఏకాదశియే శ్రీ వైకుంఠ ఏకాదశి. ముక్కోటి (3 కోట్ల మంది) దేవతలు శ్రీ మహా విష్ణువును శ్రీ వైకుంఠంలోని ఉత్తరద్వారం నుంచి ఈ ఏకాదశి నాడు దర్శించారు. అందుకే ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే మరో పేరు కూడా ఉంది. సృష్టాదిలో మధు-కైటబులనే రాక్షసులను శ్రీమన్నారాయణుడు సంహరించిన ఈ వైకుంఠ ఏకాదశి నాడే వైకుంఠంలోని ఉత్తర ద్వారం నుంచి విముక్తిని పొందించినట్లు పురాణ గాథ. అందుకే ఈ ఏకాదశికి మోక్షదా అనే పేరు వచ్చింది. శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన 12 మంది ఆళ్వారులలో ఒకరైన పెరియాళ్వారులు, శ్రీ-్భ-నీళా సమేతుడై గరుడవాహనారూఢుడైన శ్రీమన్నారాయణుని ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆకాశాన ఉత్తరం వైపున దర్శించారని చరిత్ర. ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు వచ్చే భక్తులకు దేవస్థానం వివిధ శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసింది. రామాలయాన్ని విద్యుద్దీపాలంకరణతో ముస్తాబు చేశారు. దేవస్థానం ముక్కోటి ఉత్సవాలకు గాను సుమారు రూ.30 లక్షలతో ఏర్పాట్లు చేస్తోంది.
..........
ధ్యానంతోనే ప్రపంచ శాంతి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, డిసెంబర్ 21: ప్రపంచ ధ్యాన మహాసభలు శుక్రవారం అట్టహాసంగా మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామ సమీపంలో గల హన్మాస్‌పల్లిలో ప్రారంభమయ్యాయి. పిరమిడ్ ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన మహాసభలు ప్రారంభం రోజు దేశ, విదేశాల నుండి ధ్యానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచ ధ్యాన మహాసభలను పురస్కరించుకుని కడ్తాల నుండి హన్మాస్‌పల్లి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రముఖ సంగీత విధ్వాంసుడు రమణి, పిరమిడ్ ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు సుభాష్ పత్రీజీ జ్యోతి ప్రజ్వలన చేసి ధ్యాన మహాసభలను ప్రారంభించారు. ప్రముఖ సంగీత గాయకురాలు ఎస్‌పి శైలజ ధ్యాన మహాసభల్లో తన సంగీతంతో ధ్యానులను మంత్రముగ్దులను చేశారు. ధ్యాన మహాసభల సందర్భంగా సుభాష్ పత్రీజీ సందేశాన్ని ఇస్తూ ధ్యానంతో ప్రపంచంలోని ప్రజలు శాంతిగా జీవిస్తారని తెలిపారు. కాగా మొదటి రోజు దాదాపు 20వేల మంది ధ్యానులు హాజరయ్యారు. సుభాష్ పత్రీజీ తన వేణుగానంతో మహాసభలకు హాజరైన వారిని ధ్యానంలోకి నెట్టెశారు. ప్రశాంతమైన వాతావరణం, వేలాది మంది నిశ్శబ్దంగా ధ్యానం చేస్తున్న సమయంలో గుండు సూది కిందపడితే వినిపించేంత నిశ్శబ్ద వాతావరణం నెలకొనడం విశేషం. ప్రపంచ మొత్తం కడ్తాల గ్రామం వైపు దృష్టి మళ్లింది. స్పిరిచ్యువల్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ధ్యాన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ 32,400 చదరపు అడుగుల విస్ణీరంలో 113.6 మీటర్ల ఎత్తున నిర్మించిన ధ్యాన పిరమిడ్ కేంద్రాన్ని గత ఏడాది నవంబర్ 11న ప్రారంభించారు. ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా నిలిచింది. ఇందులో ఒకేసారి దాదాపు ఆరువేల మంది కూర్చోని ధ్యానం చేసుకునే అవకాశం ఉంటుంది. ధ్యాన మహాసభలు మొదటి రోజు పిరమిడ్ కేంద్రంలో కాకుండా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం దాదాపు ఆరువేల మందితో పిరమిడ్ కేంద్రంలో ధ్యానం చేయించనున్నారు.
