విశాఖపట్నం, జనవరి 10: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రేట్లను పెంచేస్తున్నాయి. పనిలో పనిగా బీరుపై ఎక్సైజ్ డ్యూటీని కూడా పెంచేసింది ఐదు శాతం ఆల్కహాల్ కలిగిన బీరుపై ఎక్సైజ్ డ్యూటీని పెంచడంతో దాని ధర తొమ్మిది నుంచి 11 రూపాయల వరకూ పెరిగింది. లీటరు వైన్ 513 రూపాయల నుంచి 560 రూపాయలకు పెంచింది. రెడీ టూ డ్రింక్‌పై డ్యూటీని పెంచడం వలన ఏడు నుంచి తొమ్మిది రూపాయల వరకూ పెరిగింది. దీనివలన ప్రభుత్వానికి అదనంగా 180 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది.
విశాఖ జిల్లా విషయానికి వస్తే, నెలకు 24 వేల ఐఎంఎల్ కేసులను విక్రయిస్తున్నారు. అలాగే 18 నుంచి 20 వేల కేసుల బీరును విక్రయిస్తున్నారు. పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ వలన జిల్లా ఎక్సైజ్ శాఖ ఆదాయం సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో బీరు బాటిల్‌పై రెండు రూపాయలు అదనంగా పెరిగింది. ప్రస్తుతం బీరు అమ్మకాలు తక్కువగా ఉన్నా, మరో రెండు నెలల తరువాత వీటి విక్రయాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో మందుబాబులు తమ బడ్జెట్‌ను మందు కోసం మరికాస్త పెంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
పరిశ్రమల్లో భద్రత మెరుగుకు చర్యలు
* మంత్రి గంటా శ్రీనివాసరావు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 10: జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు పటిష్టమైన చర్యలు చేపడతామని రాష్ట్ర వౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. జిల్లాలోని పరిశ్రల్లో తీసుకోవలసిన భద్రతా చర్యలపై వివిధ కార్మిక సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1095 కర్మాగారాలు ఉన్నాయని, వాటిలో లక్షా 13వేల 124 మంది కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. వీటిలో 108 ఫ్యాక్టరీలను ప్రమాదాలకు అవకాశం ఉన్న వాటిగా గుర్తించారని అన్నారు. 2010-12 సంవత్సరాల మధ్య 69 ఫ్యాక్టరీలలో 91 ప్రమాదాలు జరిగాయని, వీటిలో ఎక్కువగా మానవ తప్పిదాల వలనే జరిగాయని మంత్రి వివరించారు. ప్రమాదాలకు గల కారణాలు, భద్రతా ప్రమాణాలు పాటించడంలో లోపాలను గుర్తించి, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలని అన్నారు. నిబంధనలు పాటించని కర్మాగారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రమాదాల నివారణకు కార్మిక సంఘాల నాయకుల సలహాలు, సూచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. పార్లమెంట్ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ కర్మాగారాల్లో కార్మికులకు రక్షణ పరికరాలు మంజూరు చేయడంలో యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాలు జరుగుతూ కార్మికులు చనిపోతున్నారని అన్నారు. ఈ ప్రమాదాలపై దర్యాప్తు ఎక్కడ జరుగుతోందని అన్నారు. దర్యాప్తు జరిగినప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధులను ఎందుకు పిలవడం లేదని ఆయన ప్రశ్నించారు. గాజువాక నియోజకవర్గంలో కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని, కాలుష్య నియంత్రం మండలి పట్టించుకోవడం లేదని అన్నారు. దీనివలన ఇబ్బందిపడుతున్న ప్రజలకు తానేం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎఐటియుసి జాతీయ కార్యవర్గ సభ్యుడు, విశాఖ ఉక్కు కర్మాగారం గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి ఆదినారాయణ మాట్లాడుతూ కర్మాగారాలను తనిఖీ చేసి, ధృవపత్రాలను మంజూరు చేసే అధికారులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని, వారిపై ఎటువంటి వత్తిడులు పనిచేయకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. లేబర్ రూల్స్ ప్రకారం పని గంటలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రసాయన కర్మాగారాల్లో పనిచేసే వారికి ప్రత్యేక రక్షణ దుస్తులు, పరకరాలు సరఫరా చేయాలని అన్నారు. ఐఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరిగినప్పుడే యాజమాన్యాలు, యూనియన్లు స్పందిస్తున్నాయని అన్నారు. ప్రమాదాలపై దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు.
