ఏలూరు, డిసెంబర్ 29 : ఇటీవల సంభవించిన నీలం తుఫాను కారణంగా పాడైన ధాన్యాన్ని జిల్లా పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ తెలిపారు. చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యాన్ని ఒక శాతం నుంచి 10 శాతం వరకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 1280 రూపాయలు గ్రేడ్ - ఎ ధాన్యానికి, 1250 రూపాయలు కామన్ ధాన్యానికి ఎటువంటి రేటు తగ్గింపు లేకుండా, 11-50 శాతం వరకు పాడైపోయిన ధాన్యాన్ని ప్రతీ ఒక్క శాతానికి ఒక శాతం రేటు తగ్గింపుతో కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 72 ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ఈ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులందరూ తమ పరిధిలోని ఐకెపి కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్‌ఫ్రీ నెంబర్ 1800-425-845, ల్యాండ్ లైన్ 08812-235132 నెంబర్లను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.
చేనేత సంఘాలకు ఎన్నికల కళ
*్ఫబ్రవరి 11న పోలింగ్*ఎన్నికల అధికారుల నియామకం
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, డిసెంబర్ 29 : జిల్లా వ్యాప్తంగా వున్న చేనేత సహకార సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సహకార సంఘాల ఎన్నికల నేపధ్యంలో చేనేత సంఘాలు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి. దీనిలో భాగంగా ఫిబ్రవరి 11వ తేదీన ఈ సంఘాలకు పోలింగ్ జరగనుంది. దీనిలో భాగంగానే ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారుల నియామకాలను కూడా చేపట్టారు. భీమవరంలోని హెచ్‌డబ్ల్యు సి ఎస్‌కు ఎ ఎస్ ఓ పి శేషు రామారావు, వీరవాసరం మండలం రాయకుదురులోని డబ్ల్యు సి ఎస్‌కు నందమూరు గరువు ఇవో ఆర్‌డి సిహెచ్ భుజంగరావును, పాలకొల్లు మండలం దగ్గులూరులోని శివదేవ హెచ్‌డబ్ల్యు సి ఎస్‌కు వీరవాసరం గ్రేడ్-2 ఇవో కె శ్రీనివాసరావును, పాలకొల్లు మండలం భగ్గేశ్వరంలోని కోటి లింగేశ్వర హెచ్‌డబ్ల్యు ఎస్‌కు పాలకోడేరు ఎ ఎస్ ఓ సిహెచ్ సూర్యచంద్రరావును ఎన్నికల అధికారులుగా నియమించారు. అలాగే పాలకొల్లు మండలం దిగమర్రులోని ఉమా సోమేశ్వర హెచ్‌డబ్ల్యు సి ఎస్‌కు కాళ్ల ఎ ఎస్ ఓ ఎన్ గోపాలకృష్ణంరాజును, యలమంచిలి మండలం పెనమర్రులోని వీరభద్ర హెచ్‌డబ్ల్యు సి ఎస్‌కు, పాలకొల్లు ఎంపిడివో కార్యాలయం సూపరింటెండెంట్ వి శివరామాంజనేయులును, పోడూరు మండలం రావిపాడులోని గౌతమేశ్వర హెచ్‌డబ్ల్యు సి ఎస్‌కు యలమంచిలి ఎంపిడివో కార్యాలయం సూపరింటెండెంట్ ఎన్ ఉమామహేశ్వరరావును, పోడూరు మండలంలోని పోడూరు మూలేశ్వర హెచ్‌డబ్ల్యు సి ఎస్‌కు పోడూరు ఎ ఎస్‌వో ఆర్ సుధాకర్‌ను, ఆచంట మండలం ఎ వేమవరంలోని వేమవరం క్లాత్, టేప్ వీవర్స్ సొసైటీకి ఆచంట ఎ ఎస్ ఓ టి వెంకటేశ్వరరావును, ఆచంట మండలం పెనుమంచిలి లోని జయలక్ష్మి మహిళా టేప్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీకి ఆచంట ఎంపిడివో కార్యాలయం సూపరింటెండెంట్ వి ఎస్ వి ఎల్ జగన్నాధరావును, పెంటపాడు మండలం రామచంద్రాపురంలోని రామచంద్రాపురం డబ్ల్యు సి ఎస్‌కు తాడేపల్లిగూడెం ఎ ఎస్ ఓ ఎస్ శేషుబాబును, తణుకు మండలం వేల్పూరులోని వేల్పూరు