విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 29: జిల్లా ప్రజానీకానికి సకాలంలో సేవలు సమర్థవంతంగా అందించాలని జిల్లాకలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య కోరారు. శనివారం ఇక్కడ జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన మండల ప్రత్యేక అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు వారి పరిమితులు, నిబంధనలకు లోబడి న్యాయబద్దంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే అవకాశాన్ని కల్పించామన్నారు. ప్రతి అధికారి అంకితభావంతో పనిచేయడంతోపాటు కిందస్థాయి సిబ్బందితో పనిచేయించాలన్నారు. నిర్ణయాలు తీసుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. జెడ్పీ సిఇఒ ఎన్.మోహనరావుమాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కనీస వౌలిక సదుపాయాలు అందించడంలో ప్రత్యేక అధికారులు కీలక పాత్ర వహించాలన్నారు. ఆడిట్ అభ్యంతరాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆర్థిక లావాదేవీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామీణ ప్రజలకు వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని కోరారు. వివిధ మండలాలకు చెందిన ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
‘ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలి’
పూసపాటిరేగ, డిసెంబర్ 29 : సమాజంలో ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక చింతనను అలవర్చు కోవాల్సిన అవససం ఉందని గుంటూరు జిల్లా నంబూరు కళీవన్నాశ్రమాధిపతి కళీప్రసాదమాతాజీ హితవు పలికారు. మండలంలోని గోవిందపురం సమీపానగల ముక్త్ధిం క్షేత్రంలో కనకదుర్గమ్మ మండలారాధన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యమానికి వచ్చిన వివిధ మఠాధిపతులు, ఫీఠాధిపతులు సాధువులు,రాజకీయ ప్రముఖులతో ముక్త్ధిం క్షేత్రం కిటకిటలాడింది. కనకదుర్గమ్మ అస్తమించి 40 రోజులు అయిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు గోవిందపురం మాజీ సర్పంచ్ విక్రం జగన్నాధం తెలిపారు. ఈసృష్టికి మూలం అమ్మేనని, వక్తలు అభిభాషించారు. కనకదుర్గమ్మ పరమపదించడంతొ ముక్త్ధిం క్షేత్రపాలనా బాధ్యతలను ఆమె రెండో కుమారుడు శివగిరిబాబాకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. తెనాలికి చెందిన అష్ఠ లక్ష్మిపీఠాధిపతి శ్రీదండిస్వామలు, శ్రీకాళహస్తికి చెందిన శుకబ్రహ్మశ్రమ ఉత్తర పీఠాధిపతి సంపూర్ణానందగిరి కాశీ మలయాళస్వామి పీఠాధిపతి పరమాత్మనందగిరి, ఎమ్మెల్యే అప్పలనాయుడు, మాజీ మంత్రి పి.నారాయణ స్వామినాయుడు, మంత్రి వట్టి వసంత్‌కుమార్ భార్య ఉమావసంతకుమార్, కనకదుర్గమ్మ కుటుంబ సభ్యులు, జిల్లా వినియోగదారుల మండలి న్యాయాధికారి గంటా అప్పలనాయుడు, భక్తులు పాల్గొన్నారు.
పల్లెవెలుగు బస్సుల్లో
తనిఖీలు...
అభిప్రాయ సేకరణ
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 29: జిల్లాలో పల్లెవెలుగుబస్సులు తిరిగే ప్రధానమైన అయిదురూట్లలో మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ విజయనగరం రీజియన్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్ కొటాన శ్రీనివాసరావుతెలిపారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సేవలపై ఆరా తీశారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని బస్‌స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయనగరం-రాజాం, విజయనగరం-అనకాపల్లి, సాలూరు-విజయనగరం, విజయనగరం-పార్వతీపురం, శృంగవరపుకోట వయా ధర్మవరం మీదుగా విజయనగరం రూట్లలో తిరిగే పల్లెవెలుగు బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ, బృంద తనిఖీలు, టిక్కట్‌లేని ప్రయాణికుల గుర్తింపు, దొంగ పాసుల గుర్తింపుతదితర కార్యక్రమాలను చేపడతామన్నారు. ప్రతిస్టేజ్ వద్ద ఇద్దరు చొప్పున ఆర్టీసీ అధికారులను ఉంచుతామన్నారు. ఈ ప్రక్రియను వచ్చేనెల మొదటివారం నుంచి చేపడతామన్నారు. ప్రయాణికుల అభిప్రాయ సేకరణ ప్రకారం బస్సుల రాకపోకలల్లో సమయపాలన పాటించడంతోపాటు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రూట్లలో గిఫ్ట్‌స్కీమ్‌లను ప్రవేశపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో బస్‌స్టేషన్‌మేనేజర్ ముత్తిరెడ్డి సన్యాసిరావుతదితరులు పాల్గొన్నారు.
