అడవులు, వన్యప్రాణుల పరిరక్షణలో ఇక ‘గ్రీన్ పాస్‌పోర్టులు’ కలిగిన వారు కీలక పాత్ర వహించనున్నారు. జంతుజాలాన్ని సంరక్షించాలన్న తపన ఉన్న యువతకు కేరళ అటవీ శాఖ ‘గ్రీన్ పాస్‌పోర్టుల’ను ఇప్పటికే జారీ చేయడం ప్రారంభించింది. వీటిని కలిగి ఉన్నవారు అటవీ శాఖ చేపట్టే అన్ని సంరక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అటవీ సిబ్బందితో కలిసి జంతు సంరక్షణ కేంద్రాలు, జూపార్కుల్లో యువత సేవలను వినియోగించుకునేందుకు అవకాశం కలుగుతుంది. పెరియార్ టైగర్ ప్రాజెక్టు కింద ఇప్పటికే 40 మంది విద్యార్థులకు అటవీశాఖ అధికారులు ‘గ్రీన్ పాస్‌పోర్టుల’ను మంజూరు చేశారు. ఈ విద్యార్థులు వారి స్కూళ్లలో పనిచేసే ‘నేచర్ క్లబ్’ల్లో కీలక భూమిక పోషిస్తారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణ, అడవుల పెంపకం వంటి అనేక అంశాలపై ‘గ్రీన్ పాస్‌పోర్టులు’ కలిగిన వారిలో అవగాహన పెంచేందుకు అటవీ శాఖ అధికారులు, రేంజర్లు శిక్షణ ఇస్తారు. కేరళ భూ భాగంలో 29.1 శాతం మేరకు అడవులు విస్తరించాయి. ఇది జాతీయ సగటు 20 శాతం కన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ, అటవీ విస్తీర్ణాన్ని మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉం దని అటవీశాఖ పలు కార్యక్రమాలను ప్రారంభించింది. ముఖ్యంగా తూర్పు కనుమలను ప్రపంచ వారసత్వ సంపదగా ‘యునెస్కో’ గుర్తించడంతో అడవులు, జంతు జాలం పరిరక్షణ పెద్ద సవాల్‌గా పరిణమించినట్లు కేరళ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సమాజంలోని అన్ని వర్గాల వారూ సహకరించాల్సి ఉందని, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచితే తగు ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ దిశగానే ‘గ్రీన్ పాస్‌పోర్టుల’ను గుర్తింపు పొందిన నేచర్ క్లబ్‌ల ద్వారా జారీ చేయాలని నిర్ణయించారు. వీటిని కలిగిన వారు జంతు సంరక్షణ కేంద్రాలు, జూపార్టులను సందర్శించి అటవీ శాఖ చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చు. కనుమరుగవుతున్న జంతువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ‘గ్రీన్ పాస్‌పోర్టుల’ కార్యక్రమం వల్ల ఆశించిన ఫలితాలు వస్తాయని వారు అంచనా వేస్తున్నారు.
అడవులు, వన్యప్రాణుల పరిరక్షణలో ఇక ‘గ్రీన్ పాస్‌పోర్టులు’
english title:
j
Date:
Tuesday, January 8, 2013