కన్నుల పండువగా
కందనవోలు సంబరాలు
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, డిసెంబర్ 21: తిరుపతిలో నిర్వహించనున్న 4వ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా కర్నూలులో శుక్రవారం కందనవోలు సంబరాల పేర ఉత్సవాలను ప్రారంభించారు. కర్నూలుకు తలమానికమైన కొండారెడ్డి బురుజు వద్ద మంత్రి టిజి వెంకటేష్ తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ కళా ప్రదర్శనలతోపాటు మిమిక్రీ, లంబాడీ నృత్యం, గజల్ శ్రీనివాస్ ఆలపించిన గజల్స్ ఆకట్టుకున్నాయి. పోలీసు కవాతు మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింగళి సూరన ప్రాంగణంలో తెలుగు వంటలు, తెలుగు వారు రచించిన పుస్తకాలు, తెలుగు గొప్పదనాన్ని చాటి చెప్పే ఛాయా చిత్ర ప్రదర్శన, నంది కోలాట సేవ అలరించాయి. మంత్రి టిజి మాట్లాడుతూ తెలుగు వాడిగా పుట్టడం పూర్వ జన్మ సుకృతమన్నారు. మరు జన్మ అంటూ ఉంటే తెలుగు వాడిగా కర్నూలు జిల్లా వాసిగానే జన్మించాలని ఆయన కోరుకుంటున్నానన్నారు.
ఇద్దరు బాలికలపై
అత్యాచారం
- విశాఖ, విజయనగరం జిల్లాల్లో దారుణం -
నర్సీపట్నం/గజపతినగరం, డిసెంబర్ 21: విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగింది. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంటలో ఆరేళ్ల బాలికపై గురువారం రాత్రి ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న పాపను ఆ యువకుడు మాయమాటలు చెప్పి చంపావతి నది వద్దకు తీసుకుపోయి అత్యాచారం జరిపాడు. బాలిక అదేరోజు రాత్రి ఇంటికి చేరి జరిగిన సంఘటన తల్లిదండ్రులకు తెలియజేసింది. గ్రామంలో ఒక ఇంటికి చుట్టపుచూపుగా వచ్చిన యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అత్యాచారానికి గురైన బాలికతో పాటు అనుమానితుని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో సంఘటనలో విశాఖ జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ శివారు లింగాల గుడి గ్రామానికి చెందిన 12 ఏళ్ళ గిరిజన మైనర్ బాలికకు ఆరోగ్యం బాగుండకపోవడంతో తన స్నేహితులతో కలిసి బుధవారం చింతపల్లి ఆసుపత్రికి వచ్చింది. వైద్య పరీక్షల అనంతరం తన గ్రామానికి వెళ్ళేందుకు వేచి ఉండగా లింగాల గుడి గ్రామానికి చెందిన కాపరి రాజు అనే యువకుడు మోటార్ బైక్‌పై వచ్చి ఇంటికి వస్తావా అని అడిగి బైక్‌పై ఎక్కించుకుని తుప్పల్లోకి తీసుకువెళ్ళి బాలిక నోట్లో చున్నీ కుక్కి అత్యాచారానికి పాల్పడి అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను వెలుగు కార్యాలయం ఆవరణలో వదిలిపెట్టి పరారయ్యాడు. సమీపంలో ఉన్న వ్యక్తులు బాలికను చూసి వివరాలు అడిగి వారి గ్రామానికి పంపించారు.
ఎసిబికి చిక్కిన విఆర్‌ఓ
సంతమాగులూరు, డిసెంబర్ 21: ప్రకాశంజిల్లా సంతమాగులూరు తహశీల్దార్ కార్యాలయంపై శుక్రవారం ఎసిబి అధికారులు దాడి చేశారు. పరిటాలవారిపాలెం వి ఆర్ ఓ సయ్యద్ హసయ్ పట్టాదారు పాస్ పుస్తకం కోసం పచ్చవ చెన్నయ్య అనే రైతు నుండి 7 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మార్టూరు గ్రామానికి చెందిన పచ్చవ చెన్నయ్య తానుకొనుగోలుచేసిన భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిందిగా ఆరునెలల నుంచి విఆర్‌ఓ సయ్యద్ హసయ్‌ను కోరుతున్నాడు. ఖర్చులకోసం అప్పుడప్పుడు కొంత రైతునుంచి వసూలు చేసేవాడు. పాస్ పుస్తకం వెంటనే ఇవ్వాలని మరోసారి కోరడంతో అర్జీకన్పించడం లేదు.. మళ్లీ అర్జీ ఇవ్వు అని అడగడంతో తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించాడు. భూముల రికార్డులో పలు అవకతవకలు ఉన్నాయని, 10 వేలు ఇవ్వందే పాస్ పుస్తకం ఇవ్వడం కుదరదన్నాడు. 8 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. విఆర్వో ఒప్పుకోపోవడంతో రైతు చెన్నయ్య గురువారం ఎసిబి అధికారులను ఆశ్రయించాడు.
