ఆభరణాల రంగంలో నకిలీలు రాజ్యమేలుతున్నాయి. ఏది అసలో, ఏది నకిలీయో కొనుగోలుదారులు తెలుసుకోవటం అంత సులువేమీ కాదు. రెండు సంవత్సరాల క్రితం ఒక ఆభరణాల వ్యాపారి 23 కోట్ల రూపాయలను వసూలుచేసి ఒక ప్రముఖుడి భార్యకు నకిలీ రత్నాలను అంటగట్టిన విష యం వార్తల్లోకెక్కింది. ఇటువంటి మోసాల్లో వెలుగులోకి వస్తున్న సంఘటనలు త క్కువ. మన దేశంలో ఆభరణాలను కొనుగోలు చేయటమే తప్ప వాటిని సాధారణంగా చాలామంది ఇతరులకు అమ్మరు. కొనుగోలుచేసి భద్రంగా బీరువాలలో దాచుకోవటం, పండుగకో, పెళ్ళికో బంగారు నగలను ధరించటం చేస్తారు తప్ప, ధర పెరిగినప్పుడు వాటిని విక్రయించి లాభాలను ఆర్జించాలని మన వాళ్లు భావించరు. తమ తర్వాత వారసుల చేతిలో నగలను పెట్టి పోతారు. అంటే ఒకసారి ఇంటికి చేరిన ఆభరణం ఆ ఇంటికే పరిమితమైపోతుంది తప్ప మళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టదు. ఇదే వ్యాపారుల పాలిటి ఒక పెద్దవరం అయింది. అందుకే నకిలీలను అవలీలగా వ్యాపారులు అమ్మేస్తున్నారు.
ఇక బంగారం విషయంలోనూ ఇదే తంతును గమనించవచ్చు. ఎన్ని క్యారెట్ల బంగారమో తెలుసుకొనేందుకు అవకాశాలు ఇప్పటివరకు తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. బంగారం నాణ్యతను వ్యాపారి చెప్పిన ప్రకారం నమ్మవలసిందే. పాత బంగారు ఆభరణాలతో కొత్త డిజైన్‌లలో ఆభరణాలను చేయించేటప్పుడు పాత బంగారం మంచిది కాదనే విషయాన్ని బంగారు వ్యాపారులు చెప్తున్నారు. తరుగు కింద దాదాపు ముప్పై శాతాన్ని తీసివేస్తున్నారు. ఆభరణాలను మారుస్తున్నప్పుడల్లా ఇదే జరుగుతోంది. బంగారు ఆభరణాలు, వజ్రాలు, రత్నాల వంటి వాటి నాణ్యతను నిర్ధారించే విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. హాల్‌మార్క్ విధానం వచ్చినప్పటికీ, దీనిని పాటిస్తున్న వ్యాపారులు తక్కువ. కనుక ప్రతి ఒక్క ఆభరణాల వ్యాపారి కూడా హాల్‌మార్క్ ఆభరణాలను మాత్రమే విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆభరణాలలో పొదిగే రాళ్ల బరువును ఆభరణం బరువు నుంచి మినహాయించేలా చూడాలి. ఇవన్నీ జరిగినప్పుడే వినియోగదారుల రక్షణ సాధ్యమవుతుంది.
సిటిజన్ జర్నలిస్ట్
english title:
n
Date:
Tuesday, January 8, 2013