Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

దిండి - చించినాడ వంతెనపై సోలార్ లైటింగ్ వ్యవస్థ ప్రారంభం

$
0
0

మలికిపురం, డిసెంబర్ 29: రూ 25 లక్షల వ్యయంతో వశిష్ట నదిపై దిండి - చించినాడల మధ్య నిర్మించిన వంతెనపై ఏర్పాటుచేసిన సోలార్ లైటింగ్ వ్యవస్థను అమలాపురం ఎంపి జివి హర్షకుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే ఈ వంతెనపై గెయిల్ సంస్థ సహకారంతో సౌరశక్తి లైటింగ్‌ను ఏర్పాటుచేశామన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఈ బ్రిడ్జిపై లైటింగ్ ఎంతో ఉపయోగం కాగలదన్నారు. నెడ్‌క్యాప్ సంస్థ ఈ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటుచేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నెడ్‌క్యాప్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నానిబాబు, డివో ఐవి సుబ్రహ్మణ్యం, ఎఎఫ్‌వో డి పాండురంగ, తహశీల్దార్ డిజె సుధాకర్‌రాజు, ఎంపిడివో ఎం శ్రీనివాస్, స్థానిక ప్రముఖులు గొల్ల రమేష్, దీపాటి లక్ష్మణరావు, దేవ రాజేంద్రప్రసాద్, గెడ్డం తులసీభాస్కరరావు, తోటే ప్రసాద్, పాలపర్తి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రబీకి సాగునీటి భయం లేదు
* కాలువలకు 9960 క్యూసెక్కులు సరఫరా* సీలేరు జలాలు లేకుండానే..* నాట్లు పూర్తి చేయకపోతే ఒత్తిడి
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, డిసెంబరు 29: రబీ పంటకు ఇక సాగునీటి భయం అవసరం లేదు. మిగులు జలాల విడుదల నిలిచిపోయినప్పటికీ ప్రధాన ప్రవాహంలో మాత్రం నీటి పరిమాణం ఏ మాత్రం తగ్గటం లేదు. శనివారం సాయంత్రానికి గోదావరి ప్రధాన ప్రవాహంలో 9వేల 960క్యూసెక్కుల నీరు నమోదయింది. సీలేరు నుండి గోదావరిలోకి నామమాత్రంగా అంటే 263క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతున్నప్పటికీ, ప్రధాన ప్రవాహంలో మాత్రం 9వేల 960క్యూసెక్కుల నీరు నమోదవటం రబీ పంటకు శుభ సూచకం. డిసెంబరు నెలాఖరున కూడా ఇంత పరిమాణంలో గోదావరిలో నీటి లభ్యత ఉండటంతో రబీకి నీటి కొరత ఉండకపోవచ్చన్న ధీమా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల్లోని తూర్పుడెల్టాకు 2వేల 940క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 1940క్యూసెక్కులు, పశ్చిమడెల్టాకు 5వేల 110క్యూసెక్కుల నీటిని విడుదలచేస్తున్నారు. అయితే గోదావరిలో నీటి లభ్యత ఉంది కదా అని నాట్లు వేసే కార్యక్రమాన్ని కనుక ఆలస్యంచేస్తే మాత్రం చివరిదశలో ఒత్తిడ్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. నీలం తుపాను కారణంగా దెబ్బతిన్న, పొలంలోనే కుళ్లిపోయిన పంటను తొలగించటంలో రైతులు జాప్యం చేయటంతో రబీ పంట ఏర్పాట్లు ఆలస్యమయ్యాయి. దాంతో నవంబరు నెలాఖరు లేదా డిసెంబరు మొదటివారంలో ప్రారంభంకావాల్సిన నారుమళ్లు ఇప్పటికీ ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నాట్లు పూర్తయ్యేందుకు జనవరి నెలాఖరుకావచ్చని రైతు నాయకుడు బసవ చినబాబు ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. అదే జరిగితే ఏప్రిల్ నెలాఖరు వరకు రబీ పంట సా..గుతుంది. ఏప్రిల్ నెలాఖరు వరకు గోదావరిలో నీటి లభ్యత ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. సమయాన్ని ఆదా చేసేందుకు వెదజల్లే విధానంలోనే విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. వెజల్లే విధానంలో సమయం బాగా కలిసి వస్తుందని సూచిస్తున్నారు. మరో పక్క ఇరిగేషన్ అధికారులు కూడా నీటి సరఫరాలో రైతులకు సహకరించాలని, ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీటిని సరఫరాచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోపక్క వాతావరణంలో ఒక్కసారి సంభవించిన మార్పుతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పగటి ఉష్ణోగ్రత కనుక దిగజారితే వెదజల్లే విధానంలో విత్తనం మొలకెత్తదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శనివారం ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు, పగటి ఉష్ణోగ్రత బాగా పడిపోయింది. ఇది రైతులను కాస్తంత కలవరపరుస్తోంది.