యువకుడి దారుణ హత్య
కొత్తవలస, డిసెంబర్ 29 : మండలంలోని చీడివలస పంచాయతీలో గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామస్తులతోపాటు మండల ప్రజానికం ఒక్కసారిగా భయభ్రాంతుకు గురయ్యారు.వివరాల్లోకి వెళ్తే కొత్తవలస నుంచి కోటపాడు వెళ్లె మార్గంలో చీడివలస గ్రామం వద్ద ఉన్న ఒక ప్రైవేటు లేఅవుట్‌లో యువకుని మృతదేహం ఉన్నట్లు ఆగ్రామానికి చెందిన పశువుల కాపరులు గ్రామ తలయారికీ తెలియసారు. తయారీ ఇచ్చి సమాచారం మేరకు చీడివలస విఆర్‌ఒ కె దేముడు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి యువకుడు హత్యకు గురైనట్లు నిర్ధారించుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విఆర్‌ఒ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై డి రమణయ్య తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని యువకుని హత్యపట్ల వివరాలు సేకరింస్తున్నారు. యువకుని వయస్సు 25 నుండి 35 సంవత్సలు ఉంటుందని గుర్తించారు. యువకుని తలపై కర్రలతో కొట్టిన గాయాలు గుర్తించారు. ముఖంపై బలమైన గాయాలు ఉండటంతో గుర్తుపట్టడానికి కూడా వీలులేకుండా పోయింది. ఈహత్య శుక్రవారం రాత్రి జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తాన్నారు.
గుబాళించిన సాహితీ సౌరభాలు
- కల్చరల్ -
విజయనగరం(కల్చరల్), డిసెంబర్ 29 : వివిధ సాహితీ కార్యక్రమాలకు వేదికగా 2012 నిలిచి సాహితీ సౌరభాలను వెదజల్లింది. గురజాడ 150 వ జయంతి నిర్వహణ, వివిధ పురస్కారాల ప్రదానం వంటివి చోటు చేసుకుని సాహితీ రంగాన్ని శోభితం చేశాయి. మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ మహాకవి రచించిన దేశభక్తి గేయాన్ని 16 భాషల్లో అనువదించిన పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పట్టణంలో గురజాడ జయంతి వేడుకలు సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు జరిగాయి. గురజాడ స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఉత్సవాలను ప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంత్‌కుమర్ ప్రారంభించారు. ఎం.పి. బొత్స ఝాన్సీలక్ష్మి గురజాడపై పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు. మే నెలలో గురజాడ-కన్యాశుల్కం నాటకం అంశంపై సదస్సుజరిగింది. ఇందులో డాక్టర్ చాట్ల శ్రీరాములు, సినీనటులు గొల్లపూడి మారుతీరావు, రావి కొండలరావు, జెవి రమణమూర్తి మున్నగువారు పాల్గొన్నారు. నవంబరు 30వ తేదీన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నాటకరంగ ప్రదర్శకులు నటుడు, రచయిత డాక్టర్ చాట్ల శ్రీరాములుకు గురజాడ సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. జనవరి నెల 17వ తేదీన చాసో స్ఫూర్తి సాహితీ ట్రస్ట్ మహరాజా లేడీస్ రిక్రియేషన్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో కథారచయిత ఎ.ఎస్. జగన్నాథశర్మను చా.సో సాహితీ పురస్కారంతో సత్కరించారు. ఆత్రేయ కళాపీఠం జనవరి 29న గురజాడ కళాభారతిలో నిర్వహించిన సభలో ప్రఖ్యాత చలన చిత్ర సంగీత దర్శకుడు యనమండ్ర మణిశర్మకు కీ.