చండీయాగంతో అంతా మంచే!
విశాఖపట్నం, డిసెంబర్ 21: విశాఖ శారదాపీఠంలో జరుగుతున్న చండీయాగంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. విశాఖ శ్రీశారదాపీఠంలో జరుగుతున్న లక్ష చండీ అతిరుద్ర యాగం నాలుగోరోజు శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అభిభాషణ చేస్తూ ప్రకృతి రూపం చండీమాత అన్నారు. చండీయాగం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందని, చండీమాతను ఆరాధించడం వలన రాబోయే కాలంలో వర్షాలు పడి పాడిపంటలతో రైతులు సుఖంగా ఉంటారన్నారు. రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అందరి మధ్య సోదరభావం పెరగాలన్నారు.
ఆటోను ఢీకొన్న లారీ
ఆరుగురు మృతి
కొయ్యలగూడెం, డిసెంబర్ 21: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు-ఆరిపాటిలదిబ్బ వద్ద శుక్రవారం రాత్రి ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరు గురు దుర్మరణం చెందారు. వీరిలో ఇద్దరు పసికందులు, ఏడేళ్ల బాలిక ఉన్నారు. మరో ఇద్దరు ప్రాణాపాయస్థితిలో చికిత్సపొందుతున్నారు. వివరాలిలావున్నాయి... తాడేపల్లిగూడెం నుండి కొయ్యలగూడెం వైపు వెళుతున్న లారీ పొంగుటూరు-ఆరిపాటిలదిబ్బ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో అయినాల అనంతలక్ష్మి (30), ఆమె నాలుగు నెలల కుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు. మరో 22 ఏళ్ల యువతి, ఏడాదిన్నర బాబు కూడా ప్రమాదస్థలిలోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఏడేళ్ల బాలికను 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మృతిచెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో 25 ఏళ్ల యువతి, ఆటో డ్రైవర్ భగవత్‌సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్సకై ఏలూరు ఆసుపత్రికి తరలించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగడం, మృతుల సంబంధీకులెవరూ లేకపోవడంతో మిగిలిన వారి వివరాలు తెలియరాలేదు. అనంతలక్ష్మి భర్త సూర్యనారాయణ మరో కుమార్తెతో కలిసి ఆటో వెనుక బైక్‌పై వస్తుండటంతో ఆమె వివరాలు తెలియవచ్చాయి. మహిళ ఆసుపత్రిలో మృతి చెందింది.
రికార్డు స్థాయిలో మల్లన్న ఆదాయం
శ్రీశైలం, డిసెంబర్ 21: ఈ ఏడాది కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కార్తీక మాసం సందర్భంగా 40 రోజుల హుండీ ఆదాయాన్ని రెండు రోజుల పాటు లెక్కించారు. మొత్తం మీద 2 కోట్ల 54 లక్షల 11, 108 రూపాయల ఆదాయం సమకూరిందని అధికారులు శుక్రవారం చెప్పారు. ఇదిలావుండగా కేవలం నగదు లెక్కింపులో కోటి 56 లక్షల 32 వేల 560 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. మరో కోటి రూపాయలు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సౌదీ తదితర దేశాలకు చెందిన కరెన్సీ ద్వారా సమకూరిందన్నారు. ఇదిలావుండగా దేవస్థాన స్వర్ణకారుడు అందుబాటులో లేకపోవడంతో హుండీలోని బంగారం, వెండి ఇతర ఆభరణాల మదింపు జరగలేదన్నారు. నగదు లెక్కింపు పూర్తయిన తరువాత బంగారం, వెండి ఆభరణాలను తిరిగి హండీలోనే వేసినట్లు అధికారులు తెలిపారు.
ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం
చంద్రగిరి, డిసెంబర్ 21: చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారిపై అటవీశాఖ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని అటవీశాఖామంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట ఫారెస్ట్ బంగ్లా నుండి మంత్రి అటవీశాఖసిబ్బందితో కలసి కల్యాణిడ్యాం వెనుకవైపు ఉన్న పులిబోను వద్దకు సాయంత్రం నాలుగుగంటలకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు క్యాంప్‌ను సందర్శించి పోలీసులు, అటవీశాఖ సిబ్బందితో మాట్లాడుతూ స్మగ్లర్లు, కూలీలపై కఠినంగా నిబంధనలు అమలు చేయాలని అందుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టే విషయమై సూచనలు, సలహాలు ఇచ్చారు. కన్జర్వేటర్, డి ఆర్ ఓ చక్రపాణి, స్క్వాడ్ డి ఎఫ్ ఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
క్షమాభిక్షలు వద్దు
* అత్యాచారాల నిరోధంపై
కేంద్రానికి వెంకయ్య సూచన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 21: ఢిల్లీలో ఒక యువతిపై జరిగిన అత్యాచారం సంఘటన నేపధ్యంలో దేశంలో అత్యాచారాల నిరోధకానికి హోంశాఖ స్థారుూ సంఘం కొన్ని సూచనలు చేయనున్నట్టు కమిటీ చైర్మన్, బిజెపి నేత ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. కమిటీ సమావేశం ఈనెల 27 జరుగుతుందని, ఈ సమావేశంలో ఢిల్లీలో జరిగిన అత్యాచారం సంఘటనతో పాటు దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలపై చర్చించి, నివారణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలో సూచించనున్నట్టు తెలిపారు. శుక్రవారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం దేశంలో 95వేల అత్యాచారాల సంఘటనలు నమోదు అయితే, వీటిలో నాలుగువేల మందికి మాత్రమే శిక్ష పడినట్టు తెలిపారు. పిల్లలకు, యువతకు కుటుంబ విలువలు, నైతిక విలువల గురించి బోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. అత్యాచారాల నిరోధానికి కేవలం చట్టం చేసినంత మాత్రాన సరిపోదని, మనుషుల్లో విలువలు పెంపొందించేందుకు కృషి జరగాలని అన్నారు. నైతిక విలువలు, కుటుంబ వ్యవస్థ గురించి పిల్లలకు తెలిసే విధంగా బోధన ఉండాలని అన్నారు. ఇలాంటి కేసుల సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. శిక్షాస్మృతిలో అవసరమైన మార్పులు తీసుకు రావాలని అన్నారు. ఇలాంటి కేసుల్లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అత్యాచారానికి గురైన మహిళలకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బహిరంగంగా కాకుండా ఇన్‌కెమెరా విచారణ జరగాలని అన్నారు. హత్య చేయడం కన్నా ఇది తీవ్రమైన నేరమని, అత్యాచారానికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అత్యాచారం సంఘటనలో నేరస్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాభిక్ష పెట్టవద్దని, గతంలో క్షమాభిక్ష పెట్టిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.
చట్టానికి ధర్మాన అతీతుడా?
సర్కారును నిలదీసిన చంద్రబాబు
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, డిసెంబర్ 21: వైఎస్ హయాంలో అవినీతికి పాల్పడిన మంత్రులు, అధికారులను అరెస్టు చేసినపుడు ఎ-5గా ఉన్న ధర్మాన ప్రసాదరావును ఎందుకు మినహాయించారని? టిడిపి అధినేత చంద్రబాబు నిలదీశారు. శుక్రవారం కరీరంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. ధర్మాన ప్రసాదరావును అరెస్టు చేయకుండా మినహాయింపునివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేసిందని, అయితే ఆయన ఫైలును తిప్పిపంపారని గుర్తు చేశారు. అందరితో పాటు ధర్మానను జైలుకు పంపాల్సింది పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతిపరుల కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కళంకిత మంత్రులకు న్యాయ సహాయం చేయాలని నిర్ణయించడం అత్యంత హేయమైన చర్య అన్నారు. దేశంలో గడిచిన తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ నేతలు పది లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.దేశానికి సంబంధించిన 16 లక్షల కోట్ల రూపాయల సొమ్ము విదేశీ బ్యాంకులకు తరలిపోయిందన్నారు. అదంతా దేశానికి రప్పిస్తే ప్రతీ గ్రామాన్ని సస్యశ్యామలం చేయవచ్చని బాబు అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పాలన వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. తెలంగాణ అంశాన్ని ఆసరాగా చేసుకొని బాంచెన్ దొరా అని పాత పటేల్, పట్వారీ వ్యవస్థలను మళ్లీ తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి ఈ దుస్థితిని రూపుమాపేదాకా నిద్ర పోమని వెల్లడించారు. ప్రతీ పేద కుటుంబానికి 600 పెన్షన్ ఇవ్వడంతో పాటు వృద్ధులకు 1000 రూపాయలు పెన్షన్ సౌకర్యం అమలు చేస్తామన్నారు.
