గుంటూరు, జనవరి 10: అతిపురాతనమైన పోస్టల్‌శాఖను సాంకేతిక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్, ఐటి శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి పేర్కొన్నారు. గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆలిండియా పోస్టల్ ఎంప్లారుూస్ అసోసియేషన్ గ్రూప్ సి సంఘ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షా 55 వేల పోస్ట్ఫాసులు ఉన్నాయని, కార్యాలయాలన్నింటినీ ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తాము కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో వారి వేతనాలను పోస్ట్ఫాసుల ద్వారానే చెల్లిస్తున్నామన్నారు. అనంతరం కేంద్రం మంత్రి కృపారాణిని యూనియన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి వియన్నారావు, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు షేక్ మస్తాన్‌వలి, పోస్టల్‌శాఖ ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.
ఎంపి రాయపాటి
ఇంటి ముట్టడి
* విద్యార్థి జెఎసి నేతల అరెస్ట్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జనవరి 10: సమైక్యాంధ్రకు మద్దతుగా తన పదవికి రాజీనామా చేయాలంటూ గుంటూ రు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఇంటిని విద్యార్థి జెఎసి నాయకులు గురువారం ముట్టడించారు. విద్యార్థి జెఎసి నేత రమణ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థి నేతలు గుంటూరు చంద్రవౌళి నగర్‌లోని రాయపాటి నివాసం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో రాయపాటి అనుచరులకు, విద్యార్థి జెఎసి నేతలకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఈ సమయంలో విద్యార్థి నేతలు రాయపాటి నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించి అక్కడ ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న జెఎసి నేతలను అడ్డుకున్నారు. అయితే పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకపోవడంతో విద్యార్థి జెఎసి నేత రమణతో పాటు మరో నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నేతలపై అక్రమ కేసులకు నిరసనగా
టిడిపి ఆధ్వర్యంలో ర్యాలీ
గుంటూరు (కొత్తపేట), జనవరి 10: తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలులోకి పంపడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు నగరంలో ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయం నుండి రూరల్ ఎస్‌పి కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ఎస్‌పి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలను, అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే టిడిపి నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు. తక్షణమే నరసరావుపేటలో జరిగిన సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి డిఎస్‌పిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై, తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి తెనాలి శ్రావణ్‌కుమార్‌లపై పెట్టిన అక్రమ కేసులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ పథకం ప్రకారమే సహకార ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ నరేంద్ర హత్యకేసులో యరపతినేని శ్రీనివాసరావుకు ఎలాంటి సంబంధం లేకపోయినా మూడవ ముద్దాయి పేరుతో ఎమ్మెల్సీ టిజివి కృష్ణారెడ్డి పోలీసులపై ఒత్తిడి తెచ్చి అక్రమ కేసు బనాయించారన్నారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరుపుతున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెఆర్ పుష్పరాజ్ మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా ఒక ప్రణాళికాప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తూ అనేక కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శనక్కాయల అరుణ, జియావుద్దీన్, బోనబోయిన శ్రీనివాసయాదవ్, తెనాలి శ్రావణ్‌కుమార్, దాసరి రాజామాస్టారు, వెన్నా సాంబశివారెడ్డి, మనె్నం శివనాగమల్లేశ్వరరావు, రావిపాటి సాయి, బొంతల సాయి, వేములపల్లి శ్రీరాం ప్రసాద్, మద్దిర్యాల మ్యాని, దారపనేని నరేంద్ర, చిట్టాబత్తిన చిట్టిబాబు, జాగర్లమూడి శ్రీనివాసరావు, పానకాల వెంకట మహాలక్ష్మి, పోతురాజు ఉమాదేవి, నల్లపనేని విజయలక్ష్మి, రామిదేవి హనుమాయమ్మ, రూబెన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
టిడిపిని రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు: దేవినేని
రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేకే కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అణచివేయాలని చూస్తోందని కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గురువారం జిల్లా జైలులో ఉన్న యరపతినేని శ్రీనివాసరావును పరామర్శించిన అనంతరం విలేఖర్లతో ఆయన మాట్లాడారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడిపై ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ ఏనాడూ ఒక్క కేసూ నమోదు చేయకుండా పోలీసులు కాపాడుకుంటూ వస్తున్నారని, పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే పోలీసు యంత్రాంగం టిడిపి నాయకులపై కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. యరపతినేని, కోడెల శివప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్‌లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవినేనితో పాటు యరపతినేనిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, నాయకులు కోడెల శివప్రసాద్, జెఆర్ పుష్పరాజ్, కొమ్మినేని సత్యనారాయణ తదితరులున్నారు.
విశ్వవిద్యాలయాలు జ్ఞానకేంద్రాలుగా విలసిల్లాలి
* ఎఎన్‌యు స్నాతకోత్సవంలో పద్మశ్రీ డాక్టర్ కె హరినారాయణ
నాగార్జున యూనివర్సిటీ, జనవరి 10: దేశీయ అవసరాలకు కావాల్సిన జ్ఞాన సంపదను తయారు చేసే మేధోకర్మాగారాలుగా విశ్వవిద్యాలయాలు పనిచేయాలని డిఆర్‌డిఒకు చెందిన ప్రముఖ ఏరోనాటికల్ శాస్తవ్రేత్త పద్మశ్రీ డాక్టర్ కోట హరినారాయణ కోరారు. గురువారం వర్సిటీలోని డాక్టర్ హెచ్‌హెచ్ డైక్‌మెన్ ఆడిటోరియంలో జరిగిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 32వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ వీసీ ఆచార్య కె వియన్నారావు అధ్యక్షత వహించారు. డాక్టర్ హరినారాయణ మాట్లాడుతూ గతంలో ఆయా దేశాలలో అందుబాటులో ఉన్న సహాజవనరుల ప్రాతిపదికగా దేశ సంపదను లెక్కగట్టేవారని, కాని నేడు దేశంలో ఉన్న జ్ఞానవంతమైన మానవవనరులనే దేశ సంపదగా పరిగణిస్తున్నారని తెలిపారు. ఆర్థిక, సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించినప్పటికీ గ్రామీణ భారతదేశంలోని ప్రజలు ఇంకా పేదరికంలో జీవితాలను వెళ్లదీయటం బాధాకరమన్నారు. 21వ శతాబ్దంలో జ్ఞానవంతమైన మానవ వనరులు కల్గిన దేశాలే అగ్ర స్థానాన్ని ఆక్రమిస్తాయని, రానున్న రోజులలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాల్సిన బాధ్యతదేశంలోని యువతపైనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం ఆచార్య నాగార్జున వర్సిటీ తరఫున వర్సిటీ వీసీ ఆచార్య కె వియన్నారావు డాక్టర్ హరినారాయణకు గౌరవ డాక్టరేట్‌ను అందచేశారు.
సాగునీటి కోసం ధర్నా, రాస్తారోకో
నకరికల్లు, జనవరి 10: సాగర్ జలాలను సాగునీటికి విడుదల చేయాలంటూ కోరుతూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావు అద్దంకి మార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై మండలంలోని అడ్డ రోడ్డు వద్ద గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆరు తడుపులకు నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రైతులను మోసగించి నీటి సరఫరా నిలిపివేసిందని అన్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతంలో 5 లక్షల ఎకరాల పంట భూమి నీరు లేక బీడు భూమిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి వరకు నీటిని విడుదల చేసినట్లైతే పంటలు పండే అవకాశం ఉందన్నారు. వేలకువేలు పెట్టుబడులు పెట్టి భూములను సాగు చేసిన రైతులకు పోలాలకు సరిపడ నీరు లేకపోవడంతో అప్పుల పాలవుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని చెబుతూ కనీసం సరైన సమయంలో నీటిని విడుదల చేయకుండా రైతులను మోసగిస్తోందని ఆయన అన్నారు. జిల్లా జెసి కోడెలతో మాట్లాడి గురువారం నుండి నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వటంతో ధర్నా ముగించారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు పంటలకు నీరు విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు కోడెల హెచ్చరించారు. ధర్నాలో సింహాద్రియాదవ్, పులిమి రామిరెడ్డి, టిడిపి నకరికల్లు మండల అధ్యక్షుడు ఎస్ కొండలు, రావెళ్ల గోపి, మృత్యుంజయుడు, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. నర్సరావుపేట రూరల్ సిఐ అబ్దుల్ అజీమ్ ఆధ్వర్యంలో వినుకొండ సిఐ, వినుకొండ ఎస్‌ఐ, నకరికల్లు ఎస్‌ఐ, రొంపిచర్ల ఎస్‌ఐ, నర్సరావుపేట రూరల్ ఎస్‌ఐ, ఈపూరి ఎస్‌ఐ, ఫిరంగిపురం ఎస్‌ఐలు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. రాస్తారోకో కారణంగా రోడ్డుకు రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్ఠతకు కఠిన నిర్ణయాలు
* రేషన్ దుకాణాలు సకాలంలో తెరవకుంటే చర్యలు: జెసి డాక్టర్ యువరాజ్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జనవరి 10: జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టతకు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్ యువరాజ్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో పట్టణ, జిల్లా ఆహార సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెసి యువరాజ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి రేషన్ దుకాణాన్ని ఉదయం 8 నుండి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి 6 గంటల వరకు విధిగా తెరిచి ఉంచాలని, ఈ నిబంధనలను ఎవరైనా పాటించకుంటే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో లోటుపాట్లను ప్రజల ద్వారా తెలుసుకుని తగిన చర్యలు చేపట్టేందుకు ప్రతి మంగళవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు డయల్ యువర్ ఆర్‌డిఒ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ నుండి అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఏఏవై కార్డుదారులకు రేషన్ దుకాణాల్లో న్యాయం జరగడం లేదని ఓ సభ్యుడు అన్న మాటలకు జెసి సమాధానమిస్తూ అంత్యోదయ యోజన అవార్డు పథకం కింద ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వికలాంగులకు, వితంతువులకు మాత్రమే వర్తింపజేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లాలో అనధికార వాటర్ ప్లాంట్లపై గత సమావేశంలో జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానం తనకు సంతృప్తి కల్గించలేదని, ఇంకా జిల్లాలో అనధికారికంగా మినరల్ వాటర్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారని, వాటిపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదంటూ ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ పూర్ణచంద్రరావు సమాధానమిస్తూ జిల్లాలో అనధికారికంగా 800 వాటర్ ప్లాంట్లు ఉన్నాయని, తమకు ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ ప్లాంట్‌లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని, మినరల్ వాటర్ ప్లాంట్ల యజమానులు ప్రభుత్వ చర్యలను తప్పించుకునేందుకు హెర్బల్ వాటర్, ఫ్లేవర్ డ్రింక్, సొసైటీ పేర్లతో స్థాపించి నడుపుతున్నారన్నారు. నగరంలో రైతుబజార్ల నిర్వహణ సక్రమంగా లేదని, తూకాలు సరిగా వేయడం లేదని, సౌకర్యాలు మెరుగుపర్చాలని, పట్ట్భాపురం రైతుబజారు నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణరావు అన్నారు. జెసి స్పందిస్తూ పట్ట్భాపురం షాదీఖానా పక్కన ఎకరం స్థలాన్ని కార్పొరేషన్ ఇవ్వనుందని, త్వరలో రైతుబజారును అక్కడకు మారుస్తామన్నారు. రైతుబజారులో తూనికలు, కొలతల శాఖ అధికారులచే తరచూ తనిఖీలు చేయిస్తామని చెప్పారు. ఆహార సలహా సంఘ సభ్యులు అద్దేపల్లి మురళి మాట్లాడుతూ జిల్లాల కుటుంబాల సంఖ్య కంటే రేషన్‌కార్డుల సంఖ్యే అధికంగా ఉందని, వీటిని పరిశీలించాలని జెసికి విన్నవించారు.
ఉప్పలపాడును వెంటాడుతున్న వైరల్ జ్వరాలు
నూజెండ్ల, జనవరి 10: వైరల్ జ్వరాలు ఉప్పలపాడు గ్రామస్థులను వేధిస్తున్నాయి. 10 రోజుల క్రితం గ్రామంలో సుమారు 56 మందికి పైగా జ్వరాలతో బాధపడ్డారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో మూడు రోజులపాటు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా వైద్య సేవలు అందించి చేతులు దులుపుకున్నారని గ్రామస్థులు అంటున్నారు. తిరిగి గ్రామంలో జ్వరాలు ప్రబలడంతో గ్రామస్థులు హడలి పోతున్నారు. బిసి కాలనీలో ప్రారంభమైన జ్వరాలు పాత ఊరికి కూడా సోకటంతో ఇంటికి ఇద్దరు చొప్పున మంచానికి అతుక్కుపోయారు. చిన్నారులు సైతం ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వైద్య సేవల కోసం వినుకొండ పట్టణానికి పరుగులు తీస్తున్నారు. వేలకు వేలు బిల్లులు చెల్లిస్తున్నా జ్వరాలు అదుపులోకి రావటం లేదని గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ, అనుష్క, దత్తా లు, మంగయ్య, వెంకటేశ్వర్లుతో పా టు మరి కొంతమంది వాపోతున్నారు. చిన్నారి శివ, నాగలక్ష్మి నాలుగు రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. నూజెండ్ల వైద్యాధికారి కోట్యానాయక్‌ను వివరణ కోరగా గతంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సేకరించిన రక్త నమూనాలలో మలేరియా జ్వరాలు లేవని, సీజనల్ జ్వరాలు నమోదైనట్లు చెప్పారు. వెంటనే గ్రామంలో సర్వే చేసి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు.
అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
పొన్నూరు, జనవరి 10: రేపల్లె నుంచి ధాన్యం లోడ్‌తో హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ గురువారం వేకువ ఝామున అదుపుతప్పి పొన్నూరు మండల పరిధిలోని పచ్చలతాటిపర్రు గ్రామంలోని మోటార్ల జానీ ఇంట్లోకి దూసుకెళ్లింది. దూసుకెళ్లిన లారీ వేగంగా కరెంట్ పోల్‌ను ఢీకొని బోల్తాపడింది. లారీ స్పీడ్‌కు ఇంటి ప్రహరీగోడ, గేట్లు, పంపుమోటారు సెట్‌లు ధ్వంసమయ్యాయి.
సమస్యలు పరిష్కరించకుండా టిడిపి నేతలపై దాడులా?
* టిడిపి అధికార ప్రతినిధి కోడెల
గుంటూరు (కొత్తపేట), జనవరి 10: రాష్ట్రంలో ప్రజలు, రైతులు అనేక సమస్యలతో సతమతమవుతుంటే వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ప్రజలపక్షాన పోరాటాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు చేయించడం ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆరోపించారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని ప్రయత్నిస్తే భయపడే వారు లేరని, జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, నరసరావుపేట డిఎస్‌పి, 2-టౌన్ సిఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాడికొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్రావణ్‌కుమార్, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులపై అక్రమ కేసులు, నరసరావుపేట దాడులు పథకం ప్రకారం జరిగినవేనని, ప్రభుత్వానికి పోలీసు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, అతని క్యాబినెట్ మంత్రులు దోపిడీ దొంగల్లా వ్యవహరిస్తున్నారని, తిరిగి అధికారాన్ని చూడలేమనే భయంతోనే పాలనా కాలమంతా అవినీతి, కుంభకోణాలతో జేబులు నింపుకునేందుకు యత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమై, కారం పొట్లాలు ఇచ్చి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలని చేతులెత్తేయడం సిగ్గుచేటన్నారు. కేవలం కారం పొట్లాలు అందజేసి రాష్టవ్య్రాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులను ఎలా నివారించగలుగుతారని కోడెల ప్రశ్నించారు. సహకార ఎన్నికల్లో దొంగఓట్లను చేర్చుకోవడం ప్రతిపక్ష ఓట్లను తొలగించడం వంటి అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం వీటిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో చిట్టాబత్తిన చిట్టిబాబు, హనుమంతరావు, కొమ్మినేని వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
భిన్న సంస్కృతుల సమాహారం ఎన్‌సిసి ఇంటిగ్రేషన్ క్యాంప్
* కల్నల్ కెఎస్ నరేంద్రబాబు
తెనాలి, జనవరి 10: ఎన్‌సిసి శిక్షణ పొందిన విద్యార్థి దేశ సమగ్రాభివృద్థికి దోహదపడగలరని ఎన్‌సిసి గ్రూప్ కమాండర్ కల్నల్ కెఎస్.నరేంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక విఎస్‌ఆర్ అండ్ ఎన్‌విఆర్ కళాశాల వేదికగా ఈ నెల 7 నుండి ప్రారంభమైన ఎన్‌సిసి నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌లో భాగంగా గురువారం స్కూల్స్, కళాశాలలు స్థాయిలో దేశవ్యాప్తంగా 16 డైరెక్టరేట్స్ నుండి ఎన్‌సిసి క్యాడెట్స్ హాజరయ్యారు. వీరికి ఎన్‌సిసి ఉన్నతాధికారులు వివిధ అంశాలల్లో శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో నిర్వహించిన సదస్సులో ఎన్‌సిసి గ్రూప్ కమాండర్ కల్నల్ కెఎస్.నరేంద్రబాబు మాట్లాడుతూ క్యాంప్ ప్రాధాన్యత వివరించారు. ఎన్‌సిసి శిక్షణ ద్వారా విద్యార్థి పొందే ప్రయోజనాలను వివరించారు. అదే విధంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంత్రాల ఎన్‌సిసి క్యాడెట్స్ వారి భాష, సంస్కృతి, సంప్రదాయ వేడుకల్లో పోటీలు నిర్వహించడం ద్వారా ఒక ప్రాంత సంస్కృతి , ఆచార వ్యవహారాలు మరో ప్రాంత ఎన్‌సిసి క్యాడెట్స్ తెలుసుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. నేటి సమాజంలో క్రమశిక్షణ గల యువత అవసరం ఎంతో ఉందన్నారు. ఎన్‌సిసి శిక్షణలో రాణించిన విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదిగే మార్గాలను సులువుగా అందిపుచ్చుకోవడంతో పాటు, ఎటువంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థాలు అలవర్చుకోవడం జరుగుతుందన్నారు. ఈ నెల 18 వరకు శిక్షణ శిబిరం కొనసాగుతున్న క్రమంలో ప్రతీ రోజు సాయంత్రం వేళల్లో , దేశంలోని భిన్నమైన సంస్కృతులకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీల గురించి వివరించారు. కార్యక్రమంలో 22వ ఆంధ్రా బెటాలియన్ కమాండర్స్ కల్నల్ ఎమ్‌కె.రాయ్, కల్నల్ ఎస్‌కె.పాండ, గుంటూరు గ్రూప్ శిక్షణ అధికారి ఎస్.నిరంజనరావు, వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది ఎన్‌సిసి అధికారులు, 40 మంది ప్రత్యేక అధికారులు, 700కు పైగా వివిధ ప్రాంతాల ఎన్‌సిసి క్యాడెట్స్ దేశంలోని 16 డైరెక్టరేట్స్ నుండి హాజరయ్యారు.
నేటి నుండి 12 రోజులు నీటి విడుదల: జేసీ
గుంటూరు, జనవరి 10: జిల్లాలో చివరి ఆయకట్టు భూముకు సాగర్ నీరు అందేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్ యువరాజ్ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. నీటిపారుదల, రెవెన్యూ,వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులతో గురువారం జెసి జడ్పీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి యువరాజ్ మాట్లాడుతూ సాగర్ నుండి నీరు బొగ్గువాగుకు చేరిందన్నారు. పరిమితికి లోబడి సాగర్ నీటిని 35 మేజర్ కాల్వల ద్వారా శుక్రవారం నుండి 12 రోజుల పాటు విడుదల చేయడం జరుగుతుందన్నారు. అద్దంకి బ్రాంచ్ కెనాల్‌కు ఏడు రోజులు నీటి విడుదల జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రధానంగా మిర్చి, మొక్కజొన్న, జొన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారని, సాగర్ నీటిని రైతులకు సక్రమంగా అందేలా చూడాలని కోరారు. దిగువ ప్రాంతాలైన భూములకు ఏడు రోజులు, ఏగువ ప్రాంత భూముల రైతులకు ఏడు రోజులు నీటిని విడుదల చేసేలా ప్రణాళికలు తయారు చేసి తనకు అందజేయాలని ఆదేశించారు. ఏఏ మండలాల్లో ఎప్పుడు నీరు విడుదల చేస్తారో ఆ షెడ్యూల్ వివరాలను స్థానిక దినపత్రికల ద్వారా ప్రజలకు తెలియపర్చాలన్నారు. అధికారులు తమ మండలాల పరిధిలో ఏఏ మేజర్‌కాల్వలున్నాయో తెలుసుకుని చివరి భూముల వరకు నీరు అందేలా కాల్వలపై పెట్రోలింగ్‌ను పటిష్టంగా చేపట్టాలని సూచించారు. రూరల్ ఎస్‌పి జె సత్యనారాయణ జాయింట్ యాక్షన్ టీంలద్వారా మంచి ఫలితాలను సాధించాలని సూచించారు.
