న్యూఢిల్లీ, డిసెంబర్ 28: తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అనుకూలమని తాను భావిస్తున్నానంటూ హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే శుక్రవారం అఖిలపక్ష భేటీలో ప్రకటించినట్టు తెలిసింది. షిండే అఖిలపక్షం సమావేశంలో మాట్లాడిన తీరు పరిశీలిస్తే కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణకు అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయటమా? లేక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటమా? అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నెల రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామని హోంమంత్రి షిండే ప్రకటించిన నేపథ్యంలో, యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ఈ రెండింటిలో ఏదోక దాన్ని ఖరారు చేసి ప్రకటించవచ్చని భావిస్తున్నారు. షిండే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తూనే, కౌన్సిల్ ఏర్పాటునూ ప్రస్తావించటం చర్చనీయాంశమైంది. నార్త్ బ్లాక్‌లోని షిండే కార్యాయంలో ఉదయం పదిన్నర గంటలకు అఖిలపక్ష సమావేశం ప్రారంభంకాగానే వామపక్షాలు, బిజెపి, వైకాపా, ఎంఐఎం పార్టీల నేతలు తెలంగాణా ఏర్పాటుపై కాంగ్రెస్ వైఖరి ఏమిటనేది మొదట స్పష్టం కావాలని డిమాండ్ చేశారు. ఆ తరువాతే చర్చ ప్రారంభించాలని పట్టుపట్టారు. దీంతో కాంగ్రెస్ ప్రతినిధి జి సురేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును కాంగ్రెస్ కోరుకుంటోందని చెప్పారు. ఈ దశలో షిండే జోక్యం చేసుకుని ‘కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్టు భావిస్తున్నాను’ అని వ్యాఖ్యానించినట్టు ప్రతిపక్షం నేతలు సమావేశం తరువాత మీడియాకు వెల్లడించారు. ఎనిమిది పార్టీల ప్రతినిధులు తమ పార్టీ విధానాలను వివరించిన అనంతరం షిండే ముగింపు ఉపన్యాసం ఇస్తూ గూర్కాలాండ్ వివాదాన్ని ప్రస్తావించారు. ప్రత్యేక గూర్కాలాండ్ కావాలనే డిమాండ్ పెద్దఎత్తున వచ్చినా, కొన్ని కారణాల వల్ల గుర్కాహిల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అఖిల పక్ష సమావేశంలో చెప్పారు. ‘తెలంగాణ విషయంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏదోక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం’ అని స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది. ‘యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ తీసుకునే నిర్ణయం కొందరికి నచ్చవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించటం కూడా చర్చనీయాంశమైంది. రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన తనకు అక్కడి పరిస్థితులు కొంతవరకు తెలుసునని షిండే వ్యాఖ్యానించారు.
కెసిఆర్‌తో ముఖాముఖి
అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావుతో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పది నిమిషాల పాటు విడిగా మాట్లాడారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రశేఖరరావును కలుసుకోలేదు. అందుకే ఇప్పుడు ఆయనతో విడిగా మాట్లాడుతున్నానని షిండే ఇతర నేతలతో చెప్పారు. తరువాత ఇరువురు నేతలూ దాదాపు పది నిమిషాలపాటు విడిగా చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు తెలంగాణ ఏర్పాటు సమస్య గురించి ప్రధానంగా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు.
తెలంగాణపై యూపీఏ ఆలోచన షిండే ‘అనుకూల’ ప్రకటనతో సరికొత్త అనుమానాలు భేటీలో గూర్కాహిల్ కౌన్సిల్ ప్రస్తావన కెసిఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం
english title:
v
Date:
Saturday, December 29, 2012