గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 29: నరసరావుపేటలో జరిగిన సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యుడైన డిఎస్‌పిని తక్షణమే సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. సహకార సంఘాల సభ్యత్వ నమోదులో అవకతవకలు, టిడిపి నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగింది. శిబిరం వద్ద రోడ్డుపై బైఠాయించి నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లాపార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సంహకార సంఘాల సభ్యత్వ నమోదులో అక్రమాలు చోటు చేసుకున్నాయని, కాంగ్రెస్ నేతలు సభ్యత్వ నమోదు పుస్తకాలను తమ ఆధీనంలో ఉంచుకుని వారికి అనుకూలమైన వారికి సభ్యత్వం ఇస్తున్నారని ఆరోపించారు. దొంగ సభ్యత్వాన్ని తొలగించి అర్హులైన వారికి సభ్యత్వం ఇవ్వాలని, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులను బనాయించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ అధికార పార్ట నాయకులకుతొత్తుగా వ్యవహరిస్తున్న డిఎస్‌పి నాగరాజుకు ఉద్యోగం నుండి వెళ్లే రోజులు దగ్గరపడ్డాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కాసు కృష్ణారెడ్డి నల్ల కళ్లద్దాలు పెట్టుకుని కరుణానిధిలాగా వ్యవహరిస్తున్నారని, కరుణానిధి కుటుంబ సభ్యుల మాదిరిగానే కాసు తనయుడు కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే అవినీతి అక్రమార్కుల భరతం పడతామని హెచ్చరించారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నారని, కాంగ్రెస్ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. సహకార చట్టాలను చుట్టాలుగా మార్చుకుని దొడ్డిదారిన ఎన్నికల్లో గెలవాలని మంత్రి కాసు, అతని కుమారుడు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ అర్ధరాత్రి మహిళలు తిరిగితే అత్యాచారాలు జరగవా అని వ్యాఖ్యలు చేయడం దారుణమని, బాధ్యత గల మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నడిబజారులో ఉరి తీయాలన్నారు. నరసరావుపేట సంఘటనపై ప్రభుత్వం దిగిరాకపోతే జనవరి 2న ఆందోళనపై కార్యాచరణ రూపొందిస్తామని, న్యాయం జరిగే వరకూ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు గడువు ముగిసిన తర్వాత కూడా సెక్రటరిలను ఇళ్లకు పిలిపించుకుని కాంగ్రెస్ పార్టీలో అనియాయులైన వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారని ఆరోపించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ అరాచకాలకు అడ్డుకట్ట వేసి కార్యకర్తలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం కలెక్టర్ బంగ్లాకు చేరుకుని తమ డిమాండ్లతో వినతిపత్రాన్ని కలెక్టర్ సురేష్‌కుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఎస్‌ఎం జియావుద్ధీన్, తెనాలి శ్రావణ్‌కుమార్, నిమ్మకాయల రాజనారాయణ, ముమ్మనేని వెంకట సుబ్బయ్య, కందుకూరి వీరయ్య, నగర అధ్యక్షులు బోనబోయిన శ్రీనివాసయాదవ్, వెన్నా సాంబశివారెడ్డి, చందు సాంబశివరావు, కేశనశెట్టి రమాశాంతదేవి, వేములపల్లి శ్రీరాం ప్రసాద్, నరేంద్ర, మద్దిరాల మ్యాని, చిట్టాబత్తిన చిట్టిబాబు, నల్లపనేని విజయలక్ష్మి, పానకాల వెంకట మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
‘్ఢల్లీ’ విద్యార్థిని అమానత్ మృతితో
మిన్నంటిన నిరసనలు
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 29: ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన ఫార్మశీ విద్యార్థిని అమానత్ మృతిపై నగరంలో నిరసనలు మిన్నంటాయి. పలు విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాల నేతృత్వంలో ప్రదర్శనలు, రాస్తారోకోలు, మానవహారం నిర్వహించారు. దోషులను శిక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే దోషులను ఉరి తీయాలంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ, నిందితులను దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, గుంటూరు మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో వైద్యులు, వైద్యవిద్యార్థినులు అమానత్ మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక నాజ్‌సెంటర్ వరకు దాదాపు 500 మందికి పైగా భారీ ప్రదర్శన నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎ ప్రతినిధులు డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, డాక్టర్ కుసుమగాయత్రి, డాక్టర్ దీప్తిరెడ్డి, వైద్య కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని అమానత్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం నుండి లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిందితుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నగర కార్యదర్శి బి శివపార్వతి, సి విజయకుమారి, కె ఎస్తేరమ్మ, దేవమణెమ్మ, రెడ్డి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అమానత్ మృతికి కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, డివైఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థినులు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన జరిపారు. అనంతరం స్థానిక లక్ష్మీపురం మదర్‌థెరిస్సా విగ్రహం వద్దకు చేరుకుని మానవహారం నిర్వహించి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డి రమాదేవి, జన విజ్ఞాన వేదిక సమితి జిల్లా కన్వీనర్ శ్రీదేవి, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి లక్ష్మీనారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షులు పి గాలిబ్, ఐద్వా నగర కార్యదర్శి ఎల్ అరుణ, షకీల, లక్ష్మి, మల్లేశ్వరి, విద్యార్థినులు పాల్గొన్నారు. ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్‌ల ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం నిందితుల దిష్టిబొమ్మను ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ నగర కార్యదర్శి స్టాలిన్, నానె బ్రహ్మం, వెంకట్, రమేష్, అశ్విని, సుధ, గౌస్, సుభాని, సాయి, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎసిబికి చిక్కిన వీఆర్వో
* 8 వేల లంచం తీసుకుంటుండగా అరెస్టు
గుంటూరు (క్రైం), డిసెంబర్ 29: గుంటూరు తహశీల్దార్ కార్యాలయంలో బాధితుడి నుంచి 8 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఓ విఆర్‌ఒ ఎసిబి అధికారులకు శనివారం రాత్రి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెనాలి సమీపంలోని అంగలకుదురు గ్రామానికి చెందిన కోనేరు దిలీప్ తండ్రి ఇటీవల మృతిచెందాడు. తండ్రి పేరిట ఉన్న 90 సెంట్ల పొలం గుంటూరు నగర శివారులోని బుడంపాడు గ్రామంలో ఉంది. ఈ పొలాన్ని కొలతలు వేసి తన తల్లి లక్ష్మి పేరిట టైటిల్‌డీడ్‌ను మార్చాలని దిలీప్ కొంతకాలంగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇతని టైటిల్‌డీడ్ పత్రాన్ని గుంటూరు ఆర్‌డిఒ సంతకాలు చేసినా ఆ పత్రాలు ఇవ్వడానికి బుడంపాడు విఆర్‌ఒ ఏటుకూరి గురవయ్య అడ్డుగా నిలిచారు. ఈ పత్రాన్ని ఇవ్వడానికి అతను దిలీప్ నుంచి 10 వేల లంచం డిమాండ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య 10 నుండి 8 వేల రూపాయలకు బేరం కుదిరింది. కోనేరు దిలీప్ విజయవాడలోని ఎసిబి అధికారులను ఆశ్రయించారు. శనివారం రాత్రి గుంటూరులోని తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న గురవయ్యకు 8 వేల రూపాయలు లంచాన్ని ఇచ్చాడు. అప్పటికే కాపు కాసి ఉన్న ఎసిబి డిఎస్‌పి నరసింహారావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి గురవయ్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గురవయ్యను అరెస్ట్ చేసి ఆదివారం విజయవాడ ఎసిబి కోర్టుకు తరలించనున్నారు.
ఘనంగా త్రికోటేశ్వరునికి ఆరుద్రోత్సవం
నరసరావుపేట, డిసెంబర్ 29: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని భక్తులు, అతిథులు, ఆలయ ధర్మకర్త, అధికారులు ఘనంగా నిర్వహించారు. త్రికోటేశ్వరునికి జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మహారుద్రయాగం, ఆరుద్రాభిషేకం, చండీ, రుద్రయాగాలు, కోటి ఒత్తుల ఓంకారాన్ని వెలిగించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రామకృష్ణ కొండలరావుబహుదూర్, ఇవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. వందలాదిమంది భక్తులు స్వామివారి అభిషే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం ఉదయం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారికి నిర్వహించిన ఆరుద్రోత్సవంలో జిల్లా జడ్జి బి రామారావు, మరో జడ్జి దుర్గయ్య, శివశంకరరావుతదితరులు పాల్గొన్నారు. వంగల కృష్ణమూర్తి అవధాని పర్యవేక్షణలో ఆరుద్రోత్సవాన్ని నిర్వహించారు.