శే. వేటూరి సినీసంగీత విభావరి పురస్కారం అందజేశారు. ఫిబ్రవరి నెల మొదటి వారంలో సినీనటుడు జయప్రకాష్‌రెడ్డి ఆలెగ్జాండర్ ఏకపాత్రను అద్భుతంగా ప్రదర్శించారు. నందన ఉగాది రోజున సాహితీ మిత్ర సమాఖ్య విజయభావన హైదరాబాద్‌కు చెందిన రచయిత్రి అరుణావ్యాస్‌కు ఉగాది పురస్కారం అందజేశారు. మే నెలలో సాహిత్య, సాంస్కృతిక సంస్థ కౌముదీ పరిషత్ లయన్స్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన సభలో ప్రఖ్యాత నటుడు చిమ్మపూడి శ్రీరామమూర్తి విలక్షణ సంగీత అవధానం చేశారు. డాక్టర్ పి.వి.రాజు స్మారక కళాపీఠం నిర్వహణలో గురజాడ కళాభారతిలో నాటిక ప్రదర్శనలు జరిగాయి. అక్టోబర్ 30న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరిగింది. కొద్ది రోజుల క్రితం జిల్లా స్థాయి తెలుగుమహాసభలు ఉత్సాహంగా జరిగాయి. తెలుగుదనం ఉట్టిపడే విధంగా కార్యక్రమాలు జరిగాయి.
అత్యాచార యువతి మృతిపై
నిరసనల హోరు
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 29: ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితరాలి మృతికి జిల్లాల్లో నిరసనల హోరెత్తింది. పలు స్వచ్చంద సంస్ధలు, విద్యార్థి, యువజన సంఘాలు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించాయి. యువతిపై జరిగిన అత్యాచార సంఘటనను ముక్తకంఠంతో ఖండించాయి. మరే మహిళపై ఇలాంటి సంఘటనలు జరగకుండా అత్యాచారానికి పాల్పడినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్), అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్), భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఐఎఫ్), అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సంఘం (ఐద్వా) , సురాజ్య ఉద్యమం, జనవిజ్ఞాన వేదిక తదితర సంఘాల నేతృత్వంలో విజయనగరం పట్టణంలో శనివారం ప్రదర్శనలు, రాస్తారోకోలు జరిగాయి. ,విద్యార్థులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. అనంతరం కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను ఆందోళనకారులు దగ్థం చేశారు. ఈ సందర్భంగా ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ యువతిపై అత్యాచారానికి పాల్పడినవారిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
‘రాష్ట్ర విభజన వద్దు’
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 29:4రాష్ట్ర విభజన వద్దు-సమైక్యమే ముద్దు2 అంటూ శనివారం ఇక్కడ ఆర్టీసీ కాంప్లక్స్ చేపట్టిన సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. జిల్లా సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలతోపాటు అనేక మంది స్వచ్చందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన వద్దంటూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ మామిడి అప్పలనాయుడు సమైక్యాంధ్ర జెఎసి సభ్యులు అబ్దుల్వ్రూఫ్ పాల్గొన్నారు.
