Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వర్షం నీటితో నిండిపోయిన తెలుగుమహాసభల ప్రాంగణం

$
0
0

తిరుపతి, డిసెంబర్ 30: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాల్గవ తెలుగుమహాసభలు ముగిసి ఐదారు గంటలు కూడా గడువకముందే ఆదివారం కురిసిన వర్షం నీటితో సభా ప్రాంగణాలన్నీ నీటిమయమయ్యాయి. రోడ్లన్నీ బురదమయమయ్యాయి. వాస్తవానికి శనివారం నాటి నుండే ఆకాశం మేఘావృతమై ఒక మోస్తరు వర్షం పడుతూనే వుంది. హైదరాబాద్ నుండి శనివారం ఉదయం తిరుపతికి రావలసిన ఓ విమానం మబ్బుల కారణంగా చెన్నైకి వెళ్లిన విషయం విదితమే. దీంతో ముగింపు సభలకు మధ్యాహ్నం హాజరు కావలసిన ముఖ్యమంత్రి రాక కూడా అనుమానాస్పదంగా మారింది. అవసరమైతే చెన్నైకి విమానంలో వెళ్లి అక్కడ నుండి రోడ్డు మార్గంలో అయినా తిరుపతికి చేరుకుని ముఖ్యమంత్రి సభల్లో పాల్గొంటారని అధికారులకు గట్టి విశ్వాసం వుంది. అదృష్టవశాత్తు ఆయన ప్రయాణించిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ఇదే సమయంలో చెన్నై నుండి హెలికాప్టర్‌లో రావలసిన మరో ముఖ్యఅతిథి తమిళనాడు గవర్నర్ రోశయ్య హాజరు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఆయన రోడ్డు మార్గంలో బయలుదేరి సభలకు ఆలస్యంగా వచ్చారు. వర్షం కారణంగా రోడ్లు మాత్రం చిత్తడిచిత్తడిగా తయారయ్యాయి. ప్రజలు మాత్రం వీటిని లెక్క చేయకుండా సభలకు హాజరయ్యారు. దాదాపు 10 గంటల వరకూ అన్ని సభలు జరుగుతూ వుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. శనివారం రాత్రి నుండి వర్షం మరింత జోరు అందుకున్నది. దీంతో ప్రధానవేదిక ప్రాంతంలోనూ, ఐదు ఉపవేదికల వద్ద, చర్చావేదికల వద్ద వర్షపునీరు పూర్తిగా నిలిచిపోయింది. ఆదివారం జిల్లా యంత్రాంగం మీడియాకు ఏర్పాటు చేసిన అభినందన సభ నిర్వహణ సమస్యగా మారింది. అక్కడకు వెళ్లిన వారు బురద నీళ్లలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పటిష్టంగా ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్దే ఈ పరిస్థితి దర్శనం ఇవ్వడంతో అధికారులు కూడా విస్తుపోయారు. ఒక విధంగా చెప్పాలంటే సభా నిర్వహణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పోవడం ముఖ్యమంత్రి ఆగ్రహావేశం నుండి తప్పించుకున్నామని అధికారులు అనుకోవడం వినిపించింది. ఓరి దేవుడా..అంటూ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. టిటిడి అధికారులకు మాత్రం విశ్రాంతి లభించలేదు. ఎందుకంటే టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం నుండి అధికారులు ప్రపంచ తెలుగుమహాసభల్లో భాగస్వామ్యం అయిన విషయం విదితమే. అయితే నూతన ఆంగ్ల సంవత్సరం వస్తున్న నేపధ్యంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు నిమగ్నమయ్యారు. జిల్లా అధికార యంత్రాంగానికి ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కినా, టిటిడి అధికారులకు ఆ అవకాశం దక్కలేదు. ఏది ఏమైనా మూడు రోజుల సభలకు నెలరోజులు కష్టపడిన అధికారులు ఇక విశ్రాంతిలోకి జారుకున్నారు.

