పెద్దాపురం, జనవరి 10: వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రి తోట నరసింహం అన్నారు. స్థానిక మహారాణి కళాశాలలో డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో ఎంపిక చేసిన వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి నరసింహం మాట్లాడుతూ 2004 నుండి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వికలాంగులందరికీ ప్రతి నెలా రూ.500 పింఛను అమలు చేస్తోందని చెప్పారు. 2012 జూలైలో ఇదే ప్రాంగణంలో వికలాంగులకు సహాయ ఉపకరణాలకోసం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో అర్హులను ఎంపిక చేసినట్టు తెలిపారు. వీరందరికీ వీల్ ఛైర్లు, మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో వికలాంగులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి వారికి నెలకు రూ.2,500 ఆదాయం లభించేలా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. వికలాంగులకు విద్యలోను, ఉపాధి హామీలోను ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ మాట్లాడుతూ 125 మందికి మూడు చక్రాల సైకిళ్లు, 25 మందికి వీల్ ఛైర్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో శివశంకర వరప్రసాద్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కర్రి వీర్రాఘవులు, చెరకు అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బండారు సురేష్‌కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి కృష్ణకుమారి, కళాశాల ప్రిన్సిపాల్ జాస్తి రమేష్, తహసీల్దార్ ఎల్ శివమ్మ, ఎంపిడిఒ కర్రి భీమేశ్వర్, వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ జగదీష్, ముప్పన సోమరాజు, తోట వరాలయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు ముఖ్యమంత్రి రాక
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 10: రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాకినాడ బీచ్ ఫెస్టివల్‌ను పురస్కరించుకుని శుక్రవారం జిల్లాకు రానున్నారు. కేవలం వారం రోజుల్లో రెండోసారి జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి రానుండటం విశేషం! ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అసాధారణ రీతిలో భద్రతా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కాకినాడ సాగర తీరాన్ని ప్రత్యేక పోలీసు దళాలు జల్లెడ పట్టాయి. సిఎంతో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె చిరంజీవి ఉత్సవాలకు హాజరుకానున్న నేపథ్యంలో సహజంగానే అభిమానుల తాకిడి తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో అందుకు అవసరమైన ప్రత్యేక పోలీసు పహారా ఏర్పాటుచేశారు. మరో కేంద్ర మంత్రి ఎంఎం పళ్ళంరాజు, పలువురు రాష్ట్ర మంత్రులు ఉత్సవాలకు తరలిరానున్నారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2.20 గంటలకు కాకినాడ పోలీస్ గ్రౌండ్స్ హెలీప్యాడ్‌కు హెలీకాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డుమార్గంలో 2.45 గంటలకు సర్పవరం చేరుకుంటారు. ఇక్కడి ఎపిఐఐసి ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తోన్న ఐటి పార్క్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ ఐటి పార్క్‌ను సుమారు 3 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు సర్పవరం గ్రామ పరిధిలో 40 ఎకరాల్లో ఈ ఐటి పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఇన్‌ఫోటెక్ నిర్మించిన ఐటి సెంటర్‌ను సైతం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం 3.30 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి కాకినాడ సాగర తీర సంబరాలకు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి సాయంత్రం 5.10 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం వాకలపూడి నేవల్ బేస్ వద్ద ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుని హెలీకాప్టర్‌లో విశాఖ బయలుదేరి వెళ్తారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్ళంరాజు, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కె చిరంజీవి తదితరులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రేపటి నుండి
భీమేశ్వరుని దర్శనం
లింగ రసాయన పూతల మరమ్మతులు పూర్తి
