హైదరాబాద్‌లో తనకు కావలసిన సాఫ్ట్‌వేర్ కంపెనీని ఎక్కువ శ్రమపడకుండానే పట్టుకోగలిగాడు సీతాపతి. తన కేబిన్‌లో అడుగుపెట్టిన సీతాపతిని ఎం.డి చక్రపాణి సాదరంగా ఆహ్వానించాడు. ఆఫీస్ బాయ్ లోనికి వచ్చి రెండు కాఫీ టేబిల్ మీద పెట్టాడు.
కాఫీ తాగాక ఖాళీ కప్పులను టేబుల్ మీద పెట్టారు ఆ ఇద్దరూ.
‘‘నేను మళ్ళీ వచ్చి కలుస్తాను చక్రపాణీ, నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావ్...’’ అన్నాడు సీతాపతి.
టేబుల్ మీదున్న ఖాళీ కప్పులను తీసుకుని బయటకెళ్ళాడు ఆఫీస్ బాయ్.
‘‘రాకరాక వచ్చావు, మనసు విప్పి మాట్లాడటానికి మొహమాట పడిపోతున్నావు... నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా- మరి మాట్టాడ్డానికి బిడియపడతావెందుకు?.. ఏదో పర్సనల్‌గా చెప్పాలని ఫోన్ చేశావ్, ఇప్పుడు చెప్పు’’ అన్నాడు చక్రపాణి.
‘‘చెప్పటానికి అదేమంత పెద్ద విషయం కాదనుకో- ఇప్పుడెందుకు, తర్వాత మాట్లాడుకుందాం’’ సీతాపతి లేవబోయాడు.
‘‘ఆగరా- ఆఫీసులో కూర్చున్నందుకు నువ్వు చాలా బాధపడిపోతున్నావ్. అలా బయటకెళ్లి ఏదైనా హోటల్లో కూర్చుందామా..?’’ సలహా ఇచ్చాడు చక్రపాణి.
‘‘హోటల్‌కెందుకురా- ఇక్కడే మాట్టాడుకుందాం.. మా అబ్బాయి ఎం.సి.ఏ చదివాడు. అప్పుడెప్పుడో నీకు చెప్పినట్టు గుర్తు. ప్రస్తుతం ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు.’’
‘‘చాలా సంతోషం... సీతాపతి కొడుకు మంచి పేరు తెచ్చుకోకపోతే చెడ్డ పేరు తెచ్చుకుంటాడా నీ పిచ్చిగానీ-’’ చిన్నగా నవ్వాడు చక్రపాణి.
‘‘అది నాపై నీకున్న అభిమానం’’
‘‘సరే టాపిక్ డైవర్ట్ చేయకు.. నువ్వు చెప్పాలనుకున్నదేదో చెప్పు సీతాపతి’’.
‘‘చల్లకొచ్చి ముంతదాయడమెందుకు?- మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకూడా మా అబ్బాయిని ప్రేమించిందట. మంచి అమ్మాయి, చాలా అందంగా ఉంటుందని మా అబ్బాయి చెబుతున్నాడు. అమ్మాయిని నేనింతవరకు చూడలేదు. ఆమె తల్లిదండ్రులెవరో తెలీదు. మరి ఎలా ముందుకెళ్లటం?’’ చక్రపాణి మొహంలోకి చూశాడు సీతాపతి.
