హైదరాబాద్, డిసెంబర్28: రాష్ట్రంలో యువ నాయకుల మధ్య సామాజిక సైట్స్‌లో మాటల యుద్ధం ప్రారంభం అయింది. ఇంత కాలం టివి చర్చల్లోనే తిట్టుకునే నాయకులు ఇప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను సైతం తమ రాజకీయ కీచులాటలకు వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణకు అనుకూలం అంటూ టిడిపి స్పష్టంగా వెల్లడిస్తే ఎన్టీఆర్ భవన్‌లో చప్రాసీ ఉద్యోగం చేయడానికి సైతం సిద్ధం అంటూ గతంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పిన మాటలపై లోకేశ్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. అఖిలపక్ష సమావేశంలో టిడిపి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందనే భావనతో లోకేశ్ ఈరోజు తన ట్విట్టర్‌లో ‘హరీశ్, ఎన్టీఆర్ భవన్‌లో చప్రాసీ ఉద్యోగం కోసం నీ నుంచి దరఖాస్తు కోసం ఎదురు చూస్తున్నాం’ అంటూ ట్విట్ చేశారు. అదే విధంగా ఎమ్మెల్యే తారక రామారావు రాజీనామా కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. (తెలంగాణకు అనుకూలంగా టిడిపి ప్రకటన చేస్తే ఉప ఎన్నికల నుంచి తప్పుకుంటామని, ఉప ఎన్నికల సమయంలో తారక రామారావు ప్రకటించడాన్ని లోకేష్ ప్రస్తావించారు. )
దీన్ని కొన్ని చానల్స్ ప్రసారం చేయడంతో అటువైపు టిఆర్‌ఎస్ నాయకులు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే తారక రామారావు, అల్లుడు ఎమ్మెల్యే హరీశ్వర్‌రావు ఫేస్‌బుక్‌లో ఘాటుగా స్పందించారు. రాజకీయ అపరిపక్వతతో లోకేశ్ మాట్లాడుతున్నారని హరీశ్వర్‌రావు ఫేస్‌బుక్‌లో విమర్శించారు. తాను మాట్లాడిన విషయాన్ని లోకేశ్ సరిగా అర్ధం చేసుకోలేదని అన్నారు.
మేం చంద్రబాబునాయుడు మాదిరిగా రాజకీయ అవకాశ వాదులం కాదన్నారు. లేఖ ద్వారా తెలంగాణకు అనుకూలంగా టిడిపి స్పష్టత ఇచ్చిందనే అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లోకేశ్‌కు ప్రజాస్వామ్య స్ఫూర్తిపై గౌరవం ఉంటే తన తండ్రిని నిలదీయాలని, తెలంగాణపై ద్వంద్వ వైఖరి వద్దని చెప్పాలని కోరారు. గతంలో చేసిన ప్రకటనకు తాను కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. స్వయంగా చంద్రబాబు తెలంగాణకు అనుకూలం అని విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించాలని కోరారు. బాబు రాజకీయ హిపోక్రట్ కాకపోతే తెలంగాణకు అనుకూలం అని ఆయనతో ప్రకటన చేయించాలని హరీశ్వర్‌రావు లోకేశ్‌కు సూచించారు. స్పష్టమైన ప్రకటన చేయించక పోతే అవకాశవాది అయిన తండ్రి అడుగుజాడల్లో నడిచే వ్యక్తిగా మిగిలిపోతావని లోకేశ్‌కు సూచించారు. కొత్తబిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా లోకేశ్ మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తారక రామారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు విమర్శించారు. చంద్రబాబు గురించి లోకేశ్ వాళ్ల మామలు బాలకృష్ణ, హరికృష్ణలను అడిగి తెలుసుకోవాలని, నమ్మిన వారిని బాబు ఎలా వెన్నుపోటు పొడుస్తాడో అడిగి తెలుసుకోవాలన్నారు.
శ్రీశైల మల్లన్నకు
వార్షిక ఆరుద్రోత్సవం
శ్రీశైలం, డిసెంబర్ 28: పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శుక్రవారం స్వామివారికి ఆరుద్రోత్సవం నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి 10.30 గంటలకు దేవస్థాన అధికారులు పూజాదికార్యక్రమాలు నిర్వహించారు.
ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రనక్షత్రం రోజున వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్సవంలో భాగంగా గణపతి పూజ, లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం శాస్రోక్తంగా నిర్వహించారు.
శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు మంగళవాయిద్యాలు, సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం ప్రాతఃకాల పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లకు మంగళహారతులు ఇచ్చి గ్రామోత్సవం నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి సాగర్‌బాబు తెలిపారు. అందువల్ల శనివారం జరగాల్సిన సుప్రభాత సేవ, ఏకాంత పూజలు రద్దుచేశారు. గ్రామోత్సవం అనంతరం శనివారం ఉదయం 6.30 గంటలకు భక్తులను సర్వదర్శనం, అర్జిత సేవలకు అనుమతిస్తున్నట్లు ఇఓ తెలిపారు.
‘అనంత’లో రోడ్డు ప్రమాదం
నలుగురు దుర్మరణం
పెనుకొండ, డిసెంబర్ 28: అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై పులేకమ్మ దినె్న వద్ద శుక్రవారం సాయంత్రం ఆటో బోల్తాపడిన సంఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో అనంతపురం నగరం వేణుగోపాల్‌నగర్‌కు చెందిన ఫయాజ్ (17), బాబా ఫకృద్దీన్ (45), వన్నూర్‌బీ (55), సబయ సీమా (9) ఉన్నారు.
అనంతపురం నుంచి వీరంతా ఆటోలో పెనుకొండ బాబా ఫకృద్దీన్ దర్గాను దర్శించుకుని సోమందేపల్లిలో బంధువులను పలుకరించి తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. ఆటో పులేకమ్మ దినె్న వద్ద డివైడర్లను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఫయాజ్ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ముగ్గురు పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందుతూ మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మహబూబ్‌బీ, షబానా, నూర్ మహమ్మద్ గాయపడ్డారు. షబానా పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
విధుల్లో చేరిన బిశ్వాల్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా రిటైర్డు ఐఎఎస్ అధికారి చిత్తరంజన్ బిస్వాల్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎపిపిఎస్‌సిలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు.
విజయనగరంలో
నంది నాటకోత్సవాలు
నంది నాటకోత్సవాలను జనవరి 20 నుంచి 28 వరకు విజయనగరంలో ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే ఈ నాటకోత్సవాల ఆవార్డులను చివరి రోజున ప్రదానం చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విశాఖలో లాకప్ మరణం
విశాఖపట్నం, డిసెంబర్ 28: విశాఖ టూ టౌన్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడొకరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఇది లాకప్ మృతిగానే భావిస్తున్నారు. అయితే నిందితుడు అనారోగ్యంతో చనిపోయాడని పోలీసులు తెలపగా, స్థానికులు మాత్రం లాకప్ డెత్ అని ఆరోపిస్తున్నారు. వియనగరంలోని కొత్తపేటకు చెందిన బూర శ్రీనిసరావు (35) చాలా కాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈనెల 24వ తేదీన స్థానిక కోస్టల్ బ్యాటరీ వద్ద పోలీసులు పహారా కాస్తుండగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న శ్రీనివాసరావు వారికి పట్టుబడ్డాడు. విజయనగరం పట్టణలోని వన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో అతనిపై తొమ్మిది కేసులు ఉన్నాయి. దాంతో విశాఖ టూ టౌన్ పోలీసులు శ్రీనుపై స్టేషన్‌లో విచారణ ప్రారంభించారు. శ్రీను దొంగతనం చేసిన బంగారంలో కొంత రికవరీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. మిగిలిన బంగారాన్ని రికవరీ చేసేందుకు శ్రీనును ప్రశ్నిస్తున్నారు. ఈ ఇంటరాగేషన్ తీవ్ర స్థాయిలో జరపడంతో శ్రీను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పోలీసులు గురువారం కెజిహెచ్‌కు తీసుకువెళ్లి, పరీక్షలు జరిపించారు. అతనికి ఎటువంటి అనారోగ్యం లేదని డాక్టర్లు చెప్పడంతో, శ్రీనును తిరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. శుక్రవారం తెల్లవారేసరికి శ్రీను మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. శ్రీను మృతదేహాన్ని కెజిహెచ్ మార్చురీకి తరలించారు. కొన ఊపిరితో ఉన్న శ్రీనును కెజిహెచ్‌కు తరలించామని, చికిత్స పొందుతూ చనిపోయాడని పోలీసులు చెప్పారు. అయితే మృత దేహానే్న ఇక్కడికి తీసుకువచ్చారని కెజిహెచ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంటరాగేట్ చేసి, పోలీసులు బంగారాన్ని రికవరీ చేశారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు ఐపిసి 176 (కస్టోడియల్ డెత్) కింద కేసు నమోదు చేశారు.
మొదలైన ప్రత్యేక ‘ సెగలు’
మహబూబ్‌నగర్ జిల్లాలో వైకాపా, కాంగ్రెస్, టిడిపి కార్యాలయాలపై దాడులు
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, డిసెంబర్ 28: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై తేల్చకపోవడంతో ఆగ్రహానికి గురైన తెరాస, బిజెపి, న్యూడెమోక్రసీ పార్టీ శ్రేణులు, విద్యార్థులు, జెఎసి నాయకులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టత ఇవ్వలేదంటూ వైకాపా, కాంగ్రెస్, టిడిపికి వ్యతిరేకంగా తెలంగాణవాదులు మహబూబ్‌నగర్ జిల్లాలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో వైకాపా నిర్వహిస్తున్న రైతు పోరు దీక్షా శిబిరాన్ని తెలంగాణ వాదులు ముట్టడించే ప్రయత్నం చేశారు.
ఇంతలోపే పోలీసులు వైకాపా నేతల దీక్షను త్వరితగతిన విరమింపజేసి దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించారు. టిఆర్‌ఎస్, టిఆర్‌ఎస్‌వి నాయకులు తెలంగాణ చౌరస్తాకు చేరుకుని అక్కడ ఉన్న వైకాపా నేతల ఫ్లెక్సీలు, జెండాలను పెకిలించి దగ్ధం చేశారు. అదేవిధంగా విద్యార్థి జెఎసి నాయకులతో పాటు వందలాది మంది విద్యార్థులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగి హల్‌చల్ సృష్టించారు. వెంటనే పోలీసులు విద్యార్థులను అక్కడి నుండి చెదరగొట్టారు. విద్యార్థి జెఎసి నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకోకు దిగారు. వైకాపా, టిడిపి, కాంగ్రెస్ విధానాలను తప్పుబడుతూ రాస్తారోకో చేపట్టారు. పిడిఎస్‌యు విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాగా, జడ్చర్లలో టిడిపి, కాంగ్రెస్ కార్యాలయాలపై తెలంగాణ వాదులు దాడులు చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో జడ్చర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లాలో ఒక్కసారిగా తెలంగాణవాదులు మరోసారి రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్, టిడిపి, వైకాపా పార్టీ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.