నెల్లూరు, డిసెంబర్ 27: ప్రస్తుత సంవత్సరం ఎదురైన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధఃపాతాళానికి చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పాలక పార్టీగా వెలుగొందుతున్నా ఉపపోరులో మాత్రం విజేతలైన అభ్యర్థులకు సమీప ప్రత్యర్థిగా కూడా నిలబడలేకపోవడం రాజకీయంగా తీవ్ర వెనుకబాటుకు నిదర్శనం. ఈ ఏడాది మార్చి 18న కోవూరు, ఆ తరువాత జూన్ 12న ఉదయగిరి నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కంభం విజయరామిరెడ్డి తృతీయ స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గంతోపాటు నిర్వహించిన నెల్లూరు లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్‌పార్టీ పేరుకు ద్వితీయ స్థానంలో నిలిచినా ఓట్ల తేడా ఆధిక్యత భారీగా ఉండటం గమనార్హం. ఈ ఉప ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు తిక్కవరపుసుబ్బరామిరెడ్డి బరిలో నిలిచినా సుమారు మూడు లక్షల ఓట్ల వ్యత్యాసంతో ఘోర పరాజయం పాలయ్యారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంతో జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి తేటతెల్లం. కాంగ్రెస్‌కు జిల్లాలో స్థితిగతులు ఇలా ఉంటే పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలది రెండు వేర్వేరు మార్గాలుగా ఉండటం విడ్డూరకరం. ఆనం సోదరుల వెంటే నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి కూడా కొనసాగుతున్నారు. సర్వేపల్లి శాసనసభ్యులు ఆదాల ప్రభాకరరెడ్డి మాత్రం వీరితో అంటీముట్టని రీతిలోనే కొనసాగుతున్నారు. కాగా, జిల్లాలో నాలుగు మినహా అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు కొలువుదీరాయి. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహించే ఆత్మకూరు నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ సహా జిల్లాలోని నెల్లూరు, ఉదయగిరి, కావలి కమిటీలకు పాలకవర్గాలు ఎప్పుడు నియమిస్తారనేది అంతుపట్టడం లేదు. ఇలా అడుగడుగునా అధికార కాంగ్రెస్ ప్రజల్లో పలచన కావడం, పార్టీ నేతల నడుమ తీరని అంతఃకలహాలు వెంటాడుతున్నాయి. సమీప భవిష్యత్‌లో పార్టీ పరిస్థితి పునరుద్దరణకు నోచుకోవాలంటే ఎంతైనా సందేహాస్పదమేనని రాజకీయ పండితుల విశే్లషణ. ఏడాది చివరిలో వెలువడ్డ సహకార ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌పార్టీ తమ పట్టు పదిలపరచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియమావళి విడుదలైంది. కాంగ్రెస్ మద్దతుదార్లయిన అభ్యర్థులే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరగనున్న సహకార ఎన్నికల్లో గెలుపొందే అవకాశాలున్నాయని సాక్షాత్తు విపక్ష నేతలే అంగీకరిస్తున్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగుపడ్డా ఆ ఫలితాలే ఆక్సిజన్‌గా తరువాత పరిస్థితులు ఎలా చక్కదిద్దుకోగలరనేది పార్టీ పెద్దలకే తెలియాలి.
మహిళలపై దాడుల నిరోధానికి
పటిష్ట చట్టాలు రావాలి
గూడూరు, డిసెంబర్ 27: మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకొనాలని సునీతా సేవా సంస్థ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి పేర్కొన్నారు. గురువారం సంస్థ కార్యాలయంలో సమాజంలో మహిళపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలపై వివిధ వర్గాల వారితో నిర్వహించిన చర్చా వేదికలో సులక్ష్మి మాట్లాడుతూ మహిళలపై వయోభేధం లేకుండా చిన్న పిల్లల నుండి వృద్థుల వరకు లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురి అవుతున్నారన్నారు. ప్రముఖ మహిళా న్యాయవాది చక్రాల శార్వాణీ మాట్లాడుతూ అత్యాచార నేరాలపై ప్రత్యేక కోర్టులను నియమించి కేసులు త్వరితగతిన పరిష్కరించి నేరస్థులను కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రముఖ విద్యావేత్త కోడూరు సీతాదేవి మాట్లాడుతూ అత్యాచారం, యాసిడ్ దాడులకు పాల్పడిన నేరస్థులను కఠినంగా శిక్షించాలన్నారు. మహిళా వైద్యురాలు సి రోహిణి తన ప్రసంగంలో మనుషులు మానవ మృగాలుగా మారడానికి మద్యపానం మొదటి కారణమన్నారు. వ్యవసాయ శాఖ ఎడి ఉషారాణి మాట్లాడుతూ మహిళల ఆత్మరక్షణకు విద్య ఎంతో అవసరమని అన్నారు. మహిళా పోలీస్ స్టేషన్‌లను ఎక్కువగా స్థాపించి బాధిత మహిళలకు సత్వర న్యాయం జరగాలన్నారు. ఐసిడిఎస్ గూడూరు రూరల్ ప్రాజెక్టు సిడిపిలో ప్రమీలారాణి మాట్లాడుతూ మహిళలు బయట ప్రదేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో లయోలా కళాశాల విద్యార్థినులు, అన్ని వర్గాల మహిళలు పాల్గొన్నారు.