‘‘ఈ రోజుల్లో ఎవరూ ముందుగా వివరాలు చెప్పడంలేదు... ఫరెగ్జాంపుల్- మాకు దగ్గర్లోనే మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. దాని ఎం.డి శేషగిరి. అతని కూతురి పేరు వైష్ణవి. ఆ అమ్మాయికి పెళ్ళిచేయాలని ఎన్నో సంబంధాలు చూశాడు శేషగిరి. కాని ఒక్కటీ క్లిక్ కాలేదు. తండ్రి ఆఫీసులోనే పనిచేస్తుంది వైష్ణవి. ఆమె శేషగిరి కూతురని ఆ ఆఫీసులో ఎవరికీ తెలీదు. కావాలనే శేషగిరి ఎవరికి పరిచయం చేయలేదు. అలా ఎందుకు చేశావని శేషగిరి నేనడిగాను. ‘వైష్ణవి నా కూతురని ఆఫీసు స్ట్ఫాకు తెలిసిన రోజు ఆమె దగ్గరకు వెళ్ళటానికి గానీ, ఆమెతో మాట్లాడటానికి గానీ ఎవరూ సాహించరు.. ఎం.డి కూతురన్న భయంతో. వైష్ణవి నాకూతురని తెలియనప్పుడు ఆమెతో మాట్లాడటానికి వెనుకాడేవారుండరు’ అన్నాడు శేషగిరి. ఆఖరికి ఆ ఆఫీసులో పనిచేసే ఒక ఇంజనీర్ అబ్బాయి ఆ వైష్ణవి భాగస్వామి అయాడు.. ఈ రోజుల్లో పెళ్లిచూపులు అంత ముఖ్యం కాదు. కాబోయే దంపతులు ఒకరినొకరు తెలుసుకొనటం ఇంపార్టెంటని నేనంటాను’’ చక్రపాణి అన్నాడు.
‘‘శేషగిరి ఫాలో అయిన పద్ధతి నాకు బాగా నచ్చింది’’ చెప్పాడు సీతాపతి.
‘‘ఇప్పుడు చెప్పు- నీ కొడుకు ఎక్కడ పనిచేస్తున్నాడు?... ఎవర్ని ప్రేమించాడు?’’ సీతాపతి మొహంలోకి చూశాడు చక్రపాణి.
‘‘మా అబ్బాయా- ఏదో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ విషయం పక్కన పెట్టు- ఇపుడు మనకు కావలసింది అమ్మాయి వివరాలు.’’
‘‘వివరాలు, వివరాలని పట్టువదలటంలేదు, ఆ అమ్మాయినే అడిగి తెలుసుకోవచ్చు గదా!... ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ పనిచేస్తుంది?’’ అడిగాడు చక్రపాణి.
‘‘ఎక్కడో పనిచేస్తే నేనిక్కడెందుకొస్తాను.. ఆ అమ్మాయి మీ ఆఫీసులో పనిచేస్తున్నది’’.
‘‘అమ్మాయి మా ఆఫీసులో పనిచేస్తుందా?!... పేరు?’’ చక్రపాణి ప్రశ్నకు తెల్లమొహం వేశాడు సీతాపతి.
‘‘పేరు కూడా తెలీదన్నమాట. భలేవాడివిరా- సరే, ఈ ఆఫీసులో పనిచేస్తుందంటున్నావ్, అలా వెళ్ళి కేబిన్‌లన్నీ చూసొద్దాం పద.. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిసిపోతుంది’’ చక్రపాణి మాటలు విన్న సీతాపతి నవ్వకుండా ఉండలేకపోయాడు.
‘‘ఎందుకురా అలా నవ్వుతున్నావ్-’’ సీరియస్‌గా చూశాడు చక్రపాణి.
‘‘నవ్వడం కాదురా, నీమాటలకు నేను ఏడుస్తూ కూర్చోవాలి- అమ్మాయిని ఒక్కసారైనా చూడని నేను కేబిన్‌లు చుట్టి వస్తే ప్రయోజనం ఉంటుందా?... అందుకే నేను నవ్వాను’’.
‘‘మరిప్పుడేం చేద్దాం..’’ ఆలోచనలో పడ్డాడు చక్రపాణి.
‘‘నువ్వులే... నేను చెబుతాను’’ కుర్చీ ఖాళీ చేసి కేబిన్ నుండి బయటకొచ్చాడు సీతాపతి. అతన్ని అనుసరించాడు చక్రపాణి.