‘కలెక్టరేట్ ఆవరణను
పరిశుభ్రంగా ఉంచండి’
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 29: కలెక్టరేట్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని, పలు పనులపై కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేవిధంగా తీర్చిదిద్దాలని జిల్లా జాయింట్‌కలెక్టర్ పి.ఎ.శోభ ఆదేశించారు. కలెక్టరేట్ చుట్టూ చెత్తా చెదారం, డెబ్రిస్, పొదలు పేరుకుపోవడంతో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో జాయింట్‌కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో కలెక్టరేట్ ఆవరణలో నిర్వహిస్తున్న క్యాంటీన్ యజమానికి ముందుగా నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న అన్నిశాఖల అధికారులు వారి వారి కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బాధ్యత వహించాలన్నారు. డస్ట్‌బిన్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏరోజు చెత్తను ఆరోజు డంపింగ్‌యార్డుకు తరిలించాలని మున్సిపల్ కమిషనర్ గోవిందస్వామి ఆదేశించారు. చెత్త తరిలించిన సిబ్బంది పరిపాలనాధికారి వద్ద ధ్రువీకరణ పొందాలని ఆదేశించారు. పెరుగుతున్న విద్యుత్‌బిల్లులను దృష్టిలో ప్రతి కార్యాలయంలో వ్యక్తిగత విద్యుత్ మీటర్లు పొందాలన్నారు. విద్యుత్ బకాయిలు 60లక్షల రూపాయల మేరకు పేరుకుపోవడంతో విద్యుత్ పొదుపు పాటించాలన్నారు. డిఆర్‌ఒ వెంకటరావు, పరిపాలనాధికారి చంద్రకిశోర్, ఐసిడిఎస్ ప్రాజెక్టుడైరెక్టర్ రాబర్ట్స్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘తెలుగు భాషాభివృద్ధికి
గురజాడ విశేష కృషి’
విజయనగరం (కంటోనె్మంట్), డిసెంబర్ 29: గ్రాంథిక భాషగ గుర్తింపు పొందిన తెలుగు భాషను సులభతరం చేసి ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చేసేందుకు మహాకవి గురజాడ ఎనలేని కృషి చేశారని ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి వెల్లడించారు. ఎస్.ఎఫ్.ఐ 30 వసంతాల ఉత్సవాలు, 21వ జిల్లా మహాసభల సందర్భంగా రెండవ రోజు శనివారం స్థానిక బిసి స్టడీ సర్కిల్ యూత్ హాస్టల్‌లో స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో కూడిన జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఢిల్లీ విద్యార్థిని మృతికి సంతాపం తెలియజేశారు. అనంతరం గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన 150 జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చాగంటి మాట్లాడుతూ గురజాడ తన కలంతో చెడుపై పోరాటం చేశారని స్పష్టం చేశారు. వందేళ్ల క్రితమే గురజాడ స్ర్తి వంటింటికే పరిమితం కాదని తన కన్యాశుల్కం ద్వారా తెలియుజేశారని తెలిపారు. ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సాంబశివ మాట్లాడుతూ జిల్లా సాహిత్యం, సంస్కృతులకు నిలయమని అన్నారు. ఎంతోమంది కవులను, సాహితీవేత్తలను, మేధావులను అందించిన జిల్లాలో గురజాడ వారసత్వం కొనసాగాలంటే సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్, అధ్యక్షుడు ఎ.అశోక్, డివిజన్ కార్యదర్శ ఎం.గణేష తదితరులు పాల్గొన్నారు.
‘షెడ్యూల్డ్’ గ్రామాల జాబితాపై కేంద్ర మంత్రి దృష్టి
పార్వతీపురం, డిసెంబర్ 29: ఇక్కడి ఐటిడిఎ పరిధిలోని షెడ్యూల్డ్ జాబితాలో చేర్చాల్సిన గిరిజన గ్రామాలకు సంబంధించిన జాబితాను రాష్ట్రప్రభుత్వం ద్వారా తమశాఖకు పదిరోజుల్లోగా నివేదిక అందించాలని కేంద్ర గిరిజన,పంచాయతీరాజ్ వ్యవహారాల మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్ర సూర్యనారాయణదేవ్ ఆదేశించినట్టు పీవో బి ఆర్ అంబేద్కర్ తెలిపారు. శనివారం కురుపాంలోని పేలెస్‌లోకేంద్రమంత్రి దేవ్‌ను పీవో కలిసి ఐటిడిఎ అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రమంత్రికి వివరించారు. ఈసందర్భంగా షెడ్యూల్డ్ జాబితాలో చేర్చేందుకు ప్రతిపాదించిన గిరిజన గ్రామాల వివరాలు మరోపదిరోజుల్లో తమకు పంపాలని సూచించారు. అదేవిధంగా మార్పు కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలోనే డెలివరీలు జరగడానికి వీలుగా మరో అంబులెన్సు పార్వతీపురం ఐటిడిఎకు మంజూరు చేస్తున్నట్టు కేంద్రమంత్రి దేవ్ తెలిపారని పీవో తెలిపారు. పట్టణంలోని వై కె ఎం కాలనీలో నిర్మిస్తున్న గిరిజన మహిళా సమాఖ్య భవనానికి తొలుత ఇచ్చిన ఎంపి ల్యాడ్ నిధులు రూ.6లక్షలే కాకుండా మరోరూ.5లక్షలు మంత్రి మంజూరు చేశారన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య ఆరోగ్యంతో పాటు వ్యవసాయరంగం ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి తాను కేంద్రమంత్రి దేవ్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. గిరిజనాభివృద్ధికి తన వంతు పూర్తిసహాయ సహకారాలు అందిస్తానని మంత్రి దేవ్ హామీ ఇచ్చినట్టు పీవో అంబేద్కర్ తెలిపారు.
