Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కలెక్టర్ వాణీమోహన్‌కు ‘మీ-సేవ’ అవార్డు

$
0
0

ఏలూరు, జనవరి 10: మీ-సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్‌కు ప్రతిష్టాత్మకమైన మీ-సేవా అవార్డు లభించింది. ఈ నెల 11వ తేదీ ఉదయం హైదరాబాద్‌లోని జూబ్లీ హాలులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ మీ-సేవ అవార్డును అందుకోనున్నారు. జిల్లాలో ఆరు నెలల క్రితం మీ-సేవ కేంద్రాలను ప్రారంభించి మూడు లక్షల వరకూ ప్రజలకు వివిధ రకాల ధ్రువీకరణపత్రాలను అందించడంలో ముందంజలో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ వాణిమోహన్‌ను మీ-సేవ అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లాలో ఏలూరు మండలం ప్రజలకు మీ-సేవ కేంద్రాల ద్వారా సత్వర సేవలు అందించడంలో తహసీల్దారు ఎజి చిన్నికృష్ణ అగ్రస్థానంలో నిలిచారు. కలెక్టరుతో పాటు ఎన్ ఐసి సైంటిస్టు జి గంగాధరరావు, ఏలూరు తహశీల్దార్ ఎజి చిన్నికృష్ణలు కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మీ-సేవ అవార్డులు అందుకోనున్నారు. హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టరుకు గురువారం సాయంత్రం ఫోన్ రావడంతో కలెక్టర్‌తో పాటు గంగాధరరావు, ఎజి చిన్నికృష్ణ గురువారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

ఇదేమి సాంప్రదాయం...
నా నియోజకవర్గ సమీక్షా సమావేశానికి నన్ను ఆహ్వానించరా:దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆవేదన
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జనవరి 10: తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించేందుకు నిర్వహిస్తున్న సమావేశానికి తనకే ఆహ్వానం లేకపోవటం భావ్యం కాదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదెక్కడి సంప్రదాయమని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం జిల్లా కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్ అధ్యక్షతన దెందులూరు నియోజకవర్గ అభివృద్ధి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావుతోపాటు పలువురు మాజీ సర్పంచులు, జడ్పీటీసీ సభ్యులు, ఎఎంసి ఛైర్మన్, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. అయితే సమావేశం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొద్దిసేపటి అనంతరం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సమావేశంలో పాల్గొని నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ప్రస్తావించారు. సమావేశం ముగింపులో ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేకు తెలియకుండా నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాసమస్యల పరిష్కారమే ప్రజాప్రతినిధి లక్ష్యమని, అటువంటప్పుడు సమీక్షకు తనను పిలవకపోవటం మంచి పద్దతి కాదని, మరోసారి ఇలా జరగకుండా చూస్తారని భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్యేగా తనకు ఇవ్వాల్సిన గౌరవం తనకు ఇవ్వాల్సిందేనన్న విషయాన్ని అధికారులు గుర్తించాలని పేర్కొన్నారు.

రైతన్నల విద్యుదాగ్రహం!
*బుట్టాయగూడెం సబ్-స్టేషన్ ముట్టడి
*ఎఇ నిర్బంధం
*ఇళ్లకూ వద్దంటూ సరఫరా నిలిపివేత
*అంధకారంలో గ్రామాలు
బుట్టాయగూడెం, జనవరి 10: పంటల సాగుకు అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు గురువారం స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. లక్షలాది రూపాయల వ్యయంతో సాగు చేసిన తమ పంటలు సాగునీరందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు రెండుగంటలపాటు రైతులకు విద్యుత్‌ను అందించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌శాఖ ఎఇ తిరుపతి వీరభద్రస్వామిని వారు నిలదీశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్నట్టు చెబుతున్న ఏడుగంటల విద్యుత్‌ను ఎఇ ఐదు గంటలుగానే చెప్పడంతో రైతులు ఒకదశలో ఆయనపై విరుచుకుపడ్డారు. తమ సాగుకు ఇవ్వని విద్యుత్ తమ ఇళ్లకు మాత్రం ఎందుకంటూ సబ్‌స్టేషన్‌లోని అన్ని ఫీడర్ల నుండి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. దీంతో సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలన్నీ చీకట్లో మగ్గిపోయాయి. రైతులకు స్థానిక వ్యాపారస్తులు కూడా మద్దతు పలుకుతూ సబ్‌స్టేషన్ ముందు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఎడిఇ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేదిలేదని రైతులు పట్టుబట్టారు. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో స్థానిక భూ వివాదాల ప్రత్యేక సిఐ ఆర్ మనోజహర్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించారు. ఆందోళన సమాచారం తెలుసుకున్న ఎడిఇ జి ప్రకాశరావు వచ్చి రైతులతో చర్చించారు. శుక్రవారం నుండి వ్యవసాయానికి నిరంతరం అయిదుగంటలపాటు విద్యుత్‌ను సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి రైతులు కరాటం పెదబాబు, పల్లోతు కాశిబాబు, ముదునూరి రవి, ఎన్ జానకిరామ్, వి శ్రీను, కుంజా నాగేంద్ర, యాండ్రప్రగడ శ్రీనివాసరావు, ఎన్ శ్రీనివాస్ తదితరులు నాయకత్వం వహించారు.

నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ పిలుపు
భీమవరం, జనవరి 10: జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో వౌలిక సదుపాయాలు కల్పించామని, విద్యాప్రమాణాలు పెంచి నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణీ మోహన్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక డిఎన్నార్ కళాశాలలోని రామకృష్ణ సభాభవనంలో నర్సాపురం, తణుకు, భీమవరం డివిజన్‌ల పరిధిలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి వసతి గృహాల వార్డెన్లు, ఎఎస్‌డబ్ల్యుఒ, ఎబిసిడబ్ల్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అభిలాష కార్యక్రమం ద్వారా 99 వసతి గృహాల్లో రూ.1.78 కోట్లతో వౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. మిగిలిన వసతి గృహాలకు మరమ్మతులు, ఇతర వసతులు గురించి ప్రతిపాదనలు పంపినట్టయితే నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం ఇటీవల పెంచిన మోను ప్రకారం ప్రతి వసతి గృహంలో విద్యార్థులకు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితులను కూడా పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు, వార్డెన్‌లు, మేట్రిన్లు పాల్గొన్నారు.
టెన్త్ ఫలితాల్లో ఫస్ట్ రావాలి
ఈ ఏడాది పదవ తరగతి ఉత్తీర్ణతలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలన్నారు. భీమవరం, తణుకు డివిజన్‌లకు సంబంధించి 15 మండలాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులతో పదవ తరగతి ఉత్తీర్ణత విద్యాప్రమాణాలు పెంపు విషయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదరికం విద్యకు అడ్డురాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి గ్రామస్థాయి నుండి విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నాయన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు వ్యక్తిగత శ్రద్ధ కనబర్చి పనిచేసినప్పుడు ఆశించిన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ ఏడాది నూరుశాతం ఫలితాలు సాధించాలన్నారు. ఈ సమావేశంలో 15 మండలాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ నరసింహారావు, డిప్యూటీ డిఇఒలు సూర్యనారాయణ, ఎడివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

