శ్రీకాకుళం, డిసెంబర్ 29: పేదరికం కాటేసి, అప్పుల ఊబిలో కూరుకుపోయి, అప్పు తీరే మార్గం కనిపించక గుళికలు, పురుగుల మందు తాను తీసుకోవడమే కాకుండా భార్య, పిల్లలకు కూడా బలవంతంగా పట్టించి నిండు కుటుంబం ఆత్మహత్యకు కారకుడయ్యాడో నిస్సహాయుడు. మనిషి జీవించడానికి రోజుకు 26 రూపాయలు చాలు అంటూ ప్రభుత్వ ప్రణాళికలు చెబుతున్నప్పటికీ, వాటిని అవహేళన చేసేలా రోజుకు అంతకు కొన్ని రెట్లు ఎక్కువే సంపాదిస్తున్న సగటుజీవి అప్పులపాలై, జీవనం సాగించలేని దుర్భర పరిస్థితిలో వేరే దారి కనిపించక భార్యాపిల్లలు సహా ఆత్మహత్య చేసుకోవటం దురదృష్టకరం. కూటి కోసం పొట్ట చేతబట్టి గుట్టుగా జీవనం సాగిస్తున్న నాలుగు నిండు ప్రాణాలును అప్పు మహమ్మారి బలిగొంది. తనతో పాటు ముగ్గురి ఆకలి తీర్చేందుకు ఆ కుటుంబ పెద్ద సాగిస్తున్న జీవన పోరాటంలో అప్పు తప్పనిసరైంది. ఈ నేపథ్యంలోనే చేసిన అప్పు తీర్చలేక ఒకే కుటుంబంలో నాలుగు నిండు ప్రాణాలు అశువులు బాసాయి. గార మండలం కళింగపట్నం పంచాయతీ యాతపేట గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. గ్రామానికి చెందిన మృతుడు ముంగర ధనరాజ్ (35)తో పాటు భార్య భూలక్ష్మి (30), కుమార్తెలు గాయత్రి (12), నూతన (10)లు పురుగుల మందు తాగి శుక్రవారం అర్ధరాత్రి మృత్యువాత పడ్డారు. పోలీసులు, గ్రామస్థులు తెలియజేసిన వివరాలు ప్రకారం మృతుడు ధనరాజ్ పాడిని నమ్ముకొని గేదెలను పెంచేవాడు. ప్రతీ రోజు గేదెల మందను కాస్తూ, పాల (మిగతా 2వ పేజీలో)
వ్యాపారంతో జీవనం సాగించేవాడు. ఇటీవల ఇంటిని పునఃనిర్మించడానికి కొంత మొత్తం అప్పు చేశాడు. కాలక్రమంలో పాల వ్యాపారం గిట్టుబాటు కాకపోవడంతో పశువుల వ్యాపారం చేస్తూ ఆర్థికంగా కుదేలైయ్యాడు. దీంతో కుటుంబాన్ని గ్రామంలోనే విడిచి పెట్టి చెన్నై వలస వెల్లిపోయాడు. అక్కడ కూడా వచ్చిన కూలి సరిపోక, తను బతకలేక, కుటుంబాన్ని బతికించుకోలేక చెన్నై నుండి మూడునెలల కిందటే గ్రామానికి చేరుకొని స్థానికంగానే కూలిపనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు వడ్డీతో కలిపి మూడు లక్షలైంది. రుణదాతల ఒత్తిళ్లు పెరిగిపోయాయి. అప్పుల బాధతో తల్లడిల్లుతూ కుటుంబాన్ని నెట్టుకు వస్తున్న ధనరాజ్ పలాసలోని తన బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్లి శుక్రవారం రాత్రి సుమారు పది గంటల సమయంలో యాతపేటలోని తమ ఇంటికి కుటుంబంతో చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న ధనరాజ్ పంటపొలానికి వినియోగించే పురుగుమందును కూల్ డ్రింక్‌లో కలిపి తన కూతుళ్లకు, భార్యకు బలవంతంగా తాగించి తాను కూడా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే 7వ తరగతి చదువుతున్న కుమార్తె గాయత్రి, నూతనలు తండ్రి చర్యలను ప్రతిఘటించి బయటకు వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మేల్కొని వారిని ప్రమాదం నుండి కాపాడే ప్రయత్నాలు చేసారు. తమకు ప్రాణాపాయం ఉందని గ్రహించిన గాయత్రి వెంటనే 108 వాహనానికి సమాచారం అందించింది. రాత్రి ఒంటి గంట సమయంలో సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న ధనరాజ్, భూలక్ష్మి, నూతనలతో పాటు గాయత్రిని మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. మార్గమధ్యంలోనే భూలక్ష్మీ, నూతనలు మరణించగా రిమ్స్‌లో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చి గాయత్రి మరణించింది. అపస్మారకంలో ఉన్న ధనరాజ్ మృత్యువుతో పోరాడి శనివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబం మొత్తం బలి కావడంతో గ్రామం విషాదంలో మునిగింది.
ఢిల్లీ ఘటన దోషులను
ఉరి తీయాలి
* కేంద్ర మంత్రి కృపారాణి
కవిటి, డిసెంబర్ 29 : ఢిల్లీలో పారా మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆమె మృతికి కారకులైన దోషులను ఉరి తీసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కోరారు. శనివారం కవిటి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన పౌరసన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన చట్టాలను కఠినతరం చేయాలని కోరారు. మెఢికో విద్యార్థినిపై జరిగిన సంఘటన యావత్ దేశానే్న దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. బాధితురాలి మరణ వార్త తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై గల్ఫ్ దేశాల్లో అమలు చేస్తున్న చట్టాలను రూపొందిస్తే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని అభిప్రాయపడ్డారు.
తెలుగు భాషను కాపాడుకోవాలి
తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటేందుకు ప్రతి తెలుగు వ్యక్తి కృషి చేయాలని కిల్లి కృపారాణి పిలుపునిచ్చారు. ఇటీవల ఇస్కో నిర్వహించిన సర్వేలో నశించిపోతున్న భాషల్లో తెలుగు భాష ఉండటం చాలా బాధకరమని వ్యాఖ్యానించారు. అటువంటి తెలుగు భాషను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. తెలుగు భాషను దిశ దశాల వ్యాపింప చేయడానికి రాష్ట్రప్రభుత్వం తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశ చరిత్రలోనే మహిళలకు చట్ట సభల్లో అవకాశాలు కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు దక్కుతుందన్నారు. డిసిసి అధ్యక్షుడు నర్తు నరేంద్ర, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి నర్తు రామారావు, ఇచ్ఛాపురం ఎ. ఎం.సి. చైర్మన్ శ్యామ్ పురియా సోంపేట మాజీ జడ్పీటిసి, ఎంపీపీలు నిమ్మన దాసు, మంగి గణపతి తదితర నాయకులు మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తూ పాటుపడుతున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. అనంతరం ఢిల్లీ ఘటనలో అత్యాచారానికి గురై మృతి చెందిన మెడికో విద్యార్థినికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వేదికపై రెండు నిముషాలు వౌనం పాటించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులకల శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీ డాక్టర్ సెల్ సభ్యులు డాక్టర్ కిల్లి రామ్మోహనరావు శ్రీకాకుళం పార్లమెంటరీ యూత్ అధ్యక్షులు రజనీకుమార్ దొళాయి, కాంగ్రెస్ నేతలు సత్యన్నారాయణ పాడి, కె.దేవరాజు, కె.శంకరరెడ్డి, తడక జోగారావు, పూడి నేతాజి, ఆరంగి మధు, కె.ప్రకాశ్, బి.నాగభూషణం తదితర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సవ్యంగా ప్రజాభిప్రాయ సేకరణ
అత్యధికంగా ట్రైమెక్స్‌కు అనుకూలం * స్థానికులకే ఉపాధి చూపాలని డిమాండ్
గార, డిసెంబర్ 29: వత్సవలస ట్రైమెక్స్ ఇసుక పరిశ్రమ విస్తరణకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శనివారం ఫ్యాక్టరీ సమీపంలో పర్యావరణ పరిరక్షణపై జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ సామరస్యంగా ముగిసింది. కలెక్టర్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో సభ్యుల వారీగా ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. మొగదాలపాడు, కొమరవానిపేట, వత్సవలస, తోణంగి, బందరువానిపేట తదితర గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు తరలివచ్చారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో సుమారు 50 మంది వరకు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఇందులో 90 శాతం మంది ఫ్యాక్టరీకి అనుకూలంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అభిప్రాయ సేకరణ సుమారు మూడున్నర గంటలపాటు సాగింది. పరిశ్రమ ఏర్పాటు సమయంలో తమ ప్రాంతం వారికి (మిగతా 2వ పేజీలో)
ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఫ్యాక్టరీ విస్తరణలో భాగంగా తమ ప్రాంతాలకు వచ్చే ఫ్యాక్టరీ వాహనాలను అడ్డుకుని రహదారులను దిగ్బంధం చేస్తామని కొమరవానిపేటకు చెందిన ఆనందరావు హెచ్చరించారు. ఈ మేరకు స్పందించిన కలెక్టర్ సమస్య సమస్యాత్మకం కాకుండా చూడాలని, చట్టానికి లోబడి ప్రతీ ఒక్కరూ ఉండాలని హితవుపలికారు. ప్రజాభిప్రాయ సేకరణ మొత్తం రికార్డు చేసామని, కావాల్సినవారికి అందజేస్తామని వివరించారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న వారితో పాటు అవుట్ సోర్సింగ్‌లో పనిచేసే వారికి కూడా మినిమమ్ వేజ్ అమలు చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ముందుగా కాలుష్య నియంత్రణ మండలి ఇ.ఇ. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటును ప్రస్తావించారు. అనంతరం ఫ్యాక్టరీ ప్రధాన లైజనింగ్ అధికారి డా. ఎన్.ఎల్.రావు తమ కార్యచరణను వినిపించారు. ఈ కార్యక్రమంలో డి.సి.ఎం.ఎస్. చైర్మన్ గొండు కృష్ణమూర్తి, మాజీ ఎం.పి.పి. గొండు రఘురాం, మార్కెటింగ్ కమిటి చైర్మన్ బరాటం నాగేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు బడగల వెంకటప్పారావు, పీస వెంకటరమణలతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపనకు సహకరించండి
* కలెక్టర్ సౌరభ్‌గౌర్
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, డిసెంబర్ 29: అభివృద్ధిని కోరుకొనేవారు పరిశ్రమల స్థాపనపై ఆలోచన చేయాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ కోరారు. వత్సవలస ఇసుక ఫ్యాక్టరీ విస్తరణ నేపథ్యంలో శనివారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు విచ్చేసిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. లాభనష్టాలు బేరీజు వేసుకొని పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరారు. పాధి అవకాశాలు మెండుగా ఉండాలంటే పరిశ్రమలు తప్పనిసరన్నారు. జిల్లాలో పరిశ్రమలు అవలంభిస్తున్న సి.ఎస్.ఆర్. చర్యలను అభినందించారు. ప్రస్తుతం స్థానిక సంస్థలు లేని కారణంగా పరిశ్రమలు తమ పరిసర ప్రాంతాల్లో గ్రామాల అభివృద్ధికి దృష్టి సారించాలని, నిధులను పంచాయతీ జనరల్ ఫండ్‌కు వెచ్చించి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన అభివృద్ధి, గ్రీన్‌బెల్ట్ సక్రమంగా అమలుతో పాటు రైతులు, మత్స్యకార కుటుంబాల జీవన మనుగడకు ప్రాధాన్యం కల్పించే దిశగా పరిశ్రమలు దృష్టి సారించాలన్నారు. పరిశ్రమలు కూడా వ్యాపారాభివృద్ధి, లాభార్జనలే కాకుండా వౌలిక సదుపాయాలు కల్పన, ప్రాంతాలు అభివృద్ధిపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
నిందితులను ఉరితీయాలి
* ఢిల్లీ ఘటనపై భగ్గుమన్న మహిళా లోకం * వెల్లువెత్తిన నిరసనలు
శ్రీకాకుళం (టౌన్), డిసెంబర్ 29: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఘటనలో బాధితురాలు మృతిచెందడంతో బాధ్యులైన వారిని వెంటనే ఉరితీయాలని కోరుతూ పట్టణంలో పలుచోట్ల నిరసనలు, ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. శనివారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుండి విద్యార్థినులు భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితులను ఉరితీయాలని, ఇటువంటి అమానుష సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నినదించారు. పట్టణంలోని అరసవల్లి కూడలి వరకు సాగిన ర్యాలీ మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాధితురాలకు మద్దతుగా నిలిచారు. కార్యక్రమంలో గాయత్రి సంకల్పం సంస్థ అధ్యక్షుడు గొలివి నర్శునాయుడు, ఎస్.వి.డి.మురళి, బోయిన శ్రీను, కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ కె.మధుసూదనరావు, అధ్యాపకులు కె.సూరిబాబు, టి.కామేశ్వరరావు, మొదలవలస ఇందువదన తదితరులు పాల్గొన్నారు.
* దుష్టసంస్కృతిని పారద్రోలండి
మహిళలపై హింస, అత్యాచారాలకు మూలమైన పాలకులు పెంచి పోషిస్తున్న దుష్టసంస్కృతిని పారదోలాలని స్ర్తి విముక్తి సంఘటన నాయకురాలు తాండ్ర అరుణ డిమాండ్ చేశారు. ఆడపిల్లలకు రక్షణ కరువైందని, ఢిల్లీ ఘటన జరిగి ఇంతకాలమైనా నిందితులపై చర్యలకు ప్రభుత్వం తాత్సారం తగదని వెంటనే వారిని ఉరితీయాలని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద ఈ సందర్భంగా రాస్తారోకో నిర్వహించారు.
* మెడికోల కొవ్వొత్తుల ప్రదర్శన
ఢిల్లీలో జరిగిన అమానుష ఘటనకు నిరసనగా రిమ్స్ కళాశాల మెడికోలు రిమ్స్ ఆసుపత్రి నుండి బలగ కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఘటనకు కారకులైన వారిని వెంటనే ఉరితీయాలని, ఇకముందు ఇటువంటివి జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలికు ప్రభుత్వం అండగా నిలవాలని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బక్కిరి కొండపై డి-పట్టాలివ్వలేం
* ఎ.సి.ఎఫ్ శ్రీహరగోపాల్
సారవకోట, డిసెంబర్ 29: మండలంలో తొగిరి రెవెన్యూ గ్రామం పరిధిలోని బక్కిరి కొండపై స్థానికులకు డి-పట్టాలివ్వడానికి అవకాశం లేదని అటవీ శాఖ సహాయ కన్జర్వేటర్ శ్రీహరగోపాల్ స్పష్టం చేశారు. స్థానిక సెక్షన్ అధికారి కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. అంతకుముందు రేంజి అధికారి సంజయ్, సెక్షన్ అధికారి రామకృష్ణ, బీటు అధికారి శ్రీనివాసరావులతో కలిసి బక్కిరి కొండను పరిశీలించారు. కొండ పచ్చదనంతో, మొక్కలతో రిజర్వు ఫారెస్టును పోలి ఉందని, దీనిపై స్థానికులకు పట్టాలిస్తే బంజరుభూమిగా మారుతుందన్నారు. స్థానికులు సమర్పించిన వినతిపత్రంపై బక్కిరికొండను పరిశీలించామని, నివేదికన్లు కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు.
అక్రమ రవాణాదారులకు జరిమానా
ఎటువంటి అనుమతుల్లేకుండా ట్రాక్టర్‌పై వంటచెరకును రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను ఎ.సి.ఎఫ్ శ్రీహరగోపాల్ స్థానిక అటవీశాఖ కార్యాలయ సమీపంలో శనివారం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న నెయ్యిల చిన్నవాడు నుండి ఐదువేల రూపాయలు జరిమానా వసూలు చేసి ట్రాక్టర్‌ను, కలపను విడిచిపెట్టారు.
పథకాల అమలులో యువత భాగస్వామ్యం తప్పనిసరి
* కలెక్టర్ సౌరభ్‌గౌర్
ఎచ్చెర్ల, డిసెంబర్ 29: ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందాలంటే యువజన సంఘాల భాగస్వామ్యం ఎంతో అవసరమని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి యువచైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతీ గ్రామంలో యూత్‌క్లబ్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. యువజన సంఘాలు కలిసి పనిచేయడం వల్ల ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందడంతోపాటు సత్ఫలితాలు ఇస్తాయన్నారు. ఈ సందర్భంగా మండలంలోని పట్టుశాలిపేటకు చెందిన యువజన సంఘ ప్రతినిధి రమణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. జి.సిగడాం మండలానికి చెందిన నారాయణరావు అనే యువజన సంఘ ప్రతినిధి ప్రభుత్వ పథకాల అమలులో యువకులను భాగస్వామ్యం చేసినట్లయితే రాజకీయాలకతీతంగా ఫలాలు అందించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఎజెసి రాజ్‌కుమార్, సిఇఒ కైలాసగిరీశ్వరరావు, వయోజన విద్య డి.డి నాగేశ్వరరావు, సెట్‌శ్రీ సిఇఒ మూర్తి, యుఎన్ కోఆర్డినేటర్ కృష్ణ, ప్రత్యేకాధికారులు ప్రసాద్, రెడ్డి గున్నయ్య, ఎంపిడిఒలు బి.శైలజ, కిరణ్, వాసుదేవరావు, శంకర్రావు, తహశీల్దార్లు వి.శివబ్రహ్మానంద్, వివేకానంద, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాలకు చెందిన సాక్షర భారత్ కోఆర్డినేటర్లతో యువసమ్మేళనం నిర్వహించారు.
200 మంది రక్తదానం
ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో పాటు పలు యువజన సంఘాల ప్రతినిధులు రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చారు. రెడ్‌క్రాస్ నిర్వహించిన ఈ శిబిరంలో 200 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు పి.జగన్మోహన్‌రావు, ప్రతినిధులు నిక్కు అప్పన్న, నిక్కు హరిసత్యనారాయణ, పాలిటెక్నిక్ విశ్రాంత ప్రిన్సిపాల్ బి.శ్రీరామ్మూర్తి, ఎంపిడిఒ కార్యాలయ సూపరింటెండెంట్ విజయభాస్కర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తెలుగుతల్లికి దశ సహస్ర గళార్చన
పాతపట్నం, డిసెంబర్ 29: తెలుగుమహాసభలను పురస్కరించుకుని మండల కేంద్రంలోని వ్యవసాయమార్కెట్ కమిటీ ఆవరణలో శనివారం తెలుగుతల్లికి దశ సహస్రగళార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు, పాఠశాలలతోపాటు ఇంటర్, డిగ్రీ కళాశాలలకు చెందిన పదివేలమంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురాతన ఆచార సాంప్రదాయాలు, నిత్యసాంప్రదాయ ప్రదర్శన, ఎరుకులపాటలు, కర్రసాము వంటి ప్రదర్శనలు నిర్వహించారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటే విధంగా కళాజాతను కన్నులపండువగా నిర్వహించారు. మా తెలుగుతల్లికి మల్లెపూదండ గేయంతో నృత్యప్రదర్శన చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ లవరాజు, ఇఒఆర్‌డి ఎస్.చిరంజీవులు, ఎఎంసి చైర్మన్ లింగాల జనార్ధనరావు, పైల లచ్చుమయ్య, కొంచాడ వీరభద్రరావు, విక్టరీ, ఆక్స్‌ఫర్డ్, కిరణ్మయి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ , మహేంద్ర విద్యాసంస్థల ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గైర్హాజరైన డిఆర్‌ఎంకు మళ్లీ నోటీసులు
ఆమదాలవలస, డిసెంబర్ 29: పట్టణంలోని మెట్టక్కివలస రోడ్డులో బొగ్గు గనుల కాలుష్యంపై ఇక్కడి జూనియర్ సివిల్ జడ్జికోర్టులో గతంలో జరిగిన విచారణకు రైల్వే డిఆర్‌ఎం గైర్హాజరైన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు డిఆర్‌ఎంకు శనివారం జరిగిన లోక్‌అదాలత్‌కు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినా రెండోసారి కూడా ఆయన గైర్హాజరయ్యారు. దీంతో ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేసి అప్పటికైనా హాజరు కావాలని మెజిస్ట్రేట్ వి.ఎస్.ఎస్ శ్రీనివాసశర్మ ఆదేశించారు. అయితే శనివారం జరిగిన విచారణలో తహశీల్దార్ గ్రంథి వీర్రాజు, మున్సిపల్‌కమిషనర్ కృష్ణమోహన్, కాన్‌కాస్ట్ కర్మాగారం అధికారులు పాల్గొన్నారు. బొగ్గుగనుల కాలుష్యంపై పరిసర ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పువాటిల్లుతుందన్న ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని మెజిస్ట్రేట్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్యాసప్పారావు, పివిఎన్ నర్సింహులు, కింతలి త్రినాధ్, సీనియర్ న్యాయవాదులు చాపర రమేష్, హెచ్.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలోనే
ప్రభుత్వ కార్యాలయాలకు హంగులు
* ఎమ్మెల్యే సత్యవతి
ఆమదాలవలస, డిసెంబర్ 29: నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలకు కాంగ్రెస్ పాలనలోనే పక్కా భవనాలు నిర్మిస్తున్నానని ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. శనివారం పట్టణంలో పాతినవారివీధిలో సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో తలపెట్టిన భూసార పరీక్షా కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. 40 ఏళ్ల కిందట ఈ కేంద్రం ఏర్పాటు చేశారని, ఇంతవరకు పాలకులెవరూ దీనికి సొంత భవనం నిర్మాణానికి ప్రయత్నించలేదన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ జె.డి మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాకు ఉన్న ఏకైక భూసారపరీక్షాకేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం స్థానిక రైతాంగానికి ఎంతో అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డి.ఇ ఎం.ఆర్.జి.నాయుడు, భూసారపరీక్షా కేంద్రం ఎ.డి సత్యవతి, కాంట్రాక్టర్ పి.వి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
దేవీ ఆశ్రమంలో అన్నాభిషేకం
ఎచ్చెర్ల, డిసెంబర్ 29: కోటికుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా దోమాం పంచాయతీ కుంచాల కూర్మయ్యపేటలో దేవీఆశ్రమ ప్రాంగణంలో శనివారం అన్నాభిషేకం నిర్వహించారు. 675 కిలోలు అన్నాన్ని అమ్మకు సమర్పించి క్షీరాభిషేకం చేశారు. ఆశ్రమ వ్యవస్థాపకులు తేజోమూర్తుల బాలభాస్కరశర్మ ఆధ్వర్యంలో దద్దోజనం, పులిహోరగా సమర్పించిన వరి అన్నాన్ని భిన్నంగా మార్చి భక్తులకు ప్రసాదంగా అందించారు. అలాగే 2,700 మంది సువాసినులు కుంకుమపూజ పారాయణంలో పాల్గొన్నారు. జిల్లాతోపాటు విశాఖ, విజయనగరం జిల్లాలు, ఒడిశా రాష్ట్రం నుంచి భక్తులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సతీమణి లక్ష్మీదేవితోపాటు మహిళలు పాల్గొన్నారు. వి.సర్వేశ్వరరావు, అమర్‌నాధ్, శ్రీనుస్వామి, జయరాం, రమేష్‌లు పర్యవేక్షణలో కోటికుంకుమార్చన సాగింది.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా వైస్ చైర్మన్‌గా బెవర
జలుమూరు, డిసెంబర్ 29: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా వైస్ చైర్మన్‌గా మండలం రావిపాడు గ్రామానికి చెందిన బెవర రామారావు నియమితులయ్యారు. మంత్రి ధర్మాన సూచనల మేరకు ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ బి.నర్సింహులు నియమించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని బెవర రామారావు స్పష్టం చేశారు.
