Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నిర్భయ మృతికి జిల్లా వ్యాప్తంగా ఆందోళన

$
0
0

మచిలీపట్నం, డిసెంబర్ 29: ఇటీవల ఢిల్లీలో గ్యాంగ్ రేప్‌కు గురైన యువతి నిర్భయ మృతి పట్ల జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దాదాపు 13 రోజులపాటు మృత్యువుతో పోరాడిన నిర్భయ ఆఖరికి చనిపోవటం పలువురిని కలచివేసింది. ఆమె మృతికి సంతాపంగా అనేకచోట్ల ప్రదర్శనలు నిర్వహించి సానుభూతి ప్రకటించారు. పారా మెడికల్ విద్యార్థిని నిర్భయపై దుండగులు సామూహిక అత్యాచారం చేయటంతో పాటు తీవ్రంగా గాయపర్చటంతో ఆమె మృతి చెందిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మచిలీపట్నం, గుడివాడ, హనుమాన్‌జంక్షన్, తిరువూరు, మైలవరం, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేట, గుడ్లవల్లేరు, కైకలూరు, చల్లపల్లి తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించి సంతాపం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో తెలుగుదేశం, బిజెపి, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా ప్రదర్శనలు నిర్వహించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలోనే ఇలాంటి దారుణం జరగటం సిగ్గుచేటన్నారు. పరిపాలన ఏ విధంగా సాగుతుందో ఢిల్లీ సంఘటన రుజువు చేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే దేశ వ్యాప్తంగా మహిళలకు రక్షణ కరవైందని ఆందోళన చెందారు. విచారణల పేరుతో కాలయాపన చేయకుండా దుండగులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ నిర్భయ సంఘటన ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు. దున్నపోతుపై వర్షం కురిసిన చందంగా వ్యవహరిస్తున్న పాలకులు ఇప్పటికైనా అప్రమత్తం కావాలన్నారు.
తొలుత పట్టణంలో ప్రదర్శన నిర్వహించి కోనేరు సెంటరులో సంతాప సభ జరిపారు. భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సెంటర్ మహాత్మగాంధి విగ్రహం వద్ద కొవ్వొత్తులతో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. బిజెపి నాయకులు ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ కాలం చెల్లిన బ్రిటిష్ చట్టాలను మార్పు చేసి మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను రూపొందించాలని కోరారు. లోపభూయిష్టమైన పరిపాలన వల్లే నడుస్తున్న బస్సులో దుండగులు కిరాతకంగా వ్యవహరించారన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఇలాంటి సంఘటనలు ఇకముందు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరించాలని సిపిఐ నాయకులు మోదుమూడి రామారావు డిమాండ్ చేశారు.
వీఆర్‌ఓపై అత్యాచారం కేసు
నందివాడ, డిసెంబర్ 29: నందివాడ గ్రామ రెవెన్యూ అధికారి పాండు ఓ వివాహితకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ బి జయరాజ్ కథనం ప్రకారం... నందివాడలో ఒక వివాహిత వీఆర్‌ఓ కార్యాలయంలో రికార్డులు రాసే పని కుదుర్చుకొని సుమారు రెండు నెలలు పనిచేసింది. ఈ క్రమంలో వీఆర్‌ఓ ఆమెతో సన్నిహితంగా మెలిగేవాడు. ఒకరోజు వీఆర్వో కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి తనను వివస్తన్రు చేసి అనుభవించాడని, అప్పటి నుండి పనిమానివేశానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్‌ఐ చెప్పారు. ఈ సంఘటనను సెల్‌ఫోన్‌లో వీడియో తీశానని, ఎవరికైనా చెబితే ఈ ఫొటోలు బయటపెడతానని ప్రతిరోజు బెదిరిస్తున్నాడని ఆమె తెలిపిందన్నారు. సిఐ శ్రావణకుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
సకాలంలో పన్నులు వసూలు చేయండి
నూజివీడు, డిసెంబర్ 29: డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలలో ప్రజల నుండి వసూలు చేయాల్సిన పన్నులను సకాలంలో వసూలు చేయాలని నూజివీడు రెవెన్యూ డివిజన్ అధికారి బి సుబ్బారావు ఆదేశించారు. స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని మండల తహశీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని పలువురు తహశీల్దార్లు వివిధ పనుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. పలు అంశాలపై పలువురు తహశీల్దార్లు వెనుకబడి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరువూరు, ఆగిరిపల్లి తహశీల్దార్లు అన్ని రంగాలలో బాగా వెనుకబడి ఉన్నారని, తగు శ్రద్ధ వహించి సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం మంజూరు చేసిన క్వారీలలో పగటి పూట మాత్రమే తవ్వకాలు జరపారలని అన్నారు. రాత్రివేళ తవ్వకాలు జరిపితే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తహశీల్దార్లు రైతుల నుండి నీటి తీరువా పన్నులు వసూలు చేయకుండా పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయకూడదని చెప్పారు. నీటి తీరువాతో పాటు రోడ్ సెస్సులు కూడా వసూలు చేయాలని అన్నారు. డివిజన్ పరిధిలోని ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డుకు అనువైన స్థలం గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంలేని లే అవుట్లను ధ్వంసం చేయాలని ఆర్డీవో సుబ్బారావు ఆదేశించారు. గ్రామాలలోని ప్రభుత్వ భూములు గుర్తించి తగు నివేదిక అందజేయాలని చెప్పారు. ఈ సమావేశంలో కార్యాలయం పరిపాలన విభాగం అధికారి మాధురి, డిటి శర్మ, అధికారులు పాపారావుతో పాటు డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు పాల్గొన్నారు.
త్వరలో తెలుగులో కోర్టు తీర్పులు
అవనిగడ్డ, డిసెంబర్ 29: త్వరలో అన్ని న్యాయ స్థానాల్లో తెలుగులోనే తీర్పులు వెల్లడిస్తామని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి దుర్గాప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ప్రభుత్వ అతిథి గృహంలో విలేఖర్లతో మాట్లాడారు. ప్రస్తుతం డివిజన్ స్థాయిలోని న్యాయస్థానాల్లో తెలుగులో తీర్పులు వెలువరిస్తారన్నారు. త్వరలో తెలుగుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ పనులు పూర్తి కాగానే రాష్ట్రంలోని అన్ని న్యాయ స్థానాల్లో తెలుగులోనే తీర్పులు వెలువడతాయని ఆయన పేర్కొన్నారు.
అక్రమ ఇసుక రవాణా నిరోధించలేకపోతే
సెలవుపై వెళ్లండి
నందిగామ, డిసెంబర్ 29: ఇసుక అక్రమ రవాణా నిరోధించే విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని సబ్ కలెక్టర్ ఎస్ వెంకట్రావు హెచ్చరించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల మండలాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహశీల్దార్ కార్యాలయాల ఆవరణలో కనబడుతున్న ఇసుక డంపింగ్‌లను చూస్తుంటే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నదన్నారు. గ్రామాల్లోని రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు ఇసుక అక్రమ రవాణా అడ్డుకోలేకపోతే, విధి నిర్వహణ సక్రమంగా చేయలేమని భావిస్తే సెలవు పెట్టి వెళ్లాలని సున్నితంగా మందలించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లు ఈ ఇసుక అక్రమ రవాణాపై సీరియస్‌గా ఉన్నారని వెల్లడించారు. అధికారుల మధ్య సమన్వయం కొరవడినట్లు తెలుస్తోందన్నారు. ఒక శాఖపై మరొక శాఖ వారు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ ఆదేశాలను అధికారులు అందరూ పాటించాలని ఆదేశించారు. రాత్రి సమయాల్లో తనిఖీలకు పోలీస్ సిబ్బంది సహకారంతో వెళ్లాలని సూచించారు. పట్టుకున్న ఇసుక లారీలకు లక్ష రూపాయల వరకూ జరిమానా, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచిస్తుంటే తక్కువ మొత్తంలో జరిమానాలు ఎందుకు వేస్తున్నారని, క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదంటూ తహశీల్దార్‌లను మందలించారు. ఎంపిడిఒలు, ఇఒఆర్‌డిలు ఇసుక అక్రమ రవాణా నిరోధించడం తమ పని కాదని భావిస్తుండటం ఏమిటని ప్రశ్నించారు. ఇకపై తహశీల్దార్‌ల పర్యవేక్షణలో వీఆర్‌ఒలు, పంచాయతీ కార్యదర్శులు పోలీసు సిబ్బంది సహకారంతో పూర్తి స్థాయిలో ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల తహశీల్దార్‌లు బి శ్రీనివాస్, తిరుపతినాయుడు, విక్టర్‌బాబు, ఎంపిడిఒలు నాగార్జున శ్రీనివాస్, కొడాలి అనురాధ, ఆర్‌ఐలు, విఆర్‌ఒలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతికి సంతాపంగా
విద్యార్థుల ర్యాలీ
తోట్లవల్లూరు, డిసెంబర్ 29: ఢిల్లీలో గ్యాంగ్ రేప్‌కు గురై మృతి చెందిన విద్యార్థిని మృతికి సంతాపం తెలియజేస్తూ తోట్లవల్లూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ హైస్కూల్ విద్యార్థులు శనివారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చాగంటి సాంబిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ర్యాలీ హైస్కూల్ నుంచి మెయిన్ రోడ్డుగుండా కోట సెంటర్‌కు, అక్కడ నుంచి జడ్పీ రోడ్డుపై దళితవాడ వైపు హైస్కూల్ వరకు సాగింది. ఆడవారిపై అత్యాచారాలను అరికట్టాలి, ఢిల్లీలో రేప్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు.

గుడివాడలో విద్యార్థుల మానవహారం
గుడివాడ, డిసెంబర్ 29: ఢిల్లీలో వైద్య విద్యార్థిని మృతికి సంతాపంగా ఎన్టీఆర్ ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్‌ల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం స్థానిక నెహ్రూచౌక్ సెంటర్‌లో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ముందుగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుండి ర్యాలీని ప్రారంభించి మహిళల హక్కులను కాపాడాలని నినాదాలు చేస్తూ వాసవీ చౌక్, మార్కెట్ సెంటర్, నెహ్రూచౌక్ మీదుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్డీవో పి రంజిత్‌భాషాకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం జరిగిన సభలో రావి మాట్లాడుతూ సభ్యసమాజం సిగ్గుపడేలా నిర్భయను హత్య చేశారన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చట్టాలు తీసుకురావాల్సి ఉందన్నారు. భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా మండలి అధ్యక్షురాలు వల్లూరుపల్లి లక్ష్మి తదితరులు మాట్లాడారు.

పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుళ్లు మూలస్తంభాలు
మచిలీపట్నం (కోనేరుసెంటరు), డిసెంబర్ 29: పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుళ్లు మూల స్తంభాలని జిల్లా ఎస్పీ జె ప్రభాకరరావు అన్నారు. బందరు మండలం తపసిపూడిలో నిర్మించిన డిస్ట్రిక్ట్ పోలీసు ట్రైనింగ్ సెంటర్‌ను ఎస్పీ ప్రభాకరరావు శనివారం సందర్శించారు. అక్కడ ఈ నెల 26వ తేదీన కాడెట్ పోలీసు కానిస్టేబుల్స్‌గా ఎంపికై శిక్షణ పొందుతున్న 240 మందిని ఉద్దేశించి ప్రసంగించారు. క్యాడెట్లు శిక్షణ ముగించుకుని వారివారి పోలీస్ స్టేషన్‌లలో సక్రమంగా విధి నిర్వహణ చేయాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులకు ఓదార్పు మాటల ద్వారా సాంత్వన చేకూర్చి వారి సమస్యలను పరిష్కరించేలా ప్రయత్నించాలని తెలిపారు. పోలీసు వ్యవస్థకు కానిస్టేబుల్స్ మూల స్తంభాలన్నారు. విద్యావంతులైన మీరు పోలీస్ వ్యవస్థలో ఏ విధమైన మార్పులు తీసుకురాగలరో చూపించండని దిశా నిర్దేశం చేశారు. అనంతరం కేడెట్ పోలీసు కానిస్టేబుల్స్ మినరల్ వాటర్ ప్లాంట్, భోజనశాల, డైనింగ్ హాల్, తరగతి గదులు, విశ్రాంతి గదులు సందర్శించి సూచనలు చేశారు.
నిర్భయ మృతికి విద్యార్థుల సంతాపం
చల్లపల్లి, డిసెంబర్ 29: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల సామూహిక అత్యాచారానికి గురై సింగపూరులో చికిత్స పొందుతూ మృతి చెందిన వైద్య విద్యార్థినికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు స్థానిక విజయ అకాడమీకి చెందిన వెయ్యి మంది విద్యార్థులు వౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక విజయ విద్యా సంస్థల ఆవరణలో చల్లపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ముమ్మనేని రాజకుమార్(నాని) ఆధ్వర్యంలో విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి నిర్బయ మృతికి సంతాపం తెలిపారు.
వైభవంగా శ్రీకృష్ణ దివ్య సాక్షాత్కార మహోత్సవం
కూచిపూడి, డిసెంబర్ 29: భక్తుల వాసుదేవ నామస్మరణల నేపథ్యంలో శ్రీ కృష్ణాశ్రమంలో శనివారం సీతారామ యతీంద్రుల శ్రీ కృష్ణ దివ్య సాక్షాత్కార మహోత్సవం సందర్భంగా శ్రీ కృష్ణాశ్రమంలో యతీంద్ర సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక ఉపనయనాలకు, దివ్య అభిషేకాలకు రాష్ట్రం నలుమూలల నుండి అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున నగర సంకీర్తన, సుప్రభాత సేవ, తిరుప్పావై రసధుని పారాయణం, 108 విడతలు శ్రీ సీతారామ యతీంద్రాష్టకం, నిత్యానుష్టాన పఠనం, శ్రీ సీతారామ యతీంద్రుల దివ్యమూర్తికి అభిషేకాల అనంతరం శాస్త్రోక్తంగా 14 మంది వటువులకు సామూహిక ఉపనయనాలు జరిగాయి. అనంతరం అన్నదానం జరిగింది. ముత్తీవి సీతారాం గురుదేవులు వటువులను, భక్తులను ఆశీర్వదించి గాయత్రీ మంత్రోపదేశాన్ని చేశారు. హరిసత్యన్నారాయణ శర్మ యాజ్ఞీకంలో ఈ కార్యక్రమం జరిగింది.

మానవ మృగాలను బతకనివ్వద్దు
గ్యాంగ్‌రేప్ బాధితురాలి సంతాప సభలో పలువురి డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 29: దేశ రాజధానిలో పారా మెడికల్ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడి ఆమె మృతికి కారకులైన మానవ మృగాలను బహిరంగంగా ఉరి తీయాలని, ఆ దిశగా చట్టాలను కఠినతరం చేయాలని సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తెల్లవారుఝామున మృతి చెందిన గ్యాంగ్ రేప్ బాధితురాలికి సంతాపం తెలుపుతూ అపర కీచకులను తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, ఎఐవైఎఫ్, నగర మహిళా సమాఖ్య, ఎఐఎస్‌ఎఫ్ నగర సమితుల ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్‌లో శనివారం వందలాదిమందితో మానవహారం జరిగింది. కార్యకర్తలు నల్ల జెండాలు, ప్లకార్డులు చేతబూని మృతురాలికి సంతాపం తెలియజేయడంతోపాటు ఈ దుస్సంఘటన పట్ల తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా దేశం నడిబొడ్డులో ఒక విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరగడం అమానుషమన్నారు. గత 13 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ అసువులు బాసిన బాధితురాలి మృతి చూసైనా పాలకుల్లో చలనం రావాలని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలుపుతూ మహిళలకు రక్షణ కల్పించేందుకు చట్టాలు రూపొందించినప్పటికీ ఆ చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అత్యాచారాలకు పాల్పడ్డ నిందితులు సమాజంలో యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పెనె్మత్స దుర్గ్భావాని, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నవనీతం సాంబశివరావు, నగర మహిళా సమాఖ్య కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, ఎఐఎస్‌ఎఫ్ నగర కార్యదర్శి రఘువీర్ మాట్లాడుతూ ఇటువంటి ఘోర కృత్యాలకు పాల్పడే కామోన్మాదులకు సమాజంలో జీవించే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శివర్గ సభ్యులు వియ్యపు నాగేశ్వరరావు, నగర కార్యవర్గ సభ్యులు తీరం దుర్గారావు, లంక దుర్గారావు, డివి రమణబాబు, శాఖా కార్యదర్శులు పప్పుల కోటేశ్వరరావు, జి సైదులు, తూనం వీరయ్య, పి తాతారావు, పూజారి దుర్గారావు, ఖాదర్‌ఖాన్, కంచర్ల నాగేశ్వరరావు, బి వీరాంజనేయులు, ఎండి ఇక్భాల్, పగిడికత్తుల రాము, ఎఐటియుసి నగర అధ్యక్షుడు ఎంవి షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.

పోస్టల్ బ్యాలెట్‌లోనూ... దూసుకుపోయన బస్సు!
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 29: ఎపిఎస్ ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లోనూ 50 శాతం పైగా ఓట్లు సాధించి స్పష్టమైన ఆధిక్యతలో ఎంప్లారుూస్ యూనియన్ గుర్తింపు సాధించింది. రాష్ట్రంలో ఎటూ భారీ ఆధిక్యతతో విజయకేతనం ఎగురవేసిన విషయం విదితమే. తాజాగా శనివారం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 183 ఓట్లకు గాను 158 పోలయ్యాయి. రీజియన్ గుర్తింపు (క్లాస్-6)లో ఎంప్లారుూస్ యూనియన్‌కు 85 ఓట్లు, ఎన్‌ఎంయుకు 71 ఓట్లు రాగా రెండు ఓట్లు చెల్లలేదు. ఈనెల 22 తేదీ ఎన్నికలు జరుగ్గా అదేరోజు రాత్రి ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 6817 ఓట్లకు గాను జిల్లాలో గుర్తింపుకు కనీసం 50 శాతం కంటే ఒక ఓటు అధికంగా సాధించాల్సి ఉంది. లేనిపక్షంలో రాష్ట్రంలో గుర్తింపుపొందిన సంఘమే ఇక్కడ కూడా గుర్తింపు సంఘంగా కొనసాగుతుంది. జిల్లా గుర్తింపుకు 3409 ఓట్లు సాధించాల్సి ఉండగా 22 తేదీ జరిగిన ఓట్ల లెక్కింపులో ఎంప్లారుూస్ యూనియన్ (ఇయు)కు 3351 ఓట్లు, నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయు)కు 3081 ఓట్లు లభించాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకుంటే ఇయుకు 3436 ఓట్లు, ఎన్‌ఎంయుకు 3152 ఓట్లు లభించాయి. 50 శాతం పైగా ఓట్లు లభించటంతో ఇయు జిల్లాలో కూడా గుర్తింపు సాధించింది. మొత్తంపై ఎన్‌ఎంయు కంటే 284 ఓట్లు అధికంగా లభించాయి. 2003 నుంచి వరుసగా 2003, 2005, 2008, 2010 నాలుగు ఎన్నికల్లోనూ ఎన్‌ఎంయు రాష్టస్థ్రాయిలో గుర్తింపు సాధించింది. ఆ సమయంలో 2005, 2008 ఎన్నికల్లో మాత్రం ఇయు 50 శాతం పైగా ఓట్లు సాధించి జిల్లాలో గుర్తింపు సాధించింది. మళ్లీ ఈ ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో జిల్లాలో తన పట్టు నిలుపుకోగల్గింది. ఈ సందర్భంగా ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద రాత్రి విజయోత్సవ సభ జరిగింది.

అత్యాచార బాధితురాలి మరణంతో నిరసన వెల్లువ
* ఆమె ఆత్మశాంతికి కొవ్వొత్తుల ప్రదర్శనలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 29: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనలో మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వైద్య విద్యార్థిని మృతిపట్ల విద్యార్థి లోకంతోపాటు రాజకీయపక్షాలు, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. నగరంలో ఎటు చూసినా నిరసనల వెల్లువెత్తాయి. పలుచోట్ల ఆ విద్యార్థిని ఆత్మశాంతికి కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. సిపిఐ, ఆ పార్టీ అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో లెనిన్‌సెంటర్‌లో మానవహారం జరిగింది. యువజన కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్ నాయకత్వంలో పటమట ఎన్టీఆర్ సర్కిల్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఐద్వా, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో...
అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం (ఐద్వా), డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐల ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు, మహిళలు నల్లబ్యాడ్జీలతో రాఘవయ్య పార్క్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఐద్వా నగర కార్యదర్శి కె.శ్రీదేవి, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి పి.మాధవ్, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షులు కె.బాబూరావు మాట్లాడుతూ త్వరితగతిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి నిందితులకు కఠినశిక్ష పడేలా చూడాలన్నారు.
సిద్ధార్థ మహిళా కళాశాలలో
సిద్ధార్థ మహిళా కళాశాలలో విద్యార్థినిలు, ఉపాధ్యాయినులు కొంతసేపు వౌనం వహించి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. మహిళలపై హింసను, దాడులను ప్రోత్సహిస్తున్న సినిమాలను నిషేధించాలని నినాదాలు చేశారు. స్టూడెంట్ కన్వీనర్ ఉజ్వల భారతి, ప్రిన్సిపాల్ టి. విజయలక్ష్మి, ఉమెన్ సెల్ కన్వీనర్ కల్పన తదితరులు విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు.
జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంపా కృష్ణ కిషోర్, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిక్కాల రజనీకాంత్, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నవనీతం సాంబశివరావు, ఆం.ప్ర. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పెనె్మత్స దుర్గ్భావాని, వైఎస్సార్ కాంగ్రెస్ కార్మిక విభాగం నేత ప్రభల శ్రీనివాస్, తదితరులు వేర్వేరు ప్రకటనల్లో బాధితురాలి మృతికి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ రకమైన దాడులు మున్ముందు పునరావృత్తం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్ర్తివిముక్తి ఆధ్వర్యంలో...
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్ర్తివిముక్తి సంఘటన, ఓపిడిఆర్‌ల ఆధ్వర్యంలో శిఖామణి సెంటర్‌లో మహిళలు, నాయకులు, నల్లబ్యాడ్జీలతో ప్లకార్డులు చేతబూని నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళలపై అత్యాచారాలకు కారణమైన పాలకులు పెంచి పోషిస్తున్న దుష్టశక్తిపై ధ్వజమెత్తాలంటూ నినదించారు. ఈ ఆందోళనలో ఓపిడిఆర్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఏసు, స్ర్తివిముక్తి రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ సి.విజయ, అరసం జిల్లా కార్యదర్శి కొండపల్లి మాధవరావు, ప్రజాసాహితీ ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబు తదితరులు ప్రసంగించారు.

గాంధీజీ మహిళా కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 29: విజయవాడ నగరం విద్యలవాడగానే కాకుండా అనేక రంగాల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటోందని ఆర్‌డిఓ ఎస్ వెంకటరావు చెప్పారు. గాంధీజీ మహిళా కళాశాలలో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ వెంకటరావు మాట్లాడుతూ 22సంవత్సరాలుగా క్రమశిక్షణ, ఉన్నత విద్యాప్రమాణాలతో కళాశాలను నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. ముఖ్యంగా తెలుగువారి సంస్కృతికి ప్రతీక అయిన పండుగలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడాన్ని ప్రోత్సహించారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ సిఎల్ కాంతారావు మాట్లాడుతూ విద్యార్థినులు విద్యతోపాటు సామాజిక, సేవారంగాల్లో కూడా ప్రవేశం కలిగి ఉండాలని చెప్పారు. తొలుత ఉదయం మహిళలు విద్యార్థినులకు ముగ్గులు, మెహందీ పూల అలంకరణ, సాంప్రదాయ వేషధారణ, మిస్‌వైట్, మిస్ బ్లాక్, తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు సాయంత్రం ఆర్‌డిఓ వెంకట్రావు బహుమతులు అందజేశారు. పేద ప్రతిభ కలిగిన విద్యార్థినులు 50మందికి యాజమాన్యం స్కాలర్‌షిప్‌లు అందజేసింది. కళాశాల కమిటీ ఉపాధ్యక్షుడు మానేపల్లి రాధాకృష్ణమూర్తి, కొత్తమాను వెంకట పిచ్చయ్య, కొణిజేటి రమేష్, నరహరిశెట్టి శ్రీహరి, ప్రిన్సిపాల్ ఎన్ శ్రీనివాసరావు, ఎం రమణశ్రీ ప్రసంగించారు. ఢిల్లీ అత్యాచార బాధితురాలు మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు వౌనం పాటించారు.

ప్రభుత్వ ఆదాయంలో ఐటిదే సింహభాగం
* జాతీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు సభ్యుడు కెవి చౌదరి

బెంజిసర్కిల్, డిసెంబర్ 29: కేంద్ర ప్రభుత్వానికి అందుతున్న అదాయంలో ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వాటా మిగతావాటి కంటే 20శాతం అధికంగా ఉందని జాతీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు సభ్యుడు కెవి చౌదరి తెలిపారు. పన్ను చెల్లింపుదారుల సౌకర్యం కోసం నగరంలో ఏర్పాటు చేసిన ఆయాకర్ సేవాకేంద్రాన్ని అయన శనివారం ప్రారంభించారు. అనంతరం అయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎడాదికి 5,72,500 కోట్ల రూపాయల పన్ను వసూలు లక్ష్యంగా ఆదాయశాఖ నిర్ణయించగా ఇప్పటివరకు 3,65,035 కోట్ల రూపాయల అదాయ లక్ష్యం చేరుకోగలిగామన్నారు. గత ఏడాదితో పోలిస్తే అదాయంలో 14శాతం వృద్ధి సాధించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రీజియన్‌కు సంబంధించి 30,044 కోట్ల లక్ష్యం కాగా ఇప్పటివరకు 19,231 కోట్ల రూపాయలు సాధించి 17శాతం వృద్ధిలో ఉన్నామన్నారు. అయితే ఇప్పటికీ కొంతమందికి పన్నులు ఎలా చెల్లించాలి, రిటర్న్స్ ఏవిధంగా దాఖలు చేయాలో తెలియదని వారికోసం ప్రత్యేకంగా అవగాహన కల్పించడంతోపాటు వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు దేశవ్యాప్తంగా ఆయాకర్ సేవాకేంద్రాలను ఎర్పాటు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 57కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. గత మూడు సంవత్సరాలుగా పన్ను ఎగవేతదారులను గుర్తించి సుమారు 32వేల కోట్ల రూపాయలను తనిఖీల ద్వారా రాబట్టినట్లు చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇన్‌కంట్యాక్స్ ఉన్నతాధికారులు బిబ్బర్ దత్తా, ఎ కె బెహ్రా, విజయవాడ రీజియన్ అధికారి కె అజయ్‌కుమార్ పాల్గొన్నారు.

ఇటీవల ఢిల్లీలో
english title: 
n

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>