భక్తితో సన్మార్గంవైపు నడవాలి
శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ మహాస్వామి
చింతలపూడి, జనవరి 10 : చెడు మార్గాన్ని వీడి, అందరూ భక్తితో సన్మార్గం వైపు నడవాలని శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ మహాస్వామి ఉద్భోదించారు. నిజమైన భక్తితో జీవించే మానవుడు తప్పు చేయడానికి వెనుకాడతాడన్నారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ విజయ శంకర బాల కనకదుర్గాదేవి శివ పంచాయతన ఆలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణచేశారు. పిలిస్తే పలికే అమ్మ జగన్మాత అని, భక్తి శ్రద్ధలతో ఆమెను కొలిస్తే ఏ కష్టమొచ్చినా తీరుస్తుందని, సుఖశాంతులను ప్రసాదిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ యోగిని మాత తాను నిర్మించిన ఈ ప్రగడవరం గ్రామంలోని శివ పంచాయతన దేవస్థానాన్ని శారదాపీఠం దత్తత తీసుకోవాలని భారతీ తీర్ధ మహాస్వామిని కోరారు. దీనిపై ఆయన సుముఖత వ్యక్తం చేస్తూ ఆలయ నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ యోగిని మాత కృషిని ప్రత్యేకంగా అభినందించారు. జగన్మాత అభీష్టం మేరకే చాలా ప్రశాంతమైన ప్రాంతంలో నీటి అంచున ఈ ఆలయ నిర్మాణం జరిగిందని, ఇందుకు యోగిని మాత కృషి ప్రశంసనీయమన్నారు. అనంతరం ఆయన భక్తులను ఆశీర్వదించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతో మంది ప్రముఖులు, భక్తులు, పీఠాధిపతి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. తొలుత పీఠాధిపతి భారతీ తీర్ధ మహాస్వామికి పూర్ణకుంభంతో, పండితుల వేద మంత్రాలతో మంగళవాయిద్యాల మధ్య యోగిని మాత్ర సారధ్యంలో భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని కనకదుర్గాదేవితోపాటు అష్టాదశ శక్తిపీఠాలలో స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆయన చింతలపూడిలోని శ్రీ విశ్వనాధ మఠం ( ఆశ్రమం)ను సందర్శించారు.
ద్వారకాతిరుమలలో....
ద్వారకాతిరుమల: సనాతన ధర్మ పరంపరలో భగవంతునిపై శ్రద్ధ, భక్తి ఎంతో ముఖ్యమని జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామీజీ అన్నారు. ప్రసిద్ధ క్షేత్రమైన ద్వారకాతిరుమలకు గురువారం సాయంత్రం విచ్చేసిన జగద్గురు స్వామీజీకి శేషాచలకొండపై వున్న మాధవ కళ్యాణ మండపం వద్ద ఆలయ ఛైర్మన్ ఎస్‌వి సుధాకరరావు, ఇవో వేండ్ర త్రినాథరావు, అర్చకులు, పండితులు పూర్ణకుంభ ఘన స్వాగతం పలికారు. స్వాగత పత్ర సమర్పణను నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానానికి చెందిన గజలక్ష్మిని స్వామివారు తన స్వహస్తాలతో నిమురుతూ ఆశీస్సులను అందజేశారు. అనంతరం మఠ అర్చకుల సమక్షంలో ఆలయ ప్రాశస్త్యం, పురాణగాధ, వైఖానస పూజా విధానం, దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో గజ శాల అభివృద్ధి, దత్తత ఉపాలయాలు, అనుబంధ కళాశాల, పాఠశాలలు, ఆగమ పాఠశాలల వివరాలను స్వాగత సుమాంజలిలో పొందుపరచి జగద్గురునికి వినిపించారు. ఈ సందర్భంగా స్వామీజీకి ఆలయ ఛైర్మన్ సుధాకరరావు, అధికారులు, భక్తులు ఫలాలను సమర్పించి హారతులు ఇచ్చారు. అనంతరం స్వామీజీ భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. భగవంతుని యందు అందరూ భక్తిశ్రధ్ధలు కలిగి వుండి సర్వకాలాల్లోనూ ఆయన నామావళిని స్మరించాలని సూచించారు. ధర్మజ్ఞానయోగాల వల్ల సాధ్యం కానిది భక్తి వల్ల సాధ్యమవుతుందని జగద్గురు పేర్కొన్నారు. పలువురు భక్తులు పాల్గొన్నారు.

ఎడ్ల పందాలకు పెరుగుతున్న ఆదరణ
భీమవరం, జనవరి 10: రాయలహంపి (హనుమాన్ జంక్షన్) వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్టస్థ్రాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన, అందాల పోటీలకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. సీనియర్స్ విభాగం 22 క్వింటాళ్ల బండ లాగుడు బల ప్రదర్శనలో 27 జతలు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. బల ప్రదర్శన విరామ వేళల్లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఒగ్గుడోలు, తప్పెటగుళ్లు నృత్య ప్రదర్శనలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో కనుమూరి సుబ్బరాజు (రాజబాబు), చెరుకువాడ శ్రీరంగనాధరాజు, గొట్టుముక్కల వెంకటపతిరాజు, కనుమూరి అబ్బాయిరాజు, అల్లూరి కాటన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
జూనియర్స్ విజేతల వివరాలు
జూనియర్స్ విభాగంలో 18 క్వింటాళ్ల బండ లాగుడు బల ప్రదర్శనలో గుంటూరు జిల్లా ఆళ్ల సామిరెడ్డి మెమోరియల్ కె నాగేశ్వరరావు ఎడ్లజత 20 నిమిషాల్లో 2700 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లా ఎల్లం సాంబశివరావు ఎడ్లజత 2658 అడుగుల దూరాన్ని లాగి ద్వితీయ స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లా కుందూరు రామగోపాల్‌రెడ్డి ఎడ్లజత 2622.1 అడుగుల దూరాన్ని లాగి తృతీయ స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా డొక్కు బసవశాస్ర్తియులు యాదవ్ ఎడ్లజత 2363.7/5 అడుగుల దూరాన్ని లాగి నాల్గవ స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లా వజ్రాల మనోజ్‌కుమార్‌రెడ్డి, కృష్ణాజిల్లా కాశినేని రవీంద్రచౌదరి ఎడ్లజత 2348.4 అడుగుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో నిలిచింది. ప్రకాశం జిల్లా కంచర్ల బుచ్చిబాబు చౌదరి ఎడ్లజత 2292.2/5 అడుగుల దూరాన్ని లాగి ఆరవ స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లా మర్తల పెదపుల్లారెడ్డి ఎడ్లజత 2189.2 అడుగుల దూరాన్ని లాగి ఏడవ స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లా కోటిక నాగిరెడ్డి, పైరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి ఎడ్లజత 2184.1 అడుగు దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలో నిలిచింది.