జగన్ విడుదల కావాలని కోటి సంతకాల సేకరణ
నెల్లూరుసిటీ, డిసెంబర్ 27: జగన్ విడుదల చేయాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాలను సేకరించి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి అందచేస్తున్నట్లు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి బయటవుంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు నామరూపాయలు లేకుండా పోతాయనే ఉద్దేశంతో కక్ష సాధింపుగా బెయిల్ రానివ్వకుండా అడ్డుకుని పావులు కదపుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్‌రెడ్డి జైలు గోడలు బద్దలు కొట్టుకుని నిజాయితీగా బయటకువస్తారని పేర్కొన్నారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ శాసన సభలో సంఖ్యను బట్టి ప్రధాన ప్రతిపక్షం అనిపించుకుంటున్న తెలుగుదేశం పార్టీలు కలిసి గడిచిన మూడేళ్ళలో ప్రజలకు చేసిన మేలు ఏమి లేదన్నారు. రాష్ట్రంలో పరిపాలన లేదని, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పోలీసు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న సిబిఐని ఉపయోగించుకుని రాష్ట్రంలో భయానకవాతావరణాన్ని స్పష్టిస్తున్నారని తెలిపారు. అక్రమంగా కేసులు, అన్యాయంగా అరెస్టులు చేయడం తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. జెడీ ఓ ప్రొఫెషనల్ పోలీసు అధికారిలా కాకుండా పాత కక్షలున్న ఫ్యాక్షనిస్టులా ప్రారంభించారు. టీవీ ధారావాహిక మాదిరిగా చార్జీషీట్లు దాఖఆలు చేయటం, పారిశ్రామిక సంస్థలకు విధానంగాలో భాగంగా ప్రభుత్వం నుంచి లభించిన అనుమతులను అక్రమంగా వక్రీకరించి ఏ అవకాశాన్ని జారవిడుచుకోకపోవటం, ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా దేశం అంతటికి ఒక చట్టాలు జగన్మోహన్‌రెడ్డికి మాత్రమే వేరే సూత్రాలు వరిస్తాయనన్నట్టు సిబిఐ వ్యవహరిస్తుందన్నారు.
-ళనఆ
కన్నుల పండుగగా అయ్యప్పస్వామి నగరోత్సవం
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 27: స్థానిక వేథాయపాళెం సెంటర్‌లోని అయ్యప్పస్వామి దేవస్థానంలో స్వామి అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల పూజల సందర్భంగా గురువారం రాత్రి అయ్యప్పస్వామి నగరోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేదాయపాళెం నుండి ఉదయం బయలుదేరిన ఉత్సవం నవాబుపేట శివాలయానికి చేరుకుంది. అనంతరం రాత్రి మేళతాళాలు, భాజాభజంత్రీలు, కేరళ పంచవాద్యాలు, భక్తుల జయజయధ్వానాలు, బ్యాండ్ మేళం, వివిధ దేవతల వేషధారణల మధ్య నవాబుపేట, స్టోన్‌హౌస్‌పేట, ఆత్మకూరు బస్టాండ్, కనకమహల్, ఏసిసెంటర్, గాంధీబొమ్మ, ఆర్టీసి, దర్గామిట్ట, ట్రంకురోడ్డు మీదుగా తిరిగి వేదాయపాళెం వరకు సాగింది. మండల పూజల్లో భాగంగా ఉదయం నిర్మాల్యదర్శనం, పాలాభిషేకం, మహాగణపతి హోమం, ఉషఃపూజ, శీవేలీ ఉత్సవం, కలశపూజ, నవకాభిషేకం, ఉచ్ఛపూజ, చేశారు. అనంతరం నగర శాసనసభ్యులు ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి ఉభయకర్తగా ఏర్పాటుచేసిన అన్న సంతర్పణలో వందలాదిగా అయ్యప్ప భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం అయ్యప్పస్వామి మూలవర్లకు విశేషపూలంగిసేవ, దీపాలంకరణ, మహాదీపారాధన, భగవతిసేవ, రాత్రి అత్తాళంపూజ, శీవేలీపూజ, పడికర్పూర దీపం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇరుముడి కట్టుకుని శబరిమలైకు బయలుదేరే పలువురు భక్తులు అయ్యప్పదేవస్థానానికి చేరుకుని కర్పూరజ్యోతులు వెలిగించి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. అనంతరం శరణుఘోష చేస్తూ శబరిమలకు బయలుదేరారు. మండల పూజల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబుచేశారు. ఈకార్యక్రమాల్లో అధ్యక్షులు పిటి రంగరాజన్, ఉపాధ్యక్షులు బాలుస్వామి, కె సూర్యనారాయణరెడ్డి, కార్యదర్శి జి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. వందలాదిగా భక్తులు అయ్యప్పస్వామి దర్శనానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించాయి.
