పాడేరు, డిసెంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు సవాలు విసిరారు. విశాఖ జిల్లా పాడేరు ప్రాంత పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మన్యంలో బాక్సైట్ తవ్వకాలంటూ చేపడితే ఆదివాసులందరూ కలిసి ప్రభుత్వ అంతు చూస్తారని హెచ్చరించారు. పాడేరు ప్రాంతంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న బాక్సైట్ అంశంపై నోరు మెదపకుండా విశాఖపట్నం వెళ్లి అర్థరహితమైన వ్యాఖ్యలు చేశారన్నారు. బాక్సైట్ ఒప్పందాల రద్దు అంశం తన చేతిలో లేదని, కేంద్ర ప్రభుత్వమే దీనిని నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా రాఘవులు వ్యాఖ్యానించారు. మన్యంలో బాక్సైట్ ఒప్పందాలను రద్దు చేసే అధికారం ముఖ్యమంత్రిగా లేదా అంటూ ఆయన ఈ సందర్భంగా నిలదీసారు.
గిరిజన ప్రాంతంలో చట్టవిరుద్ధంగా కుదుర్చుకున్న బాక్సైట్ ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర గిరిజన మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినపుడు ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోయారని ఆయన ప్రశ్నించారు.
బాక్సైట్‌పై కేంద్రమే నిర్ణయం తీసుకోవలసి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలను ఎలా కుదుర్చుకుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులకు అదనంగా మరో 25 ఉపాధి పనిదినాలు కల్పించనున్నట్టు ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వల్ల ప్రయోజనం ఉండదన్నారు. విశాఖ మన్యంలోని కాఫీ ప్రాజెక్టు అమలులో భారీ కుంభకోణం చోటుచేసుకుందని, మూడు సంవత్సరాల కాలంలో దాదాపు 70 కోట్ల రూపాయలను దిగమింగారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహరంపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఉన్నత స్థాయి కమిటీని నియమించి బహిరంగ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు ఉండి కూడా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించని పక్షంలో తామే ఆ భూములను ఆక్రమించి ప్లాట్లు వేసి పంపిణీ చేస్తామని హెచ్చరించారు. మైదాన ప్రాంతాలలో ఉన్న గిరిజన గ్రామాలను కూడా షెడ్యూల్ ప్రాంతాలలో చేర్పించేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు.
మీ నిధులు.. మీకే!
దళితవాడలు, గిరిజన తండాలకు కాంగ్రెస్ బాట
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 21: ‘మీ నిధులు..మీకే’ పేరిట కాంగ్రెస్ పార్టీ వారం రోజుల పాటు రాష్టవ్య్రాప్తంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నది. అయితే తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఎస్‌సి, ఎస్‌టి నిధులు దారి మరలకుండా ఉప ప్రణాళికను రూపొందించిన ఘనత తమదేనంటూ ప్రచారం చేసుకోవాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ నాయకులతో చర్చించి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. రాష్ట్రంలోని అన్ని దళిత వాడులు, గిరిజన తండాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఎస్‌సి, ఎస్‌టిలను పూర్తిగా పార్టీ వైపు ఆకర్షించుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇతర నాయకులపై బాధ్యత మోపనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిథిలోని దళిత వాడలు, గిరిజన వాడల్లో వారం రోజుల పాటు ఉప ప్రణాళిక గురించి ప్రచారం చేయాలని సూచించనున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు పార్టీ ఫిరాయించి ఉంటే, అక్కడ మాజీ ఎమ్మెల్యేలు లేదా ఇన్‌ఛార్జిలు, లేదా ఇతర ముఖ్య నాయకులకు ఆ బాధ్యత అప్పగించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇక 14 నెలల గడువు మాత్రమే ఉన్నందున, ఇటువంటి కార్యక్రమాలతో పార్టీ నాయకులు ప్రజల్లో ఉండాలన్నది బొత్స భావన. ఈ కార్యక్రమానికి పేరు పెట్టే విషయంలో తర్జనభర్జన అనంతరం ‘మీ నిధులు..మీకే’ పేరు పెట్టాలని నిర్ణయించారు.
