హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ వ్యాప్తంగా శనివారం బంద్ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పిలుపునివ్వడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బంద్ సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో ఆందోళనకు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించనందుకు నిరసనగా తెలంగాణ బంద్‌కు తెరాస అధినేత కెసిఆర్ పిలుపు ఇచ్చారు. దీంతో శనివారం బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎపిఎస్‌పి, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆయా జిల్లాల పోలీసు సిబ్బందిని భద్రతకు వినియోగిస్తున్నారు. చాలా రోజుల తర్వాత బంద్ జరుగుతున్నందున దాని ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బంద్‌కు ఒయు విద్యార్థి జెఎసి, పలు ఇతర ప్రజా సంఘాలు, తెలంగాణ ఫిలిం చాంబర్ మద్దతు ప్రకటించాయి. బంద్ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో పగటి పూట ఆటలు నిలిపి వేసి రాత్రిపూట రెండు ఆటలే ప్రదర్శిస్తామని తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ప్రకటించారు. ఉస్మానియా యూనివర్శిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను మోహరింప చేస్తున్నారు. గతంలో గొడవలు జరిగిన అన్ని ముఖ్య ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతానికి అదనపు బలగాలను రప్పించకపోయినా బంద్ సందర్భంగా భద్రతకు నగరంలో ఉన్న సిబ్బందిని వినియోగించనున్నారు. బంద్ తీవ్రతను బట్టి పోలీసులు వ్యూహం రూపొందించారు. బస్ స్టేషన్లు, ముఖ్యమైన కూడళ్ల వద్ద ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు ఏర్పాట్లు చేశారు. బంద్ సందర్భంగా అప్పటి పరిస్థితిని బట్టి బస్సులను నడపాలని ఆర్టీసి నిర్ణయించింది. నగరంలో సిటీ సర్వీసులతో పాటు జంటనగరాల నుంచి బయలుదేరే దూరప్రాంత సర్వీసులను అప్పటి పరిస్థితిని బట్టి రద్దు చేయడమా.. లేక పోలీసుల రక్షణ మధ్య నడపాలా అనేది నిర్ణయిస్తామని ఆర్టీసి వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు పలికిన టిఎంయు, ఈయూలు ఆర్టీసి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించినందున విధులకు హాజరవుతారా లేదా అనేది వేచిచూడాల్సి ఉందని చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో బందోబస్తు
english title:
n
Date:
Saturday, December 29, 2012