డబ్ల్యు సి ఎస్‌కు తణుకు ఎ ఎస్ ఓ ఎటి రాజ్‌గోపాల్‌ను, ఇరగవరం మండలం కె ఐ పర్రులోని కె ఇల్లిందరపర్రు డబ్ల్యు సి ఎస్‌కు పెనుమంట్ర ఎ ఎస్ ఓ పి సోమరాజును, తణుకు మండలం కోనాలలోని కోనాల డబ్ల్యు సి ఎస్‌కు ఉండ్రాజవరం ఎ ఎస్ ఓ ఎ గోవర్ధనరావును, ఉంగుటూరు మండలంలోని ప్రభాకర క్లాత్, టేప్ డబ్ల్యు సి ఎస్‌కు ఉంగుటూరు ఎ ఎస్ ఓ జె రాజశేఖర్‌ను ఎన్నికల అధికారులుగా నియమించారు. అలాగే జనవరి 3వ తేదీ నాటికి ఈ సంఘాల పరిధిలో అర్హులైన ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అలాగే జనవరి 7వ తేదీన ఈ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితా రూపొందిస్తారు. 11వ తేదీన అర్హులైన ఓటర్ల జాబితాను ఆయా సంఘాలకు అందజేస్తారు. 15వ తేదీన ఎన్నికల అధికారులు ఓటర్ల తుది జాబితాలను పరిశీలిస్తారు. కాగా జనవరి 28వ తేదీన ఈ సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సంఘాల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 5వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపడతారు. 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు ఉపసంహరణకు అవకాశమిస్తారు. 11వ తేదీన పోలింగ్ నిర్వహించి వెంటనే లెక్కింపు చేపడతారు. లెక్కింపు పూరె్తైన అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తరువాత రోజు ఆయా సంఘాల ఆఫీసు బేరర్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తం మీద వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి చేనేత సహకార సంఘాల్లో పాలకవర్గాలు కొలువుతీరనున్నాయి.
మెడికో విద్యార్థిని మృతి పట్ల
విద్యార్థుల ఆందోళన
నరసాపురం, డిసెంబర్ 29: దేశ రాజధాని ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెడికో విద్యార్థిని మృతి చెందడం పట్ల విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. విద్యార్థిని మృతికి సంతాపంగా శనివారం పట్టణంలోని విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. వౌన ప్రదర్శన, మానవహారం, కొవ్వొత్తుల ప్రదర్శన తదితర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు తమ సంతాపాన్ని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వైఎన్ కాళాశాల, బెరాకా జూనియర్ కళాశాల విద్యార్థులు వౌన ప్రదర్శన, రాస్తా రోకో నిర్వహించారు. బాధితురాలి ఆత్మ శాంతికి రెండు నిమషాల పాటు వౌనం పాటించారు. ఎస్‌ఎఫ్‌ఐ నేతలు దినేష్, రామోజీరావు, విఘ్నేష్, అబ్ధుల్, విమల, కె లక్ష్మి, ఐద్వా అధ్యక్షురాలు పి పూర్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్య కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు వెయ్యి కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కళాశాల ఛైర్మన్ గంటశాల సూర్యనారాయణ, కరస్పాండెంట్ జి బ్రహ్మాజీ, పేరాల మోహన్, దువ్వూరి రామ్మూర్తి, ప్రసాద్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా పనిచేయాలి
మున్సిపల్ కమిషనర్లకు ఆర్జేడి రాజేంద్రప్రసాద్ ఆదేశం
