అందరికీ తెలిసిన కథతోటే ఆరంభిద్దాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక ముష్టివాడు ఒక మండువా లోగిలి ముందు నిల్చుని బిచ్చమడిగాడు. ఆ ఇంటి కోడలు బయటకు వచ్చి ఏం లేదు పొమ్మంది. అంత పెద్ద ఇంట్లోనుంచి కోడలు బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. ఎదురుచూసి ఏమీ లేదనిపించుకున్న ముష్టివాడు మనసులో తిట్టుకుంటూ (ఈ కాలంలో పైకే తిడుతున్నారు) పక్కనున్న ఇళ్ళల్లో అడుక్కుందుకు వెళ్ళిపోయాడు. ఎక్కడో పెరట్లో ఉన్న అత్తగారికి వీధి గుమ్మం దగ్గర సంభాషణ వినిపించి ఆవిడ బయటకువచ్చేసరికి ముష్టివాడు నాలుగిళ్ళు దాటిపోయాడు.
అత్తగారు గుమ్మంలో నిల్చుని ‘‘ఏయ్, ఇలారా’’ అంది.
ముష్టివాడు వెనక్కి తిరిగి చూసి ‘‘చిన్నమ్మగారు పొమ్మన్నా పెద్దమ్మగారు రమ్మంటున్నారు. బిచ్చం వేస్తారు కాబోలు’’ అని ఆశతో వచ్చాడు.
‘‘అదెవరు ముష్టి లేదు పొమ్మనడానికి? ఈ ఇంటి యజమానురాలిని నేను. ఇప్పుడు ముష్టి లేదని నేను చెప్తున్నాను పో’’ అంది అత్తగారు.
ముష్టివాడు ఎంత నిరాశ పడ్డాడో కోడలెంత అవమానపడిందో కానీ అత్తగారి అహం సంతృప్తి చెందింది. ఇంటి యజమానురాలినన్న ఆవిడ అధికార దాహం చల్లారింది.
ఈ కథలో అతిశయోక్తి ఉందనిపిస్తుంది. ఏ అత్తగారైనా ముష్టివాడిని రమ్మని అలా చెప్తుందా? అయితే ఈ అత్తగారి ప్రవర్తనకు అతి దగ్గరగా కొందరు మనుషులు మసలడం మాత్రం మనం చూస్తూనే ఉంటాం. ఇంట్లో అందరి మాటకన్నా తనమాటే ఎక్కువగా చెల్లుబాటు కావాలి. ఆ సంగతి ప్రపంచమంతా (ప్రపంచమంటే అన్ని ఖండాలూ, అన్ని దేశాలూ కాదు. తనకున్న బంధుమిత్రులు, ఇరుగుపొరుగు, పనివాళ్ళు మాత్రమే) తెలియాలి. తనవల్లనే కుటుంబం నడుస్తోందనీ, తన చుట్టూనే తిరుగుతోందనీ అందరూ అనుకోవాలి. ఆ ప్రయత్నంలో ఇంట్లో మిగిలినవారేమైపోయినా, ఎంత బాధపడినా ఫరవాలేదు. ‘‘అయ్యో నేను ఉన్నాను కాబట్టి కానీ, మా కోడలైతే ఇల్లు నిప్పచ్చరమే అనుకో. రోజూ ఎన్ని బియ్యం పొయ్యాలో కూడా నేను చెప్పాల్సిందే. నేను దగ్గర లేకపోతే కూర ఉప్పు కషాయమే. దేవుడి హారతికి రెండు కర్పూరం బిళ్ళలు పెట్టింది. నా కొడుకూ సరే. అలాగే హారతిచ్చేశాడు. ఇలా అయితే కొంప కొల్లేరయిపోదా’’.
ఇలా... పాతతరం అత్తగారి సంభాషణ సాగిపోతూనే ఉంటుంది. నిజంగా కోడలికి ఇల్లు నడపడం రాదా? అత్తగారికి ఇంటి పెత్తనం వదలుకోడం రాదా? అధికారం చెలాయించాలి... అదే ముఖ్యం.
ఈ తరంలో కొన్ని చోట్ల రివర్స్ నడుస్తున్నది. అత్తగారు అంట్లు తోమే పని పిల్లకూ లోకువే. పెద్దావిడ ఏదైనా చెప్పబోతే ‘‘మేడమ్ చెప్పలేదు’’ అంటుంది. అత్తగారికి ఏమీ రాదని కోడలి నమ్మకం. ‘‘స్నానం చేసి గీజర్ వెంటనే ఆపెయ్యండి. హీటింగ్‌కి కరంటు ఎంతవుతుందో తెలుసా?’’ అంటుంది. వంటింట్లో ఆవిడ అడుగు పెట్టడానికి లేదు. ఈ మాడర్న్ గాడ్జెట్స్‌తో పని చెయ్యడం మీకేం తెలుసు? అంటుంది. ఆవిడకు వచ్చా రాదా?, ఆవిడ నేర్చుకోగలదా లేదా ? అన్నది ప్రశ్న కాదు. తను ఇంటికి రాణి, వంటింటికి మహారాణి. ఆ సామ్రాజ్యంలో ఇంకొకరు అడుగు పెట్టడానికి లేదు. తన అధికారాన్ని అరక్షణమైనా ఎవరూ తీసుకుందుకు వీలులేదు.
