రాజమండి, జనవరి 13: గోదావరి తీరం రాజమండ్రి నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 15న ఉదయం 6గంటల నుండి రాత్రి 8గంటల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస వేద విద్వత్సదస్సు జరగనుంది. శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ పర్యవేక్షణలో, శ్రీ శారదా పీఠాధీశ్వరులు, శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీతీర్థమహాస్వామి సమక్షంలో ఈ సదస్సును నిర్వహించేందుకు టిటిడి అధికారులు భారీ ఏర్పాట్లు చేసారు. టిటిడి అందించే భృతితో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేదపారాయణం చేసే వేదపండితులు సుమారు 2వేల మంది ఈ సదస్సుకు హాజరవుతారని శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ ఆకెళ్ల విభీషణశర్మ చెప్పారు. విశ్వశాంతి, విశ్వఅభ్యుదయం కోసం ఈ వేదసభను టిటిడి నిర్వహిస్తోందన్నారు. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, వారణాసి తదితర ప్రాంతాల నుండి వేదపండితులు హాజరవుతారన్నారు. 15న ఉదయం 6గంటల నుండి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన వేదిపై వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి సేవలు ప్రారంభమవుతాయి. తిరుమలలో శ్రీవారికి ఏవిధంగా సేవలు జరుగుతాయో అదే విధంగా సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు ఇదే వేదికపై నిర్వహించేందుకు టిటిడికి చెందిన వేదపండితులు రాజమండ్రి చేరుకున్నారు. గోవింద కళ్యాణాలు, శ్రీనివాస కళ్యాణాలను దేశ విదేశాల్లో నిర్వహించే వేదపండితులే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మధ్యాహ్నం భోజన విరామం తరువాత చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతాయి. సాయంత్రం 5గంటల నుండి రాత్రి 7గంటల వరకు తర్కం, వ్యాకరణం, మీమాంస, సాంఖ్యం, యోగం, వేదాంత శాస్త్ర గోష్ఠి జరుగుతుంది. ఈ కార్యక్రమం తరువాత వృద్ధవేదపండితులు, శాస్త్ర గోష్ఠిలో పాల్గొన్న వేదపండితులకు సత్కారాలు జరుగుతాయి. రాత్రి 7.30గంటలకు శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీతీర్థస్వామి భక్తులకు అనుగ్రహభాషణం చేస్తారు. ఈ వేద సభ ఏర్పాట్లను ఇప్పటికే టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు.
టిటిడి మాజీ సభ్యుడు, రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వేదపండితుడు విశ్వనాథ గోపాలకృష్ణశాస్ర్తీ తదితరులు వేద సభ నిర్వహణకు ప్రత్యేక సహకారాన్ని అందిస్తున్నారని, తిరుమల ప్రధాన కేంద్రానికి దూరంగా గోదావరి తీరంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాజమండ్రిలో మంచి సహకారం లభిస్తోందని విభీషణశర్మ చెప్పారు.
రెండు వేల మంది పండితుల రాక
english title:
R
Date:
Monday, January 14, 2013