మచిలీపట్నం టౌన్, జనవరి 10: పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. బుద్ధప్రకాష్ ఎం జ్యోతి అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణపై గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు. వేడుకలను తిలకించేందుకు వచ్చే అతిధులు, అధికార, అనధికారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. దేశ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేలా చూడాలన్నారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తున్న శాఖలు ప్రజలకు అందిస్తున్న సేవలను తెలియచేసే విధంగా శకటాలను, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. సాంఘిక సంక్షేమం, బిసి, ఎస్‌టి, మైనార్టీ సంక్షేమ శాఖలు శకటాలను ఏర్పాటు చేయాలన్నారు. డ్వామా, రాజీవ్ విద్యా మిషన్, డిఆర్‌డిఎ, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా, సర్వశిక్షా అభియాన్, జాతీయ రూరల్ హెల్త్ మిషన్, రెవెన్యూ తదితర శాఖలు శకటాలను ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక, రాష్ట్ర, జాతీయ నాయకుల ఫొటోలతో కూడిన హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని ఆయన వివరించారు. జెసి ఉషాకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎల్ విజయచందర్, జెడ్పీ సిఇఓ కొండయ్య శాస్ర్తీ, డిడబ్ల్యుఎఎంఎ పీడీ హనుమానాయక్, ఆర్డీవో ఐ వెంకటేశ్వరరెడ్డి, డిఇఓ దేవానందరెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ప్రసాద్, పశుసంవర్ధక శాఖ డిడి మధుసూదనరావు, డియస్‌ఓ ప్రభాకరరావు, డిఎంహెచ్‌ఓ కెఎం సునంద, హౌసింగ్ పీడీ రవికుమార్ పాల్గొన్నారు.
మళ్లీ మళ్లీ వాయిదా!
హనుమాన్ జంక్షన్, జనవరి 10: హనుమాన్ జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు గత వారం పోలీసు, రెవెన్యూ, జాతీయ రహదారుల శాఖ అధికారులు నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు గ్రహణం పట్టింది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఫుట్‌పాత్‌లను కబళిస్తూ చొచ్చుకువచ్చిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో కఠిన వైఖరి అవలంభిస్తామని చెప్పిన అధికారులు అందుకు గడువు విధించారు. తొలుత రెండు రోజుల్లో దుకాణాదారులు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలిగించాలని, లేనిపక్షంలో కేసులు పెడతామని హెచ్చరించారు. అధికారులు అందుబాటులో లేని కారణంగా రెండుసార్లు ఆక్రమణల తొలగింపు కార్యక్రమం వాయిదాపడింది. ఎవరివారే యమునా తీరే అన్నచందంగా అధికారులు వ్యవహరించడం దుకాణాదారులకు అలుసుగా మారింది. శాశ్వత నిర్మాణాలు చేపట్టే సమయంలో అడ్డుకునే అధికారులు లేకపోవడంతో ఆక్రమణలు మరింత చొచ్చుకువస్తున్నాయి. ఫుట్‌పాత్‌లపై నడిచివెళ్లే అవకాశం లేకపోవడంతో పాదచారులు రోడ్డు మధ్యలోనుంచి నడక సాగిస్తున్నారు. దీనికితోడు నిబంధనలకు వ్యతిరేకంగా ఎదురెదురుగా వాహనాలు ప్రయాణించడంతో సమస్య మరింత జటిలంగా మాఠింది. సాయంత్రం సమయంలో బస్టాండ్ నుంచి జంక్షన్ కూడలికి చేరుకోవాలంటే సమారు 20 నిమిషాల సమయం పడుతోంది. హనుమాన్ జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జంక్షన్ అవుట్‌పోస్టులో ఇద్దరు ఎస్‌ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, మరో పదిమంది సిబ్బంది వున్నారు. అయినా సరే సమస్య తీవ్రత తగ్గడంలేదు. మంత్రులు, విఐపిల పర్యటనల సమయంలో దారిపొడవునా కనిపించే పోలీసులు, తిరిగే హైవే పెట్రోల్ వాహనం మిగిలిన సమయాల్లో పనిచేసే సూచనలు లేవు. జాతీయ రహదారిపై వాహనాలు ఎంతసేపు అయినా ఆపి యాజమానులు వారి పనులను పూర్తిచేసుకునే స్వేచ్ఛ హనుమాన్ జంక్షన్‌లో మాత్రమే వుంటుంది. ఇప్పటికైనా అధికారులు ఆక్రమణలను తొలిగించి, ఆక్రమణాలదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నేడు కల్నల్ సికె నాయుడు
