విజయవాడ, డిసెంబర్ 28: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరించబోమంటూ కృష్జా జిల్లా సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నగరంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థి జెఎసి నాయకుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభించిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడటం ద్వారా చంద్రబాబునాయుడు సమైక్యాంధ్ర ప్రజలకు దగా చేస్తూ వెన్నుపోటు రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. 2008లో టిడిపి చెప్పినదానికి భిన్నంగా మాట్లాడటం ద్వారా చంద్రబాబు మోసకారితనం మరోమారు బయటపడిందని విమర్శించారు. టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ సభ్యసమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కెసిఆర్ సొత్తు కాదని, రాష్ట్ర ప్రజలంతా కలిసి అభివృద్ధి చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ధర్నాలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
గుంటూరులో ఆందోళనలు
గుంటూరు: తెలంగాణ అంశంపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీల నేతలు ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమైక్యవాదాన్ని బలపర్చలేక పోయారని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జెఎసి నేతలు శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ నినాదాలు చేశారు. రాష్ట్రం సమైక్యంగానే వుండాలంటూ లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. పలుచోట్ల విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ప్రదర్శనలు, రాస్తారోకోలు, ధర్నాలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థి జెఎసి నాయకుడు మండూరి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించే ఎలాంటి చర్యకు మద్దతునిచ్చినా ప్రజాప్రతినిధులను ఇళ్లనుంచి కదలనీయబోమని హెచ్చరించారు. సీమాంధ్ర జెఎసి గౌరవాధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ ప్రజలు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని మాత్రమే కోరుకుంటున్నారని, వేర్పాటువాదాన్ని అణచివేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అఖిలపక్ష సమావేశం తెలంగాణకు అనుకూలంగా జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అనడం ఆయన అవివేకానికి నిదర్శనమనిసమితి కన్వీనర్ ఎండి హిదాయత్ విమర్శించారు. ఉద్యమం పేరిట విద్యార్థులను బలిపశువుల్ని చేస్తున్న కెసిఆర్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
గుంటూరులో ర్యాలీలో పాల్గొన్న సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, విద్యార్థి విభాగం నేతలు, విద్యార్థినులు
నెలలో తెలంగాణ తేలదు
మంత్రి టిజి వెంకటేశ్
తిరుపతి, డిసెంబర్ 28: ఢిల్లీలో జరిగిన సమావేశం అఖిలపక్ష సమావేశం కాదని, కేవలం కాంగ్రెస్ సమావేశం మాత్రమేనని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటుకు ఏ పార్టీ నేటికీ ఎలాంటి ప్రాతిపదిక లేదని అన్నారు. అనవసరంగా ఉద్యమిస్తున్న పార్టీల నేతలను కటకటాల వెనకకు పంపించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. నెలలో తెలంగాణ అంశం తేలుతుందని వివిధ పార్టీలు చేస్తున్న మాట ఒట్టిదేనని, ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే ఏ పార్టీ అయినా తెలంగాణ అంశంపై మాట్లాడాలని ఆయన పేర్కొన్నారు. కాలం వెళ్లబుచ్చేందుకే నెల నెల అంటున్నారని, ఎన్నికల వరకూ ఈ అంశం పరిష్కారమే కాదని అన్నారు. తెలంగాణకు రావల్సిన నీటిని మహారాష్ట్ర దోచుకుంటున్నా టిఆర్‌ఎస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీమ, తెలంగాణలలో ముస్లింలు అధికంగా ఉన్నందున మజ్లిస్ రాయల తెలంగాణ కోరుకుంటోందని, చంద్రబాబు తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నందునే అక్కడి ఓట్ల కోసం అనుకూలంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
బిజెపి అధికారంలో ఉన్నపుడు తెలంగాణ ఇవ్వవచ్చు కదా...కేవలం అధికారం కోసమే బిజెపి నేడు తెలంగాణ డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ఇస్తే దేశవ్యాప్తంగా కొత్త రాష్ట్రాల కోసం డిమాండ్‌లు వచ్చి సమస్య మళ్లీ మొదలవుతుందని అన్నారు.
బలిదానాలు ఎవరు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. 610 జీవోకు పరిష్కారం కాంగ్రెస్‌తోనే లభించిందని అన్నారు. ఉద్యమాన్ని రానున్న రోజుల్లో ప్రభుత్వం అణచివేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.. 2014 ఎన్నికల్లో తెలంగాణ అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టి గెలిచిన తర్వాతనే మాట్లాడాలని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినందునే టిడిపి, బిజెపి అధికారానికి దూరమయ్యాయని అన్నారు. గతంలో జరిగిన బంద్‌లు కారణంగా లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను టిఆర్‌ఎస్ నాయకులు అనవసరంగా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.