హైదరాబాద్, డిసెంబర్ 21: ఒఎంసి కేసులో సిబిఐ అరెస్టు చేసిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి వైద్య చికిత్స చేయించుకునేందుకు వెల్లూరు హాస్పిటల్‌కు వెళ్లేందుకు అనుమతించాలని సిబిఐ కోర్టులో శుక్రవారం పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో చంచల్‌గూడ జైల్లో ఉన్న శ్రీలక్ష్మికి జనవరి 20 వరకు వైద్య చికిత్స కోసం అభ్యర్థించగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై ఉన్న ఆమె ప్రస్తుతం వెన్ను నొప్పి కోసం చికిత్స తీసుకుంటున్నారు. మెరుగైన చికిత్స కోసం వెల్లూరు హాస్పిటల్‌కు వెళ్లేందుకు డాక్టర్లు సిఫారసు చేయడంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. తనకు వెల్లూరు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై కోర్టు అనుమతి రావాల్సి ఉంది.
దుబాయ్ వెళ్లేందుకు అనుమతి కోరిన శ్రవణ్‌గుప్తా
ఎమ్మార్ కేసులో నిందితుడు శ్రవణ్‌గుప్తా కూడా సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసి తనకు దుబాయ్ వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. వ్యక్తిగత పనులపై వెళ్లేందుకు తనకు ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు అనుమతించాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
వచ్చే పదేళ్లలో భారత్‌లో విద్యుత్ సంక్షోభం తీవ్రం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 21: రానున్న పదేళ్లలో భారత్‌లో విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రమవుతుందని విద్యుత్ రంగ నిపుణులు, శ్రీరాం వెంచర్స్ లిమిటెడ్ ఎండి శ్రీనివాసన్ అన్నారు. ధరల నిర్ణయం-అత్యవసర పరిస్ధితులు అనే అంశంపై ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ప్రాంతీయ కాస్ట్ కనె్వన్షన్ 2012లో ఆయన మాట్లాడుతూ దేశంలో వచ్చే పదేళ్లలో 300 గిగావాట్ల విద్యుత్ అవసరం ఉందని, డిమాండ్, సరఫరా మధ్య లోటు 70 గిగావాట్లు ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 210 గిగావాట్ల విద్యుత్ లభ్యమవుతోందని, 12 శాతం విద్యుత్ లోటును ఎదుర్కొంటున్నామన్నారు. థర్మల్ విద్యుత్ 67 శాతం, జల విద్యుత్ 19 శాతం, అణు విద్యుత్ 2 శాతం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా 12 శాతం విద్యుత్ లోటు ఏర్పడుతోందన్నారు. ఈ సమావేశంలో ఐసిఎఐ జాతీయ అధ్యక్షుడు రాకేష్ సింగ్, ఐసిఎఐ కేంద్ర పాలక మండలి సభ్యులు ఎఎస్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసన్ మాట్లాడుతూ విద్యుత్, ఆరోగ్య రంగాల్లో చోటు చేసుకున్న ఒడిదుడుకుల వల్ల సామాన్య మానవులు ఇబ్బంది పడుతున్నారన్నారు. విద్యుత్ రంగ సమస్యల పరిష్కారానికి 24 లక్షలకోట్ల రూపాయల పెట్టుబడుల అవసరమన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పాదనను పెంచుకోవాలన్నారు.
1నుంచి 3.5 లక్షల
మహిళలకు అమృత హస్తం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది గర్భిణిలు, బాలింతలకు జనవరి ఒకటో తేదీ నుంచి పౌష్టికాహారం అందిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. అనంతరం మంత్రి తమ శాఖ చేపడుతున్న పథకాల వివరాలను వివరించారు. ఇందిరమ్మ అమృత హస్తం పథకం అమలు చేస్తున్నందున మాతా, శిశు మరణాలు తగ్గిపోతాయని చెప్పారు. స్థానిక వైద్య శాఖ అధికారులతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని, అందులో ఐదుగురు సభ్యులు పథకాన్ని పర్యవేక్షిస్తుంటారని మంత్రి చెప్పారు. దీంతో మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు. నెలలో 25 రోజుల పాటు పౌష్టికాహారం అందిస్తామన్నారు. నిధుల కొరత లేకుండా ముందస్తుగా విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సమావేశంలో ముఖ్య కార్యదర్శి నీలం సహాని, కమిషనర్ చిరంజీవి చౌదరి, డైరీ అధికారులు పాల్గొన్నారు.
భూపంపిణీ శాస్ర్తియంగా
జరుపుదాం: రఘువీరా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 21 : భూపంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త విధానానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి కసరత్తు మొదలైంది. కొత్త విధానానికి అనుగుణంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ భూయాజమాన్య ప్రాధికారసంస్థ (ఎపి ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటి-ఎపిఎల్‌ఎంఎ) మొట్టమొదటి సమావేశం భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టం ప్రకారం ఈ సంస్థ చైర్మన్‌గా సిసిఎల్‌ఎ ఉంటారు. ప్రస్తుతం సీనియర్ ఐఎఎస్ అధికారి ఎం. శామ్యూల్ సిసిఎల్‌ఎగా పనిచేస్తుండటంతో ఆయన అధ్యక్షతన ఎల్‌ఎంఎ తొలి సమావేశం జరిగింది. తొలి సమావేశాన్ని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా లాంఛనంగా ప్రారంభిస్తూ, రెవెన్యూ శాఖ చేపట్టే కార్యక్రమాలన్నీ పారదర్శకంగా ఉండాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రభుత్వం రూపొందించిన నియమ, నిబంధనలకు అనుగుణంగానే భూ పంపిణీ జరగాలని, ఎక్కడా అక్రమాలకు అవకాశం ఇవ్వకూడదని ఎపిఎల్‌ఎంఎను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శామ్యూల్‌తో పాటు ఎపిఎల్‌ఎంఎ సభ్యులైన ఉన్నతాధికారులంతా హాజరయ్యారు.
సహకార సభ్యత్వ నమోదుకు
గడువు పొడిగించాలి: టిడిపి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 21: సహకార ఎన్నికలు సజావుగా సాగేందుకు, రైతులకు మేలు జరిగేందుకు సభ్యత్వ నమోదు గడువును పొడిగించాలని టిడిపి ఎమ్మెల్యేల బృందం సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డిని కోరింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, రామానాయుడు, చందర్‌రావు, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌లు మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఫిబ్రవరి 14న జరిగే సహకార ఎన్నికలకు సభ్యత్వ నమోదును ఈనెల 21 చివరి తేదీగా ప్రకటించారని తెలిపారు. అనేక ప్రాంతాల్లో అధికార పక్షం వాళ్లు దౌర్జన్యం చేయడం వల్ల సభ్యత్వ నమోదు సాధ్యం కాలేదని తెలిపారు.
చాలాచోట్ల కొత్తగా సభ్యులు చేరకుండా అడ్డుకున్నారని తెలిపారు. కౌలు రైతులకు సైతం సభ్యత్వ నమోదుకు అవకాశం కల్పించినందున తేదీని పొడిగించాలని కోరారు.