క్రికెట్ పోటీలు ప్రారంభం
మచిలీపట్నం టౌన్, జనవరి 10: భారత జట్టు తొలి కెప్టెన్, బందరువాసి కల్నల్ సికె నాయుడు క్రికెట్ ట్రోఫీ జిల్లాస్థాయి టోర్నమెంట్‌ను శుక్రవారం స్థానిక ఆంధ్ర జాతీయ క్రీడా మైదానంలో ప్రారంభించనున్నట్లు మచిలీపట్నం క్రికెట్ అసోసియేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లాస్థాయిలో 15సంవత్సరాల్లోపు హైస్కూలు విద్యార్థుల 24 జట్లతో నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. ఎంపి కొనకళ్ళ నారాయణరావు, ప్రభుత్వ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని), జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రభాకరరావు అతిధులుగా పాల్గొననున్నట్లు తెలిపారు. క్రికెట్ క్రీడాకారులు, అభిమానులు ఈ పోటీలకు పెద్దఎత్తున తరలివచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలని అసోసియేషన్ కోరింది.
‘మీ సేవ’లో
నాలుగు పోలీసు సేవలు
మచిలీపట్నం టౌన్, జనవరి 10: ‘మీ సేవ’ ప్రాజెక్టు నిర్వహణపై అదనపు పోలీసు జనరల్ గోపాల్‌రెడ్డి, కంప్యూటర్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అంజనీకుమార్ గురువారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మీ సేవ ప్రాజెక్టు నిర్వహణపై పలు సూచనలు చేశారు. మీ సేవ ప్రాజెక్ట్ ద్వారా నాలుగు రకాల సేవలు అందుబాటులోకి రానున్నట్లు వారు తెలిపారు. ప్రమాణ పత్రాలు, బందోబస్తు నిర్వహణకు పోలీసుల సేవలు, అర్హత, ప్రమాణ పత్రాలు పోగొట్టుకున్న వారికి సదరు పత్రాలను విచారణ అనంతరం జారీ చేయమని నిర్దేశించే సేవ, కొన్నిరకాల అనుమతి పత్రాల జారీ, అనుమతి పత్రాల పునరుద్ధరణ మీ సేవ ప్రాజెక్ట్ ద్వారా లభిస్తాయన్నారు. ఎస్పీ ప్రభాకరరావు, డిసిఆర్‌బి సిఐ ఉమామహేశ్వరరావు, కమ్యూనికేషన్ సిఐ శ్రీనివాస్, ఎస్‌బి సిఐ వెంకటేశ్వరరావు, టౌన్ సిఐ మురళీధర్, కంప్యూటర్ కోర్ టీం సభ్యులు పాల్గొన్నారు.
కేసుల పరిష్కారంపై దృష్టి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జనవరి 10: అపరిష్కృతంగా ఉన్న కేసులపై దృష్టి సారించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రభాకరరావు పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రధానంగా వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై నమోదైన కేసులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. స్ర్తిలపై జరుగుతున్న అత్యాచారాల గురించి స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు, అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. అత్యాచారం జరిగిన వెంటనే గ్రామపెద్దల వద్ద పంచాయతీలు కాకుండా పోలీసుల దృష్టికి తీసుకొచ్చే విధంగా బాధితులను చైతన్యవంతుల్ని చేయాలన్నారు. న్యాయస్థానాలు ఆదేశించిన ఫిర్యాదులను తక్షణం నమోదు చేసి విచారణ చేపట్టాలన్నారు. ప్రతినెలా చివరిరోజును పౌరహక్కుల దినంగా పాటించి సాంఘిక సంక్షేమ శాఖ సౌజన్యంతో గ్రామసభలు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి చట్టాలపై అవగాహన కల్పించాలని కూడా ఎస్పీ ప్రభాకరరావు సూచించారు. ఈ సమావేశంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
శ్రీకృష్ణాశ్రమంలో
నేడు కూడార్ వ్రతం
కూచిపూడి, జనవరి 10: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో కూడార్ వ్రతాన్ని తిలకించేందుకు, పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ సీతారామ యతీంద్రులు, శ్రీ లక్ష్మణ యతీంద్రులు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులు శ్రీకృష్ణాశ్రమంలో కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు.
