Clik here to view.

తిరుపతి, డిసెంబర్ 28: తెలుగు భాషాభివృద్ధికి ఏడాది పొడవునా ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే 2013ను సాంస్కృతిక, సాహిత్య సంవత్సరంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు అమలుకు నిర్ణయించింది. దీనికోసం ముందుగా విద్యా సంస్థల్లో ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి కూడా స్పష్టం చేశారు. తెలుగుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు తిరుపతిలో మూడు రోజులపాటు అట్టహాసంగా ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సంగీత, సాహిత్య, నృత్య, జానపద రంగాల్లో తెలుగు విశిష్టతను చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తెలుగుపై యువత, విద్యార్థులకు ఆసక్తి పెంపొందించాలని, అప్పుడే తెలుగు వెలుగులు విరాజిల్లుతాయని అనేకమంది ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోంది. దీనికోసం విద్యా సంస్థలపై దృష్టి పెడితే అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్న తరుణంలో, అన్ని విద్యా సంస్థల్లో ఏడాది పొడవునా తెలుగుపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇదే సమయంలో తెలుగును ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ తప్పనిసరిగా నేర్చుకునేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగు మహాసభల్లో స్పష్టం చేయడం, దీనిపై అధికారులకు కూడా సూచనలు ఇవ్వడంతో ఆ దశగా చర్యలు ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పార్థసారథి కూడా శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ ఏడాది పొడవునా తెలుగు వెలుగులు విరజిమ్మేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, విద్యార్థుల్లో తెలుగు భాషకు ప్రోత్సాహం కల్పిస్తామని వెల్లడించారు. ఇక 2013ను సాంస్కృతిక, సాహిత్య సంవత్సరంగా గుర్తించిన నేపథ్యంలో ఇతర రంగాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏయే రంగాల్లో, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న కోణంలో త్వరలోనే మార్గదర్శకాలు ప్రకటించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం నాడు విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి పార్థసారథి