సమాచార హక్కు చట్టం, వినియోగదారుల రక్షణ చట్టం- ఈ రెండింటినీ ఉపయోగించుకొంటూ విజయం సాధించిన అరుదైన కేసు ఇది. ఒక తల్లీ ఆమె ఇద్దరు కుమారులూ సమాచార హక్కు చట్టం ద్వారా తమకు కావలసిన సమాచారాన్ని రాబట్టి, దాని ఆధారంగా దక్షిణ కన్నడ జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసుదాఖలు చేసి విజయం సాధించారు. వీరి కేసును విచారించిన వినియోగదారుల ఫోరం అయిదు లక్షల రూపాయల బీమా మొత్తాన్ని పది శాతం వడ్డీతో సహా చెల్లించాలని, కేసు ఖర్చుల కింద అదనంగా మరో రెండువేల రూపాయలను ఫిర్యాదిలకు చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది.
యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మేనేజర్‌ను ప్రతివాదిగా పేర్కొంటూ కె.పి.కమలావతి , ఆమె ఇద్దరు కుమారులు వినియోగదారుల ఫోరంలో కేసును దాఖలు చేశారు. ఆమె భర్త లక్ష్మీనారాయణ భట్ 2007వ సంవత్సరంలో ఇంటి నిర్మాణం నిమిత్తం కెనరా బ్యాంకు నుంచి అయిదు లక్షల రూపాయల రుణాన్ని తీసుకొన్నారు. ఈ రుణానికి బీమా కంపెనీ నుంచి పాలసీ కూడా లింక్ అయివుంది. యూనిట్ హోమ్‌కేర్ పాలసీ కింద అగ్నిప్రమాదం, వ్యక్తిగత ప్రమాదాలకు అయిదు లక్షల చొప్పున బీమా వర్తిస్తుంది. లక్ష్మీనారాయణ భట్ జూలై 2010లో హఠాత్తుగా కుప్పకూలి పడిపోయి తలకు అయిన గాయంతో మరణించారు. అయితే బీమా ఏయే రకాల ప్రమాదాలకు వర్తిస్తుందనే విషయాన్ని బీమా కంపెనీ ముందుగా తెలియజేయకపోవటంతో బీమా వేటికి వర్తిస్తుందో తెలియజేయాలంటూ ఫిర్యాది సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించారు.
బీమా మొత్తాన్ని చెల్లించాలంటూ ఫిర్యాదీలు బీమా కంపెనీని కోరినప్పుడు పాలసీదారుడి మరణం ప్రమాదవశాత్తు జరిగినట్టు అంగకరించలేమని, కనుక బీమా మొత్తం చెల్లించటం సాధ్యం కాదని బీమా కంపెనీ వారికి తెలియజేసింది.
పాలసీదారుడు హఠాత్తుగా కుప్పకూలి పడిపోయి తలకు అయిన గాయంతో మరణించారు కనుక దీనిని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగానే పరిగణించాలని ఫోరం అభిప్రాయపడింది. కనుక ఆయన వారసులకు బీమా మొత్తాన్ని చెల్లించాల్సిందేనంటూ తీర్పుఇచ్చింది. పాలసీదారుడి వారసులకు బీమా మొత్తాన్ని చెల్లించేందుకు నిరాకరించటం సేవాలోపమే అవుతుందని ఫోరం వ్యాఖ్యానించింది.
వినియోగ విజయం
english title:
oka
Date:
Tuesday, January 8, 2013