ఏలూరు, డిసెంబర్ 29 :పురపాలక సంఘాల కమిషనర్లు బాధ్యతాయుతంగా పనిచేసి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని పురపాలక సంఘాల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. పురపాలక సంఘాలలో నేటికీ పురాతన కాలం నాటి పన్ను విధానమేనా? పట్టణాల్లో బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్నప్పటికీ ఎందువల్ల రివైజ్డ్ టాక్స్ విధానాన్ని అమలు చేయడం లేదని రాజేంద్రప్రసాద్ కమిషనర్లను ప్రశ్నించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం పశ్చిమ, కృష్ణా జిల్లాల పురపాలక సంఘాల కమిషనర్లతో పన్నుల పరిస్థితి, ఆడిట్ వ్యవహారాలు, ఇతర అంశాలపై ఆయన సమీక్షించారు. మున్సిపాల్టీలలో రోజురోజుకూ పక్కా భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఇటువంటి స్థితిలో పురపాలక సంఘాలలో పన్నుల పెంపుదల ఎందుకు జరగడం లేదని ఎందువల్ల నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఒకవైపు రాష్ట్రంలో పురపాలక సంఘాల ఆర్ధిక పటిష్టతకు, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడానికి మంత్రి మహీధర్‌రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని మరోవైపు కొత్త కొత్త విధానాల ద్వారా ఏ విధంగా రాజమండ్రి రీజియన్‌లో పురపాలక సంఘాలను పటిష్టవంతం చేయాలనే ఆలోచనతో తాను ఎంతో కృషి చేస్తున్నానని అయితే ఆశించిన మేరకు కమిషనర్లు పనితీరు మెరుగుపరుచుకోకపోవడం బాధాకరమన్నారు. తణుకు, నిడదవోలు పురపాలక సంఘాలలో పన్నుల తీరు మరింత పెంచుకోవాలని అదే విధంగా ప్రతీ పురపాలక సంఘంలో అభివృద్ధి కార్యక్రమాల అమలుతోపాటు ఆదాయ వనరులను పెంచుకోవడానికి కూడా ప్రయత్నించాలని ఆయన సూచించారు. రాజమండ్రి రీజియన్ పరిధిలో ప్రభుత్వ భవనాల నుండి 29 కోట్ల రూపాయలు పన్ను బకాయిలు ఉంటే కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిడదవోలు, తణుకు పురపాలక సంఘాలలో ట్రాన్స్‌కో కార్యాలయాలకు ఎందుకు ఏళ్ల తరబడి పన్ను వసూలు చేయడం లేదని ఆయన కమిషనర్లను ప్రశ్నించారు. కరెంటు బిల్లులు చెల్లించకపోతే ట్రాన్స్‌కో అధికారులు ఊరుకుంటున్నారా? మరి ట్రాన్స్‌కో కార్యాలయాలు చెల్లించాల్సిన ఆస్థి పన్ను చెల్లించకపోతే కమిషనర్లు అటువంటి భవనాలను ఎందుకు జప్తు చేయడం లేదన్నారు. నిడదవోలులో అసలు ట్రాన్స్‌కో కార్యాలయానికి పన్ను కూడా వేయకపోవడంపై కమిషనరు సన్యాసిరావు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా నిబంధనలు మేరకు సర్వీసు టాక్స్ వసూలు చేసే అవకాశం పురపాలక సంఘాలకు ఉందని ఆయన చెప్పారు. రీజియన్‌లో కోర్టు కేసులకు సంబంధించి 90 శాతం కమిషనర్లు కనీసం నివేదిక కూడా ఇవ్వలేని స్థితిలో వున్నారని ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 79 అసెస్‌మెంట్లకు సంబంధించి 2.69 కోట్ల రూపాయలు కోర్టు కేసుల్లో వసూలు కాకుండా ఉండడం సమంజసం కాదని తక్షణం ఈ కేసుల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టి ఆస్థిపన్ను వసూలుపై దృష్టి కేంద్రీకరించాలని కమిషనర్ నాగరాజును రాజేంద్రప్రసాద్ కోరారు. జనవరి రెండవ వారంలో రాష్ట్ర మంత్రి మహీధర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పురపాలక సంఘాల పనితీరును సమీక్షించనున్నారని వివిధ అంశాలపై కమిషనర్లు సమగ్ర అవగాహనతో పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. కమిషనర్లకు