వసతి గృహాల అభివృద్ధికి చర్యలు
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని
పిఠాపురం, డిసెంబర్ 29: రాష్ట్రంలో 1500 కోట్ల రూపాయలతో నిధులతో కేటాయించి సంక్షేమ వసతి గృహానికి ప్రభుత్వం ఖర్చు చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. శనివారం పిఠాపురం పట్టణంలోని 50 లక్షల రూపాయలతో నిర్మించిన బాలుర వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 2013-14 సంవత్సరం నాటికి సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతులు, రెసిడెన్షియల్ తదితర అన్ని వసతి గృహాల అభివృద్ధికి తక్షణం చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీని కోసం యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించామన్నారు. సాంఘిక సంక్షేమ విద్యకు వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, మైనార్టీ గురుకుల వసతి విద్యార్థులకు వేర్వేరుగా మెస్ ఛార్జీలు ఉండేవని ఇక నుంచి అందరికి ఒకే విధంగా మెస్ ఛార్జీలు అందిస్తామన్నారు. మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి విద్యార్థులకు 370-750 రూపాయలు, 8-10 తరగతి విద్యార్థులకు 530-850 రూపాయలకు, కళాశాల విద్యార్థులకు 520-1050 రూపాయలకు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అందరికీ ఒకే మెనూ వసతి గృహాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక్క విద్యార్ధి సంక్షేమానికే కాకుండా వృద్ధులు, వికలాంగుల కోసం పెన్షన్‌ను పెంచామన్నారు. కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో వసతి గృహాల సౌకర్యాల కల్పనకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గీత, డిసిసి అధ్యక్షులు దొమ్మేటి వెంకటేశ్వర్లు, కాకినాడ ఆర్డీఒ జవహర్‌లాల్‌నెహ్రూ. సోషల్ వెల్ఫేర్ జెడి ఎన్ నాగేశ్వరరావు, టి విజయ్‌కుమార్, ఎఇ వెంకట్రాజు, మార్కెంటింగ్ సొసైటీ ఛైర్మన్ ఎస్ వెంకటేశ్వరరావు, ఎస్‌సి సెల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపు వీర్రాజు, బాలిపల్లి రాంబాబు, మొగలి దొరబాబు, జ్యోతుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ సేవలపై అవగాహన అవసరం
జాయింట్ కలెక్టర్ బాబు
కాకినాడ సిటీ, డిసెంబర్ 29: ప్రతీ భారత పౌరునికి ఒక విశిష్ట గుర్తింపు కల్పిస్తూ భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆమోదయోగ్యమైన ఆధార్ గుర్తింపు కల్పించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ బాబు తెలిపారు. ఆధార్ సంఖ్య పొందడం, ఆధార్ అనుసంధానిత సేవలను సద్వినియోగం చేసుకోవడంపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. జెసి బాబు శనివారం ఉదయం తన ఛాంబర్‌లో ఆధార్ నమోదు, నంబర్ కేటాయింపు స్టేటస్‌ను తెలుసుకోవడం, ఆధార్ అనుసంధానిత సేవలు పొందేందుకు మొదటిసారి ఉత్తమ వేళ్లు(బెస్ట్ ఫింగర్ డిటెక్షన్) సందర్భంగా ప్రజలు పాటించాల్సిన సూచనలు, ఆధార్ అనుసంధానిత పౌర సరఫరాల పంపిణీలో రేషన్ డీలర్లు పాటించాల్సిన సూచనలపై జిల్లా పౌర సరఫరాల విభాగం ప్రచురించిన 4 రకాల బ్రోచర్లను, ఉత్తమ వేళ్ల నిర్ధారణపై సూచనలతో ప్రచురించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెసి బాబు మాట్లాడుతూ ఇటీవల ఆధార్ నమోదు, అనుసంధానిత సేవలపై ప్రజల నుండి వ్యక్తమైన సందేహాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రతీ ఒక్కరికి సులువుగా అర్ధమయ్యే రీతిలో బ్రోచర్లు, పోస్టర్‌లను ప్రచురించామన్నారు. ఈ బ్రోచర్లు, పోస్టర్లను అన్ని గ్రామాలు, మండల స్థాయి కార్యాలయాల్లోను, శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాల వద్ద, రేషన్ షాపుల్లోను అందుబాటులో ఉంచుతున్నామని, ప్రజలు ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆధార్ నమోదు పొంది ఇంకా లెటర్లు రాని వారందరూ నమోదు రశీదుపై ఉండే 14 అంకెల ఇఐడి నంబర్ సహాయంతో మొబైల్ ఫోన్‌పై తమ ఆధార్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌ఓ రవికిరణ్, సివిల్ సప్లయిస్ డిఎం కుమారి, డిఆర్‌డిఎ పిడి కె మధుకర్‌బాబు, ఎఎస్‌ఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 13 నుండి శ్రీ శతచండీ సహిత అతిరుద్ర మహాయాగం
మురమళ్లలో భారీ ఏర్పాట్లు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, డిసెంబర్ 29: జిల్లాలోని ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో వేంచేసియున్న శ్రీ భద్రకాళీ శ్రీ వీరేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రంలో అతిరుద్రం (ఉత్కృష్ట మహాయాగం)ను భారీ ఎత్తున నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2013 ఫిబ్రవరి 13వ తేదీ నుండి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ఈ మహాయాగాన్ని అత్యంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు జిల్లా కేంద్రం కాకినాడలోని నాగేశ్వరరావు వీధిలో సమతా లోక్‌సేవా సమితీ ప్రతినిధులు శనివారం విలేఖరుల వద్ద మహాయాగం వివరాలను వెల్లడించారు. భద్రాచలంలో అతిరాత్రం అనే మహాయాగాన్ని అద్భుత ఆధ్యాత్మిక ఉత్సవంలా నిర్వహించి, విశేష బహుయజ్ఞకర్తగా పేరొందిన కేసాప్రగడ హరిహరనాథశర్మ, రాధాకృష్ణకుమారి దంపతుల నిర్వహణలో ఈ దఫా జిల్లాలోని మురమళ్ళలో అతిరుద్ర మహాయాగాన్ని నిర్వహించనున్నట్టు తెలియజేశారు.
విశాఖ కేంద్రంగా ప్రాంతీయ వార్తా విభాగం
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, డిసెంబర్ 29: విశాఖపట్నం కేంద్రంగా ప్రాంతీయ వార్తా విభాగాన్ని త్వరలో ప్రారంభిస్తున్నామని ప్రసార భారతి అదనపు డైరెక్టర్ జనరల్ పిజె సుధాకర్ తెలిపారు. శనివారం డిపిఆర్‌ఓ కార్యాలయంలో సుధాకర్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రసార భారతి ద్వారా కొత్తగా ప్రాంతీయ వార్తా విభాగాలు, ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ల ఏర్పాటు ప్రణాళికలపై వివరించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ దేశంలో 44 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాలు ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్, విజయవాడలో రెండు విభాగాలు సేవలందిస్తున్నాయన్నారు. 11వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా కొత్తగా మరో 7 ప్రాంతీయ వార్తా విభాగాల ఏర్పాటుకు అమోదం జరిగిందని ఇందులో భాగంగానే విశాఖలో ప్రాంతీయ వార్తా విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాకినాడలో ఎఫ్‌ఎం రెయిన్‌బో స్టేషన్ కూడా సిద్ధమైందని దీనిని కేంద్ర మంత్రి ఎంఎం పళ్ళంరాజు జనవరి రెండవ వారంలో ప్రారంభిస్తారన్నారు. కాకినాడతో పాటు శ్రీకాకుళం, విజయనగరంలో కూడా ఎఫ్‌ఎం స్టేషన్‌లు ప్రారంభమవుతాయని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం 2011 సంవత్సరానికి దేశంలో అత్యుతమ వార్తా విభాగంగా ఎంపికైందని సుధాకర్ తెలిపారు.