ధనుర్మాస మహావ్రతాల్లో అత్యంత ప్రాముఖ్యమైన కూడార్ (వ్రతఫల అనుభవ దినం) సందర్భంగా గోదాదేవి శ్రీరంగనాథునికి తన కోరికలు నెరవేర్చినందుకు సంతోషంగా 108శేర్ల నేతితో చేసిన చక్కెర పొంగలిని స్వామివారికి నివేదించినట్లు గోదా కల్యాణం ద్వారా తెలుస్తోంది. ద్వాపరయుగంలో గోపికలు శ్రీకృష్ణుని సేవించాలన్న భక్త్భివంతో చేపట్టిన కాత్యాయిని వ్రతానికి మారుపేరే కూడార్ వ్రతమని పేర్కొంటున్నారు. ఈసందర్భంగా ఆశ్రమంలో శ్రీ సీతారాం గురుదేవులు స్వయంగా నేతితో చేసిన చక్కెర పొంగలిని స్వామివారికి నివేదించిన అనంతరం భక్తులకు అందచేయటం అనాదిగా వస్తోంది.
చెడుగుడు చాంపియన్ ధిండిమెర జట్టు
తోట్లవల్లూరు, జనవరి 10: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలంలోని పెనమకూరు జెడ్పీ హైస్కూల్ ఆవరణలో భారత యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి చెడుగుడు పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయని నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ధిండిమెరకు చెందిన కన్నా రాంబాబు మెమోరియల్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. రెండో స్థానం చాగంటిపాడుకు చెందిన ఇండియన్ బ్రదర్స్ (ఎ) జట్టు, మూడో స్థానం మంతెనకు చెందిన లాంలాజర్ మెమోరియల్ జట్టు, నాలుగో స్థానం ధూళిపూడిపాలెంకు చెందిన విఎం రంగా మెమోరియల్ జట్టు, ఐదో స్థానం చాగంటిపాడుకు చెందిన ఇండియన్ బ్రదర్స్ (బి) జట్టు సాధించినట్టు యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు మరీదు తిమోతి, రాజ్‌కుమార్ తెలిపారు. విజేతలకు 15న బహుమతి ప్రదానం జరుగుతుందని వివరించారు.
సీతారామాంజనేయునికి చామంతుల అర్చన
మచిలీపట్నం (కల్చరల్), జనవరి 10: స్థానిక జవ్వారుపేట శ్రీ విజయ సీతారామాంజనేయ మందిరంలో గురువారం స్వామివారికి చామంతుల అర్చన నిర్వహించారు. విజయశ్రీ భక్తసమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు తిరుమంగై అళ్వార్ పూజలు నిర్వహించారు.
ఆర్‌ఎస్ నెం.445 తోట్లవల్లూరు పంచాయతీదే!
తోట్లవల్లూరు, జనవరి 10: మండలంలోని వల్లూరుపాలెం ఇసుక క్వారీని అధికారులు ఎంత గుడ్డిగా నిర్థారించి వేలంపాట నిర్వహించారో ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా నిరూపించారు. ఆర్‌ఎస్ నెం.445లోని ఇసుకపాయను వల్లూరుపాలెం క్వారీ కిందచేర్చి వేలంపాట నిర్వహించిన తరువాత వల్లూరుపాలెం, తోట్లవల్లూరు గ్రామాల ప్రజల మధ్య ఎంతటి వివాదాలు నడిచాయో అందరికీ తెలిసిందే. ఈ వేలంపాట ద్వారా రూ.10.17 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో తోట్లవల్లూరు గ్రామానికి చెందిన రైతు కిలారం శ్రీనివాసరావు 1971లో పంచాయతీల విభజన జరిగినపుడు అప్పటి కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను సంపాందించి 445 సర్వే నెంబర్ తోట్లవల్లూరు పంచాయతీ పరిధిలోనిదని, సీనరేజీ నిధులు తోట్లవల్లూరు పంచాయతీకే కేటాయించాలని అనేక మంది అధికారులను వినతిపత్రాల ద్వారా కోరినా తాము తప్పు చేయలేదని, 445 సర్వే నెంబర్ వల్లూరుపాలెందేనని సమాధానమిచ్చారు. దీంతో పట్టుదల పెరిగిన శ్రీనివాసరావు 1971 తరువాత మళ్ళీ పంచాయతీల విభజన జరిగిందా, జరిగితే ఆ వివరాలు కావాలని, ప్రస్తుతం 445 సర్వే నెంబర్ ఏ పంచాయతీ పరిధిలో ఉందో లిఖితపూర్వకంగా తెలియజేయాలని జిల్లా పంచాయతీ ఆఫీసర్ (డిపిఓ)కి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీంతో రికార్డులను పరిశీలించి లేఖ ఇవ్వాలని జేసీ డిపిఓని కోరారు. రికార్డులను పరిశీలించిన డిపిఓ 445 సర్వే నెంబర్ తోట్లవల్లూరు పంచాయతీ పరిధిలోదేనని జేసీకి, కిలారం శ్రీనివాసరావుకి లేఖ పంపారు. దీంతో వల్లూరుపాలెం క్వారీ వేలం ద్వారా వచ్చిన రూ.10.17 కోట్ల ఆదాయంలో 25శాతం నిధులను తోట్లవల్లూరు పంచాయతీకి కేటాయించాలని గురువారం కిలారం శ్రీనివాసరరావు, యార్లగడ్డ శివయ్య, మరికొందరు గ్రామస్థులతో కలసి కలెక్టర్ కార్యాలయంలో, జెడ్పీ సిఇఓకి వినపత్రాలు అందజేశారు. దీనిపై ఇక అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.
జిల్లా జట్ల విజయ దుందుభి
మచిలీపట్నం (కల్చరల్), జనవరి 10: స్థానిక బచ్చుపేట శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర భక్తసంఘం 33వ వార్షికోత్సవాలను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా స్తోత్ర పోటీ విజేతలకు బహుమతులు అందచేశారు. ఎల్‌కేజి నుండి 10వ తరగతి వరకు 600 మందికి పైగా విద్యార్థులు స్తోత్ర పఠన పోటీలకు హాజరుకాగా 44మందిని విజేతలుగా ఎంపిక చేశారు. బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎల్‌ఐసి సీనియర్ డివిజనల్ మేనేజరు జె రంగారావు మాట్లాడుతూ బాల్యం నుండే దైవభక్తి పెంపొందించడానికి తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఎల్‌ఐసి మేనేజరు కె ఆదినారాయణ, ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త ఎం రవికాంత్, భక్తసంఘం గౌరవాధ్యక్షులు మేడిచర్ల కుటుంబరావు, కార్యదర్శి కెఎల్‌ఎన్ ఆచార్యులు, కోశాధికారి కొల్లూరి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
పేదల కోసమే 20 సూత్రాల పథకం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 10: దారిద్య్రరేఖకు దిగువనున్న సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రవేశపెట్టిన 20 సూత్రాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు పరిచిననాడే ఆశించిన ఫలితాలను సాధించగలుగుతామని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ డా ఎన్ తులసిరెడ్డి అన్నారు. జిల్లాలో 20 సూత్రాల కార్యక్రమం అమలుపై వివిధ శాఖల అధికారులతో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం సమీక్షా సమవేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 37 సంవత్సరాల క్రితం మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ పేద ప్రజల ఆర్థిక పురోగతికి 20 సూత్రాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 1975లో పథకం ప్రవేశపెట్టిన నాటి నుండి సమాజంలో మార్పులు, ప్రపంచీకరణ నేపథ్యంలో పథకంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా 1982, 1986, 2006లలో పథకంలో మార్పులు చేయడం జరిగిందని, 2006లో యుపిఏ ప్రభుత్వం కామన్ మినిమమ్ ప్రొగ్రాం కింద ఈ పథకాన్ని 20 అంశాలతో 20 సూత్రాల పథకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ డా బుద్ధప్రకాశ్ ఎం జ్యోతి మాట్లాడుతూ 20 సూత్రాల కార్యక్రమం అమలులో జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు తగు చర్యలను తీసుకుంటున్నారన్నారు. అధికారులు చేపట్టిన చర్యలకు ఫలితంగా 2010 - 11 సంవత్సరంలో కృత్తివెన్ను, 2011-12 సంవత్సరంలో గుడివాడ మండలాలు పథకం అమలులో ప్రథమ స్థానంలో ఉన్నాయన్నారు. ఆయా అధికారులను స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమం అమలుకు కృషి చేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 2,14,000 కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని, ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ. 