ఎందుకీ విపరీతమైన అధికార వాంఛ, పెత్తనం చెలాయించాలన్న కాంక్ష. ఈ కోరిక అత్తా కోడళ్ళకే పరిమితం కాదు. వారి విషయంలో కనబడ్డంత స్పష్టంగా ఇతరత్రా కన్పించకపోవచ్చును. ‘‘అయ్యో మా అమ్మాయి సంగతే చెప్పాలి. కాఫీ పెట్టడం కూడా రాదు. కాలేజీ నుంచి వచ్చి కాళ్ళు చాపుకుని పడుకుంటుంది. నేనే అన్నీ పట్టికెళ్ళి తినిపిస్తాను. ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివి. మీ నీరజ ఇంట్లో అన్ని పనులూ చేస్తుంది’’ అంటూ తనంత మంచి తల్లీ, తన కూతురంత పనికిరానిపిల్లా లేరని చెప్పుకోడం అమ్మకి ఆనందం. ‘‘ఇదిగో నా జీతంతో ఈ రవ్వల దుద్దులు కొనుక్కున్నాను’’ అంటూ గొప్పలు కొట్టుకునే ఉద్యోగినికి తన భర్త నగలు చేయించలేని అసమర్థుడనిచాటి చెప్పడంలో హాయి. (ఇల్లు భర్త జీతంతో నడవడం లేదా? అడగద్దు మరి). కుటుంబ సభ్యులందరినీ మించిపోవడమే జీవిత గమ్యమా?
అధికార వాంఛ అంతరాంతరాలలో అందరికీ ఉంటుంది. ఆ వాంఛను జయించాలి. అణిగి మణిగి వినయంగా ఉండడంలో ఆనందాన్ని పొందాలి. ధర్మరాజు రాజసూయయాగం చేసినప్పుడు అతిథుల కాళ్ళు కడిగే పనిని శ్రీకృష్ణుడు తన వంతుగా తీసుకున్నాడు. అగ్రతాంబూలానికి అర్హుడన్న గౌరవాన్నీ అందుకున్నాడు. ఒకరిస్తే గౌరవం కానీ... మనకి మనమే తీసుకుంటే ఏమిటి గొప్ప? ముష్టివాడి దగ్గర కోడలిపై పెత్తనాన్ని ప్రదర్శించాలన్న కోరిక అత్తగారికి గౌరవాన్ని ఇస్తుందా? ఆ అధికార వాంఛను జయిస్తేనే ఆమెకు మర్యాద దక్కేది కదా!
అధికార వాంఛను జయించడం అంత సులభం కాదు. అటువంటప్పుడు కనీసం వాంఛను లొంగతీసుకోవాలి. వాంఛ అనే గుర్రాన్ని అదుపులో పెట్టి సరైన మార్గంలో నడిపించాలి. మొదట చెప్పుకున్న అత్తగారి కథనే తీసుకుంటే అత్తగారికి అధికారం సాగించాలన్న కోరిక ఉంది. కేవలం తన ఇంట్లో తనకోడల్ని చెప్పు చేతల్లో ఉంచుకోవడం మాత్రమే ఆవిడ సాధించింది. అలా కాకుండా గ్రామ పంచాయితీలో తనున్న వార్డులో పోటీ చేసి మెంబరుగా గెలవచ్చు. గ్రామాలలో పంచాయితీ వార్డు మెంబరంటే గౌరవమే కదా. ఊరి దేవాలయం మరమ్మతునో, గుడిలో భజన సంఘం ఏర్పాటునో, స్కూల్లో పోటీలనో తన పనిగా స్వీకరించి చక్కగా చేసి నలుగురి మన్నననూ పొందవచ్చు. ఇంట్లో ఒక్క కోడలి మీద పెత్తనం కన్నా, ఒక పెద్ద కమిటీలో మాట చెల్లుబాటు చేసుకోవడం గొప్ప కాదా?
ఆధునిక యువతులకైనా, ఉద్యోగినులకైనా, పాతతరం గృహిణులకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. మన ప్రతిభను చూపి పదిమందిలో పేరు తెచ్చుకోడం, పదిమంది మన మాట వినేలా చేసుకోవడం అన్ని విధాలా అభిలషణీయం. మనస్సులో ఎలాగూ అధికార వాంఛ ఉంటే ఆ కోరికను సకారాత్మకంగా మార్చుకుని ధనాన్ని, కీర్తినీ సంపాదించుకోవడం, ఇంట్లోవారి మన్నన కూడా పొందడం మంచిది. కానీ మనలో నూటికి తొంభై మంది ఏం చేస్తున్నాం? మనలోని అధికార వాంఛను జయించడమూ లేదు, లొంగతీసుకోవడమూ లేదు. పాముకి పాలు పోసినట్లుగా దాన్ని పెంచి పోషిస్తున్నాం. ఇంట్లో వాళ్ళపై పెత్తనానికి ప్రయత్నిస్తూ, వాళ్ళని చులకన చేస్తూ, ఆ పెత్తనానే్న మహాసామ్రాజ్యాధిపత్యంగా భావిస్తూ అధికార వాంఛను విషవృక్షంలా పెంచుతున్నాం. ఆ వృక్షం నీడ నుంచి పారిపోడానికే ఆప్తులు ప్రయత్నిస్తారు. చివరకు ఆ విషవాయువులో మనకే ఊపిరాడదు. జాగ్రత్త. ఏదైనా మన చేతిలోనే ఉంది. అధికార దాహాన్ని వదులుకోవచ్చు, అగ్నికి ఆజ్యం పోస్తూనే ఉండవచ్చు. ఆలోచించి అడుగేద్దాం.
-పాలంకి సత్య
అందరికీ తెలిసిన కథతోటే ఆరంభిద్దాం.
english title:
yemiti adikara vancha..?
Date:
Saturday, February 4, 2012