ఆగిన సోమశిల కాలువ పనులు
* సాగుతున్న స్వర్ణముఖి కాలువ
* ఆయకట్టు రైతుల నిరాశ
ఏర్పేడు, డిసెంబర్ 30: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయ మిగులు జలాలను వృధా కాకుండా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం సోమశిల-స్వర్ణముఖి లింకు కాల్వ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు ప్రభుత్వం 345కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు తయారు చేసింది. శ్రీపొట్టిశ్రీరామలు నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగు జలాలను అందించేందుకు వీలుగా కాల్వ తవ్వకాలు ప్రారంభించారు. పనులు ప్రారంభించిన వేళా విశేషం ఏమోకానీ తరచూ అభ్యంతరాలతో నాలుగేళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు కాల్వ పనులు కొలిక్కి రాకపోవడం గమనార్హం. తాజాగా అటవీశాఖ అభ్యంతరాలతో మళ్లీ పనులు ఆగిపోయాయి. కాల్వ పూర్తయితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని దాదాపు 86వేల ఎకరాలకు నీటి వసతి కలగనుంది. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల పరిధిలోని 65వేల ఎకరాలకు ప్రత్యక్ష ఆయకట్టుకు అనధికారికంగా 15వేల ఎకరాలకు సాగు జలాలు అందే అవకాశముంది. కాల్వ ఏర్పాటు పనుల్లో పక్కా ప్రణాళిక లేకపోవడంతో తరచూ అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో పనులు మరింత ఆలస్యమవుతున్నాయి. కాల్వ పూర్తవుతోందో లేదో అన్న విషయమై ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. కాల్వ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన వారం రోజుల వ్యవధిలోనే శ్రీకాళహస్తి మండలం యార్లపూడి గ్రామస్థులు భూములు లాక్కోవద్దంటూ అడ్డు తిరిగారు. టెండర్ దక్కించుకున్నది ఒకరైతే, బినామీలు తీసుకోవడం, నిధులు మంజూరులో జాప్యం కారణంగా గుత్తేదారులు పనులు చేయక వెళ్లిపోవడంతో పనులు ఆగిపోయాయి. అలైన్‌మెంట్ సరిగా లేదని, విలువైన భూములు పోతున్నాయంటూ రైతుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. భూసేకరణ చేసే లోపు నానా అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తీరా కొంతమేర భూసేకరణ పూర్తయ్యాక పరి హారం చెల్లింపులో ఆలస్యం కావడం, అవసరమైన మేరకు బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో మళ్లీ పనులు ఆగిపోయాయి. ఎలాగో ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో తలొగ్గిన ప్రభుత్వం పనులు వేగవంతం చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో పనులు ప్రారంభమయ్యాయి. తీరా కొందరు రాజకీయ నేతలు, గుత్తేదారుల మధ్య తలెత్తిన స్పర్థలతో నాలుగైదు నెలలు పనులు జరగలేదు. ఒక దశలో ఇక్కడ నుంచి యంత్రాలు, కూలీలంతా కూడా వెళ్లిపోవాల్సి వచ్చింది. తీరా రాజధాని స్థాయిలో జరిగిన మధ్యస్తంతో సమస్యలు సమసిపోయి పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా పనులు ప్రారంభించినా నాలుగు నెలలు తరువాత అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తిరిగి పనులు నిలుపుదల చేయాల్సి వచ్చింది.
* సహకారం ఉంటేనే పనులు జరిగేవి: ఇన్నాళ్లపాటు వివిద సమస్యలున్నప్పటికి ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ వచ్చాం. ఇక చేపట్టాల్సింది కాంక్రీట్ పనులే. రైతులు, ఇతర శాఖల అధికారుల సహకారం అందిస్తే త్వరగా ఆయకట్టు రైతులకు నీళ్లు ఇవ్వగలం. అదిలేకుంటే ఏమీ చేయలేని పరిస్థితి ఉందని సోమశిల స్వర్ణముఖి లింకుకాల్వ, డిఇఇ పరంధామరెడ్డి తెలిపారు.

