ఖమ్మం, జనవరి 11: ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజలంతా ఆశీర్వదిస్తే తనవంతు ప్రయత్నం చేసి తీరతానని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా మూడో రోజు ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించారు. తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా ఉంటూ అనేక సమస్యలను పరిష్కరించి రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా తయారు చేశానన్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రాలు ముందంజలో ఉండగా ఎపి మాత్రం తిరుగమన పథంలో నడుస్తోందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి కారణంగా పెట్టుబడులు కూడా రావటం లేదని, దీంతో అభివృద్ధి కూడా కుంటుపడిందన్నారు. ప్రజలంతా చైతన్యవంతులై ప్రభుత్వంపై తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బొగ్గు కొనుగోళ్ళలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి 400 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని, దీనిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు. మరోవైపు మద్యం ధరలు విపరీతంగా పెంచుతున్నారని, దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాగా కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో మంచినీరు దొరక్కపోయినా మద్యం మాత్రం దొరుకుతోందన్నారు. సాక్షాత్తు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే ముడుపులు ముట్టాయని ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం రాజ్యమేలుతోందని, మద్యంపై నియంత్రణ లేకపోవటంతో అన్ని గ్రామాల్లో బెల్ట్‌షాపులు వెలిశాయన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయల సొమ్మును దోచుకున్న వ్యక్తి పార్టీపెట్టి ప్రజలను మరింత దోచుకునేందుకు ముందుకు వస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాడే టిడిపి ప్రజాప్రతినిధులు, నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, తాము అధికారంలో ఉన్నప్పుడు ఇదేవిధంగా కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టి ఉంటే కాంగ్రెస్ పార్టీయే ఉండేది కాదన్నారు. కుంభకర్ణుడిలా ఆరు నెలలు నిద్రపోయి మూడు రోజులు పనిచేసే కెసిఆర్ కిరికిరిలు పెడుతుంటారని, బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు ఆయన పెట్టింది పేరని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజల ఆకాంక్షను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్‌కు పాల్పడే కెసిఆర్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తామెప్పుడు వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు
english title:
ras
Date:
Saturday, January 12, 2013