ప్రణాళికాసంఘం , కేంద్ర హోం మంత్రిత్వశాఖలు , విశిష్టగుర్తింపుసంఖ్య విషయంలో తగాదా పడుతున్నాయి. ఇరు విభాగాలూ చివరకు సమస్యను ప్రధాని ముందు ఉంచాయి. సత్వరమే ఒక నిర్ణయం తీసుకునేందుకు వీలుగా మంత్రిమండలికి ఒక నోట్ పంపించాలని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించాలని హోంమంత్రి చిదంబరం ప్రధానికి లేఖ రాశారు. నివాసితుల బయో మెట్రిక్ సమాచారం సేకరించడంపైనే ఈవివాదం కొనసాగుతోంది. భారత రిజిస్ట్రార్ జనరల్ ద్వారా సమాచారాన్ని సేకరించేందుకు హోం మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. ఇదేసమయంలో బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించేందుకు నందన్‌నిలేకని ఆధ్వర్యంలోని ఉడాయ్‌ను కూడా కేంద్రం అనుమతించింది. ఉడాయ్ ఇంత వరకూ 17 కోట్ల మంది సమాచారాన్ని సేకరించింది. దేశం మొత్తం సేకరించేందుకు వీలుగా సమయాన్ని కోరింది. బయోమెట్రిక్ సమాచారాన్ని ఉడాయ్ సేకరించాలా ? లేక భారత రిజిస్ట్రార్ జనరల్ సేకరించాలా అనే దానిపై కేంద్రం మీమాంసతో ఉంది. ఉడాయ్ ద్వారానే ప్రైవేటు సంస్థలు సేకరించే సమాచారం భద్రంగా ఉండే వీలు లేదన్నది చిదంబరం అనుమానం. ఈ విషయంలో ప్రణాళికా సంఘం ఉడాయ్‌ను సమర్ధిస్తోంది. ఆర్‌టిఐ కింద ఉండే జాతీయ జనాభా లెక్కల సంస్థ ద్వారా సమాచారాన్ని సేకరించి చిప్ ఉన్న స్మార్ట్ కార్డు ఇవ్వాలనేది హోం మంత్రిత్వశాఖ అభిప్రాయంగా ఉంది. ఈ సంవత్సరం చివరికి 20 కోట్ల మందికి కార్డులు ఇవ్వాలని ఉడాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.
లీప్ సెకెన్
భూమి గమనానికి అనుగుణంగా అణుగడియారాలకు అధిక సెకెను (లీప్ సెకెన్)ను రద్దు చేయాలన్న అంశంపై జెనీవాలో ఏకాభిప్రాయం కుదరలేదు. మరింత అధ్యయనం తర్వాతనే ఈ అంశంపై తగిన నిర్ణయం తీసుకోవాలని అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ల యూనియన్ నిర్ణయించింది.సూర్యుడు, చంద్రుడు గురుత్వాకర్షణ శక్తులతో భూ భ్రమణం కొన్ని సందర్భాల్లో మందగిస్తుంది. అటువంటిపుడు భూమి వేగానికి అనుగుణంగా ఖచ్చితమైన సమయాన్ని సూచించే అణుగడియారాలకు ఒక సెకెను కలుపుతారు. గత 40 ఏళ్లలో ఈ విధంగా 24 సార్లు కలిపారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు అన్నింటిలోనూ సమయాన్ని మార్చుకోవల్సి వస్తుంది. లీప్‌సెకను అవసరం లేదని అమెరికా, ఫ్రాన్స్, జపాన్ తదితర దేశాలు వాదిస్తున్నాయి. చైనా, బ్రిటన్, కెనడా తదితర దేశాలు మాత్రం లీప్ సెకెను తొలగిస్తే సామాజిక , ఆధ్యాత్మిక , న్యాయసంబంధ కార్యకలాపాలపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని అంటున్నాయి. వందేళ్లకు కనీసం 90 సెకెన్లు చొప్పున తేడా రావడంతో కొన్ని వేల సంవత్సరాల తర్వాత గడియారాల్లో మధ్యాహ్నం 12 గంటలు సూచించినా, ఇంకా సూర్యుడు ఉదయించకపోయే ప్రమాదం ఉందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. చైనా, కెనడా వంటి దేశాలుమాత్రం ఈ మార్పుల వల్ల ఖగోళశాస్తవ్రేత్తలు చాలా ఇబ్బంది కలుగుతుందని, వారు లక్షల సంవత్సరాలు ముందుగా లెక్కలు గట్టి నిర్ణయించుకుంటారని, అలాంటపుడు సమయపాలనలో మార్పులు వారి లెక్కలకు ఇబ్బంది అవుతాయని చైనా అంటోంది.
