Clik here to view.

కరీంనగర్, డిసెంబర్ 28: తెలంగాణ అంశంపై తెలుగుదేశం ఇచ్చిన లేఖతో తెరాస గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, కెసిఆర్‌లో వణుకు మొదలైందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘వస్తున్నా.. మీ కోసం’ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా ఓదెల మండలం
గుంపుల, జమ్మికుంట మండలం తణుగుల, వావిలాల, నగరం గ్రామాల్లో పాదయాత్ర ముగించుకొని వరంగల్ జిల్లాలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా వావిలాలలో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై స్పష్టమైన వైఖరి వెల్లడించినా, తెరాస అధినేత కెసిఆర్ పదే పదే టార్గెట్ చేస్తే బలమైన క్యాడర్ కలిగిన టిడిపి ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోబోదని ఖబడ్దార్ అంటూ ఒకింత తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తెలుగుదేశం ప్రజల్లో ఉండే పార్టీ కాబట్టే మమ్మల్ని చూసి తెరాస, వైఎస్సార్సీపీలు భయపడుతున్నాయని చెప్పుకున్నారు. 2008 లేఖకు కట్టుబడి ఉన్నామని అఖిలపక్ష భేటిలో స్పష్టత ఇచ్చింది తాము మాత్రమేనని, దాన్ని విస్మరించి టిడిపిని నమ్మరంటూ కెసిఆర్ మాట్లాడుతున్నారని, టిడిపిని నమ్మకపోతే ఆరు నెలలు ఫాం హౌజ్‌ల్లో కుంభకర్ణుడిలా నిద్రపోయి లేచి దొంగనాటకాటలాడే కెసిఆర్‌ను నమ్ముతారా? అంటూ ప్రశ్నించారు. ఎవరు నమ్మినా నమ్మకున్నా ప్రజలు నమ్మితే చాలని అభిప్రాయపడ్డారు. ప్రజల పక్షాన పోరాడుతున్న టిడిపిని అంతం చేయడం టిఆర్‌ఎస్ కాదుకదా ఎవ్వరి తరం కాదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యతనిస్తుందో అఖిలపక్ష భేటికి తాము పంపిన అభ్యర్థులే చక్కటి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.