కాకినాడ, జనవరి 11: ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పాకులాడకుండా, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వెతుక్కోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగం కంటే ప్రైవేట్ రంగంలోనే మెరుగైన ఉద్యోగావకాశాలున్నాయన్నారు. డిగ్రీలుండి విజ్ఞానంలేని చదువులొద్దని హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రాకులాడకండంటూ యువతకు ఆయన సూచించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని సర్పవరంలో గల ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఎపిఐఐసి) పారిశ్రామికవాడలో ఇన్ఫోటెక్ సంస్థ నిర్మించిన ఐటి సెంటర్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేటు రంగంలోనే ఉద్యోగావకాశాలు అధికంగా ఉన్నాయంటూ పదే పదే చెప్పారు. కాకినాడ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఐటి కంపెనీలను ప్రోత్సహించడం ద్వారా వేలాది ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, చదువు పూర్తి కాగానే ఉద్యోగానికి యువకుడు సిద్ధంగా ఉండేలా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై మనకింకా మోజు తగ్గలేదని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావల్సి ఉందని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్రంలో విఆర్‌ఒ పోస్ట్‌ల భర్తీకి రాత పరీక్ష నిర్వహించగా కేవలం ఐదారు వేల ఉద్యోగాల కోసం ఏడెనిమిది లక్షల మంది హాజరయ్యారని, వీరిలో ఇంజనీరింగ్, పీజీ చేసిన వారు కూడా ఉన్నారన్నారు. కేవలం పదవ తరగతి అర్హత గల వారి కోసం నిర్ణయించిన వీఆర్వో వంటి ఉద్యోగానికి పీజీలు, ఇంజనీర్లు హాజరు కావడం ఆశ్చర్యం అనిపించిందని, చదువుకు తగిన ఉద్యోగాన్ని ఎంచుకోవాలని యువతకు సూచించారు. విద్యార్థులు కష్టపడితే వారి కుటుంబానికే కాకుండా రాష్ట్రానికి, దేశానికి కూడా మంచిదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువతను సరైన మార్గంలోనడిపిస్తే ఏ దేశానికి తీసిపోని స్థాయిలో అభివృద్ధి సాధిస్తారన్నారు.
కాకినాడ సమీపంలోని సర్పవరంలో ఐటి సెజ్‌కు శుక్రవారం శంకుస్థాపన చేస్తున్న సిఎం . బీచ్ ఫెస్టివల్ సిడి ఆవిష్కరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి
ఆంధ్రాకే అంటే మీడియాతో చిక్కే!
ముఖ్యమంత్రి మాటలకు సభలో నవ్వులు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 11: శ్రీకాకుళం నుండి కాకినాడ, తిరుపతి వరకు ద్వితీయ శ్రేణి నగరాలలో ఐటి సెంటర్లను మంజూరు చేస్తామంటూ కాకినాడ ఐటిసెంటర్ ప్రారంభ సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంతలోనే నాలుక్కరచుకున్నారు. ఐటి సెంటర్లూ అన్నీ ఆంధ్రా ప్రాంతానికే మంజూరు చేస్తున్నారంటూ మీడియా రాసే వార్తలతో మరో వివాదం మొదలవుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంతో సభలో నవ్వుల పువ్వులు విరిశాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాకినాడలో ఇన్ఫోటెక్ ఐటి సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ఈ సంస్థకు యుఎస్‌ఎ, యుకె, జర్మనీ, ఫ్రాన్స్, నార్వే, నెదర్లాండ్, సింగపూర్, కెనడా, మలేషియా తదితర దేశాల్లో ఐటి సెంటర్లున్నాయన్నారు. అయితే విదేశాల్లో కాకుండా ఇకనుండి మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, తిరుపతి, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఐటి సెంటర్లు ఏర్పాటుచేస్తే తమ వంతు సహకారం అందిస్తామని వేదికపై ఉన్న ఇన్ఫోటెక్ ఛైర్మన్ బివిఆర్ మోహన్‌రెడ్డికి సూచించారు. అంతలోనే మీడియా వైపు చూస్తూ మీరు అన్నీ ఆంధ్రాకే అని రాస్తే ప్రమాదమంటూ మహబూబ్‌నగర్, కరీంనగర్ తదితర పట్టణాల్లో సైతం ఐటి సెంటర్లు ఏర్పాటుచేయాలంటూ సూచించారు. సిఎం మాటలకు సభలో నవ్వులు వెల్లివిరిశాయి. గతంలో ఒకటి రెండు ఐటి కంపెనీలు సరైన మార్గంలో నడవకపోవడంతో వేరే కంపెనీలను సైతం వేలెత్తి చూపే పరిస్థితి వచ్చిందని, అయితే ఇన్ఫోటెక్ వంటి సంస్థలు రాష్ట్రంలో ఐటి రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాయన్నారు. కాకినాడలో 30 వేల చదరపు అడుగుల్లో ఐటి టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నామని, ఇన్ఫోటెక్ కోరిక మేరకు ఇక్కడ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించడంతో పాటు ఐటి పార్క్‌కు రహదారుల నిర్మిస్తామన్నారు.