అధికారుల దోబూచాట!
పరిశ్రమల్లో భద్రత ఎంత దారుణంగా ఉందో అధికారుల వైఖరిని బట్టి అర్థమవుతోంది. పై సమావేశానికి వచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫైర్ సేఫ్టీ అధికారుల మధ్య ఏమాత్రం సంబంధం లేకుండా వ్యవహరించారు. ఎరికి వారు నిర్లక్ష్య ధోరణిలో సమాధానాలు చెప్పుకొచ్చారు. జరుగుతున్న ప్రమాదాల్లో తమ బాధ్యత ఏమాత్రం లేదంటూ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చంద్రశేఖర వర్మ, ప్రభుత్వ చీఫ్ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్,జిల్లా కలెక్టర్ శేషాద్రి, జివిఎంసి కమిషనర్ సత్యనారాయణ, శాసనమండలి సభ్యులు సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, మళ్ళ విజయప్రసాద్, తైనాల విజయకుమార్, అవంతి శ్రీనివాస్, గొల్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
దళిత పారిశ్రామికవేత్తలు
ఆత్మవిశ్వాసంతో పురోగమించాలి
* మంత్రి గీతారెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 10: దళితు పారిశ్రామికవేత్తలు ఆత్మవిశ్వాసంతో పురోగమించాలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి పిలుపునిచ్చారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వారి వెంట ఎప్పుడూ ఉంటుందని అన్నారు. దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ (డిఐసిసిఐ) ఆంధ్ర ప్రదేశ్ శాఖ ప్రథమ వార్షికోత్సవం సభ గురువారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గీతారెడ్డి మాట్లాడుతూ దళితులను పురోభివృద్ధికి డిఐసిసిఐ చేస్తున్న కృషిని ఆమె అభివర్ణించారు. వ్యవసాయ, కార్మిక రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారు దళితులలో కనిష్ఠంగా, ఉత్పత్తిని పెంచే శ్రామికల్లో ఎక్కువగా ఉన్నారని అన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు మాట్లాడుతూ గిరిజనులు తమ హక్కులు, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా దళిత యువకులు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి కోండ్రు మురళి, రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి జి ప్రసాద్ కుమార్, డిక్కీ రాష్ట్ర అధ్యక్షుడు నర్రా రవికుమార్, ఎంవి వివేక్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ సమస్యలపై సిఎంకు
ఐటి పార్కు అసోసియేషన్ లేఖ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 10: విశాఖ నగరంలో నెలకొన్న సమస్యలపై రుషికొండ ఐటి పార్క్ అసోసియేషన్ నాయకులు గురువారం ఒక లేఖ రాశారు. నగరంలో ఉన్న ప్రభుత్వరంగ కర్మాగారాల ద్వారా విడుదలవుతున్న కాలుష్యం వలన ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సక్రమంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించడం వలన పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని అన్నారు. నగరంలో 10 వేల జనరేటర్లును వినియోగించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేసి 50 శాతం విద్యుత్ లోటును పూడ్చాలని అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు, ఉపాధ్యక్షుడు నరేష్ కుమార్ కోరారు. విద్యుత్ కొనుగోలులో అనవసర జాప్యాన్ని నివారించాలని ఆయన కోరారు. పారిశ్రామిక ప్రగతి సాధిస్తున్న విశాఖకు 24 గంటలు విమానయాన సేవలు అవసరం అవుతున్నాయి. నేటికీ పూర్తి స్థాయిలో విమానయాన సేవలు అందుబాటులోకి రాలేదని అన్నారు. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.
నేడు సిఎం రాక
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 10: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని హెలికాప్టర్‌పై కాకినాడ బయల్దేరి వెళతారు. అక్కడి కార్యక్రమాలు ముగించుకుని తిరిగి 6.40 గంటల విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడ అధికారులు, అనధికారులను కలుసుకుంటారు. 7.30 గంటలకు తిరిగి విమానంలో హైదరాబాద్ బయల్దేరి వెళతారు.
నగరానికి చేరిన ధర్మాన
మంత్రి ధర్మాన ప్రసాదరావు గురువారం నగరానికి చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రితో కలిసి హెలికాప్టర్‌లో కాకినాడ వెళతారు. సిఎంతో పాటు ధర్మాన తిరిగి నగరానికి చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు కారులో బయల్దేరి శ్రీకాకుళం వెళతారు.