సంక్షేమ పథకాల్లో లోపాలను అధిగమించాలి
-అంగన్‌వాడీలకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఎడి విశాలక్షి సూచన
బుట్టాయగూడెం, జనవరి 10: మహిళా శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లోని లోపాలను అధిగమించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ఎడి (స్కీమ్స్) జి విశాలాక్షి కోరారు. మండలంలోని పలు గ్రామాల్లోగల అంగన్‌వాడీ కేంద్రాలను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఇందిరమ్మ అమృతహస్తం పథకం అమలు పరిశీలనను పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 387 ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉండగా, 102 ప్రాజెక్టులలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఒక్కొక్క లబ్ధిదారునికి రోజుకు 15 రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. పశ్చిమగోదావరి, నల్గొండ జిల్లాల్లో 29 కోట్ల రూపాయల వ్యయంతో ఐజిఎంఎస్‌వై పథకాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లా భౌగోళికంగా పెద్దటి కావడంతో 20కోట్లు కేటాయించామని తెలిపారు. ఈ పథకం కింద 78వేల 698మందికి లబ్ధిచేకూరుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తల్లీబిడ్డల సంక్షేమానికి కృషి చేసిన 48,393 మంది అంగన్‌వాడీ వర్కర్లకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందించినట్టు తెలిపారు. రాష్ట్రంలో సబల పథకం అమలుకు 25.38 కోట్లు కేటాయించగా, పశ్చిమగోదావరికి 3.5కోట్లు కేటాయించామన్నారు.

ఇంటి కోసం కరెంటు స్తంభం ఎక్కాడు!
పాలకొల్లులో ఓ వ్యక్తి హంగామా
పాలకొల్లు, జనవరి 10: తన ఇల్లును రోడ్డుగా చూపుతూ తొలగిస్తారనే ఆందోళనతో ఒక వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హంగామా సృష్టించాడు. చివరకు విషయాన్ని పరిశీలించి, న్యాయం చేస్తామని అధికార్లు ఇచ్చిన హామీతో కిందకు దిగివచ్చాడు. పాలకొల్లులో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి... స్థానిక బంగారువారి చెర్వులో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకొని దానం సూర్యనారాయణ ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నాడు. ఇటీవల సర్వేలో తన ఇంటి స్థలాన్ని రోడ్డుగా చూపటంతో ఉన్న ఇల్లు పోతుందని కరెంట్ స్తంభం ఎక్కి ఆత్యహత్యకు సిద్ధమయ్యాడు. గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరుగగా ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు, తహసీల్దార్ వచ్చి నచ్చచెప్పినా వినకుండా జిల్లా కలెక్టర్ రావాలని పట్టుబట్టాడు. చివరకు పరిస్థితి సమీక్షించి న్యాయం చేస్తానని తహసీల్దార్ పి.వెంకటరావు హామీ ఇవ్వటంతో కిందకు దిగి వచ్చాడు. తరువాత అతడిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇల్లు పోతుందన్న భయంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సాహసానికి పాల్పడ్డానని సూర్యనారాయణ తెలిపాడు. పట్టణ సిఐ జివి కృష్ణారావు నేతృత్వంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మీ-సేవ
english title: 
wg

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>