ఆ మిత్రులిద్దరూ కొన్ని కేబిన్లు దాటుకుంటూ వెళ్లి క్వాలిటీ అండ్ టెస్టింగ్ రూమ్‌లో దూరారు.
‘‘నాన్నా- మీరెప్పుడొచ్చారు?’’ సీతాపతిని చూడగానే ఆ కేబిన్‌లో పనిచేసే దీపక్ లేచి నిలబడ్డాడు.
‘‘ఒక అరగంటయింది. ఇదిగో మీ ఎం.డి. చక్రపాణితో కబుర్లు చెబుతూ కూర్చున్నా’’ చెప్పాడు సీతాపతి.
‘‘నమస్కారం సార్’’ రెండు చేతులు జోడించి చక్రపాణికి నమస్కరించాడు దీపక్.
‘‘నమస్కారం... దీపక్ నీ కొడుకా సీతాపతీ! - నాకెప్పుడూ చెప్పలేదే...’’ సీతాపతి వైపు చూశాడు చక్రపాణి.
‘‘నిన్ను సర్‌ప్రైజ్ చేద్దామని.. దీపక్ నా కొడుకని నీకు తెలిస్తే నువ్వు ఊరుకోవుగదా! స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తావు. ఇది మావాడికి నచ్చదు’’.
‘‘మీ అబ్బాయి అభిప్రాయం నాకు బాగా నచ్చింది.’’
దీపక్‌ని అభినందించాడు చక్రపాణి.
‘‘దీపక్! నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేనింతవరకు చూడలేదు. మీ ఎం.డి. గారు కూడా చూసి ఉండరు. అమ్మాయిని తీసుకుని చక్రపాణి కేబిన్‌కు తొందరగా రా...’’ చెప్పాడు సీతాపతి.
క్వాలిటీ అండ్ టెస్టింగ్ రూమ్ నుండి బయటపడిన మిత్రులు ఎం.డి కేబిన్‌వైపు దారితీశారు.
****
తను ప్రేమించిన వసుధను తండ్రికి, చక్రపాణికి పరిచయం చేశాడు దీపక్. ఆ తర్వాత ప్రేమికులిద్దరూ ఎం.డి రూమ్ నుండి వారి కేబిన్లకు వెళ్లిపోగానే సీతాపతి, చక్రపాణి పెళ్లి కబుర్లలో పడ్డారు.
‘‘సీతాపతీ- నీ మనసులో ఉన్నది నేను గ్రహించాను. అమ్మాయి కుటుంబ వివరాలు నీకు తెలియాలి- అంతే కదా... అందుకు నేనొక మాట చెప్పనా?’’ అన్నాడు చక్రపాణి.
‘‘అంతకంటేనా- నేనేం చేయాలో చెప్పు చక్రపాణీ!’’
‘‘ఆ అమ్మాయి- వసుధను మీ ఇంటికి తీసుకువెళ్లు- కుటుంబ వివరాలే కాదు, అమ్మాయి మంచి చెడ్డలు కూడా నీకు తెలుస్తాయి. పెళ్లికాకుండా పిల్లనెలా పంపుతారన్న సందేహం నీకొద్దు. ఉద్యోగాల గురించి అమ్మాయిని అమెరికా పంపించే రోజులివి.. అందుకే నేను చెప్పినట్టు చెయి. అమ్మాయి తల్లిదండ్రులను వొప్పించే బాధ్యత నాది.’’
‘‘ఓ.కె.. నువ్విక్కడుండగా నాకేం భయం. చాలా టైమయింది నేను వెళ్లొస్తాను’’ సీతాపతి లేచి బయటకెళ్ళాడు.
***
కాలచక్రంలో పదిరోజులు గడిచాయి. ఈ పది రోజుల్లో వసుధ ఒక వారం పాటు సీతాపతి ఇంట్లో ఉండి వెళ్లింది.
తాంబూలాలు పుచ్చుకోటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ విషయం వసుధ కన్నవారికి తెలియపర్చమని చక్రపాణికి ఫోన్ చేశాడు సీతాపతి.