నూతన ఆంగ్ల సంవత్సరాదికి టిటిడి సన్నద్ధం
తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు వెల్లడి
ఆంధ్రభూమిబ్యూరో
తిరుపతి, డిసెంబర్ 30: నూతన ఆంగ్ల సంవత్సరాది 2013ను పురస్కరించుకుని శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల కొరకు టిటిడి కట్టుదిట్టమైన దర్శన, వసతి ఏర్పాట్లు చేసిందని తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆదివారం తిరుమలలోని అన్నమయ్యభవన్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో సంవత్సరాదికి చేసిన ఏర్పాట్లను వివరించారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో సూచికలను ఏర్పాటు చేశామన్నారు. సర్వదర్శనం, దివ్యదర్శనం, విఐపి దర్శనాల్లో స్వామివారిని దర్శనం చేసుకునే భక్తులకు నిర్దేశిత సమయం, నిర్దేశిత క్యూలైన్లు, నిర్దేశిత ప్రదేశాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
* విఐపి భక్తులకు జనవరి 1వ తేదీన ఉదయం 4గంటల నుండి 7గంటల వరకు దర్శనం ఉంటుందన్నారు.
* దివ్యదర్శనం (కాలిబాట) భక్తులకు ఉదయం 7గంటల తరువాత మాత్రమే శ్రీవారి దర్శనం ఉంటుంది. కాగా దివ్యదర్శనం భక్తులకు డిసెంబర్ 31, 2012 మధ్యాహ్నం 2గంటల నుండి మాత్రమే నూతన ఆంగ్ల సంవత్సరాది దర్శన టోకెన్లు అందజేయబడుతాయన్నారు. అవి కూడా గాలిగోపురం, శ్రీవారి మెట్టు కౌంటర్లలో రెండింటికి కలిపి 15వేల టోకెన్లు మాత్రమే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

సిఎంకు ఘనంగా వీడ్కోలు
రేణిగుంట, డిసెంబర్ 30: తిరుపతిలో జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో పాల్గొని ఆదివారం ఉదయం హైదరాబాదుకు బయలుదేరిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఘనంగా వీడ్కోలు లభించింది. ఆయనకు వీడ్కోలు పలికిన వారిలో ఎంపి చింతామోహన్, డిసిసి అధ్యక్షులు అమాసరాజశేఖర్‌రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, టిటిడి బోర్డు సభ్యులు జి.వి.శ్రీనాథరెడ్డి, నాయకులు కిషోర్‌కుమార్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మమత, పులుగోరు మురళీకృష్ణారెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, రాయలసీమ ఐజి గోవింద్‌సింగ్, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, డిఐజి చారుసిన్హా, తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు, తుడా విసి పెంచల్‌రెడ్డి, ఆర్డీవో రామచంద్రారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, డిఇఓ ప్రతాప్‌రెడ్డి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. కాగా సిఎంతో పాటు స్పైస్‌జెట్ విమానంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పార్థసారధి బయలుదేరి హైదరాబాదుకు వెళ్లారు.

మీడియా సహకారం ప్రశంసనీయం
* కృతజ్ఞతలు తెలిపిన జిల్లా కలెక్టర్
పుత్తూరు, డిసెంబర్ 30: నాలగవ ప్రపంచ తెలుగు మహాసభల విజయవంతం కావడానికి మాధ్యమ (మీడియా) సహకారం ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలో జరిగిన నాల్గవ ప్రపంచ మహాసభల్లో ఆదివారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధ్యమ ప్రతినిధులతో కలసి భోజనం చేస్తూ అందరు కలసి మెలసి సభలను విజయవంతం చేయడం ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం కావాలంటే మాధ్యమ ప్రతినిధుల సహకారం అవసరం అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి సంచాలకులు రాళ్లబండి కవితా ప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారి కళారూపాలు ఇప్పటికి బతికి ఉన్నాయంటే మాధ్యమ ప్రతినిధుల కృషేనని చెప్పారు. కళామ తల్లికి జేజేలు పలుకుతూ రానున్న కాలంలో రాష్టస్థ్రాయిలో కళాజాతాలు నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు.