ఆహారం కల్తీ... విద్యార్థినికి అస్వస్థత
* కాదంటున్న యాజమాన్యం
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 29: మండలంలో రాగోలు సమీపంలోని జెమ్స్ మెడికల్ కళాశాల హాస్టల్‌లో భోజనం వికటించడంతో ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. మెడికల్ కళాశాలకు సంబంధించి హాస్టల్‌లో 170 మంది విద్యార్థులు ఉంటున్నారు. శనివారం వేకువజామున ఐదు గంటల సమయంలో శ్రావణి అనే తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి కడుపునొప్పి రావడంతో ఆసుపత్రిలోనే చేర్పించి వైద్యసేవలు అందించారు. ఆహారం వికటించడం వల్లే విద్యార్థినికి కడుపునొప్పి వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై విద్యార్థినిని వివరణ కోరగా సాధారణంగానే కడుపునొప్పి వచ్చిందని, వెంటనే వైద్యసేవలు అందించారని తెలిపింది. కళాశాల అసిస్టెంట్ మేనేజర్ సి.ఎస్.బోస్ మాట్లాడుతూ ఫుడ్‌పాయిజన్ అయితే హాస్టల్‌లో 170 మంది విద్యార్థులు ఉంటున్నారని, ఒక్కరికే కడుపునొప్పి రాదన్నారు. సాధారణంగానే విద్యార్థినికి కడుపునొప్పి రావడంతో వైద్యసేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు.
కిడ్నీ వ్యాధులపై పూర్తి స్థాయి పరిశీలన
కేంద్ర మంత్రి కృపారాణి
కవిటి, డిసెంబర్ 29 : ఉద్దాన ప్రాంత కిడ్నీ వ్యాధి పట్ల పూర్తిస్థాయిలో ప్రభుత్వం పరిశీలన జరుపుతుందని కేంద్రమంత్రి కె కృపారాణి అన్నారు. కవిటి మండలంలోని వివిధ అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణం తెలిసిన తరువాత రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.ఈ సందర్భంగా వరక పంచాయతీ సన్యాసిపుట్టుగలో పాఠశాల అదనపు భవనాన్ని, బొరివంకలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవనాన్ని, ప్రాధమిక పాఠశాల అదనపు భవనాన్ని, కవిటిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవనాన్ని, పాఠశాల అదనపు భవనాన్ని, బింగిపుట్టుగలోని పాఠశాల అదనపు భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్తు నరేంద్ర, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జీ నర్తు రామారావు, జిల్లా వైద్యాధికారిణి గీతాంజలి, బొరివంక, కవిటి పిహెచ్‌సి వైద్యులు బాలకృష్ణ, ప్రతిభాప్రియా, స్థానికులు బి శ్రీరాంప్రసాద్, పండి సీతారామ్మూర్తి, బలగ లచ్చయ్య, బాలక బాలరాజు పాల్గొన్నారు.
బెంతు ఒరియాలకు న్యాయం చేస్తా...
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో గల బెంతు ఒరియా కులస్థులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం కవిటికి వచ్చిన ఆమెను బెంతు ఒరియా కులస్థులు తమ సమస్యను వివరించారు. కులధ్రువీకరణ పత్రాలు మం జూరు కాక విద్యార్థులు, నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై మంత్రి స్పందిస్తూ గత నాయకులవలే ఓట్ల కోసం తాను పనిచేయనని సమస్య పరిష్కారానికి పని చేస్తానని హామీ ఇచ్చారు.వినతి పత్రాలు అందించిన వారిలో ఎఎంసి చైర్మన్ శ్యామ్‌పురియా, బెంతు ఒరియా ప్రతినిధులు దేవరాజ్ సాహూ, రౌళో కులసం ఘ ప్రతినిధులు కృష్ణారావు రౌళో, ధన్వంతరి రౌళో, దండాసి రౌళో, గొనప శ్రీనులు పాల్గొన్నారు.
మంత్రి కృపారాణికి ఘన సన్మానం
వివిధ పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శనివారం కవిటికి విచ్చేసిన కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిని ఘనంగా సత్కరించారు. స్థానిక ఉషోదయ యువజన సంఘ ప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు మంత్రి కిల్లి కృపారాణిని రామ్మోన్ దంపతులను ఘనంగా సన్మానించారు.