‘‘అయితే తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకుంటారు?’’ అన్నాడు చక్రపాణి.
‘‘ఎప్పుడో ఎందుకు- రాబోయే ఆదివారం చాలా బాగుంది. ఆ రోజు నువ్వు కూడా ఫ్రీగా ఉంటావు.
’’ఓ.కె. నా?’’ అన్నాడు సీతాపతి.
‘‘అలాగే, నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాను’’ ఫోన్ పెట్టేశాడు చక్రపాణి.
***
అనుకున్నట్టే ఆదివారం సాయంత్రం ఇంటికొచ్చిన సీతాపతిని, కాబోయే పెళ్లికొడుకు దీపక్‌ని మర్యాదపూర్వకంగా లోపలికి తీసుకెళ్లాడు చక్రపాణి.
హాల్లో చక్రపాణి ఎదుట ఉన్న సోఫాలో కూర్చున్నారు వచ్చిన అతిథులు.
మరోవైపు సోఫాలో చక్రపాణి భార్య జయమ్మ, పెళ్లికూతురు వసుధ ఆశీనులై ఉన్నారు.
‘‘రాబోయే వారికోసం నువ్వు ఎదురుచూస్తున్నావు, నేను గ్రహించాను. ఆ విషయం పక్కన పెట్టి నీ మనసులో ఉన్నమాట ఇప్పుడు చెప్పు సీతాపతీ!’’ అన్నాడు చక్రపాణి.
‘‘ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. వసుధ మా కోడలుగా ఇంట్లో అడుగుపెడితే చాలు- అదే మేము కోరుకున్న పెద్ద కట్నం’’ సీతాపతి మాటలు విన్న చక్రపాణి ఆనందం పట్టలేకపోయాడు.
‘‘సీతాపతీ- ఏమీ ఆశించకుండా వసుధను నీ కోడలిగా చేసుకొనటానికి ముందుకు వచ్చినందుకు నిన్ను నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను.. నీకొక విషయం నేను చెప్పలేదు-నన్ను నువ్వు క్షమించాలి’’ తలదించుకున్నాడు చక్రపాణి.
‘‘నేను నిన్ను క్షమించాలా!... నువ్వు చేసిన తప్పేమిటి?’’ అడిగాడు సీతాపతి.
‘‘వసుధ తండ్రిని నేనేనని చెప్పకపోవటం’’
‘‘వసుధ నీ కూతురా?!... మరి ఆ విషయం ఎందుకు రహస్యంగా ఉంచావ్..?!’’
‘‘వసుధ నా కూతురని ముందుగా తెలిస్తే ఆఫీసులో పెళ్లికావలసిన అబ్బాయిలు ఆమెతో చనువుగా మాట్లాడరని, పెళ్లిచేసుకోవాలని అనిపించినా ముందుకు రారని.. అందుకే నేనలా చేశాను’’ చెప్పాడు చక్రపాణి.
‘‘మంచి పని చేశావ్ చక్రపాణీ.. ఆ విషయం ముందుగా తెలిసి ఉంటే దీపక్ కూడా వసుధను పెళ్లిచేసుకునేందుకు సాహసించేవాడు కాదు. ఏదిఏమైనా నీతో వియ్యం పొందటం నా అదృష్టం.. అది సరే కాబోయే దంపతులు కనబడలేదు- ఎక్కడికెళ్లారు?’’
‘‘కంగారు పడకండి అన్నయ్యగారూ... ఈ కాలం పిల్లలు కదా- చల్లగా డాబామీదకు చేరుకున్నారు’’ చక్రపాణి భార్య జయమ్మ నవ్వింది.
రావిపల్లి నారాయణరావు,
302, గోల్ఫ్ వ్యూ ఎన్‌క్లేవ్, ఇంటి నెం: 21-121 122, ఉత్తమ్ నగర్,
మల్కాజ్‌గిరి, హైదరాబాద్- 500 047