తిరుపతి, డిసెంబర్ 28: ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్నా, నిర్వాహకుల అలసత్వం, తేలికతనం కార్యక్రమాలకు హాజరవుతున్న ప్రముఖులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వారివారి ఆగ్రహాన్ని నిర్వాహకులు చవిచూడాల్సి వస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వ్యవహారం రచ్చకెక్కి తెలుగువారి పరువుతీసే పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని సాంస్కృతిక శాఖా మంత్రి వట్టి వసంతకుమార్ శుక్రవారం అంగీకరించి, ఇక మీదట లోపాలు లేకుండా చూస్తామని చెప్పడం గమనార్హం. తెలుగు మహాసభల నేపథ్య గీతాన్ని రాసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సభలకు దూరంగా ఉండగా, మరోపక్క ఆ గీతాన్ని పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హాజరైనా వేదికపై పాట పాడలేదు. సకాలంలో తనకు సమాచారం ఇచ్చి, సిసలైన ట్రాక్ రికార్డును అందజేయమంటే అధికార్లు పట్టించుకోలేదని నేపథ్య గాయని డాక్టర్ ఎస్ జానకి అలక వహించారు. ఆతిథ్య నిరసనల జాబితాలో కేంద్ర మంత్రి చిరంజీవి కూడా చేరారు. డాక్టర్ శోభారాజ్‌కు కూడా మర్యాద లభించలేదని కినుక వహించారు. మిగిలిన అతిధులనైతే పట్టించుకునే నాధుడే కరవయ్యారు. దీంతో మంచి అంశాలపై ఉన్నత శ్రేణి ప్రముఖులతో ఉపన్యాసాలు ఏర్పాటు చేసినా, అవన్నీ వెలవెలబోతున్నాయి. కార్యక్రమాల స్పష్టత ఉన్నా, అధికారుల మధ్య సమన్వయం లోపించి అది కాస్తా హాజరైన ప్రముఖులకు ప్రాణసంకటంగా మారింది. కార్యక్రమాల్లో తమ ఉపన్యాసం ఖరారైందనే విషయమే కొంతమంది వక్తలకు తెలియకపోవడంతో వారంతా గైర్హాజరయ్యారు. వారి స్థానంలో సన్నద్ధంగా ఉన్న స్థానిక ఉపన్యాసకులతో మమ అనిపిస్తున్నారు. కొంతమంది తమ ఉపన్యాసాలు ఉన్నాయని తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం. ఐదువేల మంది వాలంటీర్లతో హరితదళం (గ్రీన్‌కార్ప్స్) ఏర్పాటు చేసి, సభలకు హాజరైన వారికి మార్గదర్శకంగా ఉండే ప్రయత్నం చేస్తుంటే, వారికి సకాలంలో ఆహారం అందకపోవడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై దళం సమన్వయాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్ సంయుక్త కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దానికి ప్రతిగా వంటలను అందించిన వారిదే తప్పని అధికారులు చేతులు దులిపేసుకున్నారు. అయితే వంటలను అందించిన గాజల్ క్యాటరర్స్ మాత్రం దాన్ని తీవ్రంగా ఖండించింది. నిర్వాహకులదే తప్పని, తమ తప్పు లేదని వారు ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేయడంతో అధికారవర్గం ఇరుకున పడింది. తొలిరోజు తమకు చెప్పింది కేవలం 15వేల మందికి మాత్రమేనని, ప్రతినిధులకు కేటాయించిన భవనంలో సరైన బారికేడింగ్ లేకపోవడం వల్ల కళాకారులతో పాటు బయటివారు, ఇతరులు ప్రవేశించారని దాంతో 40వేల మందికి భోజనాలు కల్పించడం సాధ్యం కాలేదని గాజల్ క్యాటరర్స్ ప్రతినిధి చెప్పారు. ఈ లోపం నిర్వాహకుల వల్లే తప్ప తమవల్ల కాదని పేర్కొన్నారు. గత 30 ఏళ్ల నుంచి 23 రాష్ట్రాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి భోజన వసతి కల్పించామని చెప్పారు.
పొరబాటుకు చింతిస్తున్నాం: మంత్రి
ప్రపంచ తెలుగు మహాసభలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయని, అయితే ఆశించిన దానికంటే ఎక్కువ మంది కళాకారులు హాజరుకావడంతో కొంత అసౌకర్యం జరిగిందని సాంస్కృతిక మంత్రి వట్టి వసంతకుమార్ వ్యాఖ్యానించారు. రానున్న రెండురోజుల్లో ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూసేందుకు ఏర్పాట్లు చేశామని అంటూనే, మహాసభలకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారన్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. 14 దేశాల నుంచి సుమారు రెండు వేలమంది ప్రతినిధులు విచ్చేశారని, వచ్చే మహాసభలను తమ దేశంలో నిర్వహించేందుకు ప్రతిపాదనలు తెచ్చారని పేర్కొన్నారు.
అంగీకరించిన మంత్రి వట్టి ఒకరు రాలేదు, మరొకరు పాడలేదు ప్రముఖుల్లో కోపతాపాలు అందని ఆహారం, వలంటీర్ల లబలబ
english title:
p
Date:
Saturday, December 29, 2012