పట్టణీకరణ
పట్టణీకరణలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది. గత దశాబ్దపు లెక్కల ప్రకారం పట్టణీకరణలో రాష్ట్రం 16వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 17వస్థానానికి చేరింది. అత్యధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రంగా గోవా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పట్టణాల్లో జనాభా విపరీతంగా పెరుగుతున్నా, పొరుగు రాష్ట్రాలతో పోల్చిచూసినపుడు అది కాస్తా తగ్గువగా ఉండటం వల్ల పట్టణీకరణలో ఆంధ్రప్రదేశ్ ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. మొత్తం రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 33 శాతం ఉంది. తమిళనాడులో పట్టణ జనాభా 48.45 శాతం కాగా, కేరళలో 47.72 శాతం, మహారాష్టల్రో 45.23 శాతం, గుజరాత్‌లో 42.58 శాతం, కర్నాటకలో 38.57 శాతం, పంజాబ్‌లో 37.49 శాతం, హర్యానాలో 34.79 శాతం పట్టణ జనాభా ఉన్నట్టు తాజా లెక్కలు చెబుతున్నాయి. అత్యధిక పట్టణీకరణ జరిగిన మూడు రాష్ట్రాల్లో గోవా, మిజోరాం, తమిళనాడులు ఉన్నాయి. ఒక ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు పెరగడం, వౌలిక సదుపాయాలు కల్పన, వ్యాపార అవకాశాలు మెండుగా ఉండటంతో పాటు కనీసం 75 శాతం మంది పురుషులు వ్యవసాయేతర పనులు చేస్తున్నవారై ఉంటేనే ఆ ప్రాంతాన్ని పట్టణ ప్రాంతంగా పరిగణిస్తారు. అదే విధంగా చదరపు కిలోమీటరుకు కనీసం 400 మంది జనాభా ఉండాలి. రాష్ట్రంలో పట్టణ జనాభా లెక్కల ప్రకారం 2001లో 2.08 కోట్లు ఉండగా, 2011లో పట్టణ జనాభా 2.83 కోట్లకుపెరిగింది. కాని గ్రామీణ జనాభా 5.54 కోట్ల నుండి 5.63 కోట్లకు పెరిగింది. రాష్ట్ర జనాభా పదేళ్లలో 84.55 లక్షలు పెరిగితే పట్టణ ప్రాంతాల్లోని జనాభా 75.45 లక్షలు పెరిగింది.
నేపాల్
రాచరిక పురిటి నొప్పుల నుండి బయటపడాలని నేపాల్ ఎంతో కాలంగా ప్రయత్నిస్తోంది. భారత్ ఎదుగుదలను వ్యూహాత్మకంగా నిలువరించాలంటే నేపాల్‌ను తమ ఆదుపాజ్ఞల్లో ఉంచుకోవాలనేది చైనా వ్యూహంగా కనిపిస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా మరీ ముఖ్యంగా గత రెండుదశాబ్దాలుగా రాచరిక పాలనకు వ్యతిరేకంగా నేపాల్‌లో జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం ప్రజాస్వామ్య వ్యవస్థవైపు నడిపించేందుకేనంటూ మావోయిస్టులు చేస్తున్న పోరాటంతో నేపాల్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ సాయుధ పోరాటంలోనే దాదాపు 20వేల మందికిపైగానే మరణించారు. నేపాల్‌లోని అన్ని రాజకీయ పార్టీల మధ్య ఐదేళ్ల క్రితం కుదిరిన ఒప్పందం ప్రకారం శాంతి ఒప్పందాన్ని అమలుచేయాల్సి ఉంది. రాచరిక వ్యవస్థకు చరమగీతం పాడటమే గాక, సాయుధపోరాటానికి స్వస్తిపలికి ప్రజాస్వామ్యం వైపు తొలి అడుగులు వేయడం నేపాల్ ప్రజల్లో ఎన్నో ఆశలను రేకెత్తించింది. అయితే భవిష్యత్ పాలనకు కరదీపిక వంటి రాజ్యాంగ రచన నేటికీ పూర్తికాకపోవడంతో రాజకీయ అస్థిరిత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనికి తోడు నేపాల్‌లోచైనా ప్రధాని పర్యటన కూడా భారత్‌తో ఉన్న సరిహద్దు వివాదాన్ని మరింత రగిలించింది. నేపాల్‌పై వ్యూహాత్మకంగా పట్టుసాధించాలనేది చైనా అంతరంగంగా కనిపిస్తోంది.