జగన్‌పై రాజకీయ కక్షసాధింపు: మైసూరా
ఆంద్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 21: కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధిస్తోందని మాజీ ఎంపి మైసూరారెడ్డి ఆరోపించారు. జగన్‌పై రాజకీయ కుట్రకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు చేపట్టిన ‘జనం సంతకం’ ఉద్యమాన్ని శుక్రవారం ఎంవి మైసూరారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతుండగా, సిబిఐ పక్షపాత ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు. జగన్‌పై కొనసాగుతున్న రాజకీయ కుట్రకు వ్యతిరేకంగా కోటి మందితో సంతకాలు చేయించి రాష్టప్రతికి పంపించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. పార్టీ ఎస్‌టి విభాగం నాయకుడు, మాజీ ఎంపి రవీంద్రనాయక్ తొలి సంతకం చేశారు. జనం సంతకం పేరుతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ఒక లేఖను విడుదల చేసింది.
జగన్‌పై బనాయించిన కేసులను తీవ్రంగా గర్హిస్తున్నామని పేర్కొన్నారు. జగన్‌ను దోషిగా చూపడానికి సిబిఐ ఆహర్నిశలూ చేస్తోన్న ప్రయత్నాలను పరాకాష్ఠగా భావిస్తున్నామని వైఎస్‌ఆర్‌సిపి ఆరోపించింది. రెండు వందల రోజులకుపైగా జగన్‌ను అక్రమ నిర్బంధంలో ఉంచడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్‌పై కక్ష సాధింపు చర్యలు ఆపాలని వైఎస్‌ఆర్‌సిపి డిమాండ్ చేసింది. ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని కాపాడాలనీ రాష్ట్ర ప్రజానీకం రాష్టప్రతికి చేస్తోన్న విజ్ఞప్తి ఇదని వారు పేర్కొన్నారు.
ఇలా ఉండగా జగన్ 40వ దినోత్సవాన్ని ఆ పార్టీ శుక్రవారం ఘనంగా నిర్వహించింది. జగన్ త్వరగా జైలు నుంచి విడుదల కావాలని ఆ పార్టీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు, యాగాలను నిర్వహించారు. పేదలకు దుస్తులు, విద్యార్థులకు పుస్తకాలు, రోగులకు పండ్లు, వృద్ధులకు దుప్పట్లు, అన్నదానాలు వంటి పలు సేవా కార్యక్రమాలను ఆ పార్టీ కార్యకర్తలు నిర్వహించారు. అలాగే చంచల్‌గూడ జైలుకు జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతితో పాటు ఆ పార్టీ నేతలు పలువురు వెళ్లి ఆయనను పరామర్శించారు.
టిడిపి, బిజెపి బంధం కుదిరేనా?