128 కోట్లను వేతనాలుగా చెల్లించడం జరిగిందన్నారు. సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్ రమేష్ కుమార్, డిఆర్‌డిఎ పిడి యం జానకి, సిపిఓ వెంకటేశ్వర్లు, డ్వామా పిడి వి హనుమానాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 10: ప్రభుత్వాసుపత్రిలో వైద్య సౌకర్యంను మరింతగా మెరుగుపరచడానికి తన శాయశక్తుల కృషి చేయగలనని ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా నియమితులై గురువారం విధులు చేపట్టిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం జగన్మోహనరావు అన్నారు. ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ అన్ని విభాగ వైద్యులు, అలాగే వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్ల తోడ్పాటుతో నాణ్యమైన సేవలు అందేలా కృషి చేస్తానన్నారు. సాధారణంగా ప్రభుత్వాసుపత్రికి నిరుపేదలు వస్తుంటారని, అయితే ఇక్కడి ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులు అత్యాధునిక ఎక్విప్‌మెంట్ ఉండడంతో ఉన్నత, మధ్య తరగతి ప్రజలు కూడా రావడం జరుగుతున్నదన్నారు. వౌలిక సదుపాయాల పెంపుకోసం ప్రభుత్వం నుంచి అదనపు నిధులు రాబట్టేందుకుగాను కలెక్టర్ అధ్యక్షతన పనిచేసే ఆసుపత్రి సలహా సంఘం ద్వారా కృషి చేస్తానన్నారు. త్వరలోనే అన్ని విభాగాల వైద్యులు, సిబ్బందితో సమావేశమై సమీక్షిస్తానని డాక్టర్ జగన్మోహనరావు తెలిపారు.
సాహితీ విరాట్ రూపం
‘సరస్వతి సామ్రాజ్య వైభవం’
విజయవాడ (కల్చరల్), జనవరి 10: గ్రంథం సరస్వతి రూపం. ఆ గ్రంథాల నిలయంగా భాసిల్లుతున్న పుస్తక మహోత్సవ ప్రాంగణమే సరస్వతి సామ్రాజ్యం. సరస్వతి సామ్రాజ్య వైభవం పేరిట 24వ పుస్తక మహోత్సవ ప్రాంగణంలోని ప్రధాన వేదికపై గురువారం సాయంత్రం సాహితీ రూపకం జరిగింది. వేదికపై సరస్వతిగా ఆచార్య కోలవెన్ను మలయవాసిని, నారదునిగా మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి (ప్రయోక్తగా) సరస్వతీ మాత జ్ఞానప్రదాయినిగా పుస్తక మహోత్సవ ప్రాంగణంలో పుస్తకాల రూపంలో దర్శనమిస్తోందని, నన్నయగా డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ సత్యవాక్కు గొప్పదని వివరిస్తూ, శ్రీనాథునిగా డాక్టర్ జంధ్యాల మహతీ శంకర్, భీమేశ్వరపురాణంలోని ద్రాక్షారామ వైభవాన్ని, పెద్దనగా కోట వెంకట లక్ష్మీనరసింహం మనుచరిత్ర ధర్మస్వరూపాన్ని, విశ్వనాథగా మెట్ట వెంకటేశ్వరరావు రామాయణ కల్పవృక్షంలోని జటాయు దశరథుల మైత్రిని, శ్రీశ్రీగా పింగళి వేంకట కృష్ణారావు అభ్యుదయ కవితా ప్రస్థానాన్ని వివరిస్తూ సంస్కృతాంధ్ర పండిత ప్రకాండులు వారివారి పాండితీప్రకర్షతో సాహితీ విరాట్ రూపాన్ని ఆవిష్కరించారు. సమస్యలు దత్తపదులు కూడా జరిగాయి. పాలపర్తి, కోటలు భీమ, భీష్మ, కర్ణ, కృష్ణ పదాలు, రారా, మీరా, సారా, పేరాలతో, జంధ్యాల, మెట్టాలు వరునివరించి చేరినది పార్వతి దేవతలెల్ల మచ్చగన్, పుటలే పుస్తక శత్రువుల్ వినుడహో ముమ్మాటికిన్ పాఠకుల్ వీటితో వారి ప్రజ్ఞను కనబరిచారు.