ఎస్.కోటపాడులో మూడు ఇళ్లు దగ్ధం
గుమ్మలక్ష్మీపురం, డిసెంబర్ 29: మండలంలోని ఎల్విన్‌పేట పంచాయతీ సవరకోటపాడులో శనివారం ఉదయం మూడు రేకుల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభించింది. కె రామకృష్ణ ఇంట్లో ఉన్న 68 వేల రూపాయల నగదు, ధాన్యం, తదితర అపరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కె.సుభద్ర ఇంట్లో ఉన్న పది బస్తాల ధాన్యం, క్వింటా బియ్యం అగ్నికి కాలిపోయాయి. కడ్రక మాధవరావు ఇంట్లో ఉన్న ధాన్యం, ఇంట్లో ఉన్న సామగ్రి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్ని మాపక కేంద్రానికి సమాచారం అందించారు. అప్పటికే అగ్నిమాపక వాహనం మొరాయించడంతో నెమ్మదిగా సంఘటనా స్థలానికి వాహనం రావడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపెద్దలు సర్దిచెప్పి అగ్నిమాపక సిబ్బందిచే మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అనంతరం సమాచారం తెలుసుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆస్తి నష్టాన్ని అంచనా వేశారు.
‘అన్ని అంశాలపై అవగాహన అవసరం’
పార్వతీపురం, డిసెంబర్ 29: పంచాయతీ స్థాయిలో మహిళలకు అన్నిరంగాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగించినపుడే వారు రాజకీయంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెరుగుపడతాయని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బిఆర్ అంబేద్కర్ అన్నారు. శనివారం పార్వతీపురం ఎడీవో కార్యాలయ సమావేశ హాలులో యునైటెడ్ నేషన్స్ మహిళా విభాగం సహకారంతో కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు సమన్వయంతో మహిళలకు సగ భాగం అనే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. మహిళలు రాజకీయంగా ఎదగాలంటే వారు ఆరోగ్యంగా ఉండాలని ఆ పరిస్థితులు గ్రామస్థాయిలో కల్పించాలన్నారు. ఆరోగ్యంగా ఉంటే విద్యాపరంగా కూడా తగిన అభివృద్ధి జరిగేలా ఆసక్తి కల్పించాలన్నారు. సామాజిక అభివృద్ధి చెందడానికి మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న చట్టాలపై అవగాహన ఏర్పరచాలని ఇందుకోసం మహిళలను చైతన్యం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని రంగాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించే బాధ్యత మోటివేటర్లు చేపట్టాలన్నారు. ఈకార్యక్రమంలో శిక్షకులు వీరాస్వామి, కురుపాం, పార్వతీపురం, సాలూరు, తెర్లాం ఎడీవోలు పాల్గొన్నారు.