మోసపూరిత టెస్ట్‌లను అడ్డుకోవాలి
గుంటూరు, జనవరి 10: విద్యాహక్కు చట్టాన్ని, హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ కొన్ని విద్యాసంస్థలు నిర్వహించే మోసపూరిత టాలెంట్, స్కాలర్‌షిప్ టెస్ట్‌లను అడ్డుకోవాలని ఎబివిపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సిహెచ్ శివకుమార్ ఆధ్వర్యంలో గురువారం డిఇఒ ఆంజనేయులును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎబివిపి నాయకులు మాట్లాడుతూ గతంలో ఇటువంటి టెస్ట్‌లకు వ్యతిరేకంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ యాజమాన్యాలు మారకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. టెస్ట్‌ల పేరుతో విద్యార్థుల వ్యక్తిగత చిరునామాలు సేకరించి పిఆర్‌ఒల ద్వారా తల్లిదండ్రులను మభ్యపెట్టి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. వెంటనే ఈ విధమైన టెస్ట్‌లను ఆపాలని లేకుంటే ఎబివిపి అడ్డుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు కె రాఘవేంద్ర, గురుస్వామి, చెన్నయ్య, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే ఉద్యమాలు
గుంటూరు (పట్నంబజారు), జనవరి 10: ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే దేశంలో ప్రజా ఉద్యమాలు నిరంతరం జరుగుతున్నాయని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో గురువారం భారతదేశ రాజకీయాలు-ప్రజాస్వామ్య విలువలు అనే అంశంపై జరిగిన సభలో వక్తలు పేర్కొన్నారు. స్థానిక అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ సభకు సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి అధ్యక్షత వహించారు. సభలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచలి శివాజీ మాట్లాడుతూ నిష్ణాతుల నుండి అనుభవం లేని వారి చేతుల్లోకి రాజకీయాలు మారడం మొదలైందన్నారు. 2012 సంవత్సరం దేశ చరిత్రలో ఓ మాయనిమచ్చగా మిగిలిపోయిందన్నారు. కామన్‌వెల్త్ క్రీడల మొదలు బొగ్గు కుంభకోణం వరకు అవినీతి గుభాళింపులు వెలుగుచూశాయన్నారు. సెంట్రల్ యూనివర్శిటీ రాజనీతిశాస్త్ర అధ్యాపకులు ప్రొఫెసర్ కొండవీటి చిన్నయ్యసూరి మాట్లాడుతూ 2012 సంవత్సరంలో అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికీ డిసెంబర్ 13న డిల్లీలో ఓ బస్సులో యువతిపై జరిగిన అత్యాచార సంఘటన మాత్రం దేశంలో ఒక బలీయమైన మార్పునకు నాంది పలికిందన్నారు. ప్రజల శక్తికి భయపడిన ప్రభుత్వం దేశంలో మహిళల రక్షణకు, అత్యాచారాల నిరోధానికి కొత్త చట్టాలు రూపొందించేందుకు సిద్ధపడిందన్నారు. చలమయ్య కళాశాల అధ్యాపకులు బి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ గత ఏడాది సామాన్యులకు చిన్న ఆనందం కూడా మిగల్చలేదన్నారు. ఈ చర్చాగోష్టిలో విశ్రాంత రాజనీతిశాస్త్ర అధ్యాపకుడు ఎన్ తిరపతయ్య, హిందూ కళాశాల అధ్యాపకుడు ఎల్‌ఎస్‌ఎన్ ప్రసాద్, విశ్రాంత లెక్చరర్ ఇవి సుబ్బారావు, కిసాన్ ఫౌండేషన్ నాయకులు కె మురళీధరరావు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకుడు సత్యనారాయణ, న్యాయవాది లావు సత్యనారాయణ, బి సుబ్బారెడ్డి, ఇ చంద్రయ్య, ఎ హరి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే పాదయాత్ర
* మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్