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 21: టిడిపి, బిజెపిల మధ్య మళ్లీ అనుబంధం చిగురిస్తుందా? ఇప్పుడు రెండు పార్టీల్లో నాయకుల అంతర్గత చర్చల్లో వినిపిస్తున్న మాట ఇది. 1999 ఎన్నికల్లో బిజెపితో పొత్తుతో వాజపేయిపై ఉన్న సానుభూతి టిడిపి విజయానికి ఎంతో దోహదం చేసింది. ఇప్పుడు నరేంద్ర మోడీని ప్రధానమంత్రి పదవికి బిజెపి అభ్యర్థిగా ప్రకటిస్తే, రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉన్నందున ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ అనుబంధం సాధ్యమా? అనే చర్చ రెండు పార్టీల్లో వినిపిస్తోంది. ‘చంద్రబాబునాయుడుకు ఎన్‌డిఏతో కలవడం మినహా మరో మార్గం లేదు, ఎన్నికల ముందు కలుస్తారా? ఎన్నికల తరువాతనా అనేది తేలాలి కానీ మరో మార్గం మాత్రం లేదు’ అని బిజెపి మాజీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అభిప్రాయం వ్యక్తం చేశారు. వామపక్షాలు దూరంగానే ఉంటున్నాయి, సమాజ్‌వాది పార్టీ, మమత వంటి వారిని నమ్ముకొని మూడవ ఫ్రంట్ ఏర్పాటు అనేది కల, ఇక మిగిలేది ఎన్‌డిఏ, యుపిఏ.. ఈ రెండింటిలో ఒక కూటమినే టిడిపి ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఎన్‌డిఏ తప్ప టిడిపికి మరో మార్గం లేదని దత్తాత్రేయ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉభయ కమ్యూనిస్టులను నమ్ముకొని వారికి 40-50 సీట్లు కేటాయిస్తే, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆ సీట్లు ప్రత్యర్థి పార్టీలకు ధారాదత్తం చేయడం మినహా ప్రయోజనం ఉండదని, ఇలాంటి పరిస్థితిలో కమ్యూనిస్టులతో కన్నా బిజెపితో కలవడం మంచిదనే అభిప్రాయం టిడిపిలో కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అయితే దీని గురించి ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి లేదని, 2013లో జరిగే ఎన్నికల్లో బిజెపి పరిస్థితి చూసిన తరువాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఇష్టాగోష్ఠి సమావేశాల్లోనే తప్ప ఇలాంటి అంశాలపై పార్టీలో ఆధికారిక చర్చ జరగలేదని పార్టీ నాయకులు తెలిపారు.
మరోవైపు తెలంగాణ నగారా సమితి ఎన్‌డిఏకు మద్దతు ప్రకటించనున్నట్టు తెలిపింది. ఈనెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, అలా నిర్ణయం తీసుకోక పోతే నగారా సమితి ఎన్‌డిఏకు మద్దతు ప్రకటిస్తుందని నాగం జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఎన్‌డిఏ అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టంగా ప్రకటించినందున తెలంగాణ వాదులు ఎన్‌డిఏకు మద్దతు ఇవ్వాలని అన్నారు. 28న అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ కోరుకునే పార్టీలు కాంగ్రెస్‌తో ఉండాల్సిన అవసరం లేదని నాగం తెలిపారు. తెలంగాణలో టిడిపి బాగా బలహీనపడిందని, తెలంగాణకు కట్టుబడి ఉన్నామనే ప్రకటన ద్వారా బిజెపి బలం పుంజుకుంటుందని ఆయన భావిస్తున్నారు. 28న తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనిపించనందున నాగం జనార్దన్‌రెడ్డి బిజెపి పట్ల ఆసక్తి చూపుతున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపి పార్టీలు తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా అనుకూలత వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని, అలా తీసుకోక పోతే ఆ పార్టీని తెలంగాణ ప్రజలు బొందపెడతారని నాగం హెచ్చరించారు. టిడిపి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీలో చేరుతారా? అని విలేఖరులు ప్రశ్నించగా, ‘నిర్ణయం తీసుకోనివ్వండి’ అని అన్నారు.
కమలానికి దగ్గరవుతున్న నాగం నగారా సమితి
నేడు ఆర్టీసి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసి) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ప్రస్తుత గుర్తింపు కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్‌తో పాటు ప్రత్యర్థి యూనియన్లు ఎంప్లాయిస్ యూనియన్ పోటీపడుతుండగా తెలంగాణ ఎన్‌ఎంయులు మరికొన్ని చిన్న యూనియన్లు ఎంప్లాయిస్ యూనియన్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఓటింగ్ ఉదయం 5 గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 211 డిపోల్లో 1.17 లక్షల మంది ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కార్మిక శాఖ చేసింది. ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది.