అవినీతికి పాల్పడే అధికారులపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని పౌరులకు కల్పించేందుకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ఓ ప్రాజెక్టును చేపట్టింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లు ఇందుకు అవసరమైన మద్దతును ఇగ్నోకు అందజేస్తున్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు చెందిన విజ్‌ఐ (విజిలెన్స్-ఐ) ప్రాజెక్టులో భాగంగా అవినీతి అధికారులపై అందిన ఫిర్యాదుల గురించి దేశవ్యాప్తంగా వున్న 67 ప్రాంతీయ కార్యాలయాల ద్వారా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రచారం చేస్తుంది. అవినీతి అధికారులపై మొబైల్‌ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు విజ్‌ఐ ఒక వేదికగా వుంది. ప్రజలు అవినీతికి సంబంధించిన ఫొటోగ్రాఫ్‌లు, ఆడియో, వీడియోలను కూడా ఆన్‌లైన్‌లో సాక్ష్యంగా అందజేయవచ్చు. గ్రామీణ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొనేందుకు అనువుగా గ్రామస్థాయిలో వాలంటీర్లను కూడా సిద్ధం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పారా మెడికల్ సిబ్బంది లేమి
మన రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా పారామెడికల్ సిబ్బంది కొరత తీవ్రంగా వుంది. ఈ విషయాన్ని చెప్పింది ఏ స్వచ్ఛంద సంస్థో కాదు, స్వయానా కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించిన వాస్తవం ఇది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలలో 64 లక్షల మేరకు పారామెడికల్ సిబ్బంది కొరత వుందని నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ అల్లయిడ్ హెల్త్ సైనె్సస్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ కొరతను తీర్చేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జాతీయస్థాయిలో ఒక సంస్థను, ఇతర ప్రాంతాలలో ఎనిమిది కేంద్రాలను ప్రారంభించే ఆలోచనలో వుంది. ఇ-లెర్నింగ్, వెబ్‌టూల్స్ వంటి ఆధునిక విధానాల ద్వారా కూడా విద్యను అందించటం ద్వారా వైద్య అనుబంధ రంగాలలో వృత్తినిపుణుల సంఖ్యను పెంచేందుకు చర్యలను తీసుకోవలసిన అవసరం వుందని ఆ నివేదిక సిఫార్సు చేసింది.
నియమాలు పాటించని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు
దేశంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో అత్యధికం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. యుజిసి ఇటీవల 53 విశ్వవిద్యాలయాలను తనిఖీ చేయగా వాటిలో కేవలం అయిదు మాత్రమే నియమాలకు అనుగుణంగా ఉన్నాయని తేలింది. దేశంలోని మొత్తం 145 ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో యాభైమూడింటిని తనిఖీ చేయగా వాటిలో కేవలం అయిదు మాత్రమే నియమాలను పాటిస్తున్నట్లు వెల్లడైందని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ఇటీవల రాజ్యసభకు తెలియజేశారు.
సర్వేల కోసం 80వేల మంది నియామకం
ప్రభుత్వం చేపట్టే వివిధ సర్వేలలో సమాచార సేకరణ నిమిత్తం ఎనభైవేల మంది కార్యకర్తలను బీహార్ ప్రభుత్వం నియమించనుంది. ఇప్పటికే 11వేలకు పైగా అక్రిడిటెడ్ స్టాటిస్టికల్ వాలంటీర్లను నియమించటం జరిగింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లోగా మిగిలిన ఖాళీలను కూడా భర్తీచేసే లక్ష్యంతో వుంది అక్కడ ప్రభుత్వం. ఈ గణాంక కార్యకర్తలు రాష్ట్రంలోని 8,842 పంచాయతీలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని సేకరించటం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ప్రభుత్వానికి అవసరమైన సమాచార సేకరణకు ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ విభాగాల సిబ్బందిని పురమాయించటం జరుగుతోంది. ఉపాధ్యాయులను సర్వేలకు పంపటం వలన విద్యా సంవత్సరంలోగా సిలబస్‌ను పూర్తిచేయలేకపోవటం, విద్యార్థులు ఇబ్బందులకు గురికావటం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు అక్రిడిటెడ్ స్టాటిస్టికల్ వాలంటీర్లను నియమించటం జరుగుతోందని రాష్ట్ర ప్రణాళిక, అభివృద్ధిశాఖ పేర్కొంది. 12వ తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగులు వాలంటీర్లుగా చేరేందుకు అర్హులు. కార్యకర్తలుగా సేవలను అందించేందుకు ఆ రాష్ట్రానికి చెందిన మూడు లక్షల మంది దరఖాస్తుచేసుకోగా, వారిలోనుంచి ఇరవై అయిదువేల మందికి వ్యవసాయ సంబంధ గణాంకాల సేకరణ నైపుణ్యాలను అందించేందుకు మూడురోజుల శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం పరీక్షలు పెట్టి, ఉత్తీర్ణులైన వారిని కార్యకర్తలుగా నియమించటం జరుగుతోంది.
అవినీతికి పాల్పడే అధికారులపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే
english title:
a
Date:
Tuesday, January 8, 2013