పురపాలక సంఘాల చట్టాలపై సమగ్ర అవగాహన పెంచుకోవాలని దిగువు స్థాయి సిబ్బంది సమర్పించే నోటు ఫైల్‌ను సమగ్రంగా చదివి అవగాహన చేసుకోవాలని సూచించారు. పురపాలక సంఘాలలో ఆడిట్ శాఖ అభ్యంతరాలపై దృష్టి కేంద్రీకరించి వాటిని పరిష్కరించుకోవాలని, అనవసర బ్యాంకు ఖాతాలను రద్దు చేసి ఆ నిధులను ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ జి నాగరాజు, జిల్లా ఆడిట్ శాఖాధికారి వెంకటేశ్వరరావు, ఇంజనీర్ ప్రసాద్, ఎస్ ఇ యోహాను, పబ్లిక్ హెల్త్ డి ఇ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
మైనర్‌పై అత్యాచారం
అత్తిలి, డిసెంబర్ 29: అత్యాచారాలను నిరోధించాలంటూ ఓ వైపు సభ్యసమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంటే..మరోవైపు అభం శుభం తెలియని మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతూనే ఉండటం శోచనీయం. స్థానిక పోలీస్టేషన్ సమీపంలోని మార్కెట్ వద్ద అయిదు సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ మేరకు తమకు ఫిర్యాదు అందినట్టు అత్తిలి పోలీసులు శనివారం తెలిపారు. ఇందుకు సంబంధించి స్థానిక పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం..అయిదు సంవత్సరాల బాలికను భీమవరానికి చెందిన గంధం నాగరాజు (24) అత్యాచారం చేసినట్టు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు రోడ్డుపై చెత్తకాగితాలు ఏరుకుని జీవిస్తారని, అయితే బాలిక అమ్మమ్మ వద్ద ఉంటుందన్నారు. మధ్యాహ్న సమయంలో మార్కెట్ సమీపంలో ఉన్న బాలికపై అత్యాచారం చేసి, నాగరాజు పరారైనట్టు పోలీసులు తెలిపారు. బాలిక అమ్మమ్మ పసుపులేటి సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షలు నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు చెప్పారు. తణుకు ఇన్‌ఛార్జి సిఐ వానపల్లి సుబ్రహ్మణ్యం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటుతో దోపిడీలు అరికట్టవచ్చు
భీమవరం, డిసెంబర్ 29: ప్రధాన కూడళ్లలో, రద్దీగా ఉన్న ప్రాంతాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలు, దోపిడీలను అరికట్టవచ్చని జిల్లా ఎస్పీ రమేష్ అన్నారు. శనివారం స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేఖర్లతో ఎస్పీ రమేష్ మాట్లాడుతూ జిల్లాలో దొంగతనాలు, దారిదోపిడీలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని అరికట్టడానికి అన్ని స్టేషన్ల పరిధిలో వివిధ ప్రధాన కూడళ్లలో, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటుచేయడం ద్వారా నేరాలను అరికట్టవచ్చన్నారు. సిసి కెమెరాల ద్వారా సమాచారం కంట్రోల్ రూమ్‌కి వస్తుందని, తద్వారా నేరాలు చేసిన వారిని త్వరితగాతిన పట్టుకోవడానికి వీలవుతుందని అన్నారు. ముందుగా భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే జిల్లాలోని అన్ని స్టేషన్లకు, రద్దీగా ఉన్న ప్రాంతాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. గత కొంతకాలంగా మహిళలు అధికంగా నేరాలకు పాల్పడుతున్నారన్నారు. దొంగతనాలు, కోడి పందాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ రమేష్ వెంట నర్సాపురం డిఎస్పీ రఘవీర్‌రెడ్డి ఉన్నారు.
బార్ల తనిఖీ చేసిన ఎక్సైజ్ జాయింట్ కమిషనర్
ఏలూరు, డిసెంబర్ 29 : నగరంలోని బార్లను ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ కె వేణుగోపాల్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బార్‌ల నిర్వహణకు సంబంధించి నిబంధనలను అనుసరించడం లేదని, ఆడిట్ అభ్యంతరాలు కూడా రావడంతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. లైసెన్సు దారులు నిబంధనల ప్రకారం బార్‌లను నిర్వహిస్తున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు తనిఖీలు చేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బార్‌లను నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సరఫరా గది, కిచెన్, స్టోర్ రూమ్, సిట్టింగ్ హాల్‌లకు సంబంధించి మ్యాప్‌లను పరిశీలించి అందుకు అనుగుణంగా వున్నదీ లేనిదీ తనిఖీలు చేస్తున్నామన్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా రెండు బార్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. తనిఖీల నివేదికలను తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూధన్‌రెడ్డి, సి ఐ రామారావు, ఎస్ ఐ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ కమిటీలు వేయాలి
* మాజీ ఎంపి చేగొండి హరిరామజోగయ్య
యలమంచిలి, డిసెంబర్ 29: ప్రతీ గ్రామంలోను గ్రామ కమిటీలు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపి చేగొండి హరిరామజోగయ్య అన్నారు. మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ గాలి, వైఎస్సార్ కాంగ్రెస్‌పై ప్రజాభిమానం విశేషంగా ఉందన్నారు. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కొక్కటీ నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యలమంచిలి మండలంలో వెయ్యి మందికి తక్కువ కాకుండా సమర్థులైన, ఉత్సాహవంతులైన కార్యకర్తలను ఎంపిక చేయాలన్నారు. త్వరలో జరగనున్న సొసైటీ ఎన్నికల్లో అభ్యర్థులను ఏ విధంగా ఎంపికచేస్తే గెలుస్తారో కార్యకర్తలకు అవగాహన కల్పించి, పలు సూచనలను చేగొండి అందజేశారు. తాను పై నుండి సలహాలు ఇస్తానే తప్పిస్తే తనపై బాధ్యతలు వేయవద్దని అన్నారు. మరో నేత సిహెచ్ రంగనాధరాజు మాట్లాడుతూ కడప జిల్లా తరువాత పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పటిష్టవంతంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు తెల్లం బాలరాజు, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ మండల కన్వీనర్ గుబ్బల వేణు, దేవరపు మల్లేశ్వరరావు, గున్నం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయలకు అతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్
పాలకొల్లు: తెలంగాణా సమస్యపై రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నిమిడి ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ తన నిర్ణయాన్ని అఖిల పక్ష కమిటీ సమావేశంలో స్పష్టంగా వెలిబుచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపి చేగొండి వెంకట హరిరామజోగయ్య అన్నారు. వివిధ ప్రాంతాల ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కేంద్రం ముందున్న ప్రధాన కర్తవ్యమని ఆయన వెల్లడించారు. కేంద్రం తీసుకున్న ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామన్న భరోసా ఇవ్వాలని పార్టీ తీసుకున్న నిర్ణయం సహేతుకమైందని ఆయన అన్నారు. ప్రత్యేక ఆంధ్రాయే ముద్దని చేగొండి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎన్జీవోల టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్
ఏలూరు, డిసెంబర్ 29 : తణుకు తాలూకా ఎన్‌జివో సంఘం 2013 టేబుల్ క్యాలెండర్‌ను శనివారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ ఆవిష్కరించారు. తణుకు, ఉండ్రాజవరం, పెరవలి, ఇరగవరం, పెనుగొండ, పెనుమంట్ర మండలాలకు సంబంధించిన టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా జె ఎసి ఛైర్మన్, జిల్లా ఎన్‌జివో సంఘం అధ్యక్షులు ఎల్ విద్యాసాగర్, జిల్లా ట్రెజరర్ ఎం నరసింహమూర్తి, ఏలూరు డివిజన్ రెవిన్యూ సంఘం అధ్యక్షులు కె రమేష్‌కుమార్, నాయకులు వై సత్యనారాయణమూర్తి, పి శ్రీనివాసులు, పితాని వెంకటరమణ, కెవి సత్యనారాయణ, డి భాస్కర్‌రెడ్డి, సిహెచ్ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
