ఏలూరు, జనవరి 10 : రబీ పంట విషయంలో పూర్తి ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించడం ఎంత వరకు ఆచరణాత్మకమన్నది ఒక సమస్య అయితే ప్రస్తుతం నిర్ణయించిన వంతుల వారీ విధానం ఎంత వరకు సాగుతుందన్నది ఇప్పుడు తాజాగా తెరపైకి వచ్చిన కీలకమైన ప్రశ్న. గోదావరి జలాల లభ్యత గత ఏడాది మాదిరిగానే భారీగా తగ్గిపోవడం, అందుబాటులో వున్న జలాలతో పూర్తి ఆయకట్టు సాగు చేయడం దాదాపు అసాధ్యమని సాగునీటి పారుదల శాఖాధికారులే అనుమానాలు వ్యక్తం చేయడం తెలిసిందే. అయినప్పటికీ గత సీజన్‌లో రైతాంగం దారుణంగా దెబ్బతిన్నందున ఈ సీజన్‌లో పూర్తి ఆయకట్టుకు నీరిచ్చి రైతును ఆదుకోవాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా నిర్ణయించడం కొంత ఉపశమనాన్ని కలిగించేదే. కానీ దానికి అనుగుణంగా సీజన్ ప్రారంభమైతేనే ఫలితం లభించే అవకాశం వుంటుందన్నది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆ దిశగా పరిణామాలు మాత్రం పరుగులు తీయడం లేదు. వంతుల వారీ విధానాన్ని అమలు చేయడం ద్వారా అందుబాటులో వున్న జలాలను అందరికీ సరిపడే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే అనంతర పరిణామాల్లో సహకార సంఘాల ఎన్నికలు రావడం, ఇతరత్రా అంశాలు కూడా తెరపైకి రావడంతో వంతుల వారీ విధానం అమలుపై పూర్తిస్థాయి దృష్టి పెట్టే అవకాశాలు తగ్గిపోయాయి. ఈ కారణంగానే కాలువల వారీగా వంతుల వారీ విధానాన్ని ఏ విధంగా అమలు చేయాలన్న విషయంలో ప్రణాళిక రూపకల్పనలోనే చాలా రోజులు గడచిపోయాయి. ఉన్నత స్థాయిలో యంత్రాంగం వంతుల వారీ విధానంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టిన సందర్భాల్లోనే రైతులకు పలు అగచాట్లు తప్పలేదు. అలాంటిది ఇప్పుడు సగం సగం దృష్టి పెట్టి విధానాన్ని అమలు చేస్తే ఏ విధమైన ఫలితాలు వస్తాయన్న విషయంలో అందరికీ అనుమానాలున్నాయి. ఈ పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు రబీ నాట్లు కూడా ఆలస్యంగా పూర్తవుతుండటం మరో ప్రధాన సమస్యగా మారుతోంది. డిసెంబర్ నెలాఖరు నాటికి రబీ నాట్లు పూర్తి చేస్తేనే వంతుల వారీ విధానం ప్రణాళిక ప్రకారం పంట చేతికి వచ్చే సమయానికి కూడా అవసరమైన తడులు అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వున్న పరిస్థితులను చూస్తే ఆ విధంగా ప్రణాళిక అమలు కావడం లేదనే అర్ధమవుతుంది. జిల్లా వ్యాప్తంగా రబీ ఆయకట్టులో సంక్రాంతి సమయానికి కూడా దాదాపు 40 నుంచి 50 శాతం వరకు మాత్రమే నాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇదే వేగంతో కొనసాగితే నెలాఖరు వరకు నాట్లు పడే అవకాశం వుందని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారం నాటికి నూరుశాతం నాట్లు పూర్తవుతాయని వ్యవసాయశాఖాధికారులు అంచనా వేస్తున్నారు. సీజన్ పరిస్థితి ఈ విధంగానే వుంటే అసలే వంతుల వారీ విధానం కావడంతో నాట్లు ఆలస్యం కావడం, రానున్న రోజుల్లో తీవ్ర నష్టదాయకంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. గత సీజన్ చివరిలో రైతాంగాన్ని నిండా ముంచిన నీలం తుఫాను కారణంగా రబీ కోసం ఉంచుకున్న విత్తన పంట కూడా పూర్తిగా దెబ్బతింది. దీంతో తిరిగి విత్తనాలను సమీకరించుకోవడానికే రైతుకు చాలా రోజులు పట్టింది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో లభించే విత్తన రకాలు జిల్లాలో వాడే అలవాటు లేనందున ఇక్కడ వినియోగించే రకాలను మళ్లీ ఉత్పత్తి చేసుకుని నాట్లు వేసుకునే సరికి రైతాంగానికి జాప్యం తప్పలేదు. అయితే దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ శాఖాధికారులు వంతుల వారీ విధానం ప్రణాళికలను రూపొందించుకుంటే రానున్న రోజుల్లో వచ్చే ఇబ్బందులను తప్పించే వీలుండేది. అయితే నాట్లు ఇప్పటికే ఆలస్యం కావడంతో ఇప్పుడు వేసే పంట దాదాపు ఏప్రిల్ సమయానికి చేతికి వస్తుందని భావించిన ఆ సమయానికి సాగునీటి కష్టాలు తీవ్ర స్థాయికి చేరి వుంటాయి. చివరి దశలో అత్యవసరమైన తడులు అందక పంట దెబ్బతినే పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. ఈ నేపధ్యంలో అటు రైతాంగంలోనూ ఇటు వ్యవసాయ శాఖాధికారుల్లోనూ కొంత ఆందోళన లేకపోలేదు. దీన్ని ఇప్పుడైనా పరిగణనలోకి తీసుకుని ప్రణాళికల్లో మార్పులు చేస్తే తప్ప రైతులు మళ్లీ నష్టపోకతప్పదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
*నీరందక ఆలస్యమైన రబీ నాట్లు *పంట చేతికొచ్చే సమయంలో పాట్లు
english title:
wg
Date:
Friday, January 11, 2013