నవ్వులు పూయించిన
కైలాసంలో కోర్టు వీధి నాటకం
ప్రారంభంలో లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల రామకృష్ణ, ఎవి రమణ్‌జీ, కెవి భాస్కరరావు, శ్రీకృష్ణలు బి బాబూరావు రచించిన కైలాసంలో కోర్టు నాటిక నవ్వులను పంచుతూ సాగింది. ఓటు హక్కును సరిగా వినియోగించుకోకపోతే జరిగే అనర్థాలకు కోర్టు కైలాసంలో ఉండి న్యాయ నిర్ణయం అచటనే జరుగుతుందని తెలుపుతుంది. చందు మిమిక్రీ అందరినీ ఆకట్టుకుంది.
మాంటిస్సోరిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
గాంధీనగర్, జనవరి 10: తెలుగువారి సాంప్రదాయ ప్రతిభను దృష్టిలో పెట్టుకుని బందరురోడ్డు, మాంటిస్సోరీ మహిళా కళాశాలలో సంక్రాంతి పండుగ సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించినట్లుగా కళాశాలకు చెందిన జూనియర్ విభాగ ప్రిన్సిపాల్ డా. యార్లగడ్డ మంగతయారు తెలిపారు. గురువారం ఉదయం సంప్రదాయసిద్ధంగా 10 గంటలకు భోగి మంటలతో అంకురార్పణ జరిగిన ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహ భరితంగా సాగింది. రంగవల్లుల పోటీల్లో విద్యార్థినులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. తెలుగువారి సాంప్రదాయ వస్త్ర వేషధారణ, భోగిపళ్లు, కోలాటం, హరిదాసుల పాటలు, చమ్మాచక్క, గాలిపటాలు, గంగిరెద్దుల ఆటలు, జానపద నృత్యాలు, గొబ్బెమ్మ కొలువు సంక్రాంతిని కళ్లముందుంచాయి. ఆయా విభాగాల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 250, 150, 116 రూపాయలు చొప్పున అందజేసినట్లు మాంటిస్సోరి విద్యా సంస్థల డైరెక్టర్ కోటేశ్వరమ్మ తెలిపారు.
వైష్ణవి కేసు 24కి వాయిదా
విజయవాడ (క్రైం), జనవరి 10: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన పలగాని నాగవైష్టవి కేసు విచారణ పునః ప్రారంభమైంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ వైద్యుడ్ని న్యాయమూర్తి గురువారం విచారించారు. ప్రముఖ వ్యాపారి పలగాని ప్రభాకర్ కుమార్తె పలగాని నాగవైష్ణవి 2010లో పాఠశాలకు వెళ్తున్న సమయంలో కిడ్నాప్‌కు గురై హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డ్రైవర్ లక్ష్మణరావును హతమార్చిన దుండగులు వైష్ణవిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత గొంతు నులిమి చంపి కాల్చి బూడిద చేసిన విషయం విదితమే. వైష్ణవి మృతి వార్త తెలుసుకున్న పలగాని ప్రభాకర్ సైతం తర్వాత గుండెపోటుతో మరణించారు. అప్పట్లో ఈ వరస సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ కేసులో సత్యనారాయణపురం పోలీసులు దర్యాప్తు చేపట్టిన మీదట మోర్ల శ్రీనివాసరావు, వెంపరాల జగదీష్, పంది వెంకట్రావ్‌గౌడ్‌లను నిందితులుగా అరెస్టు చేయగా ప్రస్తుతం జిల్లా జైలులో రిమాండ్ అనుభవిస్తూ విచారణ ఎదుర్కొంటున్నారు. దీనిలో భాగంగా గురువారం మహిళా సెషన్స్ కోర్టుకు నిందితులు హాజరయ్యారు. అయితే ప్రభుత్వ వైద్యుడు రాజ్‌కుమార్‌ను న్యాయమూర్తి కేసులో పలు విధాల విచారించిన మీదట నిందితుల తరపు డిఫెన్స్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ నిమిత్తం 24వ తేదీకి వాయిదా వేశారు. కాగా వైష్ణవి కేసు విచారణ సందర్భంగా ఏసిపి, సిఐలు, సిబ్బంది పెద్ద ఎత్తున కోర్టుకు తరలివచ్చారు.