మంత్రి పొన్నాల రాక నేడు
మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం నగరానికి వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రితో కలిసి కాకినాడ వెళ్లి, తిరిగి సాయంత్రం నగరానికి వస్తారు. ముఖ్యమంత్రితో కలిసి హైదరాబాద్ వెళతారు.
నీటి పథకానికి నిధులు మంజూరు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 10: కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి విజ్ఞప్తి మేరకు విశాఖ నగరంలోని సమగ్ర మంచినీటి పథకానికి 2,147.75 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు కేంద్ర మంత్రి కమలనాథ్ తెలియచేశారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను కోరినట్టు కమల్‌నాథ్, పురంధ్రీశ్వరికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
దట్టంగా కురుస్తున్న పొగమంచు
అరకులోయ, జనవరి 10: ఆంధ్రా ఊటీ అందాల అరకులోయ పరిసరాల్లో పొగ మంచు దట్టంగా కురుస్తోంది. గత వారం రోజులుగా పొగమంచు విపరీతంగా కురుస్తుండడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నా యి. మంచు కారణం గా అనేకమంది ఇళ్లకే ప రిమితమవుతుండగా, ఘాట్‌రోడ్డులో వాహనచోదకులు ప్రయాణం చేయలేకపోతున్నారు. పొగమంచు అరకులోయతో పాటు ఘాట్ రోడ్డును కమ్ముకోవడంతో రహదారులు కనబడని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహ నచోదకులు లైట్లను వేసుకుని రాకపోకలు సాగిస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు. పొగ మంచు కారణంగా జలుబు, దగ్గు వంటి వ్యాధులు సంభవిస్తూ పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం పొగమంచు వలన నానా అవస్థలు పడుతున్నారు.
‘ఉపాధి’ పనుల్లో నాణ్యత పాటించాలి
కోటవురట్ల, జనవరి 10: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు పనుల్లో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలని జాతీయ పురస్కార్ అవార్డు కమిటీ చైర్మెన్ అశ్వనీకుమార్ అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాలో జాతీయ పురస్కార్ అవార్డుకు ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈమేరకు జిల్లాలో ఉపాధి హామీ ద్వారా జరిగిన పనులను తనిఖీ చేయడానికి జాతీయ పురస్కార అవార్డు కమిటీకి చెందిన ఎనిమిది బృందాలు జిల్లాలో పర్యటిస్తున్నాయి. ఒక బృందానికి నాయకత్వం వహిస్తున్న కమిటీ చైర్మెన్ అశ్వనీకుమార్ గురువారం మండలంలో కె.వెంకటాపురంలో పర్యటించి ఉపాధి హామీలో జరిగిన పనులను పరిశీలించారు. కూలీలతో పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాబ్‌కార్డులను తనిఖీ చేశారు. ఉపాధి పనుల వల్ల కూలీలు ఎంత వరకు ప్రయోజనం పొందుతున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. వేతనాలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అని ఆరా తీశారు. అనంతరం స్థానిక ఉపాధి కార్యాలయంలో రికార్డులను పరిశీలించి మస్తర్ షీట్లను తనిఖీ చేశారు. ఈ పర్యటనలో డుమా పి.డి. సత్యసాయి శ్రీనివాస్, ఎ.పి. ఓ.యరకయ్య పాల్గొన్నారు.