సామర్లకోట, జనవరి 10: స్థానిక పంచారామక్షేత్రం చాళుక్య కుమారారామ భీమేశ్వరాలయంలో స్వామివారి యోగ లింగానికి కేంద్ర పురావస్తు పర్యవేక్షణ శాఖ ఆధ్వర్యంలో రసాయన పూతల మరమ్మత్తులు దాదాపుగా పూర్తికాగా, స్వామివారి దర్శనానికి శనివారం మహా సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులను అనుమతించనున్నారు. ఈ నెల 5 నుండి 8వ తేదీ వరకూ భక్తుల దర్శనాలు, పూజలు నిలుపుదల చేసి పురావస్తు శాఖ అధికారులు స్వామివారి యోగ లింగానికి రసాయన పూతల మరమ్మత్తులు ప్రారంభించారు. అయితే పనుల్లో జాప్యం జరగడంతో దర్శనానికి అనుమతి లభించకపోవడంతో స్వామివారి యోగలింగం పూజలకు నోచుకోలేదని భక్తులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం కెమికల్ ట్రీట్‌మెంట్ పూర్తి అయినప్పటికీ అంతరాలయం, గర్భాలయాన్ని మూసివేసి ప్యాన్ల ద్వారా గాలి తగిలే ఏర్పాట్లు చేసారు. రసాయన పూతలు ఆరే నిమిత్తం శుక్రవారం కూడా ఆలయం తెరవడం లేదు. శనివారం ఉదయం 11 గంటలకు ఆలయం తెరచి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. అయితే మరమ్మత్తులు, దర్శనాలకు అనుమతి విషయమై సరైన సమాచారం ఇచ్చేవారు ఆలయం వద్ద కరవవ్వడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
మే నాటికి మంచినీటి పథకం పూర్తి చేయాలి
* ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు
రామచంద్రపురం, జనవరి 10: వెల్ల గ్రామంలో నిర్మితమవుతున్న రామచంద్రపురం మంచినీటి పథకం ప్రదేశాన్ని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు గురువారం సాయంత్రం సందర్శించారు. మే నాటికి పనులు పూర్తి చేయాలని అధికార్లను ఆదేశించారు. ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జివి పళ్ళంరాజు, డిఈ రెడ్డి శేషగిరి రావు, మున్సిపల్ కమిషనర్ ఎమ్ జీవరత్నం, కాంట్రాక్టర్ కృష్ణంరాజులు ఎమ్మెల్యే త్రిమూర్తులుకు పథక వివరాలను వెల్లడించారు. 2008లో ఈ పథకం ఆమోదం పొందినా, కోర్టు వ్యాజ్యాల కారణంగా 2011 జనవరి నుండి పనులు ప్రారంభించినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పళ్ళంరాజు వివరించారు. అనంతరం వెల్ల గ్రామ ప్రజానీకంతో సమావేశాన్ని నిర్వహించారు. వెల్ల జమీందార్ శ్రీవట్టికూటి వెంకట సుబ్రహ్మణ్యం (వెల్ల అబ్బు) మాట్లాడుతూ స్థలాన్ని రామచంద్రపురం పురపాలక సంఘ అవసరాలకు అప్పగించే సమయంలో తమ గ్రామానికి దాహార్తి తీర్చాలని చెప్పిన అంశాన్ని ప్రస్తావిస్తూ, ఈ అంశంలో శాసనసభ్యులు తోట త్రిమూర్తులు చొరవ చూపించాలని కోరారు. దీంతో వెల్ల గ్రామ పంచాయితీ ప్రజల నుండి ఒక వినతిపత్రం తీసుకోవాలని, రామచంద్రపురం పురపాలక సంఘం కూడా ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు తోట త్రిమూర్తులు సూచించారు. మాజీ మండలాధ్యక్షులు నున్న రామచంద్రరావు, కామెర్ల వైద్యులు డాక్టర్ గుండుబోగుల స్వామినాయుడు, మాజీ ఎమ్‌పిటిసి పాముల సురేష్ కుమార్, కాంగ్రెస్ నాయకుడు కొమ్మిరెడ్డి కోదండ రాముడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
15 గ్రామాల విలీనానికి జీవో జారీ?
రాజమండ్రి, జనవరి 10: రాజమండ్రి నగరపాలక సంస్థలో పరిసర 15 గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం గురువారం జిఓ జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైలు హైదరాబాద్ సచివాలయంలో ఉన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణాలు, నగరాల్లో సమీప పంచాయితీలను విలీనం చేసేలా తీర్మానాలు చేయాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇప్పటి వరకు అమలు కాలేదు. రాజమండ్రి రూరల్ శాటిలైట్‌సిటీ మినహా మిగిలిన పంచాయితీలేవీ రాజమండ్రి కార్పొరేషన్‌లో విలీనాన్ని ఆమోదిస్తూ తీర్మానాలు చేయలేదు. అయితే రాజమండ్రి నగరపాలక సంస్థలో గ్రామాల వీలనాన్ని ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం పొందారు. గ్రామాల విలీన ప్రక్రియకు సంబంధించిన ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయం రెండుసార్లు తిరస్కరించింది. దీంతో ఎమ్మెల్యే రౌతు ముఖ్యమంత్రిని ఒప్పించి, పట్టుబట్టి విలీనానికి సంబంధించి ఫైలును ఆమోదింపజేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒకసారి 10 గ్రామ పంచాయితీలను రాజమండ్రి నగరపాలక సంస్థలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సర్పంచ్‌లు, పాలకవర్గాలు కోర్టును ఆశ్రయించడంతో విలీన ప్రక్రియకు అప్పట్లో బ్రేక్ పడింది. మరోసారి నగరపాలక సంస్థ అధికారులు తొలుత 15 గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించారు. తరువాత గ్రేటర్ రాజమండ్రి దిశగా 22 గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించారు. చివరకు 15 గ్రామాలను రాజమండ్రి నగరపాలక సంస్థలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. రాజమండ్రిలో పరిసర గ్రామాల విలీనం జరిగితే జనాభా 5లక్షలకు చేరుతుందని, తద్వారా నగరపాలక సంస్థను మిషన్ సిటీగా గుర్తించి కేంద్రం నిధులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం వంటి పథకాలను రాజమండ్రిలో అమలు చేయవచ్చని ఆశిస్తున్నారు. ఇప్పటికే సుమారు 300కోట్లతో సమగ్ర మంచినీటి, మురుగునీటి పారుదల ప్రాజెక్టులను కేంద్రానికి సమర్పించారు. ఇప్పటి వరకు వాటికి ఆమోదం లభించలేదు. గ్రామాల విలీన జిఓ జారీ అయిన నేపథ్యంలో వివిధ కేంద్ర పథకాలు రాజమండ్రికి వర్తింపజేసే అవకాశాలు ఉన్నాయి.