అత్యాచారానికి గురైన యువతి మృతికి సంతాప సూచికంగా
విద్యార్థుల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు
వినుకొండ, డిసెంబర్ 29: ఢిల్లీలో అత్యాచారానికి గురై యువతి మృతికి నిరసనగా పట్టణంలోని శివయ్యస్థూపం సెంటర్‌లో వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు నిరసన ర్యాలీలు, మానవహారం కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావుతమ మద్దతు ప్రకటించారు. పట్టణంలోని వాణీ జూనియర్ కళాశాల ప్రారంభమైన ర్యాలీ పల్నాడు రోడ్డుమీదుగా శివయ్యస్థూపం సెంటర్‌కు చేరుకుంది. విద్యార్థినీ విద్యార్థులు శివయ్యస్థూపం సెంటర్‌లో మానవహారం నిర్మించారు. మమ్మల్ని బతకనివ్వండి..సమాజాన్ని బతికించండి.. చేయని నేరాలకు మరణశిక్షలు మాకేందుకు..నిందితులను ఉరి తీయండి లేదా మమ్మల్ని ఉరి తీయండి, జీవించడానికి హక్కులేదా, జీవించడానికి పోరాడాలా అంటూ నినాదాలు చేశారు. శివయ్యస్థూపం సెంటర్‌లో విద్యార్థులు మానవహారంగా ఏర్పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈసందర్భంగా డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు మాట్లాడుతూ మహిళలపై దాడులు చేసేవారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. గ్యాంగ్ రేప్ బాధితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. పాంచజన్య పబ్లిక్ స్కూల్, వాసవి కానె్సప్ట్‌స్కూల్, కృష్ణవేణి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వాసవి జూనియర్ కళాశాల, ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అలాగే ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వాసవీస్కూల్ కానె్సప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు కోవ్వొత్తుల నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈకార్యక్రమంలో మాజీ ఎంపిపి ములకా రామతులసిరెడ్డి, వాసవికానె్సప్ట్‌స్కూల్ ప్రిన్సిపల్ ఎ గోపి, అధ్యాపకుల బృందం, ఎఐవైఎఫ్ నాయకులు సిహెచ్ రాంబాబు, బి నాగాంజనేయులు, కె కోటి, బాల, అబ్రహాం, పల్లె మరియబాబు, ఎన్ రామాంజీ, కె నాగాంజీ, కోటేశ్వరరావు, సత్యనారాయణ, సుబ్బారావుతదితరులు పాల్గొన్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి జూపూడి
గుంటూరు (లీగల్), డిసెంబర్ 28: శాసనమండలి సభ్యుడిగా జూపూడి యజ్ఞనారాయణ విమర్శల జడివానకు భయపడి ఎన్‌టిఆర్ అప్పటి శాసనమండలిని రద్దు చేశారని, సమస్యలపై నిబద్ధతగల యోధుడుగా తిరుగులేని పోరాటం సల్పిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని పలువురు భారతీయ జనతా పార్టీ జిల్లా నేతలు కొనియాడారు. దివంగత ఎమ్మెల్సీ, న్యాయవాది జూపూడి యజ్ఞనారాయణ 98వ జయంతి ఉత్సవాలు స్థానిక అరండల్‌పేటలోని ఓ ఫంక్షన్ హాలులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సీనియర్ న్యాయవాది కిడాంబి దేవరాజన్ అధ్యక్షత వహించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు వల్లెపు కృపారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యడ్లపాటి రఘునాధ్‌బాబు, రాష్ట్ర కిసాన్‌మోర్చ అధ్యక్షుడు జమ్ముల శ్యాంకిషోర్ జూపూడి సేవలను కొనియాడారు. ఈ సభలో జూపూడి జీవిత చరిత్రకు సంబంధించి డాక్టర్ దుగ్గంరాజు శ్రీనివాసరావు రచించిన ‘బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ జూపూడి’ అనే పుస్తకాన్ని వనమా పూర్ణచంద్రరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నగర అధ్యక్షుడు జూపూడి రంగరాజు, జూపూడి హైమావతి, నేరెళ్ల మాధవరావు, ఆలూరు కోటేశ్వరరావు, పాలపాటి రవికుమార్, గుండవరపు జగన్మోహనరావు, సీనియర్ న్యాయవాదులు బొప్పూడి శివరామకృష్ణప్రసాద్, పప్పి, గిరీష్, శ్రీదేవి, రాజ్యలక్ష్మి, పద్మనాభం, లక్ష్మీ అనుపమ తదితరులు పాల్గొన్నారు.
సకలగుణ మనోభిరాముడు శ్రీరామచంద్రుడు
* రామకోటి మహోత్సవ ప్రారంభ సభలో వక్తలు
గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 29: అయోధ్యాపురి వాసులను కన్నబిడ్డల్లాగా పాలించిన శ్రీరామచంద్రుడు సకల గుణ మనోభిరాముడని నగరంలో ప్రారంభమైన రామకోటి మహోత్సవాల్లో అతిథులుగా విచ్చేసిన పలువురు వక్తలు ప్రస్తుతించారు. స్థానిక ఆర్ అగ్రహారంలోని శ్రీరామ నామక్షేత్రంలో ఐదు రోజుల పాటు జరిగే 80వ శ్రీరామకోటి మహోత్సవాలు శనివారం రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన రామభక్తుల సీతారామ నామ స్మరణల మధ్య వేడుకగా ప్రారంభమైనాయి. ఉత్సవాలను అష్టలక్ష్మీ పీఠాధిపతి దండి నిర్మలానందగిరి స్వామి (తెనాలి) అఖండ జ్యోతి ప్రజ్వలన చేసి అంకురార్పపణ గావించారు. ఈ సందర్భంగా క్షేత్ర ప్రవచన వేదికపై జరిగిన ఆధ్యాత్మిక గోష్టిలో భక్తులనుద్దేశించి నిర్మలానందగిరిస్వామి, చింతలపాటి పూర్ణచంద్రరావు, స్వాగతోపన్యాసం చేసిన శ్రీ సీతారామనామ సంకీర్తన సంఘ కార్యదర్శి రాగం రామపిచ్చయ్య, శృంగేరీపీఠ ప్రతినిధి పోలిశెట్టి శ్రీహరి ప్రసాదరావు, వేదస్వస్తి చేసిన పలువురు వేద పండితులు రామనామ మహత్యాన్ని వివరించారు. చావలి వెంకట సూర్యనారాయణశర్మ, అనుగ్రహ భాషణం చేసిన బ్రహ్మానందతీర్ధస్వామి, నందిగామ హరేరామ శర్మ తదితర పండితులు కలియుగంలో కేవలం దైవనామ స్మరణతోనే ముక్తి లభిస్తుందని ఉద్బోధించారు.
మల్లాదిలో ఘనంగా గోదారంగనాథుల కల్యాణం
అమరావతి, డిసెంబర్ 29: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శనివారం మండల పరిధిలోని మల్లాది గ్రామంలో వేంచేసియున్న వటవృక్షాంతర్గత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గోదారంగనాథుల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణ వశిష్టులు పరుచూరి శ్రీనివాసాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు వినుకొండ శ్రీనివాసాచార్యులు కల్యాణంలో పాల్గొన్న 50 మంది దంపతులచే తలంబ్రాలు పోయించారు. వటవృక్షాంతర్గత వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కూడా విశేషంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి జ్వాలా లక్ష్మీనరసింహారావు, మాజీ సర్పంచ్ భవిరిశెట్టి హనుమంతరావు పాల్గొన్నారు.
10 కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు
గుంటూరు, డిసెంబర్ 29: జిల్లాలో ఏర్పాటు చేసిన పది కొనుగోలు కేంద్రాల ద్వారా ఈనెల 31వ తేదీ నుండి పత్తిని కొనుగోలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్ యువరాజ్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన రోజుల్లో ఆయా మార్కెట్‌యార్డుల వద్ద సిసిఐ కొనుగోలు చేస్తుందని చెప్పారు. గుంటూరు, తాడికొండ, సత్తెనపల్లి యార్డుల్లో సోమ, బుధ, శుక్ర వారాల్లోనూ పెదనందిపాడు, మాచర్ల యార్డుల్లో మంగళ, గురు, శని, చిలకలూరిపేట యార్డులో సోమ, గురు, నరసరావుపేట, ఫిరంగిపురంలో బుధ, శని, క్రోసూరులో మంగళ, శుక్ర, పిడుగురాళ్లలో మంగళ, శని వారాల్లో పత్తిని కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ జెడి శ్రీనివాసరావు, సిసిఐ జిఎం పాణిగ్రహి, ఆర్‌డిఒలు, యార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.
అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలి
మంగళగిరి, డిసెంబర్ 29: ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అమె మరణానికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌వైఎస్, పిడిఎస్‌ఓ ఆధ్వర్యంలో శనివారం మంగళగిరి పట్టణంలో విద్యార్థులు, యువజనులుప్రదర్శన నిర్వహించారు. పిడిఎస్‌ఓ నాయకులు ఎస్‌కె నాగూర్ మాట్లాడుతూ మృత్యువుతో పోరాడి బాధితురాలు మరణించిందని సంతాపం తెలిపారు. సాంబశివరావు, రవికిషోర్, అజయ్, గోపి, షబానా, బాలకృష్ణ పాల్గొన్నారు.
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రేపిస్టుల దిష్టిబొమ్మ దగ్ధం
ఢిల్లీలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ మహిళా సమాఖ్య, ఎఐఎస్‌ఎఫ్, సిపిఐ ఆధ్వర్యాన శనివారం మంగళగిరి పట్టణంలో ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహం సెంటర్లో రేపిస్టుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహిళా సమాఖ్య నాయకురాలు కట్టెపోగు రత్నమాణిక్యం, గుడిమెట్ల శివకుమారి, ఎఐఎస్‌ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు జి కోటేశ్వరరావు, సిపిఐ నాయకుడు కూరపాటి మురళీరాజు, పిల్లలమర్రి నాగేశ్వరరావు, షేక్ సుభాని, దస్తగిరి, ఇస్మాయిల్, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అందరి సహకారంతోనే గ్రామస్వరాజ్యం
* కలెక్టర్ సురేష్‌కుమార్
చేబ్రోలు, డిసెంబర్ 29: అభివృద్ధి అనేది ఏ ఒక్కరి వల్ల జరిగే పనికాదని, చేయి చేయి కలిపి అందరూ సహకరిస్తేనే గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. మండల పరిధిలోని శలపాడు గ్రామంలో వెలగపూడి నళినీ స్మారక సేవా సంస్థ, జిల్లా పరిషత్ సంయుక్త నిధులతో నిర్మించతలపెట్టిన కమ్యూనిటీ హాలు భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ శనివారం భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి పొందిన వారైనా ఉన్న ఊరిలో గుర్తింపు పొందాలన్నది మన భారతీయ సంస్కృతి అన్నారు. గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి సదాశయంతో ముందుకు వచ్చిన వెలగపూడి బాపూజీరావు ఎంతైనా అభినందనీయులని కొనియాడారు. శలపాడు నుంచి కమ్యూనిటీ హాలు మీదుగా జాగర్లమూడి వరకు వెళ్లే రోడ్డును 70 లక్షల రూపాయలతో నిర్మించడం జరుగుతోందన్నారు. కమ్యూనిటీ హాలు భవన నిర్మాణానికి అవసరమైతే తన నిధులను కూడా మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర, తెనాలి ఆర్‌డిఒ శ్రీనివాసమూర్తి, పంచాయితీరాజ్ ఎస్‌ఇ సి సూర్యనారాయణ, ఇఇ ఎస్ గోవర్ధనరెడ్డి, ఎఇ వెంకట్రావ్, విఆర్‌ఒ లోకనాధరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఎన్నికల్లో
ఎంప్లారుూస్ యూనియన్‌కు గుర్తింపు
గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 29: ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో 5,667 ఓట్లు ఉండగా, 5,571 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. జిల్లా గుర్తింపు సంఘానికి 2,835 ఓట్లు సాధిస్తే విజయం సాధించినట్లే. ఎంప్లారుూస్ యూనియన్‌కు 2,484 ఓట్లు రాగా, నేషనల్ మజ్దూర్ యూనియన్ 2,771 ఓట్లు వచ్చాయి. ఏ యూనియన్ అయినా జిల్లా గుర్తింపు సంఘంగా గెలవాలంటే 2,835 ఓట్లు తప్పనిసరి. నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు 64 ఓట్లు వస్తే ఈ ఎన్నికల్లో జిల్లా గుర్తింపు లభించేది. ఎన్నికల సమయంలో విధుల నిర్వహణ కారణంగా 84 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ నెల 27,28,29 తేదీల్లో కార్మికశాఖ కార్యాలయంలో వారి కోసం ఓట్లు వేసే సౌకర్యం కల్పించడంతో 84 ఓట్లకు గాను 43 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీనిలో ఎంప్లారుూస్ యూనియన్‌కు 5 ఓట్లు, నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు 38 ఓట్లు రాగా, రాష్టస్థ్రాయిలో ఎంప్లారుూస్ యూనియన్ కూటమి విజయం సాధించడం వల్ల జిల్లా గుర్తింపు కూడా ఎంప్లారుూస్ యూనియన్‌కే దక్కింది. ఎన్‌ఎంయు ఓట్లు ఎంప్లారుూస్ యూనియన్ కన్నా అధికంగా సాధించినప్పటికీ 26 ఓట్ల తేడాతో జిల్లా గుర్తింపును కోల్పోయింది.