సింహాద్రిలో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ
పరవాడ, జనవరి 10: సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ) నాలుగు యూనిట్లు పూర్తి స్థాయి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. సింహాద్రి రెండవ యూనిట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా అధికారులు సదరు యూనిట్‌ను ఇటీవల షట్‌డౌన్ చేశారు. ఈ తరుణంలో యూనిట్‌కు మరమ్మతులు చేపట్టి బుధవారం రాత్రి లైటప్ చేశారు. గురువారం తెల్లవారుజాము 4గంటలకు పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తికి చేరుకుంది. నాలుగు యూనిట్లు కలిసి ప్రస్తుతం 2 వేల మెగావాట్ల విద్యుత్ చేపడుతున్నాయి. వారం రోజుల క్రితం బొగ్గు కొరత కారణంగా సింహాద్రి 3,4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా అధికారులు తగ్గించారు. ప్రస్తుతం సింహాద్రి బొగ్గును పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకోవడంతో నాలుగు యూనిట్లు కలిపి పూర్తి స్థాయి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే సింహాద్రికి నిత్యం సాంకేతిక లోపాలు పట్టి పీడిస్తున్నాయి. దీనికారణంగా అధికారులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
రోలుగుంట, జనవరి 10: మండలంలోని పలు గ్రా మాల్లో పలు ప్రభుత్వ పధకాల అమలు తీరును జా తీయ స్థాయి గ్రామీణా భివృద్ధి మోనటరింగ్ అధికా రి జి.ఎన్.ఎస్.స్వామి గురువారం పరిశీలించారు. మం డలంలోని కొంతలం, అడ్డసరం, కొవ్వూరు గ్రామాల్లో ఎన్.ఆర్. ఇ.జి.ఎస్. , హౌసింగ్, ఆర్.డబ్ల్యు. ఎస్ , ఐ.కె.పి, పి.ఎం.జె.ఎస్.వై. తదితర పథకాల కింద అమలవుతున్న పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కారార్యలయంలో అధికారులతో పై పథకాల అమలు తీరుపై సమీక్ష జరిపారు. పైపథకాల కింద ఎన్ని అభివృద్ధి పనులు మంజూరయ్యాయి, వీటివలన కలిగే ఉపయోగాలు ఇతర అంశాలపై సమీక్షించి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో డి.ఆర్.డి.ఎ. ఎ.పి.ఓ. రమేష్, ఎడీవో జె.లలితకుమారి, ఉపాధి ఎ.పి. ఓ. కాశీ, వెంకట అప్పారావు, ఆర్.డబ్ల్యు. ఎస్. ఎ.ఇ. భాస్కరరావు, హౌసింగ్ ఎ.ఇ. ప్రసాదరావు పాల్గొన్నారు.
విద్యార్థి ప్రాణం తీసిన సెల్‌ఫోన్
జి.మాడుగుల, జనవరి 10: పాఠశాలలకు సంక్రాం తి సెలవులు ప్రకటించడంతో ఆనందంగా ఇంటికి వెళ్ళిపోవచ్చని భావించిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. తమ తోటి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణం తీసుకోవడం వారిని తీవ్రంగా కలచివేసింది. స్థానిక కేంద్రీకృత ఆశ్రమోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీనివాస్ అనే విద్యార్థి గురువారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొరాజు మహేష్ సెల్‌ఫోన్ బుధవారం పోయింది. ఈ సెల్‌ఫోన్ మృతుడు శ్రీనివాస్ దగ్గర ఉన్నట్టు గుర్తించిన తోటి విద్యార్థులు శ్రీనివాస్‌ను నిలదీయగా ఈ ఫోన్ వేరొకరు ఇచ్చారని శ్రీనివాస్ సమాధానం ఇవ్వడంతో ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయులు శ్రీనివాస్‌ను ప్రశ్నించగా మనస్థాపానికి గురై పాఠశాల సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు శ్రీనివాస్‌ను బావి నుంచి బయటకు తీసి 108 వాహనంపై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదుచేసి శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని పాడే రు కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని మృతుని తల్లిదండ్రులకు అప్పగించారు.
.
కాఫీ నిధుల అవినీతిపై
ఉన్నత స్థాయి విచారణ జరపాలి
* గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు
కిల్లో సురేంద్ర డిమాండ్
పాడేరు, జనవరి 10: విశాఖ ఏజెన్సీలో అమలు చేస్తున్న కాఫీ ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతి కుంభకోణంపై ఉన్నత స్థాయి విచారణ నిర్వహించాలని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. స్థానిక గిరిజన భవన్‌లో గిరిజన కాఫీ రైతులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు చెల్లించాల్సిన నిధులను అధికారులు అక్రమాలకు పాల్పడి కాజేశారని ఆరోపించారు. కాఫీ ప్రోత్సాహక నిధులను చెల్లించేందుకు అధికారులు వివిధ బ్యాంకుల నుంచి 45 కోట్ల 45 లక్షల రూపాయలను డ్రా చేశారని, ఈ నిధులను 16,473 మంది గిరిజన రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. తమ సంఘం ఏజెన్సీలోని 86 పంచాయతీల పరిధిలోని 332 గ్రామాలలో సర్వే నిర్వహించి 8,313 మంది లబ్ధిదారులను విచారించగా, అధికారుల అవినీతి వ్యవహారం బట్టబయలైనట్టు ఆయన పేర్కొన్నారు. తాము సర్వే నిర్వహించిన గ్రామాల గిరిజనులకు 18 కోట్ల ఆరు లక్షల 92 వేల ఏనభై తొమ్మిది రూపాయలను చెల్లించాల్సి ఉండగా కేవలం 5 కోట్ల 48 లక్షల 40 వేల 946 రూపాయలను మాత్రమే చెల్లించి మిగిలిన 12 కోట్ల 58 లక్షల 51 వేల 143 రూపాయలను అధికారులు దిగమింగారని ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మన్యంలో అమలు చేస్తున్న కాఫీ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ఒక్కో కాఫీ రైతుకు 2009-11 సంవత్సరాల మధ్యకాలంలో 28,277 రూపాయలను చెల్లించాల్సి ఉండగా కేవలం 1,664 రూపాయల నుంచి 6,264 రూపాయల వరకు చెల్లించారని ఆయన వివరించారు. కాఫీ తోటలకు అనుబంధంగా నాటిని సిల్వర్ ఓక్ మొక్కల పెంపకానికి ప్రతి రైతుకు 8 ,451 రూపాయలు చెల్లించాల్సి ఉండగా 4,162 రూపాయలను మాత్రమే ఇచ్చి కోట్లాది రూపాయలను అధికారులు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. పెదబయలు మండలంలోని ఐదు పంచాయతీలలో కాఫీ ప్రోత్సాహక నిధుల చెల్లింపులో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై అధికారులు నిర్వహించిన విచారణలో 2 కోట్ల 88 లక్షల 89 వేల 775 రూపాయల అవినీతి చోటుచేసుకున్నట్టు నిర్థారించారని ఆయన చెప్పారు.
ఇదే తరహాలో ఏజెన్సీలోని అన్ని మండలాల్లో కూడా కాఫీ నిధులు స్వాహాకు గురికాబడినా అవినీతి అధికారులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై గిరిజన సంక్షేమ శాఖా మంత్రి బాలరాజు జోక్యం చేసుకుని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సురేంద్ర డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం నాయకులు పి.అప్పలనర్స, పాలికి లక్కు, పాడేరు, హుకుంపేట, అరకులోయ, అనంతగిరి, జి.మాడుగుల, పెదబయలు మండలాలకు చెందిన కాఫీ లబ్ధిదారులు పాల్గొన్నారు.
కేంద్రమంత్రి పదవిని ఆశించా
* ముఖ్యమంత్రి పదవిపై వ్యామోహం లేదు
* నామినేటెడ్ పోస్టులకు తీవ్రమైన పోటీ
* రాజ్యసభ సభ్యులు టిఎస్సార్
విశాఖపట్నం, జనవరి 10: ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తన పేరు ఉంటుందని ఆశించానని, అయితే తనకు అవకాశం దక్కలేదని రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి అన్నారు. గురువారం విశాఖలోని తన స్వగృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రివర్గంలో స్థానం కల్పించే అంశంపై తొలుత తన పేరు వినిపించిందన్నారు. అయితే తనకు బదులు ఈ అవకాశం రాష్ట్రం నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి దక్కిందన్నారు. పార్టీ హైకమాండ్ అన్ని వర్గాలకు ప్రాధాన్యతనివ్వడంలో భాగంగా కేంద్రమంత్రివర్గంలో ఆయనకు అవకాశం కల్పించిందన్నారు. తాను కాస్తంత బాధపడగా, అవకాశం వస్తుందని తనను యపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ బుజ్జగించారన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తనకు రాదని, దీనిపై వ్యామోహం కూడా లేదని విలేఖరుల అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను అంచలంచెలుగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. రాష్ట్రంలో జిల్లా, నియోజకవర్గాల పరిధిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే భర్తీపై ఆదేశాలిచ్చిందన్నారు. పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం కొనసాగుతున్నందున పార్టీ నుంచి వెళ్లిపోయే కార్యకర్తలు, నాయకులు పెరుగుతారేమోనని విలేఖరులు అనటంతో ఆయన స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ఇటువంటివి సాధారణమన్నారు. నామినేటెడ్ పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉందని, ఆశావహులు ఎక్కువవుతున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజానీకం మనోభావాలకనుగుణంగానే తెలంగాణ అంశంపై నిర్ణయం ఉంటుందని, దీనిపై తానేమీ మాట్లాడలేనన్నారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం త్వరలోనే తీరనుందని, దీనిపై దేశ ప్రధాని డాక్టర్ మన్మోహాన్‌సింగ్‌తో చర్చించానని, విద్యుత్ కొనుగోలు, బొగ్గు, దిగుమతి, జల విద్యుత్ ఉత్పత్తి, గ్యాస్ ఆదారిత విద్యుత్ కోసం అనేక రకాలైన చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇవన్నీ అనుకూలిస్తే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను సరఫరా అవుతుందన్నారు. 50 శాతం మేర పవర్ ప్లాంట్‌లు దెబ్బతిన్న కారణంగానే ఈ సంక్షోభం నెలకొందని, దీనివల్ల వ్యవసాయం, పరిశ్రమలకు ఇబ్బందులు తప్పడంలేదన్నారు. భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు.