వైభవంగా గోదాదేవి పెళ్లి కుమార్తె వేడుక
రాజమండ్రి, జనవరి 10: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సీతంపేట రామాలయంలో బోగి పర్వదినం నాడు గోదా రంగనాధస్వామి కళ్యాణోత్సవంలో భాగంగా గోదాదేవి అమ్మవారిని పెళ్లి కుమార్తెగా అలంకరించే కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయం 4గంటలకు గోకుల్ టివిఎస్ అధినేత నారా వెంకట సత్యనారాయణ, కనకమహాలక్ష్మి దంపతులు స్వామివారికి విశేష పూజలు, అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. మహిళా భక్తులు సాంప్రదాయంగా పసుపుకొమ్ములు దంచి అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేశారు. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు ఏడిద శ్రీనివాసాచార్యులు తెలిపారు.
సంబరాలకు ముస్తాబైన సాగరతీరం
కాకినాడ రూరల్, జనవరి 10: కాకినాడ రూరల్ మండలం వాకలపూడి బీచ్ సాగర సంబరాలకు ముస్తాబైంది. నేటి నుండి ఆదివారం వరకు జరగనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న బీచ్‌ల్లో విశాఖపట్నం బీచ్ మాదిరిగా కాకినాడ బీచ్‌ను కూడా ఉత్సవాలకు ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బీచ్‌లో లైటింగ్, ప్రత్యేక బోర్డు, పర్యాటకులకోసం ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేశారు. సూర్యారావుపేట నుండి ఉప్పాడ వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా పారిశుద్ధ్య పనులు తొమ్మిది పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విజ్ఞప్తి మేరకు సాగర సంబరాల నిర్వహణకు ప్రభుత్వం నుండి రూ.12 లక్షలు మంజూరయ్యాయి. అలాగే బీచ్‌లో సౌకర్యాల ఏర్పాటుకు పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ మరో రూ.3 లక్షలు మంజూరు చేసింది. వివిధ కార్పొరేట్ సంస్థలు బీచ్‌లో పర్యాటక ఏర్పాట్లకోసం రూ.50 లక్షల విరాళాలు అందజేశాయి. సాగర సంబరాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ మృదంగ విద్వాంసుడు యల్లా వెంకటేశ్వరరావు, సినీ సంగీత దర్శకుడు కోటి, ప్రముఖ శాస్ర్తియ సంగీత నృత్య కళాకారిణి రమా వైద్యనాథన్, విద్యా సాహు సంగీత విభావరి వంటి కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం, ఫైర్‌వర్క్స్, ఫల పుష్ప ప్రదర్శన, డాగ్ షో, ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే వివిధ చేనేత వస్త్రాలు, చేతివృత్తి కళాకారుల కళా ప్రదర్శనల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం 3 గంటల నుండి బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఉత్సవ కమిటీ ఛైర్మన్, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ విలేఖరులకు తెలిపారు.