జగన్ విడుదల కోసం కోటి సంతకాల సేకరణ
తిరుపతి, డిసెంబర్ 30: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ను అన్యాయంగా, అక్రమంగా కాంగ్రెస్, టిడిపి కుమ్మకై జైల్లో పెట్టించారని తిరుపతి ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం స్ధానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట జగన్‌ను విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవ్వరెన్ని కుట్రలు చేసినా వైఎస్‌పై రాష్ట్ర ప్రజలకున్న అభిమానాన్ని చెరిపివేయలేరన్నారు. జగన్‌ను జైలుకు పంపి రాజకీయ డ్రామాలు ఆడుతున్న కాంగ్రెస్, టిడిపిలకు తగిన గుణపాఠం చెప్పెందుకు ప్రజలు సిద్దంగా వున్నారన్నారు. జగన్‌ను జైలు నుండి విడుదల చెయ్యాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అందుకు నిదర్శనమే కనివినీ ఎరుగని రీతిలో ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాఫ్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు ఎంవిఎస్‌మణి, వెంకటేష్, టి రాజేంద్ర, షపీ అహ్మద్ ఖాదరీ, బొమ్మగుంట రవి, మల్లం రవి, దుద్దెలబాబు, కొమ్ము చెంచుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ తెలుగుమహాసభల విద్యుత్ ఖర్చు అంచనా రూ. 1.75 కోట్లు
తిరుపతి, డిసెంబర్ 30: ప్రపంచ తెలుగుమహాసభలకోసం వినియోగించిన విద్యుత్ ఖర్చును ఎపిఎస్‌పిడిసిఎల్ అధికారులు 1.75 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఈ నెల 27 నుండి 29వతేది వరకూ మూడురోజుల పాటు వినియోగించిన విద్యుత్‌ను, సభా ఏర్పాట్లలో భాగంగా వివిధ విభాగాల వారు వినియోగించిన విద్యుత్ ఖర్చు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు సభలకు ముందుగా వినియోగించిన విద్యుత్ వినియోగం తదితర వ్యయాలను అన్నింటిని 1.75 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. 11 ట్రాన్స్‌ఫార్మర్లను, 1500 చిన్నబల్పులను, 600 పెద్ద బల్పులను అందజేశారు. ఇందులో కేవలం విద్యుత్ వినియోగానికి మూడు రోజులు అయిన ఖర్చు 9 లక్షల రూపాయలుగా అధికారులు నిర్ణయించారు. యూనిట్ 7.50 రూపాయలుగా ధరను తాత్కాలిక సేవల కింద అందించనున్నారు. ఈ నేపధ్యంలో ట్రాన్స్‌కో అధికారులు అంచనాల్లో సగం ఖర్చును ముందుగా అందజేసిన రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ విద్యుత్ వినియోగాన్ని బట్టి లెక్కలు కట్టనున్నది. ఇందులో లెక్కలు కట్టి వినియోగాన్ని బట్టి విద్యుత్‌శాఖ వ్యయం తక్కువగా వుంటే వారు తిరిగి రాష్ట్ర సాంస్కృతికశాఖకు ట్రాన్స్‌కోవారు మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి వుంటుంది. లేదా ఎక్కువ వ్యయం అయితే ట్రాన్స్‌కోకు సాంస్కృతిక శాఖ ఆ మొత్తాన్ని చెల్లించేవిధంగా ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రపంచ తెలుగుమహాసభల్లో పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం అయిన నేపధ్యంలో ఖర్చు కోటి రూపాయలు దాటే అవకాశం వుందని ట్రాన్స్‌కో అధికారులు అంచనా వేస్తున్నారు. సభలకు ఏర్పాటు చేసిన 11 ట్రాన్స్‌పార్మర్లను ఆదివారం నాడు తొలగించి తరలించే కార్యక్రమాన్ని విద్యుత్‌శాఖ అధికారులు చేపట్టారు.