కాలేజీ విద్యార్థుల కంటి పరీక్షల కోసం యువదృష్టి
* రాష్ట్రంలో తొలి ప్రయోగం
* రాజ్యసభ సభ్యులు టిఎస్సార్
విశాఖపట్నం, జనవరి 10: నగరంలో జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారందరికీ కళ్ళద్దాలు పంపిణీ చేసే బృహత్తరమైన ’యువ దృష్టి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. తన స్వగృహంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనిని గురువారం ప్రారంభిస్తామని, దీనికి రాష్ట్ర ఓడరేవులు,పెట్టుబడులు,వౌలిక సదుపాయాల కల్పనాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే వి శేషాద్రి, ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, మళ్ళ విజయప్రసాద్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పాల్గొంటారన్నారు. దీనిలోభాగంగా నగరంలో పలు కాలేజీలకు చెందిన 50 వేల మంది విద్యార్థులు కంటి పరీక్షలు నిర్వహించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కంటి స్క్రీనింగ్, శస్తచ్రికిత్స, అద్దాల, మందుల పంపిణీ వంటివి నిర్వహిస్తామన్నారు. దీనిని విద్యార్థులు సద్వినియోగపర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మూడు దశాబ్ధాలుగా విశాఖ ప్రజలకు అథ్యాత్మిక, సామాజిక, వైద్యపరమైన సేవలందిస్తున్నానన్నారు. రాష్ట్రంలో ఈ విధమైన సేవలు మరే రాజకీయ నాయకులు అందించడంలేదన్నారు. నగరంలో మురికివాడల్లో పలు రకాలైన సమస్యలు నెలకొంటున్నాయని, వీటిని పరిశీలించి సమీక్ష నిర్వహించడం ద్వారా వీటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. మురికివాడల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పేందుకు సహకరించనున్నట్టు చెప్పారు. రుణాల మంజూరులో బ్యాంకుల సహకరించడంలేదనే వాదన వినిపిస్తోందని, లక్ష కంటే ఎక్కువుగా రుణాలు తీసుకునే లబ్ధిదారులకు సమస్యలు వస్తున్నాయని, దీనిపై దృష్టిపెట్టి, తగిన న్యాయం చేయగలనని హామీ ఇచ్చారు. నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విశాఖ నరగంలో 40 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చురుగ్గా సాగుతుందన్నారు. అలాగే రూ.70 కోట్ల వ్యయంతో కెజిహెచ్ అభివృద్ధి కోసం ప్రత్యేక భవన నిర్మాణానికి తాను చేసిన కృషి ఫలించిందన్నారు. ఇందులో విశాఖస్టీల్‌ప్లాంట్ రూ.15కోట్లు, విశాఖపట్నంపోర్టుట్రస్టు ఐదు కోట్లు, ఎన్‌ఎస్‌టిఎల్ మరో ఐదు కోట్లు, హెచ్‌పిసిఎల్ ఐదు కోట్లు, బిహెచ్‌ఇఎల్ రూ. 15 కోట్ల మేర ఇచ్చేందుకు అంగీకరించాయని, వీటితో ఓఎన్‌జిసి తన వంతు సహకరించనుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, వరదారెడ్డి, పిసిసి రాష్ట్ర కన్వీనర్ ధర్మాల ఆనంద్‌కుమార్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు యల్లపు రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
రైలు చార్జీల పెంపుపై తీవ్ర నిరసన
* కదం తొక్కిన ప్రజా సంఘాలు
* ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
విశాఖపట్నం, జనవరి 10: పెంచిన రైలు చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ గురువారం విశాఖపట్నం రైల్వేస్టేషన్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ ఇప్పటికే అన్ని రకాల చార్జీల భారం మోస్తున్న సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం రైలు చార్జీల భారం మోపిందని విమర్శించారు. ప్రస్తుత చార్జీల పెంపుతో ప్రజలపై రూ. 6,600 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీల షరతులకు ప్రభుత్వం దాసోహమంటూ ప్రజలపై బారం మోపడం సమంజసమంకాదని ఆరోపించారు. పెంచిన రైలు చార్జీలను తగ్గించే వరకు సిపిఐ పోరాటం నిర్వహిస్తుందని ఆయన హెచ్చరించారు. సిపిఐ నగర సహాయ కార్యదర్శి కె.సత్యాంజనేయ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. సిపిఐ నగర సహాయ కార్యదర్శి కె.సత్యాంజనేయ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజల జీవితాలు అత్యంత దయనీయం మారాయని, నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతవౌతున్న ప్రజలకు రైలు చార్జీల పెంపు మరింత భారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గసభ్యులు బి.వెంకటరావు, జి.రాంబాబు, పి.వీర్రాజు, జెడి నాయుడు, పి.ఈశ్వరరావు, ఏపి మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏ విమల, నగర అధ్యక్షులు పడాల రమణ, చంద్రశేఖర్, నగర కమిటీ సభ్యులు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.