విస్తరణకు అడ్డుగావున్న కట్టడాలను తొలగించండి
గుంటూరు (కార్పొరేషన్), డిసెంబర్ 29: మంగళగిరి రోడ్డు విస్తరణలో భాగంగా ప్రైవేటు కట్టడాల యజమానులతో చర్చించి వాటిని తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె సుధాకర్ అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన పర్యటనలో భాగంగా ఆయన బొమ్మిడాల కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించి మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణకు ఆటంకంగా ఉన్న కట్టడాలను తొలగించాలన్నారు. తక్కెళ్లపాడు పంపింగ్ కేంద్రంలో పైపులైను లీకులను అరికట్టాలన్నారు. ఈ పర్యటనలో నగరపాలక సంస్థ ఎస్‌ఇ పి ఆదిశేషు, ఇన్‌చార్జి ఎఇ ఎ మహేష్, డిప్యూటీ ఎఇ జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అత్యాచారానికి గురైన యువతి మృతికి సంతాపంగా
రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులు
నరసరావుపేట, డిసెంబర్ 29: ఢిల్లీలో అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థిని మృతికి సంతాపంగా స్థానిక కృష్ణవేణి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు శనివారం సాయంత్రం చిలకలూరిపేట- నరసరావుపేట రహదారిపై బైఠాయించారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించారు. అత్యాచారం చేసిన నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. శిక్షలను వెంటనే అమలుపరిచేందుకు ప్రత్యేక మహిళాకోర్టును ఏర్పాటుచేయాలన్నారు. ఇకపై మహిళలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
లిటిల్‌హార్ట్స్ అనాథ శరణాలయం ఆధ్వర్యంలో...
స్థానిక శ్రీరాంపురంలోని లిటిల్‌హార్ట్స్ అనాథ శరణాలయం నుండి పట్టణ మహిళామండలి ఆధ్వర్యంలో శనివారం విద్యార్థినులు, మహిళలు ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో వైద్యవిద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళామండలి అధ్యక్షురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
రేపల్లెలో...
రేపల్లె: ఢిల్లీలో విద్యార్థినిపై దుండగులు వ్యవహరించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం స్పందించి నిందితులను ఉరి తీయాలని పిడిఎస్‌ఓ నినాదాలు చేస్తూ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా పిడిఎస్‌ఓ జిల్లా కార్యదర్శి నాగబసవయ్య మాట్లాడుతూ ఈసంఘటనకు కారణమైన టివి, సినిమా, మత్తు పదార్ధాలు, పానీయాలను వెంటనే ఎత్తివేయాలనే డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ తాత మోహన్‌రావుకు శనివారం అందజేశారు. ఈకార్యక్రమంలో పిడిఎస్‌ఓ పట్టణ కన్వీనర్ జి నాగేంద్రబాబు, నాయకులు శివరావు, కె శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెనాలిలో...
తెనాలి: అత్యాచారానికిగురై గత 13రోజులుగా మృత్యువుతో పోరాడి సింగపూర్ వైద్యశాలలో మరణించిన వైద్య విద్యార్థిని ఆత్మకు శాంతి చేకూరాలని పట్టణ బిజెపి నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. శనివారం రాత్రి స్థానిక గాంధీచౌక్‌లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బిజెపి నాయకులు కొవ్వొత్తులు వెలిగించి బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. ఈసందర్భంగా పట్టణ బిజెపి అధ్యక్షుడు అడుసుమల్లి సుధాకర్, పార్టీజిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ విజయభాస్కరరెడ్డి, ధార్మిక పరిషత్ రాష్ట్ర కన్వీనర్ అనంతాచార్యులు మాట్లాడుతూ ‘పాస్ట్‌ట్రాక్’ కోర్టులు ఏర్పాటుచేసి దోషులకు వెంటనే శిక్షలు అమలయ్యేలా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ గుంటూరు పార్లమెంటు కన్వీనర్ కె వాసుదేవనాయుడు, వేణు, హనుతమంతురావు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
గ్యాంగ్‌రేప్ నిందితులకు ఉరిశిక్ష వేయాలి
* మాలమహానాడు, ఎంఐఎం పార్టీల డిమాండ్
నరసరావుపేట, డిసెంబర్ 29: దేశ రాజధాని ఢిల్లీలో యువతిపై గ్యాంగ్‌రేప్ చేసి ఆమె మరణానికి కారణమైన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని మాల మహానాడు జిల్లా అధికారప్రతినిధి కూచిపూడి చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. డిసెంబర్ 16వతేదీ దేశంలో ఒక దుర్ధినమని అభివర్ణించారు. చైనా తరహాలో ఇండియాగేటువద్ద బహిరంగంగా నిందితులకు ఉరిశిక్ష అమలుచేయాలని కోరారు. దోషులను కఠినంగా శిక్షించాలని గడ్డం వెంకట్రావు, రవికుమార్, చిన సుబ్బారావు, నాగరాజు తదితరులు ఆ ప్రకటనలో కోరారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ నాయకులు ఢిల్లీలో గ్యాంగ్ రేప్‌కు గురైన మహిళ మృతి చెందిన సంఘటనను పురస్కరించుకుని దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయ ఏవో బాల సుబ్రహ్మణ్యంకు వినతిపత్రాన్ని అందజేశారు. మహిళాచట్టాలపై గుంటూరులోని కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని ఏవో బాలసుబ్రహ్మణ్యం నాయకులకు తెలిపారు. ఈకార్యక్రమంలో కరిముల్లా, వౌలాలి, మస్తాన్‌వలి, జక్రియా, నాజర్‌వలి పాల్గొన్నారు.
‘రామానుజం జయంతి విద్యార్థులకు ఓ స్ఫూర్తి’
తెనాలి, డిసెంబర్ 29: గణితం మేధావి రామానుజం జయంతి వేళ బాష్యం విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో గణితంలో ప్రతిభా పొటీలు నిర్వహించడం ద్వారా వారిలో ఓ స్ఫూర్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని భాష్యం సంస్థ జోనల్ ఇంచార్జి హనుమంతరావు అన్నారు. స్థానిక బాష్యం స్కూల్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల రామానుజం జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు గణితంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రతిభా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈక్రమంలో తెనాలి భాష్యం విద్యార్థులు పి సుమంత్ ప్రథమ బహుమతి, సిహెచ్ సాయిజగదీశ్వర్ ద్వితీయ బహుమతి, సిహెచ్ వెంకటగణేష్ తృతీయ బహుమతి సాధించగా, అద్భుత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను హనుమంతరావు అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ఎం బ్రహ్మానందం , ఉపాధ్యాయలు పాల్గొన్నారు.
శ్రీచైతన్య టెక్నోస్కూల్ ఆవరణలో...
ప్రపంచం గర్వించ దగ్గ గణిత మేధావుల్లో ఒకరైన శ్రీనివాస రామానుజం విద్యార్థులకు ఆదర్శమని శ్రీచైతన్య టెక్నోస్కూల్ ప్రిన్సిపాల్ పూర్ణిమ పేర్కొన్నారు. స్థానిక శ్రీచైతన్య టెక్నోస్కూల్ ఆవరణలో శనివారం గణితం అంశాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ పూర్ణిమ మాట్లాడుతూ గణితం సులభంగా అర్ధమయ్యేందుకు శ్రీనివాస రామానుజం విద్యార్థిలోకానికి అందించిన తేలిక పద్ధతులను వివరించారు. గణిత సిద్ధాంతాలు, పజిల్స్, ప్రయోగాత్మక చిత్రాలు ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. శ్రీనివాస రామానుజం గణితంలో చేసిన కొన్ని ప్రయోగాలను విద్యార్థులు ప్రదర్శనలో చూపించారు. శ్రీనివాసరామానుజం జీవిత చరిత్రను బుర్రకథగా ప్రైమరీ విద్యార్థులు గానం చేశారు.కార్యక్రమంలో ఎజిఎం అంజయ్య, రీజిలన్ కోఆర్డినేటర్ అప్పాజి పాల్గొన్నారు.