ఓట్లు తొలగింఛారని రైతుల ఆందోళన
కోరుకొండ, డిసెంబర్ 29: మండలంలోని శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ (పిఎసిఎస్) పరిధిలోని కోఠి గ్రామానికి చెందిన రైతుల ఓట్లను జాబితా నుండి తొలగించారంటూ ఆ గ్రామానికి చెందిన రైతులు శనివారం సొసైటీ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత నెల 21న 51మంది ఓటర్ల పేర్లను నమోదు చేసుకున్నారని, అయితే వాటికి సంబంధించి జిరాక్స్ కాపీలు అందజేయలేదని, వాటిని తొలగించారని తెలిపారు. వీటికి సంబంధించి జిరాక్స్ పత్రాలను తీసుకువస్తే సొసైటీ అధ్యక్షులు లేరని, రికార్డులన్నీ ఆయన వద్దే ఉన్నాయని సంఘం సిఇఒ తెలుపుతున్నారన్నారు. గతంలో సొసైటీపై 51 విచారణలు జరిగాయని, సొసైటీలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు తమ ఓట్లను రాజకీయ కారణాలతో తొలగించారని వారు ఆరోపించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు నండూరి రామకృష్ణ, మాదవరపు వీరభద్రరావు, మాజీ ఎంపిటిసి డి సుబ్బారావు, అత్తిలి సత్యనారాయణ ప్రసాద్, దాడి రాంబాబు పాల్గొన్నారు.
ఓట్లు తొలగించలేదు విచారణ జరుగుతోంది
ఒకే సర్వే నెంబరులోని అర ఎకరం పంట పొలాన్ని 40మందికి కౌలికిచ్చినట్టు దరఖాస్తులు అందజేసారని, దాంతో వాటిని విచారణ చేస్తున్నామని, అయితే ఓట్లను తొలగించలేదని శ్రీరంగపట్నం సొసైటీ అధ్యక్షుడు అత్తిలి రాంప్రసాద్ వివరణ ఇచ్చారు. అలాగే ఒకే కుటుంబానికి చెందినవారికి ఈ కౌలు ఒకే రోజు రాయడం, ఆ పొలం సరిహద్దులు కూడా ఒకటే ఉండటంతో వాటికి సంబంధించి వారి నుండి వివరణ కోరామన్నారు. అదే విధంగా సంతకాలు లేకుండా కూడా దరఖాస్తులు పంపించారని తెలిపారు. దానికి ఈ నెల 31వ తేదీ లోపు సొసైటీలో వివరాలు అందజేయాలని నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. పొలానికి సంబంధించి జిరాక్స్ కాపీలు, సంతకాలు లేకపోవడంతో వారికి గడువు ఇచ్చామని అంతేకానీ ఓట్లను తొలగించలేదని ఆయన తెలిపారు. ఎన్నికల్లో విజయం కోసం మాజీ జడ్పీటీసీ ఎల్లపు సాయిబాబా తదితరులు రాజకీయ కుట్రలు పన్నుతున్నారని రాంప్రసాద్ ఆరోపించారు.