రైల్వేబడ్జెట్ ముందు చార్జీల పెంపు దుర్మార్గం
* సమైక్యాంధ్ర పొలిటికల్ జెఏసి నిరసన
విశాఖపట్నం, జనవరి 10: రైల్వేబడ్జెట్‌కు ముందు చార్జీలను పెంచి ప్రయాణికులపై పెను భారం మోపడం దుర్మార్గపు చర్య అని సమైక్యాంధ్ర పొలిటికల్ జెఏసి రాష్ట్ర కన్వీనర్ జెటి రామారావు అన్నారు. విశాఖ రైల్వేస్టేషన్ వద్ద పొలిటికల్ జెఏసి ఆధ్వర్యంలో గురువారం పలు రూపాల్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేబడ్జెట్‌కు 20 రోజులు ముందుగా చార్జీలను పెంచడం ఏ విధంగాను సమంజసంగా లేదన్నారు. దీనిని ఉపసంహరించుకోపోతే కేంద్ర రైల్వేశాఖామంత్రి బన్సాల్, ఎంపీల ఇళ్ళను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. రైల్వేబడ్జెట్ రూపొందుతున్న తరుణంలో ఆకస్మీకంగా రైల్వేచార్జీలను పెంచడంలో అర్ధంలేదన్నారు. సంక్రాంతి కానుకగా సామాన్యుల నెత్తిన రైల్వే పెనుభారం మోపుతోందన్నారు. ఆదాయ వనరులను పరిశీలించకుండా ప్రయాణికులపై భారం మోపడం దుర్మార్గపు చర్యగా తెలిపారు. రవాణా రంగాన్ని మెరుగుపర్చేందుకు ఎటువంటి చర్యలు చేపట్టని రైల్వే ప్రైవేటు ట్రావెల్స్ కోట్లాది రూపాయల వ్యాపారాన్ని పెంచుకుంటున్నా ప్రేక్షకపాత్ర వహిస్తుందన్నారు. బ్రిటిష్ హాయాంలో నిర్మించిన రైల్వే మార్గాలు తప్పితే కొత్తగా వీటిని నిర్మంచడమనేది రాష్ట్రంలో లేదని, కొత్త లైన్లు వేయడంలేదన్నారు. మరోపక్క మెట్రోరైల్వే కుంభకోణంలో కూరుకుపోతుందని, రాష్ట్రంలో గతంలో జరిగిన రైళ్ళ ప్రమాదం సంఘటనల నేపధ్యంలో రైల్వే చేసిన భద్రతా, నిర్వహణపరమైన హామీలను ఇప్పటికీ నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. కనీసం విశాఖ రైల్వేస్టేషన్‌లో తాగునీరు,సులాబ్ సౌకర్యాలు సైతం లేని పరిస్థితుల్లో చార్జీలు పెంచి ఇబ్బందులకు గురిచేస్తుండటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదాయాలు వచ్చే మార్గాల్లో రైళ్ళను నిర్వహించకుండా బీహార్, ఒడిషా వంటి ఏమాత్రం ఆదాయం లేని రైల్వేమార్గాల్లో కొత్త రైళ్ళను వేస్తుండటం రైల్వేకే చెల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు లగుడు గోవింద్, కె.రామచంద్రమూర్తి, బి.అప్పారావు, ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.