యుజిసి నెట్ పరీక్షలు ప్రశాంతం
తిరుపతి, డిసెంబర్ 30: ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన యుజిసి వారి నేషనల్ ఎలిజబులిటి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్వీయూ వీసి రాజేంద్ర ప్రకటించారు. యూనివర్శిటీ, డిగ్రీ స్ధాయి ఆచార్యులకు, అధ్యాపకులకు ఆరు నెలలకు ఒక మారు నిర్వహించే అర్హత పరీక్షల్లో ఈ మారు 74 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. 26 శాతం గైర్హాజరయ్యారన్నారు. ఈ నెట్ పరీక్షలకు మొత్తం 8755 మంది దరఖాస్తులు చేసుకోగా 6496మంది హాజరయ్యారన్నారు. ఆదివారం ఎస్వీయూలోని 10 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినందులకు ఆచార్య శ్రీనివాసులు, బుద్దుడు, ఆచార్య పాపారావు, అప్పారావు, కె శ్రీనివాసులనాయుడు, రిజిస్టార్ కె సత్యవేలురెడ్డిలను వీసి అభినందించారు.

13 నుండి లడ్డూ ప్రసాదసేవ
ఆంధ్రభూమిబ్యూరో
తిరుపతి, డిసెంబర్ 30: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు వైకుంఠం-1 లడ్డూ కౌంటర్, అదనపు లడ్డూ కౌంటర్లలో లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా అందించడానికి గాను 2013 జనవరి 13వ తేదీ నుండి ‘లడ్డూప్రసాదసేవ’ టిటిడి ప్రవేశపెట్టనుందని టిటిడి ప్రజాసంబంధాల అధికారి తలారి రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 17న టిటిడి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పరకామణిసేవ’ విశేష ఫలితాలను ఇస్తుండడంతో అదే ప్రేరణతో టిటిడి లడ్డూ ప్రసాదసేవను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా ముందుగా వైకుంఠం-1, అదనపు లడ్డూ కౌంటర్ల ప్రాంతాల్లో చెరో నాలుగు కౌంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ నూతన సేవను ప్రవేశపెట్టనుంది. ఈ సేవలో పాల్గొనదలిచిన భక్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే రిజిష్టర్ చేసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక వెబ్‌పేజీని కూడా కొన్ని నిర్దేశిత నియమావళి మరియు విధివిధానాలతో రూపొందించిందని తెలిపారు. ఈమేరకు వెబ్‌సైట్‌లో డిసెంబర్ 28వ తేదీ నుండి భక్తులకు అందుబాటులోనికి వచ్చిందన్నారు. ఈ సేవలో ఉచితంగా సేవలు అందించదలిచిన భక్తుల కొరకు రూపొందించిన విధివిధానాలు ఇలా ఉన్నాయి.
* లడ్డూప్రసాదసేవ శ్రీవారి సేవలో ఒక నూతన విభాగం. ఇందులో పాల్గొనే శ్రీవారి సేవకులను లడ్డూ ప్రసాద సేవకులుగా వ్యవహరిస్తారు.
* లడ్డూప్రసాదసేవలో పాల్గొనదలిచిన భక్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
* లడ్డూప్రసాదసేవలో పాల్గొనే సేవకులు ప్రభుత్వ ఉద్యోగ లేదా విశ్రాంత ఉద్యోగ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగులుగా మాత్రమే ఉండాలి.
* లడ్డూప్రసాదసేవలో కేవలం పురుష సేవకులు మాత్రమే పాల్గొనవచ్చు.
* లడ్డూ ప్రసాదసేవలో పాల్గొనే వ్యక్తులు తప్పనిసరిగా హిందూమతస్తులై ఉండి టిటిడి నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
* సేవకు హాజరు తెలిపే లడ్డూప్రసాద సేవకులు తప్పనిసరిగా తమ ఉద్యోగ లేదా విశ్రాంత ఉద్యోగ గుర్తింపు కార్డులను, ఆన్‌లైన్ నమోదు ఫారంను మరియు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తమ వెంట తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు.