కోరుకొండ శ్రీ రంజిత్ మూవీస్ షూటింగ్
కోరుకొండ, డిసెంబర్ 29: అలా మొదలైంది బ్యానర్ శ్రీ రంజిత్ మూవీస్ నూతన సినిమా కోరుకొండలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి హీరోపై వర్షంలో కొన్ని చిత్ర సన్నివేశాలను కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కోనేరు వద్ద దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్ చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. గత రెండు రోజులుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రంలోని పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. శుక్రవారం రాజమండ్రిలోని పుష్కర ఘాట్ వద్ద చిత్రీకరించామని, శనివారం కోరుకొండలో చిత్రీకరించామని, సినిమాలో లవ్, రోమాంటిక్ డ్రామా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సినిమాలో నూతన కథానాయకునిగా సుమంత్ అశ్విన్‌ను పరిచయం చేస్తుండగా, హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయవలసి ఉందన్నారు. మరో 40 రోజులు హైదరాబాద్‌లో చిత్రీకరణ చేయనున్నట్టు తెలిపారు. ఈ సినిమాకి నిర్మాతగా కెఎల్ దామోదర్, కెమెరామెన్‌గా పిజి విందా వ్యవహరిస్తున్నారు.
7న దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆస్తాన రాక
తుని, డిసెంబర్ 29: దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆస్తాన జనవరి 7వ తేదీన విజయవాడ డివిజన్‌లో ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లను పరిశీలిస్తారని డివిజన్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్ తెలిపారు. శనివారం అనకాపల్లి నుండి తునికి ప్రత్యేక రైలులో విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ కార్యక్రమంలో చేపడుతున్నారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 3 వేల కోట్ల రూపాయలు ఆదాయం లక్ష్యంగా నిర్ణయించగా, రూ. 29 వేల 770 కోట్లు ఆదాయం గడించి, గత సంవత్సరం కంటె 35 శాతం అధికంగా లభించిందన్నారు. తుని రైల్వే స్టేషన్ ఎ గ్రేడ్ అర్హత సాధించే అవకాశం ఉందన్నారు. తుని రైల్వే స్టేషన్‌కు ఈ సంవత్సరం రూ. 8 కోట్లు ఆదాయం లభించిందన్నారు. అంతకు ముందు తుని స్టేషన్ ఆవరణలో పలు విభాగాలను ఆయన పరిశీలించారు. ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు చెత్త పడవేస్తే జరిమానా విధించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆయన వెంట డిసిఎం శాస్ర్తీ, డిఇ ఎం అమిల్ అగర్వాల్, డిఒ ఎం సత్యనారాయణ, సిటిటి ప్రసాద్, సిఐ రాంబాబు, ఎస్‌ఎస్ పిసి సాహు తదితరులు పాల్గొన్నారు.
వివాదాస్పద ఇసుక ర్యాంపును పరిశీలించిన అధికారుల బృందం
డి గన్నవరం, డిసెంబర్ 29: వివాదాస్పదంగా మారిన డి గన్నవరం ఇసుక ర్యాంపును శనివారం అధికారుల బృందం పరిశీలించి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసింది. పడవల ద్వారా ఇసుకను తీసుకొచ్చి నిర్వహించాల్సిన ఈ ర్యాంపు వద్దకు ఇసుక పడవలు వచ్చేందుకు వీలు లేకపోవడంతో హెడ్‌వర్క్స్ ఇఇ గతంలో నదిలోకి మార్గం నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నదిలోకి రహదారి నిర్మించి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఇసుక తీస్తున్నారన్న అభియోగాలతో ఇఇ తిరుపతిరావు నదిలోకి ఏర్పాటుచేసిన మార్గాన్ని తొలగించాలని ఆదేశాలు జారీచేయడం, వాటిని అమలుచేసేందుకు వచ్చిన అధికారులను నిర్వాహకులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్‌వర్క్స్ ఇఇ వివి తిరుపతిరావు, మైన్స్ ఏడి ఎస్‌వి రమణారావు, గ్రౌండ్ వాటర్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్‌వి