‘నగదు’కు ఖాతాల తంటా
గ్యాస్ ఏజన్సీలో నమోదూ ఒక ప్రహసనం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, డిసెంబర్ 21: ‘నగదు బదిలీ పథకం’ అంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హడావుడి సామాన్య ప్రజలను నానా ఇక్కట్లకు గురిచేస్తోంది. ప్రభుత్వ పథకాల సబ్సిడీలన్నీ ఇక ‘నగదు బదిలీ’ రూపంలో లభిస్తాయని, దీనికోసం బ్యాంకు ఖాతాలు తెరవకపోతే భవిష్యత్తులో ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్ధిక సహాయం లభించదని అధికార్లు చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. బ్యాంకు ఖాతాలు తెరవడం దగ్గర నుండి గ్యాస్ ఏజెన్సీల్లో ఆధార్ వివరాలు నమోదు వరకు ప్రజల తిప్పలు వర్ణనాతీతం.
నిన్నటి వరకు తమ బ్యాంకులో పొదుపు ఖాతా తెరవాలంటూ జనం వెంటపడ్డ జాతీయ బ్యాంకులు, నగదు బదిలీ పథకం పుణ్యమా అని పెద్ద సంఖ్యలో వస్తున్న జనాన్ని చూసి, పనిఒత్తిడి భయంతో చికాకు ప్రదర్శిస్తున్నాయి. నగదు బదిలీ పథకం కోసం ‘జీరో’ బ్యాలెన్స్ ఖాతాలను ప్రతి ఒక్కరికీ తెరవాలని, ఈ విషయంలో బ్యాంకులు ఏ మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు పదే పదే హెచ్చరికలు చేసినాగానీ కొన్ని బ్యాంకులు ఇప్పటికీ ఖాతాలు తెరిచేందుకు వెళ్లే సామాన్య తరగతి కుటుంబాల మహిళల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆధార్ కార్డు ఒక్కటే చాలదని, దీనితోపాటు రేషన్ కార్డు కూడా ఉండాలంటూ కొన్ని బ్యాంకులు అమాయక పేద మహిళలను తిప్పిపంపుతున్నాయి. చాలా మందికి ఆధార్ కార్డులున్నాగానీ, రేషన్ కార్డులు లేవు. కొంత మందికి రేషన్ కార్డు ఉందిగానీ, ఆధార్‌కార్డు కోసం వివరాలు నమోదు చేసుకున్న అకనాలెడ్జ్‌మెంట్ ఉన్నాగానీ కార్డు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర ఫొటో గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్‌ను చూపించి జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరుచుకునేందుకు అవకాశం ఉంది. కానీ కొన్ని బ్యాంకులు ఇందుకు సహకరించటం లేదు. ఆధార్ కార్డు లేకపోతే ఇతర అడ్రస్, ఫోటో గుర్తింపు పత్రాలను తీసుకోవటంతోపాటు, ఆధార్ లేదన్న సాకుతో రూ.500 డిపాజిట్ తీసుకుని మరీ ఖాతాలు తెరుస్తున్నారు. బ్యాంకు ఖాతా లేకపోతే భవిష్యత్తులో బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు రావేమోనన్న భయంతో చాలామంది సామాన్య వర్గాలకు చెందిన మహిళలు, అప్పుచేసి మరీ రూ.500 డిపాజిట్‌తో ఖాతాలు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా అన్యాయమని, జీరో బ్యాలెన్స్ అకౌంట్లు తెరిచేందుకు అంగీకరించని బ్యాంకు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పేదవర్గాల మహిళలు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఒకపక్క ఇన్ని తిప్పలుపడుతుంటే, మరోపక్క గ్యాస్ ఏజెన్సీలు పెడుతున్న మంట అంతా ఇంతా కాదు.
బడ్జెట్‌లో విద్యకు
10 శాతం నిధులివ్వాలి
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, డిసెంబర్ 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లలో విద్యకు 10 శాతం నిధులు కేటాయించాలని ఎఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ టెక్సాల్ డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలో నిర్వహిస్తున్న ఎఐఎస్‌ఎఫ్ 45వ రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిణామాల్లో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలన్నారు.విద్యా వ్యాపారం, అవినీతి రాజకీయాల నిర్మూలనకు నడుం కట్టాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దీనిపై ఎఐఎస్‌ఎఫ్ కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ అనేక ఉద్యమాలు నిర్వహించి పోరాడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ భగత్‌సింగ్, చేగువేరా ఆదర్శాలను అందిపుచ్చుకోవాలన్నారు. దేశ రాజధానిలో పారా మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం సంఘటన సిగ్గుచేటన్నారు. దేశంలో బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోతోందనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి కపిల్ సిబాల్ అమెరికా విధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం వల్ల దేశంలో ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, బొగ్గు మాఫియా, అవినీతి రాజ్యం ఏలుతున్నాయన్నారు.