‘్ఫండేషన్ సేవలు ప్రశంసనీయం’
పార్వతీపురం, డిసెంబర్ 29: ఆటో అంబులెన్సు సేవలు అందించడానికి సహృద ఫౌండేషన్ చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ తీసుకున్న చొరవ ప్రశంసనీయమని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు పేర్కొన్నారు. శనివారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు ఆటో అంబులెన్సులను ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గంలోని 125 మంది ఆటోలు నడిపే వ్యక్తులు సహృదంలో ఆయా ప్రాంతాల్లోని ఎలాంటి ప్రమాదాలకు గురైనా వెంటనే ఆటోఅంబులెన్సులోఆసుపత్రికి ఉచితంగా తరలించడానికి ముందుకు రావడం ఎంతైనా అభినందనీయమన్నారు. ఇందుకు తగిన చొరవ తీసుకున్న సహృద ఫౌండేషన్ చైర్మన్ చొరవ పట్ల ఆయన అభినందించారు. ఆపదలో ఉన్న వారికి తక్షణ సేవలందించడానికి 125మంది ఆటో అంబులెన్సుల ద్వారా సేవలందించడానికి ముందుకు రావడం వల్ల ఎంతోమందికి ప్రాణదాతలు అవుతారన్నారు. ఇప్పటికే తమ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్వతీపురం పట్టణంలోని ప్రముఖ గైనాలజిస్టు డాక్టర్ వై వి పద్మజ మాట్లాడుతూ ప్రమాదానికి గురైన వ్యక్తికి ఎంత త్వరగా ఆసుపత్రికి చేర్చితే అంత త్వరితంగా వైద్యం అందడం వల్ల ప్రాణాలు రక్షించడానికి అనువుగా ఉంటుందన్నారు. అందువల్ల ఆటోలు అంబులెన్సు సేవలందించే ప్రక్రియ ఎంతైనా అభినందనీయమన్నారు. పార్వతీపురం పోలీసు సర్కిల్ ఇనస్పెక్టర్ బి.వెంకటరావు మాట్లాడుతూ తమ వంతు సేవలందించడానికి ముందుకు రావడంతో వారికి తమశాఖ కూడా తగిన విధంగా సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సిపి నాయకులు కేతిరెడ్డి రాఘవకుమార్, రెడ్డి కృష్ణారావు, బెలగాం రామశంకరావు తదితరులు పాల్గొన్నారు.
తోటపల్లిలో న్యాయ అవగాహన సదస్సు
గరుగుబిల్లి, డిసెంబర్ 29: ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన కల్పించి తద్వారా న్యాయ హక్కులను తెలియజేయడమే న్యాయ అవగాహన సదస్సు ముఖ్య ఉద్ధేశమని పార్వతీపురం సీనియర్ సివిల్ జడ్జి పివి రాంబాబు అన్నారు. మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శనివారం పార్వతీపురం కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నామన్నారు. కేసులకు సంబంధించిన ఇరువురు కక్షిదారులను పిలిపించి వారికి ఆమోదయోగ్యమైన రాజీ కుదర్చడంతోపాటు వాదికట్టిన కోర్టు ఫీజును వాపస్ చేస్తామని చెప్పారు. ఈ సదస్సులో న్యాయవాదులు డి జోగారావు, బి వెంకటరావు, లోక్‌అదాలత్ మెంబర్ కోట బాబూరావు పాల్గొన్నారు.
విధిగా భూసార పరీక్షలు
గరుగుబిల్లి, డిసెంబర్ 29: రైతులు విధిగా భూ సార పరీక్షలను చేయించాలని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ లీలావతి సూచించారు. మండల పరిధిలోని తోటపల్లి ప్రకృతి ఆదిదేవోభవ ప్రాంగణంలో శనివారం క్షేత్ర పరిశీలన దినోత్సవం సందర్భంగా తోటపల్లి, నందివానివలస, తదితర గ్రామాల రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. జట్టు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డొల్లు పారినాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూసార పరీక్షలను చేయించడం వల్ల వ్యయం తగ్గడంతోపాటు అధిక దిగుబడులను సాధించవచ్చునన్నారు. పచ్చిరొట్ట ఎరువులతో పండించిన పంటలకు రసాయనిక ఎరువులతోపండించిన పంటలకు గల తేడాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. రసాయనిక ఎరువుల కంటే పచ్చిరొట్ట ఎరువులతో పండించిన పంటల దిగుబడి అధికంగా ఉందని పలువురు రైతులు తెలిపారు. నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజరు ఇ శ్రీనివాసరావు మాట్లాడుతూ నాబార్డు ద్వారా రైతు క్లబ్‌లోని రైతులకు రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేస్తామన్నారు. అనంతరం జట్టు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అర ఎకరంలో అన్నపూర్ణ నమూనాలు పండించిన పలు రకాల పంటలను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆత్మ పిడి రాజబాబు, భూసార పరీక్షా కేంద్రం ఎడి నాగభూషణరావు, ఎఒ సునీల్‌కుమార్, మార్కొండ నూకంనాయుడు, ఎం. శ్రీనివాసరావుపాల్గొన్నారు.