ఎవరేమన్నారు...
తెలంగాణ ఇవ్వాల్సిందే: సురేష్‌రెడ్డి
సమైక్యంగానే ఉంచాలి: గాదె
2008 లేఖకు కట్టుబడి ఉన్నాం
- టిడిపి
రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారా? లేదా?
- టిఆర్‌ఎస్
తెలంగాణ ఇవ్వండి
-సిపిఐ
సమైక్యాంధ్రకే మా ఓటు
-సిపిఎం
విభజన తప్పదనుకుంటే
‘రాయల తెలంగాణ’
-ఎంఐఎం
తెలంగాణ మనోభావాన్ని
గౌరవిస్తున్నాం, కేంద్రమే తేల్చాలి:
-వైఎస్‌ఆర్ కాంగ్రెస్
న్యూఢిల్లీ,డిసెంబర్ 28: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే శుక్రవారం నిర్వహించిన మూడో అఖిలక్ష సమావేశంలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నాలుగు పార్టీలు డిమాండ్ చేస్తే రెండు పార్టీలు వ్యతిరేకించాయి. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతిని అవలంబిస్తే కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాటవేత వైఖరిని ఆవలంబించింది. తెరాస, బిజెపి, సిపిఎం, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే సిపిఎం, ఎంఐఎం పార్టీలు రాష్ట్ర విభజనను వ్యతిరేకించాయి. కాంగ్రెస్ తరఫున హాజరైన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తే గాదె వెంకటరెడ్డి మాత్రం సమైక్యాంధ్ర వాణి వినిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ వైఖరిని వెల్లడించాలంటూ వైకాపా నాయకుడు ఎంవి మైసూరారెడ్డి, సిపిఎం నాయకుడు బివి రాఘవులు, సిపిఐ నాయకుడు కె.నారాయణ, బిజెపి నాయకుడు కిషన్‌రెడ్డి, ఎంఐఎం లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ గట్టిగా డిమాండ్ చేయటంతో సమావేశం ప్రారంభంలోనే కొంత గందరగోళం నెలకొంది. నార్త్ బ్లాక్‌లోని షిండే కార్యాలయంలో దాదాపుగంట సేపు జరిగిన సమావేశంలో ఎనిమిది పార్టీలకు చెందిన పదహారు మంది ప్రతినిధుల్లో దాదాపు పది మంది ప్రసంగించారు. షిండే రావటం ఆలస్యం కావడంతో సమావేశం పావుగంట ఆలస్యంగా ప్రారంభమైంది. సమావేశం ప్రారంభం కాగానే మిగతా పార్టీల నేతలంతా ఒకేసారి మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని వెల్లడించాలని పట్టుపట్టడంతో సమావేశంలో గందరగోళం నెలకొన్నది. మీరు నాకు ఆదేశాలిస్తే ఎలా? అని షిండే ప్రశ్నించారు. కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించకుండా అఖిలపక్ష సమావేశం నిర్వహించటంలో అర్థం లేదంటూ వామపక్షాల నేతలు వాకౌట్ చేసేందుకు సిద్ధంకాగా కిషన్‌రెడ్డి తదితరులు జోక్యం చేసుకుని వారించారు. అనంతరం మాజీ స్పీకర్ జి.సురేష్ రెడ్డి మాట్లాడుతూ తాము తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటున్నామని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడుతోంది కాంగ్రెస్ పార్టీ అనేది మరిచిపోరాదన్నారు. దీనిపై మైసూరారెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలమని భావించాలా? అని అడగ్గా గాదె వెంకటరెడ్డి లేదంటూ తల ఊపినట్లు తెలిసింది. దీనిపై షిండే మాట్లాడుతూ సురేష్ రెడ్డి అభిప్రాయాన్ని కాంగ్రెస్ అభిప్రాయంగా ప్రభుత్వానికి నివేదిస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలమని తాను భావిస్తున్నానని షిండే చెప్పినట్లు తెలిసింది. ఆ తరువాత కిషన్ రెడ్డి మాట్లాడుతూ వీలున్నంత త్వరగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదిస్తే బిజెపి బలపరుస్తుందని హామీ ఇచ్చారు. బిజెపి నాయకుడు హరిబాబు మాట్లాడుతూ, తెలంగాణ మూలంగా ఆంధ్రకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సిపిఐ నారాయణ మాట్లాడుతూ తమది విశాలాంధ్ర కోసం పోరాడిన పార్టీ కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును డిమాండ్ చేస్తున్నామన్నారు. గుండా మల్లేష్ దీనిని సమర్థించారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని సిపిఎం రాఘవులు స్పష్టం చేశారు.
టిఆర్‌ఎస్ అధినాయకుడు కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ తాము మొదటి నుండి ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నామని, అందుకే ఈ సమస్యను వీలున్నంత త్వరగా పరిష్కరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారా? లేదా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. త్వరగా తేల్చాలని నాయిని నరసింహారెడ్డి అడిగారు. తెలుగుదేశం తరపున కడియం శ్రీహరి, యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పంపించిన సీల్డ్ కవర్‌ను, 2008లో అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖను అందజేశారు. ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయాలని ప్రణబ్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశామంటూ తామిప్పటికీ దీనికే కట్టుబడి ఉన్నామన్నారు. దీనిపై నాయిని స్పందిస్తూ ప్రణబ్‌కు లేఖ రాసిన తరువాత మీ పార్టీ తెలంగాణాపై ‘యు టర్న్’ తీసుకున్నది కదా అని విమర్శించారు. కడియం శ్రీహరి దీనికి బదులిస్తూ ‘తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నాం కదా’ అని అన్నారు. షిండే జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తాము యుపిఏ భాగస్వాములమైనప్పటికీ 2009 డిసెంబర్ 9 తేదీ నిర్ణయం తమకు చెప్పకుండానే తీసుకున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, గత్యంతరం లేని పరిస్థితిలో విభజన జరిపితే హైదరాబాద్ రాజధానిగా రాయల తెలంగాణాను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆ తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరపున సీనియర్ నాయకుడు ఎంవి మైసూరారెడ్డి పార్టీ తరఫున ఒక లేఖను షిండేకు అందజేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ప్రకారం రాష్ట్రాలతో సంబంధం లేకుండానే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాలని లేఖలో సూచించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తమ పార్టీ గౌరవిస్తోందని లేఖలో పేర్కొన్నారు. మైసూరారెడ్డితోపాటు ఆ పార్టీ తరఫున కె.కె.మహేందర్ రెడ్డి అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యారు.