తెలంగాణపై అఖిల పక్షానికి హాజరైన సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, ఎంఐఎం ప్రతినిధులు
అఖిలపక్షం అభిప్రాయాలు తెలుసుకున్నా
ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందిస్తా
సమావేశం సంతృప్తికరంగా సాగింది
సమస్యకు ఏదో ఒకదారి లభించటం ఖాయం
అప్పటి వరకూ శాంతించాలన్న షిండే
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ‘ప్రత్యేక తెలంగాణ వివాదంపై కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తుంది. రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఊరట కలిగిస్తాం. తెలంగాణ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కనుక, యువత శాంతియుతంగా ఉండాలని అఖిలపక్షం వేదిక నుంచి కోరుతున్నా’ అని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. శుక్రవారం హోంమంత్రి కార్యాలయంలో ఎనిమిది పార్టీల నేతలతో షిండే ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు ప్రకటన చేశారు. ‘ఎనిమిది పార్టీల ప్రతినిధులు చెప్పినదంతా సావకాశంగా విన్నాను. వీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కేంద్రానికి నివేదిస్తాను. నెల రోజుల్లో చర్చల ఫలితాన్ని ప్రకటిస్తాం’ అని తెలిపారు. ‘సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. సమావేశానికి హాజరైన వారంతా తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీలైనంత త్వరగా తెలంగాణ సమస్యపై నిర్ణయాన్ని ప్రకటించాలని కొందరు కోరితే, మరికొందరు నెల రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు’ అని హోం మంత్రి తెలిపారు. తెలంగాణ అంశంపై ఇదే ఆఖరి అఖిలపక్ష భేటీ అని పేర్కొంటూనే, రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలను జాగ్రత్తగా విని నోట్ చేసుకున్నట్టు సుశీల్‌కుమార్ చెప్పారు. ఆయా పార్టీల ప్రతినిధులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని, నెల రోజుల్లో ఫలితాన్ని ప్రకటిస్తామని షిండే చెప్పారు. ఫలితం అంటే ఏమిటి? తెలంగాణ ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తారా? మరేదైనా చెబుతారా? అని ఒక మీడియా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటిస్తుందని షిండే బదులిచ్చారు. శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై నిర్ణయం ప్రకటిస్తామని ఆయన వివరించారు. వివిధ పార్టీల ప్రతినిధులు ఏం చెప్పారని అడుగగా వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను వెల్లడించటం సాధ్యం కాదన్నారు. మెజారిటీ ప్రతినిధులు ఏం చెప్పారన్న ప్రశ్నకు కూడా ఆయన బదులిచ్చేందుకు నిరాకరించారు. కాంగ్రెస్ ప్రతినిధులు ఏం చెప్పారనేది వెల్లడించేందుకూ షిండే అంగీకరించలేదు. రాష్ట్ర ప్రజలు ఇంత వరకు రెండు వైపుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నేటి సమావేశం ద్వారా వారికి త్వరలోనే ఊరట కలిగించగలుగుతామనే పూర్తి విశ్వాసం తనకు ఉన్నదని సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. తెలంగాణ సమస్యకు ఏదోకదారి లభిస్తుందనే ఆశాభావాన్ని షిండే వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని యువకులు ప్రశాంతంగా ఉండాలని వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం తెలంగాణ సమస్యపై ఒక నిర్ణయం తీసకుంది అని చెప్పి, ఆ తరువాత తీసుకుంటోందని చెప్పారు. అంతా మంచే జరుగుతుంది అనే ఆశాభావాన్ని షిండే వ్యక్తం చేశారు. ఇదే ఆఖరి అఖిల పక్ష సమావేశం అని స్పష్టం చేస్తూ, సమావేశం జరిగిన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మీ నిర్ణయం ఇరుపక్షాలకు సంతృప్తి కలిగిస్తుందా? అని ఒక విలేకరి ప్రశ్నించగా అందరికి సంతృప్తి కలిగించాలి. కానీ నిర్ణయాలు కొందరికి సంతృప్తి కలిగించవచ్చు మరికొందరికి అసంతృప్తి కలిగించవచ్చునని షిండే వ్యాఖ్యానించారు. ‘ఈరోజు అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాం. వీటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నించగా అలా భావించటం మంచిది కాదని, అందరి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు. తెలంగాణపై పలుమార్లు సమావేశం జరిగింది. రాజకీయ పార్టీలు పలుమార్లు అభిప్రాయాలు వెల్లడించాయి. శ్రీకృష్ణ కమిటీ సిఫారసు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో మీరు ఈరోజు జరిపిన చర్చల ఆధారంగా నెల రోజుల్లో నిర్ణయానికి రాగలుగుతారా? అని ఒక విలేకరి ప్రశ్నించగా షిండే ఒక నిమిషం పాటు ఆలోచించి ‘నిర్ణయం ప్రకటిస్తామని చెప్పాను కదా. తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం’ అని బదులిచ్చారు.
చిత్రం... తెలంగాణపై కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఎనిమిది పార్టీల ప్రతినిధులు,