నాణ్యమైన విద్యనందించాలి : మంత్రి విశ్వరూప్
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జనవరి 10: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి పినిపే విశ్వరూప్ సూచించారు. అమలాపురం పట్టణంలోని నారాయణపేటలో 20 లక్షల రూపాయలు సర్వశిక్షాభియాన్, రాజీవ్ విద్యామిషన్ నిధులతో లాల్‌బహుదూర్ శాస్ర్తీ పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన 4 తరగతి గదులతో కూడిన పాఠశాల భవనాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యాబోధన నిమిత్తం విద్యార్ధులకు పాఠశాలల్లో అన్ని వౌళిక వసతులు ప్రభుత్వం సమకూర్చుతోందని, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు విద్యార్ధులు అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం పురపాలక సంఘ మాజీ వైస్‌ఛైర్మన్ చెల్లుబోయిన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఆటో ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలు
గోకవరం, జనవరి 10: పండుగ సెలవులు ఇవ్వడంతో ఆనందంగా హాస్టల్ నుండి ఇంటికి వస్తున్న 8 మంది విద్యార్థులు ఆటో ప్రమాదంలో గాయపడిన ఘటన గురువారం రాత్రి గోకవరం మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గోకవరం మండలం కామరాజుపేట గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు, గంగవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రాజమండ్రిలోని బిసి హాస్టల్‌లో చదువుకుంటున్నారు. సంక్రాంతి పండుగకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు రాజమండ్రిలో ఆటో ఎక్కి స్వగ్రామాలకు బయలుదేరారు. ఆటో గోకవరం నుండి కొత్తపల్లి వైపు వెళ్తుండగా డైవర్స్ కాలనీ సమీపంలోని మలుపువద్ద గోకవరం వైపు నుండి మరో ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవరు కె వెంకటేశ్వరావుతోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న కామరాజుపేట గ్రామానికి చెందిన విద్యార్థులు యాదాల వెంకట రమణ, కందుల సాయి, పిల్ల రాజు, కాని వాసు, తేలు శ్రీను, తుంగర్ల హరీష్, గంగవరం మండలం నెల్లిపూడికి చెందిన విద్యార్థులు డి భవానీ ప్రసాద్, బి వర ప్రసాద్ గాయపడ్డారు. వీరిలో కామరాజుపేటకు చెందిన యాదాల వెంకట రమణ (7వ తరగతి), నెల్లిపూడికి చెందిన డి భవాని ప్రసాద్ (8వ తరగతి), బి వర ప్రసాద్ (6వ తరగతి) తీవ్రంగా గాయపడ్డారు. వీరికి గోకవరంలోని 30 పడకల సిహెచ్‌సి సిబ్బంది వైద్య సేవలందించారు. అయితే యాదాల వెంకట రమణ పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అన్ని రాష్ట్రాల్లో విభజన డిమాండ్లు ఆమోదిస్తే...
తెలంగాణకు ఓకే
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల
రాజమండ్రి, జనవరి 10: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర విభజన డిమాండ్లను ఆమోదిస్తే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణకు ఆమోదం తెలుపుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అంశం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిధిలో ఉందని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్ర విభజనపై తమ వైఖరిని లిఖితపూర్వకంగా కేంద్రానికి తెలియజేశామన్నారు. ఆ లేఖకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అయితే తెలంగాణాకు అనుకూలమా వ్యతిరేకమా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. రాష్ట్ర విభజనపై తమ కార్యాచరణను 15 రోజుల్లో నిర్ణయిస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు రైలు, గ్యాస్, విద్యుత్‌చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలను బాదుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత దారుణంగా చార్జీల పెంపు ఎప్పుడూ చూడలేదన్నారు. విద్యుత్‌చార్జీలు, కోతల కారణంగా రాష్టవ్య్రాప్తంగా 25వేల పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. ఐటి పరిశ్రమ కూడా రాష్ట్రం నుంచి తరలిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు బరితెగించి చార్జీలు పెంచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకాలకు కూడా విద్యుత్‌చార్జీలు పెంచి రైతుల నడ్డివిరుస్తున్నాయన్నారు. చార్జీలు, ధరలతో ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వాన్ని అభిశంసించాలని పిలుపునిచ్చారు. ఇకపై విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. చార్జీలు, ధరల పెరుగుదలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, త్వరలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని, వారికి రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. ప్రజలు మళ్లీ తెలుగుదేశం పార్టీ పాలనను కోరుకుంటున్నారని గోరంట్ల తెలిపారు. లక్షన్నర కోట్ల సబ్సిడీలను ఎగవేసేందుకే నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టారని గోరంట్ల దుయ్యబట్టారు.
అరటి అత్తలంలో 51 పళ్లు
సీతానగరం, జనవరి 10: మండలంలోని సీతానగరం గ్రామంలోని వెలం పేటకు చెందిన కోండ్రపు ముత్యాలు అరటి తోటలో ఓ అరటి గెలకు అత్తానికి 51 పళ్లు ఉండటాన్ని గుర్తించారు. సాధారణంగా అత్తానికి 14నుండి 16 అరటి పళ్లు మాత్రమే ఉంటాయి. అయితే 51 అరటి పళ్లు అత్తానికి ఉండటంతో పలువురు ఈ అత్తాన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. రైతు ముత్యాలు సేంద్రియ ఎరువులనే వాడుతున్నానని, నాలుగు ఎకరాల్లో అరటి తోట వేసినట్టు చెప్పారు. ఈ సంవత్సరం రూ.2లక్షలు ఆదాయం అరటి తోటల రావచ్చుననే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.