బోగస్ కార్డులు ఏరివేతలో ఏలూరు మండలం ఆదర్శం:జెసి
ఏలూరు, డిసెంబర్ 29 : పశ్చిమ గోదావరి జిల్లాలో బోగస్ కార్డులు ఏరివేత కార్యక్రమంలో ఏలూరు మండలం ఆదర్శవంతంగా నిలిచిందని ఈ సందర్భంగా జెసి అన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బోగస్ రేషన్‌కూపన్లను స్వీకరించే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి బాబూరావునాయుడు మాట్లాడుతూ ఏలూరులో చౌక డిపోడీలర్లు రెండవసారి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున రేషన్‌కార్డుల అందజేత కార్యక్రమం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. తాను జాయింట్ కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పశ్చిమగోదావరిలో జనాభా కన్నా రేషన్ కార్డుల్లో జనాభా అధికంగా ఉన్నారని దీన్ని బట్టి జిల్లాలో పెద్ద ఎత్తున బోగస్ కార్డులపై దృష్టి కేంద్రీకరించారని చెప్పారు. జిల్లాలో అర్హత గల ఏ ఒక్క పేద కుటుంబం రేషన్ కార్డు రద్దు కాకూడదనే ఉద్దేశ్యంతో జాగ్రత్తగా బోగస్ కార్డుల ఏరివేతపై దృష్టి పెట్టడం జరిగిందని ఇన్నాళ్లు ఈ కార్డులపై బియ్యాన్ని ఇతర నిత్యావసర సరుకులను పొందాలని ఇకనైనా ప్రభుత్వం కల్పించిన అవకాశం మేరకు స్వచ్ఛందంగా బోగస్‌కార్డుల అందజేత కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరడంతో ఏలూరు చౌకడిపో డీలర్లు 10 వేల కార్డులు సరెండరు చేసారని వారిని ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని ఇతర చౌకడిపోల్లో ఉన్న బోగస్ కార్డులన్నీ సంక్రాంతిలోగా సరెండరు చేయాలని ఆ తర్వాత పట్టుబడితే చర్యలు మాత్రం తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఏలూరు మండల పరిధిలో 19 వేల కూపన్లు ఉండగా వాటిలో 6039 కూపన్లు సరెండరు చేయడం జరిగిందని 3125తెల్ల రేషన్ బోగస్ కార్డులను కూడా సరెండరు చేసారని జాయింట్ కలెక్టర్ చెప్పారు. దీనివల్ల ప్రతీ నెలా లక్షా 25 వేల కేజీల బియ్యం ఆదా అవుతున్నట్లు చెప్పారు. ఏలూరు రూరల్, అర్బన్ మండలాల్లో 19513 కూపన్లు ఉండగా వాటిలో 12325 మంది తమ ఫొటోలను అప్‌లోడ్ చేయించుకున్నారని ఇంకా 7188 మంది ఫొటోలు అప్‌లోడ్ చేయించవలసి వుందన్నారు. ఏరివేత కార్యక్రమంలో అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో చేపట్టడం జరిగిందన్నారు. నగదు బదిలీ కార్యక్రమంపై డీలర్లలో కొంతమేర ఆందోళన వుందని, అయితే వారు అనుకున్నంత ఇబ్బంది ఏదీ ఉండదన్నారు. లబ్ధిదారులు నగదు ఇచ్చినప్పటికీ తిరిగి బియ్యం డీలర్ల నుంచే కొనుగోలు చేయాల్సిన అవసరం వుంటుందన్నారు. 2013 మార్చి నాటికి జిల్లాలో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయితే వాస్తవ లబ్ధిదారుల వివరాలు స్పష్టంగా తెలుస్తాయన్నారు. అప్పుడైనా బోగస్ కార్డుల బండారం బయటపడుతుందని, దీన్ని గుర్తించి బోగస్ కార్డులు సరెండర్ చేయాలని చెప్పారు. ఏలూరు ఆర్డీవో కె నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ లబ్ధికోసం రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్నారని, ఈ కారణంగా కూడా బోగస్ కార్డుల సమస్య తలెత్తిందన్నారు. డీలర్లు ఎవరి ఒత్తిడికి లోనుకావద్దని కోరారు. సమస్యలను నేరుగా జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని అన్నారు. లీడ్‌బ్యాంక్ మేనేజర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఆయా బ్యాంకుల్లో తమ పేర్లతో బ్యాంకు ఖాతాలు ప్రారంభించేలా రేషన్ డిపోకు వచ్చే ప్రతీ ఒక్కరికీ తెలియజేయాలన్నారు. జిల్లా వినియోగదారుల సొసైటీ కార్యదర్శి బొబ్బిలి బంగారయ్య మాట్లాడుతూ పారదర్శకంగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో నా రేషన్ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం నిర్వహించడం విశేషమన్నారు. నగరంలో పది వేల బోగస్ రేషన్ కార్డులను చౌక డిపోడీలర్లు స్వచ్ఛందంగా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడుకు శనివారం సరెండరు చేశారు. కార్యక్రమంలో ఏలూరు తహశీల్దార్ ఎజి చిన్నికృష్ణ, డివి రమణమూర్తి, పౌర సరఫరాల అధికారి లక్ష్మీనారాయణ, ఎల్‌వి సాగర్, డీలర్ల సొసైటీ అధ్యక్షులు గంగాధర్, పలువురు రేషన్ డీపోల డీలర్లు పాల్గొన్నారు.