పింఛన్ల పంపిణీలో రూ. 2.36లక్షలు స్వాహా
*పంచాయతీరాజ్ పనుల్లో రూ. 56774 అవినీతి
*పదిమంది మేట్‌లు, 9మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లకు జరిమానా
*మదనపల్లె సామాజిక బహిరంగసభలో జిల్లా అదనపు పిడి తిప్పేస్వామి వెల్లడి
మదనపల్లె, డిసెంబర్ 30: జాతీయ ఉపాధిహామీ పథకం కింద పింఛన్ల పంపిణీలో రూ.2.36లక్షలు, పంచాయతీరాజ్ రోడ్డు పనుల్లో రూ.56774లు స్వాహా చేసినట్లు సామాజిక తనఖీ బహిరంగ సభలో వెల్లడైంది. పనులు చేసిన కూలీలకు మస్టర్ నిర్వహించడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పదిమంది మేట్‌లు, 9మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ వారికి 11వేల రూపాయలు జరిమాన విధించారు. మదనపల్లె మండలంలోని 16పంచాయతీల పరిధిలో 2011 నవంబర్ 1నుంచి 2012 అక్టోబర్ 31వ తేది వరకు జరిగిన జాతీయ ఉపాధిహామీ పనుల్లోని ఉపాధిపనులు, పింఛన్లు, పంచాయతీరాజ్ పనులు, అటవీశాఖ పరిధిలో జరిగిన పనులపై నెలరోజులుగా నిర్వహించిన విచారణపై ఆదివారం ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో సామాజిక బహిరంగ సమావేశం నిర్వహించారు. మదనపల్లె ఎంపిడిఓ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా డ్వామా అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ తిప్పేస్వామి, ఎపిడి దీక్షాకుమారి, ఎస్‌ఆర్‌పి మునిరత్నం హాజరయ్యారు. ఏడాది కాలంలో ఉపాధి పనులు చేసిన కూలీలకు 11278308లు వ్యయం చేయగా, పరికరాలకు 3207624 రూపాయలు ఖర్చుచేశారు. అయితే పనులకు వచ్చిన కూలీల మస్టర్‌లు సకాలంలో వేయకపోవడంలో నిర్లక్ష్యం వహించిన మేట్‌లు, పట్టించుకోకుండా పోయిన ఫీల్డ్ అసిస్టెంట్‌లకు జరిమానా విధించారు. అదేవిధంగా పంచాయతీరాజ్ పరిధిలో రోడ్డు, భవనాల నిర్మాణానికి కూలీలకు 1629999లు, పరికరాలకు 10633237 రూపాయలు వెచ్చించారు. ఇందులో మండలంలోని సిటిఎం, కొత్తవారిపల్లె పంచాయతీల్లో జరిగిన రోడ్డు, భవనాల పనుల్లో 56774లు అవినీతి జరిగినట్లు విచారణలో తేలింది. దీనిపై చర్యలు తీసుకుంటూ రికవరీ చేయాలని ఎపిడి ఆదేశించారు. అటవీశాఖ పరిధిలో చేసిన పనులకు కూలీలకు 34054లు చెల్లించగా, పరికరాలకు 9706 రూపాయలు వెచ్చించారు. అయితే విచారణకు అటవీశాఖ అధికారులు రికార్డులు ఇవ్వకపోవడంతో వారికి నోటీసులు జారీచేయాలని అదనపుపిడి ఆదేశించారు. సమావేశంలో ఎంపిడిఓ గంగయ్య, ఎపిఓ మంజుల, సాంకేతిక అధికారి బాబా, ఎఇ విజయమోహన్, ఫీల్డ్‌అసిస్టెంట్‌లు, ఉపాధిసిబ్బంది పాల్గొన్నారు.