అఖిలపక్ష సమావేశంలో సీమాంధ్రవాదం వినిపించాలి
* సీమాంధ్ర యువజన, విద్యార్థి జాక్
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 27: శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి షిండేతో నిర్వహించే అఖిలపక్ష భేటీలో సీమాంధ్ర ప్రాంత రాజకీయ పార్టీల ప్రతినిధులు సీమాంధ్ర వాదం వినిపించాలని సీమాంధ్ర యుజవన విద్యార్థి జెఎసి రాష్ట్ర కన్వీనర్ ముక్కు రాధాకృష్ణ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సీమాంధ్ర వాదాన్ని వినిపించని రాజకీయ పార్టీలకు పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇకనైనా ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వాలన్నారు. సమైక్యవాదం పేరుతో లగడపాటి, రాయపాటి, శైలజానాథ్ లబ్ధి పొందాలని చూస్తే తాము చూస్తూ ఊరుగోబోమన్నారు. 28 తర్వాత సీమాంధ్ర మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు, యువజన, మహిళా సంఘాలతో నెల్లూరులో పెద్ద ఎత్తున చైతన్య సదస్సు నిర్వహిస్తామని రాధాకృష్ణ తెలిపారు.
డిఇఓ నియంతృత్వ ధోరణికి నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన
* దిష్టిబొమ్మ దగ్ధం
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 27: ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ అవినీతికి పాల్పడుతున్న జిల్లా విద్యాశాఖాధికారి తన నియంతృత్వ ధోరణిని మార్చుకోవాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహించి డిఇఓ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ పి కిరణ్ మాట్లాడుతూ డిఇఓ ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాడన్నారు. అవినీతి డిఇఓను తక్షణమే విధులనుండి తొలగించాలని, ఆయన విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిఇఓ నియంతృత్వ విధానాలపై విద్యార్థి సంఘాలు పోరాటం కొనసాగిస్తాయని చెప్పారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టివివి ప్రసాద్ మాట్లాడుతూ డిఎస్‌ఇ కౌన్సిలింగ్‌ను డిఇఓ తన ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారన్నారు. కౌనె్సలింగ్‌ను వాయిదా వేయడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారన్నారు. ఈకార్యక్రమంలో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, సందీప్, మహేష్, రాము, సుధీర్, చిన్న, కల్యాణ్,చైతన్య, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 27: ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, తెలంగాణ, రాయలసీమ పేర్లతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తే తెలుగు ప్రజలు ఆయా పార్టీలకు తగిన బుద్ధి చెపుతారని టాక్స్‌బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆర్‌వి శేషయ్యనాయుడు అన్నారు. కేతా అంకులు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం సుబేదారుపేలో ఆంధ్రరాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని కోరుతూ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శేషయ్యనాయుడు మాట్లాడుతూ ఆంధ్రాకంటే తెలంగాణా అన్ని రంగాల్లో అభివృద్థి చెందిందన్నారు. ఇంజనీర్ సీతారామస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరారు. ఈకార్యక్రమంలో దుర్గం మధుసూధన్, అన్నపూర్ణ, కేతా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
చదరంగం విజేతలకు అభినందనలు
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 27: ఇటీవల మహారాష్టల్రోని తానే జిల్లాలో నిర్వహించిన 58వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ చెస్ చాంఫియన్‌షిప్ పోటీల్లో విజేతలై బంగారు, కాంశ్య పతకాలను కైవసం చేసుకున్న కె మనోజ్‌కుమార్, వి పృథ్వీకుమార్‌ను గురువారం స్థానిక అమరావతి సమావేశ మందిరంలో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పలువురు ప్రముఖులు అభినందించారు. విజేతలకు 2వేల రూపాయల నగదుప్రోత్సాహక బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపికలు అందచేశారు. అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. చెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వై సుమన్, పలువురు క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.