ఆక్రమణ భూమిని పరిశీలించిన ఆర్డీవో
విజయవాడ రూరల్ జనవరి, 10: విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలోని అమెరికన్ హాస్పిటల్ ఆవరణలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిని విజయవాడ ఆర్‌డిఓ వెంకట్రావ్ గురువారం పరిశీలించారు. బహుళ అంతస్థులతో నిర్మాణాలు ఉండాటాన్ని ఆరా తీశారు. సెయింట్ ఆన్స్ యాజమాన్యం 3 దశాబ్దాల క్రితం బహుళ అంతస్థులు నిర్మాణాలు జరిపారు. పలు మార్లు తహాశీల్ధార్ అసైన్డ్ భూమిపై హెచ్చరించారు. ఆ స్థలం మాదేనని వాదిస్తూ వచ్చారు. ఇందుకు సంబంధించిన రికార్డులు చూపమని సెంట్ ఆన్స్ యాజమాన్యాన్ని కోరారు. ఆర్డీఓ పరిశీలనలో ఎట్టకేలకు మెత్తబడ్డారు. ప్రభుత్వ భూమిగా చూపబడుతున్న స్థలానికి ప్రత్యామ్నాయంగా 1.27 సెంట్లు యివ్వటానికి సుముఖత వ్యక్తం చేశారు. నున్న గ్రామంలోని ఆర్ ఎస్ నెంబర్ 279/2 లో ఆక్రమణలోని భూమికి బదులుగా తమ ఆథీనంలోని ఆర్ ఎస్ నెంబర్ 280లో 1.27 ఎకరాల భూమి స్వాధీనం చేస్తామని సూచనప్రాయంగా తెలియజేశారు. ఇందుకు స్పందించిన ఆర్‌డిఓ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా తమ ఆధీనంలోని 279/3ఎ లో1.27 సెంట్లు స్వాధీనం చేయటానికి అంగీకారం తెలియజేశారు. రాకపోకలు జరపటానికి వాగుపై వంతెన నిర్మాణం చేయాల్సి వస్తోంది కాబట్టి తమ సంస్థ ద్వారం నుంచి రాకపోకలు అనుమతిస్తారా అని రెవిన్యూ ఆధికారులు అడిగారు. అందుకు సిస్టర్స్ నిరాకరించారు. ఎట్టకేలకు ఆర్ ఎస్ నెంబర్ 280లో 1.27 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేయటానికి సెంట్ అన్స్ సిస్టర్స్ అంగీకరించారు. లిఖిత పూర్వకంగా అప్పగించాలని రెవన్యూ అధికారులు సూచించారు. కనె్సంట్ లెటర్ రెవన్యూ కార్యాలయానికి వచ్చి అందజేస్తామని న్యాయవాది ద్వారా తెలియజేశారు.
పిహెచ్‌సి ఏర్పాటుకు మార్గం సుగమం
చుట్టుపక్కల గ్రామాలకు కూడలిగా వున్న నున్న గ్రామంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు అధికారులు స్థలానే్వషణ సులభమైంది. విజయవాడ-నూజివీడు రహదారిలోని నున్న గ్రామంలోని అమెరికన్ హస్పిటలో ఆవరణలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమికి ప్రత్యామ్నాయంగా 1.27 ఎకరాలు స్వాధీనం చేయటానికి సెంట్ ఆన్స్ యాజమాన్యం అగీకరించటంతో ఆ స్థలాన్ని ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు తగు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. గ్రామంలోని ఆర్‌ఎస్ నెంబర్ 280లో పిహెచ్‌సి ఏర్పాటుకు సెంట్ ఆన్స్ యాజమాన్యం అంగీకరించింది. సాయిబాబా గుడికి ఉత్తర పక్కన నుంచి రహదారి ఏర్పాటుతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిక యివ్వనున్నట్లు నున్న గ్రామ ప్రత్యేకాధికారి మూర్తి తెలిపారు. విఆర్‌ఓ తొర్లికొండ శంకర్, సర్వేయర్లు సత్తిబాబు, సుబ్బారావు మాజీ గ్రామ సర్పంచ్ జీతం శ్రీనివాసరావు తదితరులు పాల్లొన్నారు.