ఆదిలాబాద్, ఫిబ్రవరి 5. వచ్చే మే నెల్లో రాష్టవ్య్రాప్తంగా ఉన్న పాఠశాలల్లో రాజీవ్ మాధ్యమిక శిక్షాభియాన్ ద్వారా పోస్టులను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా చేపట్టేందుకు ఆదేశాలను కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారులు ఖాళీల వివరాలను, ఆయా పాఠశాలల్లో అదనంగా ఉన్న పోస్టుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇందుకోసం ఇటీవలే ఆయా డివిజన్‌ల స్థాయిలో ప్రధానోపాధ్యాయుల సమావేశాలను జిల్లావిద్యాశాఖాధికారులు నిర్వహించి ఉపాధ్యాయుల ఖాళీల వివరాలను ధృవీకరించుకున్నారు. ఇదిలా ఉండగా ఈ సారి డిఎస్సీకి ప్రత్యేకత ఉంది. గతంలో డి.ఎడ్, బి.ఎడ్ వంటి ఉపాధ్యాయ శిక్షణలను పొందిన ప్రతివారు డిఎస్సీ వ్రాసేవారు. ఇందువల్ల పోటీ విపరీతంగా పెరిగిపోయి చాలామందికి నిరాశ కలిగే పరిస్థితి ఉండేది. అయితే ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి డిఎస్సీ వ్రాయాలంటే టెట్ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిన ఫలితంగా ప్రతిభ ఉన్నవారే పరీక్ష వ్రాయడంతో పాటు వ్రాసిన వారిలో అత్యధికులు పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉండడం పట్ల అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. పైగా ఇటీవలే నిర్వహించిన టెట్ పరీక్షల్లో ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం మూలంగా చాలామంది అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారు. అర్హత సాధించిన వారు తాము ఎలాగైనా డిఎస్సీలో కూడా అర్హత సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు. ఈ ఆశతోనే రానున్న డిఎస్సీకి సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న పాఠశాలల్లో ఆర్‌ఎంఎస్‌ఎ ద్వారా మొత్తం 252 పోస్టులు మంజూరు కాగా గణితంలో అత్యధికంగా 72 పోస్టులు మంజూరయ్యాయి. అలాగే భౌతిక శాస్త్రంలో 43, జీవ శాస్త్రంలో 15, ఆంగ్లంలో 35, సాంఘిక శాస్త్రంలో అతి తక్కువగా అంటే కేవలం 13 పోస్టులు మాత్రమే మంజూరయ్యాయి. తెలుగు 39, హింది 35 పోస్టులు మంజూరయ్యాయి. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న సెకండరీ పాఠశాలల్లో దాదాపు యాభైకి పైగా పాఠశాలల్లో వందలోపు విద్యార్థుల సంఖ్య ఉంది. ఇలాంటి పాఠశాలలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ పాఠశాలలకు సంబంధించిన పోస్టులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే పోస్టుల సంఖ్య మారే అవకాశం కూడా లేకపోలేదని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే టెట్ ప్రశ్నపత్రం కఠినంగా ఉన్నందున దీనికి సంబంధించి కటాఫ్‌ను తగ్గించాలని ఇప్పటికే విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నందున ప్రభుత్వం ఈ దిశగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే డిఎస్సీ పరీక్షను వ్రాసే అభ్యర్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.
* డిఎస్సీ ఏర్పాట్లలో అధికారులు బిజీ * వివరాల సేకరణకు అధికారుల కసరత్తు
english title:
tet candidates
Date:
Monday, February 6, 2012