2వేల లీటర్ల పాలు నేలపాలు
పెద్దమండ్యం, డిసెంబర్ 30: మండలంలోని ఐకేపి ఆద్వార్యంలో కలిచెర్లలో పాలశీతల కేంద్రం ఏర్పాటు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో 2వేల లీటర్లపాలు చెడిపోవడంతో వాటిని నేలపాలు చేశారు. శనివారం ఓ అధికారి నిర్లక్ష్యం వల్లన మోటారు కాలిపోయి, కంప్రెసర్ పాడవడంతో పాలన్నీ చెడిపోయాయి. దీనివల్లన రైతులకు సూమారు 40వేల నష్టం వాటిల్లింది. ఈ విషయంపై సంబంధిత అధికారిని వివరణ కోరగా కంప్రెసర్ పాడవడంతో పాలు చెడిపోయాయని రైతులకు నష్ట పరిహారం చెల్లించడానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

తెలుగువారికి అవమానం
*తిరుపతిలో జరిగింది కాంగ్రెస్ మహాసభలు
*టిడిపి జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె విమర్శ
చిత్తూరు, డిసెంబర్ 30: చిత్తూరుజిల్లా తిరుపతి పట్టణ సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో మూడు రోజులపాటు జరిగింది నాల్గవ ప్రపంచ తెలుగుమహాసభలు కాదని, కాంగ్రెస్ సభలని తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు విమర్శించారు. ఆదివారం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుమహాసభల్లో తెలుగుజాతిని దేశ విదేశాల్లో చాటినవారి ఫొటోలు, తెలుగువారు ప్రధాన మంత్రిగా దేశాన్ని పాలించినవారి ఫొటోలు పెట్టకపోవడం దారుణమని శ్రీనివాసులు అన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో మూడు రోజులుగా జరిగిన తెలుగుమహాసభల్లో తెలుగుజాతికి వనె్నతెచ్చి, దేశ విదేశాల్లో చాటిచెప్పిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు ఫొటోలను ఉంచకపోవడం, వారికి నివాళులర్పించకపోవడం శోచనీయమన్నారు. ఎన్టీరామారావు కుమార్తె పురంధ్రేశ్వరి దేవి కేంద్ర మంత్రిగా తెలుగు మహాసభలకు హాజరై తన తండ్రి ఫోటో గురించి ప్రస్తావించకపోవడం తెలుగుజాతికే అవమానమని తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బిఎన్ రాజశింహులు మాట్లాడుతూ తెలుగుమహాసభలు జరిగిన చంద్రగిరి నియోజకవర్గ ఎంపి ఎన్ శివప్రసాద్‌ను సభలకు ఆహ్వానించకపోవడం సిగ్గుచేటన్నారు. దీన్నిబట్టి చూస్తే ఇది కాంగ్రెస్ మహాసభగా ఉంది తప్ప తెలుగుమహాసభ కాదన్నారు. సుమారు 100కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తెలుగుమహాసభలు నిర్వహించి గొప్పగొప్ప పదవులు అలంకరించిన తెలుగువారిని స్మరించుకోకపోవడం, వారి ఫొటోను పెట్టి ఒక పూలమాల వేయకపోవడం విచారకరమన్నారు. అందుకే వాటిని నాల్గవ తెలుగుమహాసభలు అని చెప్పడంకన్నా ప్రపంచ కాంగ్రెస్ మహాసభలు అని చెప్పుకోవడం మంచిదని ఆయన హితవు పలికారు. ఈ విలేఖర్ల సమావేశంలో టిడిపి బిసిసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి షణ్ముగం, జిల్లా ఉపాధ్యక్షులు నాని, వైవి రాజేశ్వరి, ఇందిర, బిసిసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు విల్వనాథన్, కార్యాలయ కార్యదర్శి ఎన్ మోహన్‌రాజ్, మాపాక్షి మోహన్, కుమార్ తదితరులు ఉన్నారు.

* ఊపిరి పీల్చుకున్న జిల్లా యంత్రాంగం * విశ్రాంతిలోకి జారుకున్న అధికార గణం
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>