మేడికొండూరు, జనవరి 10: ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే పాదయాత్ర లక్ష్యమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని సిరిపురం గ్రామంలో పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిరిపురం గ్రామంలోని బిసి, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజల నుండి పలు సమస్యలను తెలుసుకున్నారు. ఈ కాలనీలో రోడ్ల మరమ్మతుల నిమిత్తం ఆర్‌అండ్‌బి నిధుల నుండి కోటి రూపాయలు మంజూరైనట్లు వెల్లడించారు. సిరిపురంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ పాదయాత్రలో మాజీ ఎంపిపిలు వి సాంబిరెడ్డి, పేరం సాంబశివరావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పాములపాటి తిరుపతిరావు, ఫిరంగిపురం మార్కెట్‌యార్డు ఉపాధ్యక్షుడు అబ్దుల్ బాసిత్, కోటా గోపాలకృష్ణ, ఎంపిడిఒ బ్రహ్మయ్య, తహశీల్దార్ పద్మావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
హాస్టల్ విద్యార్థులకు దోమతెరలు పంపిణీ
మంగళగిరి, జనవరి 10: పట్టణంలోని ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులకు, ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినులకు యెదిద్యా ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన దోమతెరలు, ఇన్వర్టర్ అందజేశారు. నార్త్‌జోన్ డిఎస్పీ ఎం మధుసూధనరావు చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మధుసూధనరావు మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు దోమతెరలు అందించిన నిర్వాహకులను అభినందించారు. విద్యుత్ కోత వలన చదువుకు ఆటంకం కలగరాదనే ఉద్దేశంతో ఇన్వర్టరును కూడా బహూకరించడం హర్షణీయమని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని అన్నారు. ఆర్గనైజేషన్ అధ్యక్షుడు స్టాలిన్, కార్యదర్శి రంజిత్, కాంగ్రెస్ నాయకుడు షేక్ కాలేషా తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
అమరావతి, జనవరి 10: జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు ఫిబ్రవరి 20, 21 తేదీల్లో జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఈమని అప్పారావు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక తల్లం బ్రహ్మయ్య స్మారక భవనంలో నూతక్కి రమేష్ అధ్యక్షతన జరిగిన సిఐటియు మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు అప్పికట్ల భూషయ్య, ఎన్ వెంకట్రావ్, పఠాన్ జాని, తుడుము కృష్ణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
కొత్త పనులను గుర్తించి కూలీల వలస నివారించండి
పొన్నూరు, జనవరి 10: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొన్నూరు మండలంలోని 29 గ్రామాల్లో కోటి 5 లక్షల రూపాయల వ్యయంతో పనులు పూర్తి చేయడం జరిగిందని డ్వామా పిడి అనిల్‌కుమార్ తెలిపారు. పొన్నూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులపై ప్రజావేదిక ద్వారా గురువారం ఆయన సమీక్షించారు. ఈ పథకం ద్వారా మండల పరిధిలోని గ్రామాల్లో జరిగిన కాల్వల పూడికతీత, డ్రైన్ల మరమ్మతులు, పంచాయితీ రోడ్ల నిర్మాణ పనులను 78 స్వయం సహాయక సంఘాలు, 1128 లేబర్ గ్రూపులకు పని కల్పించడం జరిగిందన్నారు. ప్రజావేదిక కార్యక్రమానికి గైర్హాజరైన కొండముది గ్రామ సిఎస్‌టివి, పనులు చేపట్టని జూపూడి ఫీల్డు అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కొండముది గ్రామంలో పనులు పూరె్తై 8 నెలలు గడిచినా డబ్బులు చెల్లించలేదని కూలీలు ఆరోపించడంతో సత్వరమే చెల్లించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్‌కార్డు జిల్లా మేనేజర్ సురేష్, సోషల్ ఆడిట్ టీం ఎస్‌ఆర్‌పి శ్రీనివాస్, ఎండిఒ కె అంకమ్మ తదితరులు పాల్గొన్నారు.