న్యూఢిల్లీ, డిసెంబర్ 28: తెలంగాణపై చర్చించటానికి జరిగిన అఖిలపక్ష సమావేశం సమస్యను పరిష్కరించటంలో విఫలమైనందకు నిరసనగా శనివారం తెలంగాణ బంద్‌కు తెలంగాణ రాష్టస్రమితి పిలుపు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణపై తమ విధానాన్ని స్పష్టంగా ప్రకటించకుండా గోడమీది పిల్లిలా వ్యవహరించినందునే సానుకూల నిర్ణయం వెలువడకుండా పోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు సమావేశం ముగిసిన తరువాత విలేఖరులకు తెలియచేశారు. సమావేశానికి హాజరుకాకముందే తాను వ్యక్తం చేసిన అభిప్రాయం నూటికి నూరు శాతం నిజమైందని ఆయన చెప్పారు. ఇంతకుముందు జరిగిన సమావేశాల్లో మాదిరి ‘పాడిందే పాడరా..’ అన్నట్టు సాగిందని ఆయన వ్యంగ్యంగా చెప్పారు. హోంమంత్రి షిండేకు తెలంగాణ అంశంపై అవగాహన లేదని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని ఆయన మరో కంటి తడుపు చర్యగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఒక వృధా కసరత్తు చేసిందని చెబుతూ, తామేమీ సాధించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆయన అభిప్రాయ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో కూడా తన విధానాన్ని స్పష్టం చేయలేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ తరపున హాజరైన ప్రతినిధులు భిన్న స్వరాలను వినిపించారని ఆయన తెలియచేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పంపిన లేఖలో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి తమ పొలిట్‌బ్యూరో తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తూ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి పంపిన లేఖను ఉపసంహరించుకోలేదనీ, ఆ లేఖ ప్రభుత్వం వద్దే ఉందని చెప్పారే తప్పించి తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశం మద్దతు ప్రకటిస్తోందని చెప్పకుండా తప్పించుకున్నారని ఆక్షేపించారు. రాజ్యాంగంలోని 3వ అధికరణ మేరకు రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిసి ఉంచాలన్నా పూర్తి అధికారాలు కేంద్రానికే ఉన్నందున, సమస్యకు తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కోరుతూ లేఖ ఇచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ చేతులు దులుపుకొందని ఆయన తెలియచేశారు.
నెల రోజుల్లో తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని హోంమంత్రి షిండే చేసిన ప్రకటనపై ఆయన మండిపడ్డారు. ‘ఇప్పటికీ చాలా నెలలు గడిచిపోయాయి. వెయ్యిమంది పిల్లలు ప్రాణాలను అర్పించారు. పరిస్ధితి మరింత ఉద్ధృతమయ్యే అవకాశాలున్నాయి’ అని ఆయన చెప్పారు. నెలరోజుల పాటు నిరీక్షించవలసిన అవసరం లేనేలేదని వాదించారు. అఖిలపక్ష సమావేశం ముగిసిన తరువాత ప్రధానితో చర్చించి ఇప్పటికిప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించవచ్చునని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశం తనకు పూర్తి నిరాశను మిగిల్చిందని ఆయన చెప్పారు. తమ మద్దతుదారులు, అనుబంధ సంస్థలతో సంప్రదించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని కెసిఆర్ ప్రకటించారు.
అందుకే అఖిలపక్షంలో స్పష్టత లేదు.... కెసిఆర్ విమర్శలు
english title:
a
Date:
Saturday, December 29, 2012