వెంకటేశ్వరరావు, జియాలజిస్ట్ రాజేష్‌కుమార్‌లతో కూడిన అధికారుల బృందం ర్యాంపు పరిస్థితులను పరిశీలించింది. వాల్టా చట్టం ప్రకారం అక్విడెక్ట్‌కు ఇరువైపులా 500 మీటర్ల మేర ఇసుక త్రవ్వకాలు సాగించకూడదని, అదేవిధంగా వైనతేయ నదీ వెడల్పును అనుసరించి ఒడ్డు నుంచి 160 మీటర్లు దూరం దాటిన తరువాత మాత్రమే ఇసుక తీయాల్సివుందని అధికారులు వివరించారు. నదిలో పడవలు వచ్చే మార్గంలో నీటిలో వున్న ఇసుకను తొలగించాలన్నా.. ఆ ప్రాంతం 160 మీటర్ల పరిధిలోకి వస్తుందని అధికారులు చెప్పారు. నదిలో పోటు సమయాల్లో మాత్రమే పడవలు ర్యాంపు వద్దకు వస్తున్నాయని, పాటు సమయాల్లో రావడం లేదని నిర్వాహకులు వివరించారు. ఈ కారణంగానే నదిలోకి ర్యాంపునకు అనుమతి కోరినట్లు నిర్వాహకులు తెలిపారు. నిబంధనల ప్రకారం చూస్తే డి గన్నవరం ర్యాంపులో ఇసుక తీసేందుకు ప్రతిబంధకంగా ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. రెండు రోజుల్లో తమ నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు బృందం వివరించింది. వచ్చే సీజన్‌లో ఈ ర్యాంపు విషయంలో ఎటువంటి సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటామని హెడ్‌వర్క్స్ ఇఇ తిరుపతిరావు విలేఖర్లకు చెప్పారు.
యువత కుల మత భేదాలు విడనాడాలి
ఆర్డీవో సంపత్ కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, డిసెంబర్ 29: కుల మత బేధాలను వీడి యువత ఉజ్వల భవిష్యత్‌కై కృషిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని అమలాపురం ఆర్డీవో పి సంపత్ కుమార్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా యువజన సర్వీసుల శాఖ (సెట్‌శ్రీ) ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలోని వివిధ యువజన సంఘాల సభ్యులు రెండు రోజుల పాటు యూత్ ఎక్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలోని ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార్య వ్యవహారాలు, వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని అధ్యయనం చేసే నిమిత్తం శనివారం అమలాపురం వచ్చారు. అమలాపురంలో పార్లమెంట్ భవనాన్ని పోలిన ఆర్డీవో కార్యాలయాన్ని 20 మంది సభ్యులతో కూడిన యువజన సంఘాల సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా సభ్యులను ఉద్దేశించి ఆర్డీవో మాట్లాడుతూ అనేక సంస్కృతీ సాంప్రదాయాలకు పేరెన్నికగన్న తూర్పు గోదావరి ఉన్నతమైన జిల్లా అని, ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, జీవన విధానం ఎంతో ఆచరణీయమన్నారు. అభివృద్ధిపరంగా కూడా ప్రభుత్వం చేపట్టే అనేక పథకాలు జిల్లాలో విజయవంతంగా అమలు కాబడుతున్నాయని ఆర్డీవో అన్నారు. వీటిని అధ్యయనం చేయడం ద్వారా యువత తమ భవితకు బంగారు బాట వేసుకోవచ్చునన్నారు. కోనసీమలో అధ్యయనం చేయాల్సిన పలు అంశాలను అమలాపురం ఎంపిడిఒ వి శాంతామణి యువజన సంఘాలకు తెలియజేశారు. శ్రీకాకుళం యువజన సర్వీసు శాఖ సూపరింటెండెంట్ ఎస్ హైమావతి మాట్లాడుతూ ద్రాక్షారామలో భీమేశ్వరాలయం, యానాంలోని బీచ్, అమలాపురంలోని ఆర్డీవో కార్యాలయం, బాలయోగి ఘాట్, స్టేడియం, పి గన్నవరంలోని అక్విడెక్ సందర్శించి అనంతరం రాజోలు, దిండి యువత సందర్శిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ యువజన సర్వీసుల శాఖ జూనియర్ అసిస్టెంట్ టి రాజా, రెవిన్యూ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ విఎస్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

రూ 25 లక్షల వ్యయంతో
english title: 
d

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles