విశాఖపట్నం, డిసెంబర్ 29: ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) పరిధిలో ఐదు జిల్లాలకు సంబంధించి గడచిన మూడు మాసాల్లో 84 శాతం మేర విద్యుత్ మీటర్ల అమ్మకాలు సాధించినట్టు సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ నదీం అన్నారు. విశాఖలోని సంస్థ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా దేశంలోనే తమ సంస్థ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి తొమ్మిది మాసాల్లో 84 శాతం మేర మీటర్ల అమ్మకాలు సాధించగలిగామన్నారు. గత ఏడాది ఇదే సమయంలో 81శాతం మీటర్ల అమ్మకాలు జరిగాయన్నారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నష్టాలను ఐదు శాతానికి తగ్గించగలిగామన్నారు. ఇందులో కూడా తమ సంస్థ ముందంజలో ఉందన్నారు. ఈ రెండు ప్రమాణాలను తాము ప్రధానంగా తీసుకుంటున్నామన్నారు. సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల్లో ఈ ఏడాది రూ.108 కోట్ల వ్యయంతో 33/11 కెవి 85 విద్యుత్ సబ్‌స్టేషన్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా 51 సబ్‌స్టేషన్లు అందుబాటులోకి రాగా, మిగిలిన 57 సబ్‌స్టేషన్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వీటిని వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేస్తామన్నారు. వినియోగదారులకు మరింత ప్రయోజనం కలిగే విధంగా సెంట్రలైజ్డ్ ఎలక్ట్రికల్ కాల్‌సెంటర్‌ను ఇటీవల ఏర్పాటు చేసామని, దీనిని ఉపయోగించుకునేందుకుగాను టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసామన్నారు. గత ఏడాది వరకు ఆయా జిల్లాల పరిధిలోనే సేవలందగా, ప్రస్తుతం సంస్థ పరిధిలోని ఐదు జిల్లాలకు విస్తరించగలిగామన్నారు. వినియోగదారుల నుంచి ఆన్‌లైన్ సిస్టమ్‌లోనే ఫిర్యాదులు నమోదవుతాయని, వీటిని కంప్యూటరీకరించి పరిష్కరిస్తున్నామన్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి రూ. 100 కోట్ల మేర అపరాధం రుసుమును వసూలు చేసామన్నారు. విశాఖ జిల్లా ఏజేన్సీ ప్రాంతంలో తొమ్మిది మండలాలకు సంబంధించి మారుమూల 57 గిరిజన కాలనీల్లో సోలార్ విద్యుత్ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చామని అహ్మద్ నదీం అన్నారు. విద్యుత్ లైన్లు వేయడానికి ఏమాత్రం అవకాశం లేని మారుమూల ప్రాంతాల్లోను విద్యుత్ సరఫరాను అందించడానికి వీలుగా రూ. 17 కోట్లతో సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేసామన్నారు. ఇప్పటికే 13 గిరిజన కాలనీల్లో ఇది పూర్తయ్యిందని, మిగిలిన కార్యక్రమాన్ని మరో రెండు మాసాల్లో పూర్తిచేస్తున్నట్టు చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి మరుసటిరోజు ఉదయం ఆరు గంటల వరకు వీధి దీపాలు, రాత్రంగా ఇంటి దీపాలు ఈ ప్రాజెక్టు ద్వారా వెలుగుతాయన్నారు. వచ్చే ఏడాది భారీ ప్రాజెక్టులకు సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. సంస్థ పరిధిలో ఐదు జిల్లాల్లో 33/11కెవి 28 విద్యుత్ సబ్‌స్టేషన్లను రూ.35 కోట్ల వ్యయంతో నిర్మంచనున్నట్టు తెలిపారు. విశాఖ నగరంలో రూ. 356 కోట్ల వ్యయంతో భూగర్భ విద్యుద్ధీకరణ ప్రాజెక్టు నిర్మాణానికి తగిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపామని వీటికి ఆమోదం లభిస్తే పనులు మొదలుపెడతామన్నారు. అలాగే విద్యుత్ పొదుపు అంశాలను తమ కార్యాలయాల్లో పాటిస్తున్నామని, దీనివల్ల 50నుంచి 60 శాతం మేర విద్యుత్ ఆదా అవుతుందన్నారు. గడచిన మూడు మాసాల్లో 12 శాతం విద్యుత్ పొదుపును సాధించామన్నారు. వినియోగదారులకు దీనిపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది రూ. 9.72 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నామని, దీనివలన విద్యుత్ వాడకం మరింత తగ్గుతుందన్నారు. మరోపక్క విద్యుత్ పొదుపు కోసం అన్నిచోట్ల ఫైవ్ స్టార్ సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. డిస్ట్రిబ్యూషన్ డి-సెంట్రలైజ్డ్ అండ్ జనరేషన్ సిస్టమ్ కింద 2013-14 సంవత్సరంలో ఉత్తరాంధ్ర జిల్లాలో 286 కాలనీల్లో విద్యుత్ సదుపాయాన్ని కల్పించేందుకు వీలుగా రూ.52.7 కోట్ల వ్యయ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు. అలాగే సంస్థ పరిధిలో ఏడు గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరాను రెండు దశల్లో సమర్ధవంతంగా ఇవ్వగలుగుతున్నామన్నారు.
విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం
విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉందని సిఎండి స్పష్టంచేశారు. వచ్చే ఏడాది మార్చి తరువాతనే స్వల్పంగా చార్జీలు పెరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీని కంటే ముందుగా వినియోగదారుల అభిప్రాయాలను సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఇఆర్‌సి) సదస్సు నిర్వహించనుందన్నారు. విద్యుత్ సరఫరా కొనుగోలు, యూనిట్‌కు చెల్లించే చార్జీలు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ఉద్యోగులు, సిబ్బంది జీత,్భత్యాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని అధిక భారం పడకుండా పెంచే యోచన ఉందన్నారు. ఇందుకోసం ‘పబ్లిక్ హియరింగ్’ నిర్వహిస్తుందన్నారు.
ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే
గ్రామీణ యువతలో నైపుణ్యం పెంపొందించాలి
* ప్రముఖ ఆర్థిక రంగ నిపుణుడు ప్రొఫెసర్ కెసి రెడ్డి
విశాఖపట్నం, డిసెంబర్ 29: దేశ ఆర్థిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు అపరిమితంగా ఉన్న దేశ యువశక్తికి ఉపాధి అవకాశాలను కల్పించాలంటే గ్రామీణ స్థాయి నుంచి నిపుణత కలిగిన మానవ వనరులను దేశం సిద్ధం చేసుకోవాలని ప్రముఖ ఆర్థిక రంగ నిపుణుడు ప్రొఫెసర్ కెసి రెడ్డి అన్నారు. విశాఖ గీతం యూనివర్శిటీలో జరుగుతున్న ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ 95వ వార్షిక సమావేశాలు శనివారం ముగిశాయి. ముగింపు సమావేశంలో కెసి రెడ్డి మాట్లాడుతూ దేశ ఆర్థిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పోటీ వాతావరణం దృష్ట్యా అపరిమితంగా ఉన్న దేశ యువశక్తికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నిపుణులులైన మానవ వనరులను సిద్ధం చేయాల్సి ఉందన్నారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో యువతరం నేటికీ ప్రభుత్వ ఉద్యోగాలే అన్నివిధాల సురక్షితమైనవన్న భావనలో ఉన్నారన్నారు. అవసరమైతే అవి లభించే వరకు ఇంటి వద్ద ఖాళీగా ఉండటానికి సైతం సిద్ధంగా ఉంటున్నారు తప్పితే.. నైపుణ్యం పెంచుకునేందుకు ఇష్టపడటం లేదన్నారు. పెరుగుతున్న యువజనులకు తగినన్ని ఉద్యోగావకాశాలు ప్రభుత్వరంగంలో లేవనేది స్పష్టమన్నారు. పాఠశాల స్థాయిలోనే చదువు మానేసిన వారికి, డిగ్రీ పట్ట్భద్రులకు, ఇంజనీరింగ్ వంటి సాంకేతిక కోర్సులు అభ్యసించిన వారిని దృష్టిలో ఉంచుకుని ఉపాధి అవకాశాలను నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు ఉన్నా అవి నైపుణ్యం గల యువతకు మాత్రమే లభించేవిగా ఉన్నాయన్నారు. విశ్వవిద్యాలయాలు చొరవ తీసుకుని పరిశ్రమలతో కలిసి యువతలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేలా, పారిశ్రామిక అవసరాలకు తగిన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలకు రిజర్వేషన్లు వర్తించే విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అయితే నైపుణ్యం పెంచుకోవడం ద్వారానే భవిష్యత్‌లో ఉద్యోకావకాశాలు మెరుగుపడతాయన్నారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అధిపతి ప్రొఫెసర్ సుధాన్షుభూషణ్ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు భౌగోళికంగా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఈ దృష్ట్యా ఆయా ప్రాంతాలకు తగిన విధంగా వృత్తి విద్యలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలెప్‌మెంట్ డైరక్టెర్ ప్రొఫెసర్ ఎస్ అలోక్‌శర్మ మాట్లాడుతూ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేనిదే వృత్తి విద్యలను సమర్థవంతంగా నిర్వహించలేమన్నారు. పాట్నా విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ ప్రొఫెసర్ నావల్ కిషోర్ చౌదరి మాట్లాడుతూ దేశంలో విద్యకు సమగ్ర జాతీయ విధానం లేకపోవడం శోచనీయమన్నారు. నేషనల్ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ సభ్యులు రాజీవ్ చౌదరి మాట్లాడుతూ 2022 సంవత్సరం నాటికి దేశంలో ప్రైవేటు రంగం ద్వారా 15 కోట్ల ఉద్యోగాలను కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. భారత ఆర్ధిక నిపుణుల సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ప్రొఫెసర్ బిఎల్ ముంగేకర్ మాట్లాడుతూ దేశంలో ఉపాధి అవకాశాలు అన్ని వర్గాల ప్రజలకు సమానంగా లేవని, ప్రాచీన కాలం నుంచి అనుసరించి వస్తున్న వర్ణ వ్యవస్థ మాదిరే ఉద్యోగ రంగంలోను వివక్షత కనిపిస్తోందన్నారు.
కేజిహెచ్‌కు కలెక్టర్ వరాలు
* హెచ్‌డిఎస్ నుంచి మూడు కోట్లు మంజూరు
* ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిపాదనలకు మోక్షం
* వైద్యాధికారులతో సమీక్ష
విశాఖపట్నం, డిసెంబర్ 29: ప్రభుత్వ ఆసుపత్రులకు మంచి రోజులొచ్చాయి. చాలాకాలం తరువాత మళ్ళీ వీటి అభివృద్ధి కోసం వైద్యాధికారులతో కలెక్టర్ వి.శేషాద్రి అధ్యక్షతన శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రుల డెవలెప్‌మెంట్ సొసైటీ (హెచ్‌డిఎస్) సమావేశంలో ఆసుపత్రుల్లో వౌలిక సదుపాయాలను కల్పించడం, పెండింగ్ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌నివ్వడం, రోగుల వసతులు, సిబ్బందిని విస్తరించడం, పోస్టుల భర్తీ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిలనేది ఈ సమావేశం ప్రధాన సారాంశం. విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రి (ఘోసాసుపత్రి)కి సంబందించి 31 లక్షల వరకు హెచ్‌డిఎస్ నిధులుండగా, పలు అభివృద్ధి పనులకుగాను రూ. 20లక్షల వరకు కలెక్టర్ మంజూరు చేశారు. ఆల్ట్రా సౌండ్ స్కాన్ యంత్రం ఒక దానిని మంజూరు చేయగా, ల్యాబ్‌లో వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్, ఆపరేషన్ థియేటర్‌లో రెండు లక్షలతో టేబుళ్ళు, 1.2 లక్షల వ్యయంతో మూడు కంప్యూటర్లు, మరో 1.3 లక్షలతో ఆటో యనలైజర్ వంటివి సమకూర్చుకునేందుకు అనుమతి లభించింది. అలాగే అదనంగా మరో 13 మంది పారిశుద్ధ్య సిబ్బందిని, సెక్యురిటీ గార్డ్‌ల కోసం ఆసుపత్రి పర్యవేక్షకరాలు డాక్టర్ కె.పద్మలీల తెలిపారు. ఓపి బ్లాక్‌లో షెడ్‌ల నిర్మాణం, 147పడకలను 250కు పెంచాలనే ప్రతిపాదనలు పెట్టినట్టు ఆమె పేర్కొన్నారు. కుటుంబ సంక్షేమ భవనం ఆధునీకరణ, 250 కెవి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, అంబులెన్స్ మర్మతులకు మోక్షం లభించింది. ఆసుపత్రుల్లో పలు క్యాటగిరీల పోస్టుల భర్తీకి త్వరలో గ్రీన్‌సిగ్నల్ లభించనుంది.
కెజిహెచ్ అభివృద్ధికి మూడు కోట్లు
ఆసుపత్రి అభివృద్ధి సొసైటీకి సంబంధించి ఆరు కోట్ల రూపాయల వరకు ఉండగా, ఇందులో దాదాపు మూడు కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు శనివారం కేజిహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ శేషాద్రి అనుమతులిచ్చారు. పది లక్షలతో క్యాజువాలీటి ర్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. భావనగర్, రాజేంద్రప్రసాద్ వార్డులకు ఈ సౌకర్యం కల్పిస్తారు. కొత్త క్యాజువాలిటీ బ్లాక్, ఆర్ధోపెడిక్ వార్డు మరమ్మతులు సుమారు ఆరు లక్షలు వెచ్చించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. మరో ఆరు లక్షలతో కిచెన్ ఆధునీకరణ, పిడీయాట్రికి వార్డులో అంటెండర్ల కోసం రూ 15 లక్షలతో షెడ్ నిర్మాణం, వైద్య పరికరాలు, ఇంకో రూ.20 లక్షలతో 220కెవి జనరేటర్‌ను కేత్‌ల్యాబ్ కార్డియాలజీలో ఏర్పాటు చేస్తారు. అలాగే కార్డియాలజీలో వెంటిలేటర్ సౌకర్యం, ఇసిజి యంత్రాలు సమకూరనున్నాయి. 12లక్షలతో ఎండోగైనాలజీ వార్డు లో అటోమెటిక్ ఎనలైజర్‌కు, గాస్ట్రొ ఎంట్రాలికి మరో 12 లక్షలు మంజూరయ్యాయి. ఇవి కాకుండా డెంటల్ విభాగానికి ఆరు లక్షలు,
స్కూల్ మొబైల్ డెంటల్ చైర్ కోసం ఐదు లక్షలు, న్యూరాలజీ విభాగం వీడియో ఇఇజి మిషన్, మోబైల్ ఎక్స్‌రే యూనిట్లు ఆరు, లేబర్ రూమ్‌కు బోర్డులు, ఆల్రాసౌండ్ మిషన్ గైనాకాలజీకి ఓపిలో ఎక్స్‌రే యంత్రం ఏర్పాటు చేసుకునేందుకు ఆమోదం లభించింది. ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, కేజిహెచ్ సూపరింటెండెంట్ ఎం.మధుసూధనబాబు, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కల్పనా సుబ్రహ్మాణ్యం, ఉమా శంకర్, సురేంద్రరెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. గత కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ది కార్యక్రమాలకు అవసరమైన నిధులు మంజూరయ్యాయని, దీనివల్ల ఆసుపత్రి వైద్య పరికరాలను సమకూర్చుకోవడం సులభం అవుతుందని కేజిహెచ్ సూపరింటెండెంట్ మధుసూధనబాబు తెలిపారు.
ఏయుకే ఎడ్‌సెట్-2013 నిర్వహణ
* ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ఆచార్య నిమ్మ వెంకవువిశాలాక్షినగర్, డిసెంబర్ 29: బిఇడి కోర్సుల్లో ప్రవేశానికిగాను రాష్టవ్య్రాప్తంగా నిర్వహించే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్-2013) బాధ్యతను మళ్లీ ఏయు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అప్పజెప్పింది. 2012లో పరీక్ష నిర్వహణ, ఫలితాలు వెల్లడి, ప్రవేశాలు ప్రక్రియలను సమర్ధవంతంగా నిర్వహించడంతో 2013 నిర్వహణ బాధ్యతలను కూడా ఏయుకే అప్పగిస్తూ, ఎడ్‌సెట్-2013 కన్వీనర్‌గా ఆచార్య నిమ్మ వెంకట్రావును నియమిస్తూ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య పి.జయప్రకాశరావు ఉత్తర్వులను విడుదల చేశారు. ఏయు వైస్-్ఛన్సలర్ ఎడ్‌సెట్-2013కు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన సమావేశం జనవరి మొదటి వారంలో ఉన్నత విద్యామండలి నేతృత్వంలో హైదరబాద్‌లో జరగనుంది.
టౌన్‌ప్లానింగ్‌పై శ్యాంబాబు ఫైర్
* కల్యాణ మండపాలకు ఫైర్‌సేఫ్టీ, పార్కింగ్ తప్పనిసరి
* ఫుట్‌పాత్‌ల నిర్వహణపై మండిపాటు
విశాఖపట్నం (జగదాంబ), డిసెంబర్ 29: జివిఎంసి పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల (టౌన్‌ప్లానింగ్)పై స్పెషల్ ఆఫీసర్ బి.శ్యాంబాబు ఫైర్ అయ్యారు. గత మూడు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి నగర అభివృద్ధిపై దృష్టి సారించిన ఆయన శనివారం ఉదయం తన ఛేంబర్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ నిర్మాణాలు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తదితర విషయాలపై సమీక్షించారు.
జివిఎంసి పరిధిలోని అన్ని కల్యాణ మండపాలకు అగ్ని ప్రమాదాలు ఎదుర్కొనేందుకు పరికరాలు, పార్కింగ్ సౌకర్యం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. విశాఖ నగరంలో ఉన్న 94 కల్యాణ మండపాల్లో కొన్ని ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటికి ఎలాంటి ఫైర్‌సేఫ్టీ, పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాద వశాత్తు దుర్ఘటనలు జరిగి ఆస్తి, ప్రాణనష్టం సంభవించే ప్రమాదమున్నందున ఫైర్‌సేఫ్టీని తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను కోరారు. నగర ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత జివిఎంసిపై ఉందని, చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల అధికారులు చిక్కుల్లో ఇరుక్కొనే ప్రమాదం లేకపోలేదని హితవు పలికారు.
జోనల్ కమిషనర్లకు స్వతంత్ర బాధ్యతలను ఇవ్వడం జరిగిందని బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు పౌరసేవలు సంతృప్తికరంగా అందించే విధంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. జిహెచ్‌ఎంసి తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అందమైన నగరంగా విశాఖను అభివర్ణించారు. మార్కెట్లు, పారిశుద్ధ్యం, అక్రమ ఆక్రమణలు, ఫుట్‌పాత్‌లను పాదచారులు వినియోగించుకునేలా ప్రణాళికా బద్ధంగా విధులు నిర్వర్తించి విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నారు. లేఅవుట్‌లు, ఖాళీస్థలాలు జివిఎంసి ప్రోపర్టీ కిందకు వస్తాయని వాటిని కాపాడుకో వలసిన బాధ్యత జివిఎంసి అధికారులపై ఉందన్నారు. అంతేకాక మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది 24 గంటలు పనిచేయాల్సి వస్తుందని, అందుకు వారు నిబద్ధతతో పనిచేయాలన్నారు.
పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపర్చాలి: గత మూడు రోజులుగా నగరంలో పర్యటించిన ప్రత్యేకాధికారి శ్యాంబాబు నగరంలోని పారిశుద్ధ్య నిర్వహణపై తీవ అసంతృప్తి వ్యక్తపర్చారు. అసలు ఇది గ్రేటర్ సిటీయేనా? లేక మున్సిపాలిటీనా అని ప్రజారోగ్య అధికారులను అడిగారు. ప్రతిరోజు రాత్రి 11 నుండి 2 గంటల మధ్యలో పారిశుద్ధ్య పనులను నిర్వర్తించి తెల్లవారే సరికి ఎక్కడా చెత్తాచెదారం లేకుండా ఉండేలా ప్రణాళికను సిద్ధం చేసుకొని పారిశుద్ధ్యాన్ని నిర్వర్తించాలన్నారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడుతున్నారా?
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో అంతేవేగంగా అక్రమ నిర్మాణాలు కూడా జోరందు కుంటున్నాయి. అసలు మీరు అక్రమ నిర్మాణాలపై ఏమైనా చర్యలు చేపడుతున్నారా? లేదా? అంటూ అధికారులను ప్రశ్నించారు. అలాగే టౌన్ ప్లానింగ్ సిబ్బంది గృహాలు, అపార్ట్‌మెంట్లు నిర్మాణానికి నిబంధనలన నుసరించి ప్లాన్‌లను అనుమతించాలని, అంతేకాక ఇష్టానుసారంగా ప్లాన్లు మంజూరు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. సకాలంలో జరిమానాలు విధించాలని అప్పుడే ఆక్రమ కట్టడాలు, ప్లాన్ అతిక్రమణలు తగ్గుతాయని ఆయన అభిప్రాయ పడ్డారు. నిబంధనల మేరకు లేకుంటే నిర్మాణాలను రెగ్యులేట్ చేయవద్దని పేర్కొన్నారు. నగర సుందరీకరణ దృష్ట్యా ప్లానింగ్ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని అన్నారు.
పాఠశాలలు, ఆస్పత్రులు, తదితర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జివిఎంసి కమిషనర్ ఎం.వి. సత్యనారాయణ, వుడా వీసీ కోన శశిధర్, అదనపు కమిషనర్లు పి.పూర్ణచంద్ర రావు, కె.రమేష్, ప్రధాన ఇంజనీరు బి.జయరామిరెడ్డి, ప్రధాన సిటీ ప్లానర్ ఎస్.బాలకృష్ణ, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.
అత్యాచార బాధితురాలి మృతిపై ఆగ్రహావేశాలు
చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలి: మహిళా సంఘాలు
విశాలాక్షినగర్, డిసెంబర్ 29: దేశ రాజధానిలో కీచకుల ఘాతుకానికి బలైన వైద్య విద్యార్థిని శనివారం మృతిచెందడంపై నగరంలోని మహిళా సంఘాలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, ధర్నాలు చేపట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జివిఎంసి ఎదురు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు ఎం.లక్ష్మి మాట్లాడుతూ మహిళలపై దాడులు, అత్యాచారాలు నియంత్రించాల్సిన పాలకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జస్టిస్ జెఎస్ వర్మ కమిటీ లైంగిక నేరాల్లో చట్టాల సవరణకే పరిమితం కాక కఠిన చట్టాలు చేయాలని కోరారు. ఎ.పి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి వి.సత్యవతి, మహిళా చేతన్ రాష్ట్ర కార్యదర్శి కత్తి పద్మ తదితరులు మాట్లాడుతూ బాధితురాలి మృతిపై ప్రభుత్వం బాధ్యత వహించి కోటి రూపాయల నష్టపరిహారం కుటుంబానికి చెల్లించాలని, ప్రజల్లో మహిళలపై గౌరవ భావం కలిగే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్, ఆంధప్రదేశ్ పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.శ్రీరామమూర్తి మాట్లాడుతూ నేరాలకు మూలమైన కారణాలను పరిశీలించి ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకురావాలని సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు.
ప్రజా సంఘాల నిరసన, ధర్నా
ఢిల్లీ సంఘటనలో మృతిచెందిన వైద్య విద్యార్థినికి బాసటగా నిలిచేందుకు విద్యార్థి సంఘాలు శనివారం తీవ్ర నిరసనలు తెలిపాయి. ఎఐడిఎస్‌వో ఆధ్వర్యంలో విద్యార్థులు జివిఎంసి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మానవహారాన్ని చేపట్టారు. పలు ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపారు. అనంతరం కొద్దిసేపు వౌనం పాటించి సంతాపాన్ని తెలిపారు. కేంద్రం చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడంతో కోట్లాది చిరు వ్యాపారులు జీవనోపాధి కోల్పోతారని ప్రజాస్పందన అధ్యక్షుడు సిఎస్ రావు అన్నారు. రిటైల్ బిజినెస్‌లో విదేశీ పెట్టుబడులకు అనుమతి, అణువిద్యుత్ కేంద్రాల స్థాపనకు వ్యతిరేకంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శనివారం ప్రజాస్పందన, ఎఐడిఎస్‌వో, ఎఐఎంస్‌ఎస్, ఎఐడివైవో సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసి ధర్నా చేపట్టారు. భద్రతకు వచ్చే ముప్పు, స్థానికంగా ఉపాధి గురించి ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్‌యుసిఐ (సి) పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.గోవింద రాజులు, ఆలిండియా మహిళా సాంస్కృతిక సంఘం విశాఖ కన్వీనర్ ఎం.తేజోవతి, ఆలిండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ జిల్లా ఇన్‌చార్జి సురేష్, యువ సాహితి స్రవంతి ప్రతినిధి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎసిబి వలలో
ఆర్‌విఎం ఎఇ వరప్రసాద్
ఎస్. రాయవరం, డిసెంబర్ 29: మండలంలోని రాజీవ్ విద్యామిషన్ పధకం కింద బంగారమ్మపాలెం గ్రామంలో నిర్మిస్తున్న భవన నిర్మాణానికి సంబంధించి ఫైనల్ బిల్లును చెల్లించేందుకు గాను 20వేల రూపాయల లంచం తీసుకుంటుండంగా ఎసిబి అధికారులు దాడులు జరిపి రాజీవ్ విద్యామిషన్ ఎఇ చినపోలు వరప్రసాద్‌ను అరెస్టు చేసారు. ఎసిబి డిఎస్పి వెంకటేశ్వరరావు అందజేసిన వివరాల ప్రకారం బంగారమ్మపాలెం గ్రామంలో 21లక్షల రూపాయలతో ఎస్‌ఎస్‌ఎ పధకం కింద పాఠశాల భవనాలను స్థానిక ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నిర్మాణం చేపట్టారు. బిల్లులు చెల్లింపునకుగాను ఇప్పటివరకు 1.40లక్షలు రూపాయలు చెల్లించారు. ఫైనల్ బిల్లు చెల్లించేందుకు గాను మరో 26వేలరూపాయలు చెల్లించాలంటూ ఎఇ వరప్రసాద్ డిమాండ్ చేస్తుండటంతో స్థానిక యూత్ ప్రతినిధులు మైలపల్లి సత్తిరాజు తదితరులు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. దీంతో పధకం ప్రకారం శనివారం సాయంత్రం అడ్డురోడ్డులోని ఒక టీ దుకాణం వద్ద మైలపల్లి సత్తిరాజు ఎఇ వరప్రసాద్‌కు 20వేల రూపాయల లంచం ఇస్తుండగా సమీపంలోని మాటువేసిన ఎసిబి అధికారులు వెంటనే దాడిచేసి పట్టుకున్నారు. ఎఇకి ఫిర్యాదుదారులు అందజేసిన నోట్ల వివరాలు పూర్తిగా ఎసిబి ముందుగా ఎసిబి అధికారులకు ఇచ్చిన నోట్లతో సరిపోవడంతో ఎఇ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీనిపై కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, నిందితుడు వరప్రసాద్‌ను అరెస్టు చేసి శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసినట్లు డిఎస్పి తెలిపారు. నెలరోజులు గడవకముందే మండలంలో రెండవ అధికారి ఎసిబి దాడుల్లో గురికావడం విశేషం. ఈ దాడుల్లో ఎసిబి సిఐలు జంగయ్య, రాఘవ, రామకృష్ణతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
అరకులోయలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అరకులోయ, డిసెంబర్ 29: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ సతీసమేతంగా ఆంధ్రా ఊటీ అందాల అరకులోయను శనివారం సందర్శించారు. ప్రధాన న్యాయమూర్తి దంపతులకు జిల్లా, డివిజన్, మండల స్థాయి ప్రభుత్వ అధికారులు స్థానిక పర్యాటక అభివృద్ధి సంస్థ అతిథి గృహం వద్ద సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోలీసు సిబ్బంది నుంచి న్యాయమూర్తి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పర్యాటక మయూరీ అతిథి గృహం వద్ద బస చేసిన న్యాయమూర్తి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం స్థానిక గిరిజన సంస్కృతి మ్యూజియం, కాఫీ హౌస్‌ను వీక్షించారు. మ్యూజియంలో పొందుపరచిన గిరిజన కళాకృతులను తిలకించి గిరిజనుల ఆచార, వ్యవహార, సంస్కృతి, సాంప్రదాయాలపై ఆరా తీశారు. కాఫీ హౌస్‌లో అరుకు కాఫీని సేవించి కాఫీ రుచి అద్భుతమని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. న్యాయమూర్తి బి.వెంకటప్రసాద్, స్థానిక కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ఎస్.దామోధరరావు, పాడరు అదనపు ఎస్పీ ఎ.ఆర్.దామోధర్, పాడేరు ఆర్డీవో గణపతిరావు, స్థానిక తహశీల్ధార్ ఎం.అప్పారావులతో పాటు పలువురు న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డిఆర్‌ఎం రైల్వే స్టేషన్ సందర్శన
అనకాపల్లి (నెహ్రూచౌక్), డిసెంబర్ 29: డివిజనల్ రైల్వేమేనేజర్ ప్రదీప్‌కుమార్ (ఎస్‌సి రైల్వే) శుక్రవారం అనకాపల్లి రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. వచ్చేనెల 7న రైల్వేజనరల్ మేనేజర్ (ఎస్‌సి రైల్వే) అనకాపల్లి రైల్వేస్టేషన్‌ను తనిఖీచేయనున్న నేపధ్యంలో ఇక్కడి సౌకర్యాలను, సమస్యలను అడిగి తెలుసుకుని తగు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డిసిఎం శాస్ర్తీ, అనకాపల్లి స్టేషన్ మేనేజర్ జి. రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకులు దాడి రత్నాకర్ డిఆర్‌ఎంకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రైలుపట్టాలకు అవతలవైపునకు వెళ్లేందుకు వీలుగా మార్గం సుగమం చేయాలని డిఆర్‌ఎంకు వివరించారు.
రెస్కొ చైర్మన్‌గా చల్లా బాధ్యతల స్వీకరణ
కశింకోట, డిసెంబర్ 29: విద్యుత్ వినియోగదారులకు సహకార రంగంలో అత్యుత్తమైన సేవలందించే సంస్థగా గుర్తింపు పొందిన అనకాపల్లి ఆర్‌ఇసిఎస్ పాలకవర్గంలో పలుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్‌ఇసిఎస్ సంస్థ చైర్మన్ పదవికి బొడ్డేడ ప్రసాద్ రాజీనామా చేయగా నూతన చైర్మన్‌గా పరవాడ డైరక్టర్ చల్లా కనకారావు ఆదివారం బాద్యతలు స్వీకరించనున్నారు. వైస్ చైర్మన్‌గా తాళ్లపాలెం డైరక్టర్ గొల్లవిల్లి డైరక్టర్ బాద్యతలు స్వీకరించనున్నారు. ఆర్‌ఇసిఎస్ నూతన పాలకవర్గం ఏర్పాటయ్యే తరుణంలో చైర్మన్‌గా బొడ్డేడ ప్రసాద్‌ను ఎన్నుకున్నప్పుడే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అటు పరవాడ, ఇటు అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల పరిధిలోని నేతలతో కుదిర్చిన ఒప్పందంలో భాగంగా పాలకవర్గంలో తాజామార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఆర్‌ఇసిఎస్ సంస్థ పరిధిలోని ఎనిమిది స్థానాల్లోనూ మాజీ మంత్రి కొణతాల బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించిన విషయం విదీతమే. ఆర్‌ఇసిఎస్ పర్సన్ ఇన్‌చార్జ్‌గా వరుసగా రెండు పర్యాయాలు పనిచేసిన బొడ్డేడ ప్రసాద్ తొలిరెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని, తరువాత రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పరవాడ డైరక్టర్ చల్లా కనకారావు నిర్వహించేలా మాజీ మంత్రి కొణతాల, పరవాడ మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జి తదితర నేతల సమక్షంలో నిర్ణయం జరిగింది. అయితే ఆర్‌ఇసిఎస్‌లో పలునాటకీయ పరిణామాలు వలన మూడు నెలలు ఆలస్యంగా చైర్మన్ మార్పు చోటుచేసుకుంది. కశింకోట సంస్థ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆర్‌ఇసిఎస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రసాద్ (మిగతా 2వ పేజీలో)
మిలీషియా సభ్యుని లొంగుబాటు
ముంచంగిపుట్టు, డిసెంబర్ 29: మావోయిస్టులకు సహకరిస్తూ పలు విధ్వంసాలకు పాల్పడుతూ మూడేళ్లపాటు మిలీషియా సభ్యునిగా పనిచేసిన కుమడ పంచాయతీ చీపురుగొంది గ్రామానికి చెందిన పాంగి కేశవరావు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్.ఐ. వి.చక్రధరరావు ఎదుట శనివారం లొంగిపోయాడు. ఈ సందర్భంగా ఎస్.ఐ. మాట్లాడుతూ బల్లుగుడలో జరిగిన కిల్లో మాణిక్యం హత్యా సంఘటనతో పాటు రూడకోటలో రోడ్డు తవ్వటం, పూలబందలో రోడ్డు రోలర్, లక్ష్మీపురంలో రోడ్డు నిర్మాణానికి వినియోగించే ప్రొక్లీనర్, మిల్లర్, బంగారుమెట్టలో ఆర్టీసీ బస్సు దగ్ధం వంటి పలు సంఘటలలోకేశవరావు పాల్గొన్నాడన్నారు. అదేవిధంగా ఒడిశాలో మావోయిస్టుల సమావేశాలకు హాజరుకావడం, భోజనాలు సమకూర్చడం, గోడపత్రికలు, బ్యానర్లు అతికించడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని ఆయన చెప్పారు. పోలీసుల పిలుపు మేరకు స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోయిస్టులపై కేసులను ఎత్తివేసి వారికి ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సహకారం అందిస్తున్నామన్నారు. కేశవరావుపై సైతం కేసులు ఎత్తివేసి తన స్వగ్రామానికి పంపించివేశామని ఆయన చెప్పారు. అదేవిధంగా మండలంలోని మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్న కుమడ, బూసిపుట్టు పంచాయతీలకు చెందిన దిగువ కంఠవరం, ఎగువ కంఠవరం, సాగినపుట్టు, తాడిపుట్టు, బల్లుగుడ, నేరేడుపుట్టు, సరియాపల్లి గ్రామాలకు చెందిన కిల్లో రెల్లి, పాంగి గాసి, కిల్లో భాస్కర్, గుల్లూరి సమ్రూ, కిల్లో కంద్రా, కిల్లో కామేశ్వరరావు, పాంగి సొన్ను, దారాపు తిరుపతితో పాటు బాబుసాల పంచాయతీ బల్లుగుడకు చెందిన పాంగి రమేష్‌లు సైతం మిలీషియా సభ్యులుగా వ్యవహరిస్తూ మావోయిస్టులకు సహకరిస్తున్నారని, వీరు కూడా స్వచ్ఛందంగా లొంగిపోతే వారిపై కూడా ఎటువంటి కేసులు పెట్టబోమని ఎస్.ఐ. చక్రధరరావుతెలిపారు.
కలుషిత ఆహారం తిని 14 మంది గిరిజనులకు అస్వస్థత
నర్సీపట్నం, డిసెంబర్ 29: విశాఖ ఏజన్సీ చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ చింతలవీధి క్రిస్టియన్ చర్చ్‌లో కలుషిత ఆహారం తిని 14 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. ఐక్య క్రిస్మస్ వేడుకల్లో భాగంగా శనివారం చింతలవీధి చర్చ్‌లో గ్రామస్థులు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం చర్చ్‌లో బిర్యానీ, మాంసం తిన్న కొంత సేపటికే 14 మంది గిరిజనులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరందరినీ సమీపంలోని లోతుగెడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటినా తరలించారు. వైద్యులు ప్రాధమిక సేవలందిచండంతో 14 మంది కూడా ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యాధికారి సత్యనారాయణ తెలిపారు. వీరందరికీ ప్రాణాపాయం నుండి ముప్పుతప్పిందని ఆయన విలేఖరులకు తెలియజేసారు.